శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

డార్విన్ ఆత్మకథ

Posted by V Srinivasa Chakravarthy Monday, February 13, 2012



భౌతిక శాస్త్రానికి ఐన్ స్టయిన్ ఎంతో, జీవశాస్త్రానికి డార్విన్ అంత అని చెప్పుకోవచ్చు. డార్విన్ ఎనలేని కృషి వల్ల పరిణామ సిద్ధాంతం జీవశాస్త్రంలో ఓ ముఖ్య స్థానాన్ని ఆక్రమించింది. పరిణాత్మక దృష్టితో చూడకపోతే జీవశాస్త్రంలో ఏదీ కచ్చితంగా అర్థం కాదనేంత ఎత్తుకు పరిణామ సిద్ధాంతం ఎదిగింది.


డార్విన్ కృషి గురించి లోగడ కొన్ని వ్యాసాలు ఈ బ్లాగ్ లో పోస్ట్ చెయ్యడం జరిగింది. అందులో డార్విన్ యొక్క వైజ్ఞానిక చింతన గురించి, ఆ చింతనకి ఊపిరి పోసిన పూర్వుల చింతన గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది. అయితే ఓ మేధావి యొక్క వ్యక్తి గత జీవన విశేషాల గురించి కూడా ఆయన చింతన గురించి ఎంతో తెలుసుకోవచ్చు. ఎలాంటి సంఘటనలు, ఎలాంటి జీవన, సామాజిక నేపథ్యం అలాంటి భావాలకి ప్రాణం పోశాయో స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.


వైజ్ఞానికులలో జీవత కథలు చాలా ఉన్నాయిగాని, అత్మకథలు కొంచెం అరుదు. అయితే డార్విన్ ఆత్మకథ ఒకటి వుంది. ఓ సంపాదకుడి విన్నపం మీద తన జీవిత కథని క్లుప్తంగా రాశాడు డార్విన్.

డార్విన్ పుట్టిన రోజు (ఫిబ్రవరి 12) సందర్భంగా ఆయన ఆత్మకథను ఇప్పట్నుంచి ఈ బ్లాగ్ లో ఓ సీరియల్ గా పోస్ట్ చేస్తున్నాం. (ఇది నిన్న చేసి ఉండాల్సింది. అయితే నిన్న ఇంట్లో నెట్ పడుకుంది! :-)
- శ్రీ.చ.


డార్విన్ ఆత్మకథ

నాకు తెలిసిన ఓ జర్మను సంపాదకుడు నా మానసిక, వ్యక్తిత్వ వికాసాన్ని గురించి, నా ఆత్మకథా విషయాల గురించి ఏదైనా రాయమని అడిగాడు. కాలక్షేపానికి అలాంటి పని చెయ్యడం సరదాగా ఉంటుందనిపించింది. అంతే కాక నా పిల్లలకి, వాళ్ల పిల్లలకి కూడా అది పనికి రావచ్చని అనిపించింది. మా తాతగారు తన జీవితం గురించి, తన ఆలోచనల గురించి, పని తీరు గురించి ఏ కాస్త రాసి ఉన్నా చదవడానికి ఆసక్తికరంగా ఉండేదని ఎన్నో సార్లు అనిపిస్తుంది. కనుక నా ఆత్మకథని రాయటానికి పూనుకున్నాను. ఓ మరణించిన మనిషి మరో లోకం నుంచి తన గత జీవితాన్ని చూసుకుంటూ వ్యాఖ్యానిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ కథ చెప్పుకొచ్చాను. అలా చెయ్యడం నాకు పెద్ద కష్టం అనిపించలేదు. ఎందుకంటే నా జీవితం ఇంచుమించు అయ్యేపోయింది. శైలి గురించి పెద్దగా పట్టించుకోకుండా బుద్ధి పుట్టినట్టు రాస్తూ పోయాను.

నేను పుట్టింది 1809 లో, ఫిబ్రవరి 12 నాడు. ష్రూస్బరీ నగరంలో. బాగా చిన్నతనానికి సంబంధించి నాకు ఒకే విషయం జ్ఞాపకం ఉంది. అప్పటికి నా వయసు నాలుగు ఏళ్లు దాటి కొన్ని నెలలు ఉంటుందేమో. సముద్ర స్నానానికి అని అబర్గెలే నగరానికి వెళ్లాం. అక్కడ కొన్ని సంఘటనలు, ప్రదేశాలు కొద్దోగొప్పో స్పష్టంగా గుర్తున్నాయి.

జులై 1817లో మా అమ్మ చనిపోయింది. అప్పటికి నా వయసు ఎనిమిది దాటి ఉంటుంది. మా అమ్మ గురించి నాకు పెద్దగా గుర్తు లేదు. మరణ శయ్య మీద నల్లని వెల్వెట్ గౌన్ లో ఆమె శయనించి ఉండటం గుర్తుంది. ఆ తరువాత విచిత్రమైన రూపం గల ఆమె పని చేసుకునే బల్ల కూడా గుర్తుంది.

ఆ ఏటే నన్ను ష్రూస్ బరీ లో ఓ బళ్లో పడేశారు. అక్కడ ఓ ఏడాది పాటు నా చదువు సాగింది. మా చెల్లెలు కాథ్రీన్ తో పోల్చితే నేను చదువులో కాస్త నెమ్మది అని చెప్తారు. బాగా అల్లరి చేసేవాణ్ణని కూడా చెప్తారు.

