శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

Awakenings - సినిమా కథ, సమీక్ష - 1

Posted by V Srinivasa Chakravarthy Sunday, March 4, 2012
ఈ మధ్య ఓ చక్కని సినిమా చూడడం జరిగింది. పేరు Awakenings. 1991 నాటి సినిమా. చాలా మంది చూసే ఉంటారు. ఆలివర్ సాక్స్ అనే బ్రిటిష్ న్యూరాలజిస్ట్, పాపులర్ సైన్స్ రచయిత యొక్క జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా ఇది. ఈ కథలో ముఖ్య పాత్ర అయిన డా. మాల్కమ్ సేయర్ పాత్రని రాబిన్ విలియమ్స్ పోషించాడు.

డా. సేయర్ ఓ అమెరికన్ న్యూరాలజిస్టు. ఇతడికి క్లినికల్ వృత్తి కన్నా పరిశోధనల మీద ఆసక్తి ఎక్కువ. 1917-1928 కాలంలో ఎన్సెఫలైటిస్ లెతార్జికా అనే అంటువ్యాధి పెచ్చరిల్లి ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. ఎన్సెఫలైటిస్ వైరస్ ముఖ్యంగా మెదడుని దెబ్బ తీస్తుంది. ఈ వ్యాధి వాత బడ్డ రోగులు నిశ్చేతనంగా శిలాప్రతిమల్లా ఏళ్ళ తరబడి ఉండిపోతారు. ఇలాంటి స్థితిని కెటటోనియా అంటారు. వాళ్లకి వాళ్ళు స్వచ్చందంగా ఏమీ చేసుకోలేరు. అన్నీ మరొకరు చెయ్యాల్సిందే. 1917-1928 కాలంలో ఈ అంటువ్యాధి దుష్ప్రభావం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. బతికి బట్టకట్టిన కొంత మంది దశాబ్దాల పాటు ఇలా శిలలలా పడి ఉంటారు. డా. సేయర్ కి ఇలాంటి కొంత మంది రోగులతో పని చెయ్యాల్సిన బాధ్యత ఏర్పడుతుంది. సరిగ్గా అప్పుడే వచ్చిన ఎల్-డోపా అనే మందు ఈ రోగం మీద సత్ఫలితాలు చూపించొచ్చన్న వార్త వస్తుంది. డా. సేయర్ ధైర్యం చేసి తన రోగుల మీద ఈ మందు ప్రయోగించి చూస్తాడు. కొంతమంది విషయంలో అద్భుతమైన ఫలితాలు కనిపించినా, ఒక రోగి విషయంలో మాత్రం రోగం వికటించి జీవితం మరింత దుర్భరం అయిపోతుంది. క్లుప్తంగా ఇదీ కథ.

డా. సేయర్ ఉద్యోగం వెతుక్కోవడంతో కథ మొదలవుతుంది. న్యూరాలజిస్ట్ పోస్ట్ కోసం ఓ ఆసుపత్రికి అర్జీ పెట్టుకుంటాడు. అయితే డా. సేయర్ గతానుభవం అంతా పరిశోధనా రంగంలోనే ఉందని, క్లినికల్ రంగంలో అనుభవం ఇంచుమించు లేదని ఇంటర్వ్యూ చేసిన వాళ్లకి త్వరలోనే అర్థమవుతుంది.

ఇంతకాలం ఏం చేశారు డాక్టర్? అన్న ప్రశ్నకి డా. సేయర్, “ కొన్ని ఏళ్లు శ్రమపడి 4 టన్నుల వానపాము మాంసం నుండి కొన్ని డెసీగ్రాముల మైలిన్ పదార్థాన్ని వెలికితీసే ప్రయత్నం చేశాను” అంటాడు. (నాడీ తంతుల చుట్టూ ఉండే ఓ సన్నని తెల్లని పొరే ఈ మైలిన్. మల్టిపుల్ స్క్లీరోసిస్ లాంటి నాడీ వ్యాధులలో ఓ మైలిన్ పొర చెడిపోతుంది. మరి అలాంటి రోగం మీద పరిశోధన చెయ్యలాంటే ఆ మైలిన్ పదార్థాన్ని తగు మోతాదులో ముందు సాధించాలి.) రోగుల అవసరాలకి, పరిశోధనా ఫలితాలకి మధ్య (అనివార్యమైన) వారడి ఈ సంభాషణలో స్పష్టంగా కనిపిస్తుంది. వైద్య బృందం ముందు వెనకాడినా చివరికి డా. సేయర్ కి ఆ ఉద్యోగం ఇస్తారు.

అంతకాలం పెట్రీ డిష్ లో కణాలని మైక్రోస్కోప్ లో చూస్తూ కాలం గడిపిన డా. సేయర్ ఒక్కసారిగా న్యూరాలజీ వార్డ్ లో రోగులు, వారి దురవస్థ చూసి తల్లడిల్లి పోతాడు. ముఖ్యంగా తన దృష్టి ఎన్సెఫలైటిస్ రోగుల మీద పడుతుంది. వారంతకి వారు ఏ చలనమూ చూపించకపోయినా, బయటి నుండి వచ్చే ప్రేరణలకి స్పందిస్తారని గమనిస్తాడు డా. సేయర్. ఉదాహరణకి ఒక సన్నివేశంలో డా. సేయర్ చేతి నుండి జారిపోతున్న పెన్ ని, అంతవరకు చలనం లేకుండా కూర్చున్న రోగి చెయ్యి చాచి చటుక్కున అందుకుంటాడు. అది చూసి డా. సేయర్ ఆశ్చర్యపోతాడు. ఇతర రోగులని కూడా పరీక్షించి చూస్తాడు. బంతి విసిర్తే పట్టుకోవడం గమనిస్తాడు. దశాబ్దాల పాటు స్థాణువై ఉన్న వాళ్లలో ఇంత చిన్న కారణం వల్ల చలనం రావడం చూసి నమ్మలేకపోతాడు. ఉత్సాహం పట్టలేక ఆసుపత్రి చీఫ్ ని మరిద్దరు సీనియర్ డాక్టర్లని పిలిచి చూపిస్తాడు. “తమ కంటూ ఏ సంకల్పమూ లేకపోయినా, బంతి యొక్క సంకల్పాన్ని వాడుకుని కదలగలుగుతున్నారు” అని రోగులు ఎలా కదల గలుగుతున్నారో వివరిస్తాడు. ఆ వివరణ సీనియర్ డాక్టర్లకి హాస్యాస్పదంగా తోస్తుంది. నవ్వి వెళ్ళిపోతారు.

కాని డా. సేయర్ వివరణ తన వార్డులో పని చేసే ఎలియనోర్ కాస్టెలో అనే నర్స్ కి నచ్చుతుంది. డా. సేయర్ సామర్థ్యం మీద ఆమెకి నమ్మకం, గౌరవం ఏర్పడతాయి. ఇద్దరూ కలిసి మిగతా రోగుల పరిస్థితిని కూడా మెరుగుపరచాలని ప్రయత్నిస్తారు. తగు రీతిలో బాహ్య ప్రేరణలు ఇచ్చి వారిని మరింత చైతన్యవంతం చెయ్యాలని చూస్తారు. ఒక సారి ఒక వృధ్ధురాలిని నడిపించాలని చూస్తారు. ఎన్ని ‘ఎర’లు చూపించినా ఉన్న చోటనే నించుంటుంది కాని కదలదు. ఆమెని ఎలా కదిలించాలా అని డా. సేయర్ ఆలోచనలో పడతాడు. అలా ఆలోచిస్తూ ఒక రోజు తన వార్డు కిటికీ లోంచి కిందకి చూస్తుంటే కింద కొంత మంది పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తారు. వారిలో ఒక పాప తొక్కుడుబిళ్ళ ఆడుతూ కనిపిస్తుంది. ఒక్కక్క గడిని గెంతుతూ, దాటుతున్న ఆ పాపని చూడగానే డా. సేయర్ మనసులో ఓ అద్భుతమైన ఆలోచన మెదుల్తుంది.

డా. సేయర్ పని చేసే న్యూరాలజీ వార్డులో నేల ఎలాంటి చిహ్నాలు లేని తల్లని నేల. ఆ నేల మీద చదరంగంలో నలుపు, తెలుపుల గడులు వచ్చేలా రంగులు వెయ్యడం మొదలెడతాడు. ఈ ఆలోచన నచ్చిన నర్సు ఎలియనోర్ కూడా సహాయం చేస్తుంది. అంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేని ఆ వృద్ధ రోగి ఈ గడుల మీద సులభంగా నడవగలుగుతుంది.

ఇలా ఉండగా లియనార్డ్ లోవ్ (రాబర్ట్ డి నీరో) అనే రోగితో డా. సేయర్ కి ఓ ప్రత్యేక అనుబంధం ఏర్పడుతుంది. ఇతగాడు బళ్ళో చదువుకునే రోజుల్లో వ్యాధి సోకుతుంది. అంతవరకు క్లాసులో అన్ని సబ్జెక్ట్లలో రాణించిన పిల్లవాడు ఒక్క సారిగా అచేతనంగా మారిపోతాడు. అప్పట్నుంచి తల్లే తనని కనిపెట్టుకుని చూసుకుంటూ ఉంటుంది. వయసు పైబడ్డ ఆ తల్లి నుండి లియొనార్డ్ గురించి మరింత సమాచారం రాబట్టుతాడు. తన బద్ధ స్థితి నుండి లియొనార్డ్ ఎలాగైనా బయటికి తేవాలని అనుకుంటాడు. కనీసం తన మనసులో ఏవుందో తెలుసుకోవాలని అనుకుంటాడు. ఓ ‘ఔజా’ బోర్డుతో లియొనార్డ్ తో మాట్లాడొచ్చని తెలుసుకుంటాడు. “దెయ్యాలతో” మాట్లాడడానికి వాడే ఈ బోర్డులో ఓ పాయింటర్ ఉంటుంది. చుట్టూ అక్షరాలు ఉంటాయి. పాయింటర్ ని కదిలిస్తూ వరుసగా అక్షరాలని సూచిస్తూ పోవచ్చు. ఆ బోర్డుని ఉపయోగించి లియొనార్డ్ ఇచ్చిన మొట్టమొదటి సందేశం చూసి డా. సేయర్ అదిరిపోతాడు. ఆ సందేశం ఇలా ఉంటుంది

RILKESPANTHERRILKES…

(ఇంకా వుంది)

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts