RILKESPANTHERRILKES…
దీన్ని కొంచెం శోధించి పదాలని Rilke’s Panther అని వేరు చేస్తాడు. Rainer Rilke పందొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఒక ఆస్ట్రియన్ కవి. ఇతడు రాసిన పద్యాలలో Panther అనే పద్యం కూడా ఉంది. లైబ్రరీకి వెళ్ళి రిల్కె కవితల పుస్తకం తెచ్చి చదువుతాడు డా. సేయర్. ఆ పద్యంలో కొన్ని పంక్తులు -
“వేయి కటకటాలు అతడి గతికి అడ్డుపడుతున్నాయి.
ఆ కటకటాల వెనుక ఉన్నది నిష్ప్రపంచమైన శూన్యం .
ఉక్కిరిబిక్కిరి చేసే ఇరుకు పరిధిలో
పదే పదే కలయదిరుగుతుంటాడు.
తన బలమైన పదఘట్టనలు
మారని కేంద్రం చుట్టూ చేసే నిర్బంధ ప్రదక్షిణ.
ఓ ప్రచండమైన సంకల్పబలం
ఆ కేంద్రంలో నిశ్చేష్టమై పడి వుంది. …
కొన్ని సార్లు ఏ అలికిడీ లేకుండా ఏదో దృశ్యం
కనుపాప తెర పైకెత్తి లోపలికి అడుగిడుతుంది.
సద్దులేని దేహపు ఇరుకు గోడల మధ్యగా
ముందుకి సాగి, హృదయంలోకి దూరి… అంతరించిపోతుంది.”
రిల్కె కవితలు చదివిని డా. సేయర్ కి కనువిప్పు అవుతుంది. అంతవరకు తను రోజూ చూసే ఎన్సెఫలైటిస్ రోగులు జీవచ్ఛవాల్లాంటి వారన్న అభిప్రాయంలో ఉండేవాడు. ఏవో కొన్ని స్వల్పమైన బాహ్య కదలికలు తప్ప లోపల మనసు ఎప్పుడో చచ్చిపోయిందని అనుకునేవాడు. కాని లియొనార్డ్ తనని రిల్కె కవితలు చదవమని సూచించాడంటే నిశ్చయంగా ఆ పద్యాల ద్వార తన మానసిక, ఆంతరిక స్థితి వ్యక్తం చేసుకోవాలనే ఉద్దేశం తప్ప మరొకటి లేదు. పంజరంలో చిలకలా లియొనార్డ్ మనస్సు ఈ వ్యాధిగ్రస్థ దేహంలో బందీగా పడి వుందని గమనిస్తాడు. లియొనార్డ్ నే కాక అలాంటి స్థితిలో ఉన్న ఇతర రోగులకి కూడా ఎలాగైనా విమోచనమార్గం వెతకాలని నిశ్చయించుకుంటాడు.
ఇలా ఉండగా పార్కిన్సన్స్ వ్యాధి కి కొత్త మందు బయటికి వచ్చిందన్న వార్త వస్తుంది. ఎల్-డోపా అనే మందు వల్ల పార్కిన్సన్స్ వ్యాధి వున్న రోగుల్లో అద్భుతంగా గుణం కనిపిస్తోందని తెలుస్తుంది. ఆ మందు గురించి డా. సేయర్ పని చేస్తున్న ఆసుపత్రిలో ఒక నిపుణుడు సెమినార్ ఇస్తాడు. పార్కిన్సన్స్ వ్యాధి రోగులకి, తను చికిత్స చేస్తున్న ఎన్సెఫలైటిస్ వ్యాధి రోగులకి మధ్య వ్యాధి లక్షణాలలో పోలికలు గమనించిన డా. సేయర్ అదే మందుని తన రోగుల మీద ప్రయోగించి చూడాలని అనుకుంటాడు.
ముందు తన రోగుల్లో ప్రతి ఒక్కరికి ఈ కొత్త మందు ఇవ్వాలని అనుకుంటాడు. కాని చీఫ్ ఒప్పుకోకపోవడంతో తనకి బాగా సన్నిహితమైన లియొనార్డ్ కి మాత్రం ఇచ్చి చూస్తాడు. ప్రయోగం చెయ్యడానికి లియొనార్డ్ తల్లి అనుమతి తీసుకుంటాడు. ముందు 500 mg డోస్ ఇచ్చి చూస్తాడు. ఏ ఫలితమూ ఉండదు. డోస్ రెండింతలు చేస్తాడు. అయినా ఏ మార్పూ కనిపించదు. లియొనార్డ్ పక్కనే రాత్రంతా జాగారం చేస్తాడు డా. సేయర్. అర్థరాత్రి ఏదో అలికిడై ఉలిక్కి పడి లేచిన డా. సేయర్ కి పక్కన పక్క మీద రోగి కనిపించడు. చుట్టూ వెతికితే పక్క హాలులో ఒక బల్ల వద్ద కూర్చుని ఏదో రాసుకుంటూ కనిపిస్తాడు లియొనార్డ్! లోకం అంతా నిద్రపోయే వేళ ఇలా మేలుకోకూడదు, వెళ్లి పడుకో మంటాడు డా. సేయర్. ముప్పై ఏళ్ల నిద్ర తరువాత మెలకువ వచ్చింది, మళ్లీ నిద్ర పోవాలని లేదంటాడు లియొనార్డ్.
ఒక్క రోజులో లియొనార్డ్ లో అంత మార్పు రావడం చూసి ఆసుపత్రి సిబ్బంది అదిరిపోతారు.
మందుని తతిమా రోగులకి కూడా ఇవ్వాలని డా. సేయర్ ఆసుపత్రి చీఫ్ కి సూచిస్తాడు. అయితే దానికి 12,000 డాలర్లు ఖర్చవుతుంది. ఆసుపత్రి అంత ఖర్చు భరించలేదంటాడు చీఫ్. నేరుగా ఆసుపత్రికి విరాళాలిచ్చే దాతలని అడుగుతానంటాడు సేయర్. లియొనార్డ్ లో వచ్చిన మార్పులని ప్రదర్శిస్తూ వీడియో తీసి దాతలకి మందు గొప్పదనం గురించి వివరిస్తాడు. చికిత్సకి నిధులు సమకూరుతాయి.
అందిన నిధులతో తక్కిన రోగులకి కూడా మందు ఇస్తారు. అందరూ నమ్మశక్యం కానంత బాగా కోలుకుంటారు. కొత్త మందు వల్ల దీర్ఘ కాలం అచేతనంగా పడి వున్న వాళ్ళు ఉన్నపళంగా ‘మేలుకుంటారు.’ ఒక్క సారిగా న్యూరాలజీ వార్డ్ కి ప్రాణం లేచొచ్చినట్టు అవుతుంది. అంతవరకు రాళ్లలా పడివున్న రోగులలో ఎక్కడ లేని చైతన్యం వస్తుంది. ఆ సందర్భంలో కొన్ని దృశ్యాలు గమ్మత్తుగా ఉంటాయి. “కొంచెం ఆగు తల్లీ! బీపీ తీసుకోవాలి” అంటూ ఓ నర్సు ఓ ముసలావిడ వెంట పడుతుంటుంది. “పాతికేళ్లు కుర్చీలో కదలకుండా కూర్చున్నాను. అప్పుడేంచేశావు?” అంటూ ఆ పెద్దావిడ పరుగు అందుకుంటుంది.
ఇలా కొంత కాలం గడుస్తుంది. లియొనార్డ్ పరిస్థితి బాగా మెరుగౌతుంది. ఆ కాలంలోనే పౌలా అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఈ అమ్మాయి తన తండ్రిని చూడడాన్కి ఆసుపత్రికి వస్తుంటుంది. లియొనార్డ్ ని మొదట చూసి తనొక రోగి అనుకోదు. తనలాగే ఆసుపత్రికి వచ్చిన సందర్శకుడు అనుకుంటుంది. ఇద్దరి స్నేహం క్రమంగా బలపడుతుంది.
లియొనార్డ్ కి ఆసుపత్రిలో బతుకు దుర్భరంగా అనిపిస్తుంది. బయటికి వెళ్లినా ఎవరినైనా తోడు తీసుకుని వెళ్లాల్సిందే. ఒంటరిగా బయటికి వెళ్లడానికి అనుమతి కోరుకుంటూ అర్జీ పెట్టుకుంటాడు. కాని ఆసుపత్రి అధికారులు ఒప్పుకోరు. ఇక భరించలేక ఒక సారి ఆసుపత్రి నుండి పారిపోడానికి ప్రయత్నించి విఫలమవుతాడు లియొనార్డ్.
ఇంతలో లియొనార్డ్ ప్రవర్తనలో విచిత్రమైన మార్పు కనిపిస్తుంది. మందు సక్రమంగా వేసుకుంటున్నా కూడా ఒంట్లో ఆపుకోలేని చిత్రమైన కదలికలు (dyskinesias) కనిపిస్తుంటాయి. తల విసిరేస్తున్నట్టుగా పదే పదే విదిలిస్తుంటాడు. ఇలాంటి కదలికలని motor tics అంటారు. ఒళ్ళంతా బలంగా ఊగిపోవడం వల్ల నాలుగు అడుగులు వెయ్యడమే గగనం అయిపోతుంది. డా. సేయర్ మందు మోతాదుని రకరకాలుగా మార్చి చూస్తాడు. ఏ ఫలితం ఉండదు.
లియొనార్డ్ పరిస్థితి క్రమంగా దిగజారిపోతుంటుంది. ఏమీ చెయ్యలేని తన అశక్తతకి డా. సేయర్ మనస్తాపం చెందుతాడు. ఇంత కాలం తరువాత మేలుకున్న వ్యక్తి అంతలోనే మళ్ళీ ఆ భయంకర నిద్రలోకి జారుకోవడం అతడు భరించలేకపోతాడు.
ఆ విధంగా ఓ వైద్య సమస్యతో మొదలైన సినిమా, పూర్తి పరిష్కారం లేకుండా ముగుస్తుంది… నిజ జీవితంలో లా.
న్యూరాలజీ లో రోగాలు ఎంత విచిత్రంగా, ఎంత భయంకరంగా ఉంటాయో తెలుపుతుంది ఈ సినిమా. అసలు మందులే లేక, ఉన్నా సరిగ్గా పని చెయ్యక, మొదటికే మోసం వచ్చేలాంటి ‘ఉపఫలితాలు’ (side effects) చూపిస్తూ వైద్య నిపుణులని యాతన పెట్టే మెదడు రోగాల లక్షణాన్ని స్పష్టంగా చూపిస్తుంది. గొప్ప పాండిత్యం, ప్రతిభ మాత్రమే కాక, వైద్యుడికి ఉండాల్సిన అంకితభావం, కరుణార్ద్రహృదయం గల న్యూరాలజిస్ట్ అయిన ఆలివర్ సాక్స్ ని తలపించేలా డా. సేయర్ పాత్రని రాబిన్ విలియమ్స్ అద్భుతంగా పోషించాడు. ( రాబిన్ విలియమ్స్ వైద్యుడి పాత్రని అద్భుతంగా పోషించిన మరో సినిమా కూడా ఉంది. ‘శంకర్ దాదా ఎమ్. బి.బి.ఎస్.’ కి స్ఫూర్తి నిచ్చిన ఆ సినిమా పేరు ‘పాచ్ ఆడమ్స్’.) రోగిగా రాబర్డ్ డి నీరో నటన కూడా అద్భుతం. ముఖ్యంగా చివరి దశల్లో dyskinesias ప్రదర్శిస్తూ అతడు చేసిన నటన చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
ఈ చిత్రం మూడు అకాడెమీ అవార్డ్ నామినేషన్లు అందుకుంది. రాబర్ట్ డి నీరో కి ఉత్తమ నటుడి నామినేషన్ రావడంలో ఆశ్చర్యం లేదు.