ఆ బళ్లో చేరిన నాటికే ప్రకృతి పట్ల నాలో ఆకర్షణ, వస్తువులు సేకరించే అలవాటు బలంగా ఉండేదట. కనిపించిన ప్రతీ మొక్క పేరు గుర్తించడానికి ప్రయత్నించేవాణ్ణట. గవ్వలు, నాణేలు, ఖనిజాలు ఇలా నానారకాల వస్తువులు సేకరించేవాణ్ణట. ఈ సేకరించే అలవాటు ఉన్న మనిషి ప్రకృతివేత్త గాని, పిసినారి గాని అవుతాడని అంటారు. మరి ఎలా వచ్చిందో నాకీ అలవాటు సహజంగా వచ్చింది. నా అక్కచెళ్లెళ్లకి గాని, తమ్ముడికి గాని ఈ అలవాటు రాలేదు.

ఆ ఏడాది జరిగిన ఒక సంఘటన మాత్రం నా మనసులో గాఢంగా ముద్ర పడిపోయింది. ఆ సంఘటన జరిగిన తరువాత అది నా మనసులో రేపిన కలకలం వల్ల అది ఇంకా ఎక్కువ గుర్తుండిపోయింది. ఆ వయసులోనే నన్ను మొక్కల్లోని వైవిధ్యం ఎంతో ఆకట్టుకుంది. పాలీయాంతస్ మొక్కలకి, ప్రిమ్రోజ్ మొక్కలకి రకరకాల రంగు నీళ్లు పోసి రంగు రంగుల పూలు సృష్టించగలనని నాకు తెలిసిన ఓ పిల్లవాడితో (అది లేటన్ అనుకుంటా, ఇతగాడే తరువాత ప్రఖ్యాత వృక్ష శాస్త్రవేత్తగా ఎదిగాడు) ఓ సారి బుకాయించానట! కాని ఆలాంటి ప్రయత్నానికి ఎప్పుడూ నేను స్వయంగా పూనుకున్న పాపానికి పోలేదు! ఆ వయసులో ఇలాంటి కట్టుకథలు చాలా అల్లేవాణ్ణట. స్నేహితులలో సంచలనం కలిగించడానికి అలా చేసే వాణ్ణి. ఒకసారి అలాగే మా నాన్నగారి తోట లోంచి మంచి మంచి పళ్లెన్నో కోసి అవన్నీ ఓ పొద కింద దాచాను. ఆ తరువాత పరుగెత్తుకుంటూ వెళ్ళి ఓ పెద్ద “దొంగలించిన పళ్ల భాండారం” దొరికిందంటూ అందరికీ దండోరా వేశాను!

నేను మొట్టమొదట బళ్లో చేరినప్పుడు చాలా అమాయకంగా ఉండేవాణ్ణో ఏమో. గార్నెట్ అని ఓ మిత్రుడు ఒకసారి నన్నొక బేకరీకి తీసుకెళ్లాడు. ఆ కొట్లో బోలేడు కేకులు తీసుకుని, డబ్బు చెల్లించకుండా బయటికి వచ్చాడు. డబ్బులు చెల్లించలేదేం? అని అడిగాను. అందుకు ఆ పిల్లవాడు, "మా మావ గొప్ప ఆస్తిపరుడు. పోతూపోతూ ఈ ఊరి పేర్న తన ఆస్తంతా రాస్తూ, నాకు గాని, తన పాత టోపీ పెట్టుకుని ఆ టోపీని ఓ ప్రత్యేక రీతిలో కదిలించిన మరెవరికైనా గాని, ఊళ్లో అంగళ్ల వాళ్లు ఉచితంగా అడిగినవన్నీ ఇవ్వాలన్న నిబంధన పెట్టి పోయాడు," అని చెప్పాడు. "కావాలంటే నువ్వూ కూడా ప్రయత్నించి చూడు, ఇందాకటి బేకరీ నుండి ఏవైనా తెచ్చుకో," అంటూ ఆ విచిత్ర టోపీని నా చేతిలో పెట్టాడు.

మహాప్రసాదంలా ఆ టోపీని అందుకుని ఇందాకటి బేకరీకి వెళ్లాను. కొన్ని కేకులు అడిగి తీసుకుని, టోపీని ఓ సారి జాగ్రత్తగా కదిలించి డబ్బులు చెల్లించకుండా బయటికి నడవబోయాను. కొట్టువాడు నా పీక పట్టుకోబోయాడు. నేనా కేకులు కింద పడేసి కాలిసత్తువ కొద్దీ పరుగు అందుకున్నాను. నేనలా పరుగెత్తు తుంటే అల్లంత దూరంలో పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ నా స్నేహితుడు, ఆ పిల్ల రాక్షసుడు, గార్నెట్ కనిపించాడు.
(ఇంకా వుంది)

5 comments

  1. voleti Says:
  2. very interesting

     
  3. ఆసక్తిగా ఉంది. థాంక్ యూ !

     
  4. మంచి ప్రయత్నం !

     
  5. Unknown Says:
  6. Hi Srinivas garu.. డార్విన్ ఆత్మకథ. its really very useful and interesting. but i want to read the total book. where should I, please suggest me.

     
  7. Prabhu garu, I can send the pdf of the original English version, if you send me your email. The Telugu version is in the making... :-)

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts