స్నెఫెల్ పర్వతం యొక్క అగ్నిబిలం (crater) ఓ తిరగేసిన శంకువు ఆకారంలో ఉంటుంది. దాని నోటి వ్యాసం ఓ అర లీగు ఉంటుందేమో. లోతు రెండు వేల అడుగులు ఉండొచ్చు. అంత పెద్ద బిలం లోంచి సలసల మరుగుతున్న లావా ఉవ్వెత్తున ఎగజిమ్ముతుంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. బిలం సన్నబడి గల్లా మెడలా మారే చోట దాని చుట్టుకొలత 250 అడుగులు ఉంటుందేమో. బిలంలో నేల వాలు అంత ఎక్కువ కాకపోవడం చేత ఆ ‘మెడ’ వరకు సులభంగానే చేరుకోడానికి వీలయ్యింది. ఉన్నట్లుండి ఎందుకో ఆ బిలం అంతా ఓ పెద్ద పొత్రం లాగా కనిపించింది. అసలు ఆ ఆలోచనకే వెన్ను లోంచి వణుకు మొదలయ్యింది.
https://apetcher.wordpress.com/tag/volcano/
“ఎగేసుకుని ఆ పొత్రంలోకి దూరడం కన్నా వెర్రితనం మరొకటి కనిపించడం లేదు. కొంపదీసి పొత్రం లోపల గాని మందుపాతర ఉంటే అందరం ఆ లోతుల్లోంచి తూటాల్లా గాల్లోకి విసిరేయబడతాం.” భయంకరమైన ఆలోచనలు మెదణ్ణి దొలిచేస్తున్నాయి.
కాని ఎలాగో ధైర్యం చేసుకుని నిబ్బరంగా ముందు నడుస్తున్న హన్స్ వెనకే నోరు మూసుకుని నడక సాగించాను.
అవరోహణా సౌలభ్యం కోసమని కాబోలు హన్స్ సర్పిలాకారపు బాటలో లోపలికి దిగుతున్నాడు. దారి పొడవునా అగ్నిపర్వత శిలలు పడి వున్నాయి. కొన్ని రాళ్లు ముందే వదులుగా ఉన్నాయోమే మా పాదాలు తగిలి కిందకి జారి కింద బిలం లోతుల్లో పడి కనుమరుగు అవుతున్నాయి. అవి దొర్లుకుంటూ కింద పడుతుంటే ఆ చప్పుడు బిలంలో నలుదిశలా మారుమ్రోగుతోంది.
మేం నడుస్తున్న దారిలో కొన్ని చోట్ల మంచు పొరలు ఎదురయ్యాయి. అలాంటి ప్రదేశాలలో హన్స్ ఆచితూచి అడుగు వెయ్యసాగాడు. ఇనుప కొస ఉన్న కట్టెతో మంచులో గుచ్చి పరీక్షిస్తూ, అడుగున ఏవైనా గోతులు ఉన్నాయేమో పరిశీలిస్తూ, నెమ్మదిగా ముందుకు నడవసాగాడు. దారి బాగా దుర్గమంగా ఉన్న ప్రదేశాల్లో అందరం ఒకే త్రాడు పట్టుకుని నడిచాం. ఈ ఏర్పాటు వల్ల ప్రమాదం పూర్తిగా నివారించబడకపోయినా, మరింత సురక్షితంగా అనిపించింది అని మాత్రం చెప్పగలను.
ఆ విధంగా ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, మా గైడుకి కూడా తెలీని అజ్ఞాత దారుల వెంట నడుస్తూ, మధ్యాహ్నాని కల్లా నెమ్మదిగా బిలం యొక్క మెడ ప్రదేశానికి చేరుకున్నాం. తల పైకెత్తి చూస్తే అగ్నిబిలం యొక్క నోరు ఓ పెద్ద చక్రంలా కనిపించింది. ఆ చక్రం మధ్యలో కాస్తంత గగనం చిక్కుకున్నట్టు చిత్రంగా కనిపించింది. బిలం యొక్క అంచుకి ఒక పక్కగా అల్లంత దూరంలో ‘సారిస్’ పర్వతపు హిమ శిఖరం కనిపిస్తోంది.
అగ్నిబిలం అడుగున మూడు పొగగొట్టాలు ఉన్నాయి. అగ్నిపర్వతం విస్ఫోటం జరిగినప్పుడు పర్వత గర్భంలో ఉండే కొలిమి లోంచి అగ్ని, లావా పైకి తన్నుకు వచ్చేది ఈ పొగగొట్టాల లోంచే. ఒక్కొక్క పొగగొట్టం నూరు అడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. వాటి లోంచి తొంగి చూడడానికి నాకైతే ధైర్యం చాలలేదు. కాని ప్రొఫెసర్ మామయ్య మాత్రం హడావుడిగా వెళ్లి మూడింటినీ సర్వే చేసేశాడు. ఆ పొగగొట్టాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, చేతులు చిత్రంగా ఊపేస్తూ, ఎవరికీ అర్థం కాకుండా ఏదో సణుగుతూ భలే ఆర్భాటం చేశాడు. హన్స్, అతడి అనుచరులు మామయ్య కేసి గుడ్లప్పగించి చూశారు. ఈయన ఏమైనా పిచ్చాసుపత్రి నుండి తప్పించుకువచ్చిన బాపతా అని వాళ్లకి సందేహం వచ్చినట్టు వాళ్ళ మొహాల్లో చూచాయగా తెలుస్తోంది.
ఉన్నట్లుండి మామయ్య గట్టిగా రంకె వేశాడు. ఏ కన్నంలోనో కాలు ఇరుక్కుపోయిందేమో నని భయపడి వెంటనే అటు చూశాను. కాని అలాంటిదేం జరిగినట్టు కనిపించలేదు. ఆయనకి గాని, ఆయన కాలికి గాని ఏం ప్రమాదం లేదు. ఓ పెద్ద కంకర శిలకి ముందు చేతులు చాచి, కాళ్లు పంగజాపి నిటారుగా నించున్నాడు. కాసేపు స్థాణువులా నిలబడ్డ మనిషి కాస్తా అంతలో ఏదో పూనకం వచ్చినట్టు,
“ఏక్సెల్! ఏక్సెల్” అని కేకలేశాడు.
నేను ఆయన కేసి పరుగెత్తాను. హన్స్ గాని, ఆయన అనుచరులు గాని ఉన్నచోటి నుండి కదల్లేదు.
“ఇదుగో చూడు,” అంటూ ఆ శిల కేసి చూపించాడు.
(ఇంకా వుంది)
0 comments