ఎలాగూ ఇంత వ్యాసం రాశాను కనుక ఇక చివర్లో నా గోడు కొంచెం చెప్పేసుకుంటాను. మన దేశంలో, మన భాషల్లో ఇలాంటి సినిమాలు ఎందుకు రావు? ముఖ్యంగా సైన్స్ అంశాల మీద సినిమాలు మన సంస్కృతిలో ఎందుకంత తక్కువ? ఎప్పుడో తప్పజారి సైన్స్ కి సంబంధించిన సినిమా తీసినా అవి దేవుళ్ళు, దయ్యాలు, సైన్స్, నాన్సెన్స్ అన్నీ కలగలిపిన కుర్మా సినిమాలు తప్ప శుద్ధమైన సైన్స్ అంశాలమీద పకడ్బందీగా తీసిన సినిమాలు బహుతక్కువ. దానికి కారణాలు కొత్తేం కాదు. ఒక ఆధునిక సమాజంలో సైన్స్ ఎలాంటి సహజ పాత్ర పోషించాలో అలాంటి పాత్ర ఇంకా మన సమాజంలో పోషించడం లేదు. సైన్స్ యొక్క ప్రయోజనాలని కొంత వరకు వాడుకోవడం జరుగుతోందే తప్ప సైన్స్ యొక్క తత్వం మన సామాన్య సామజిక చింతనలోకి లోతుగా ఇంకా ప్రవేశించలేదు. సైన్స్ ప్రభావం బలంగా ఉంటే మన సమిష్టి జీవనం ఇంత కల్లోలంగా ఉండదు. సైన్స్ అంటే కేవలం ఉద్యోగావకాశాలని పెంచే ఓ పనిముట్టుగా చూడకుండా, సమిష్టి జీవన ప్రమాణాలని పెంచే ఓ ప్రబల శక్తిగా స్వీకరించాలి. జీవితాన్ని, ప్రపంచాన్ని వైజ్ఞానిక దృష్టితో చూసే అలవాటు మన చేతనలో గాఢంగా నాటుకుపోవాలి. సైన్స్ సమాచారం కేవలం ‘సైన్స్ స్టూడెంట్ల’కి, ‘సైంటిస్టుల’కి మాత్రమే పరిమితం కాకూడదు. సైన్స్ అందరి సొత్తూ కావాలి. వైజ్ఞానిక భావ లహరులు సర్వత్ర సహజంగా ప్రవహించాలి. మన సినిమాలలో, సాహిత్యంలో, జీవన వ్యవస్థలలో, దైనిక జీవనంలో దోషంలేని, సమున్నతమైన వైజ్ఞానిక పరిజ్ఞానం అభివ్యక్తం కావాలి. పశుబలం తప్ప ఏ ఔన్నత్యమూ లేని కథానాయకులతో, రూపం తప్ప వ్యక్తిత్వం సుతరామూ లేని కథానాయికలతో, ఒక జంట నానా తిప్పలూ పడి పెళ్లిచేసుకోవడం తప్ప మరో వస్తువే లేని కథతో, కాస్త చవకబారు సంచనలనం తప్ప ఏ సారమూ లేని నేటి తెలుగు సినిమాలు ఇంతకన్నా దిగజారలేవేమో ననిపిస్తుంది. Awakenings లాంటి సినిమాలు మన సినిమాలకి ‘మేలుకొలుపు’ అయితే బావుంటుంది.
References:
http://en.wikipedia.org/wiki/Awakenings
http://en.wikipedia.org/wiki/Rainer_Maria_Rilke
http://www.thebeckoning.com/poetry/rilke/rilke3.html
బాగుంది. ముఖ్యంగా చివరి ప్యారా.
ఈ సినిమా చూస్తాను. ధన్యవాదాలు.
అద్భుతంగా వ్రాసారు సర్..!
మీరు చెప్పిన లాంటి ’భారీ’చవకబారు సినిమాలు తీస్తూ, ప్రేక్షకులు ఇలాంటివే కోరుకుంటున్నారంటూ అక్కడికేదో వీళ్ళ స్థాయి ఇంతే అన్నట్లు ప్రేక్షకలోకాన్ని అవమానిస్తున్నారు కూడా..!!
sir, thanks for sharing. given data on neurology is very informative.
Thank you Sri garu!