ప్రొఫెసర్ మావయ్య చూపించిన దృశ్యం చూసి ఆనందించ లేదు గాని అదిరిపోయాను. ఎదురుగా ఉన్న బండ యొక్క పశ్చిమ ముఖం మీద రహస్య ర్యూనిక్ అక్షరాలు చూసి ఆశ్యర్యపోయాను. కాలం ప్రభావం వల్ల చాలా మటుకు అక్షరాలు చెరిగిపోయాయి. వాటి మధ్యలో మా జీవితానికి శనిలా దాపురించిన ఓ పేరు చూసి అట్టుడికినట్టు ఉడికిపోయాను.
“ఆర్నే సాక్నుస్సేమ్!” మామయ్యే ఆ పేరుని పైకి చదివాడు. “ఇప్పటికైనా నీ సందేహం తీరిందా?”
నేనేం మాట్లాడలేదు. అంతకు ముందు నేను కూర్చున్న లావా వేదిక వద్దకి తిరిగి వెళ్లాను. కాసేపు ఆలోచనలు స్తంభించిపోయాయి. అక్కడ కనిపించిన సాక్ష్యాధారాలకి దిమ్మదిరిగిపోయింది.
కొంతసేపు మనసంతా ఏవేవో ఆలోచనలతో అలజడిగా అయిపోయింది. కాసేపయ్యాక నేను తలెత్తి చూసేసరికి ఎదురుగా మామయ్య, హన్స్ నిలబడి ఉండడం మాత్రం గుర్తు. మాకు తోడుగా అంతవరకు వచ్చిన ఐస్లాండ్ వాసుల బృందం అల్లంత దూరంలో వెనక్కు తిరిగి వెళ్లిపోతూ కనిపించారు. ఇక నాకైతే ఆ విచిత్ర దృశ్యానికి స్పందించే ఓపిక కూడా లేదు. రెప్పలు వాలిపోతున్నాయి.
హన్స్ ఓ పెద్ద బండ వద్ద, లావా వేదిక మీద పడుకున్నాడు. కాని మామయ్య మాత్రం అగ్నిబిలం అడుగున బోనులో పులిలా ఉద్రేకంగా అటు ఇటు ఒకటే తిరిగేస్తున్నాడు. ఈ పాతాళగృహంలో ఏ క్షణం ఏ అవాంతరం జరుగుతుందోనని ఒక పక్క బిక్కుబిక్కుమంటూనే వున్నా హన్స్ బాబునే ఆ క్షణం ఆదర్శంగా తీసుకుని హాయిగా నిద్రలోకి జారుకున్నాను.
ఆ విధంగా ఆ అగ్నిబిలంలో మొదటి రాత్రి సురక్షితంగా గడిపేశాం.
మర్నాడు ఉదయం లేచి చూస్తే ఆకాశం మేఘావృతమై వుంది. అలుసిస్తే లోపలికి చొచ్చుకు వచ్చేటంతగా మబ్బులు పర్వత ముఖం మీదుగా ముసిరి వున్నాయి.
ఈ విషయాన్ని నేను కేవలం ప్రకృతి విలాసాన్ని చూసి గ్రహించలేదు. మామయ్య ధుమధుమలాడుతుంటే చూసి తెలుసుకున్నాను.
కారణం ఏమిటో తెలిశాక హృదయంలో ఓమూల ఏదో చిన్న ఆశ చిగురించింది. అసలు విషయం ఇది.
ఇప్పుడు మా ఎదుట మూడు మార్గాలు ఉన్నాయి. ఒకటి సాక్నుస్సేం తీసుకున్న దారి. మహాపండితుడైన ఆ ఐస్లాండర్ రాసిన రహస్య సందేశంలో ఆ మార్గం సూచించబడింది. స్కార్టారిస్ పర్వతపు నీడ జూన్ నెల చివరి రోజుల్లో ఆ దారి మీదుగా పడుతుందట.

ఓ పెద్ద సౌరగడియారపు స్తంభంలా ఆ పర్వతపు నీడ భూమి కేంద్రానికి తీసుకుపోయే మార్గాన్ని సూచిస్తుందట.
కాని ఆ క్షణం మాకు సూరీడు లేడు, నీడా లేదు. దారి తెన్ను తెలియలేదు. ఆ రోజు తేదీ జూన్ 25. మరో ఆరు దినాలు ఇలాగే మేఘావృతమై ఉంటే మేం ఈసారికి ఇక ఇంటికెళ్లిపోయి మళ్లీ మరుసటేడు రావలసిందే.
ఆ క్షణం పట్టరాని కోపంతో ఊగిపోతూ మామయ్య చేస్తున్న తాండవాన్ని వర్ణించడానికి నాకైతే శబ్దజాలం సరిపోదు. గడియలు గడిచిపోతున్నాయి గాని పర్వతపు లోపలి గోడల మీద ఏ నీడా పడలేదు. హన్స్ ఉన్నచోటి నుండి కదల్లేదు. మేం ఎందుకోసం ఎదురుచూస్తున్నామో తనకి అర్థమై వుండదు. విషయాన్ని విశదీకరించడానికి మామయ్య కూడా నోరు మెదపలేదు. కన్నార్పకుండా కారుమబ్బుల కేసి గుర్రుమని చూస్తూ ఉండిపోయాడు.
26 వ తేదీ ఉదయం కూడా సూర్యుడి ఆచూకీ లేదు. రోజు పొడవునా వర్షం, మంచు కలిసి కురిశాయి. హన్స్ గట్టిపడ్డ లావా ముక్కలతో చిన్న గుట్టలాగా చేశాడు. అగ్నిపర్వతపు శంకువులోకి వస్తున్న చిట్టిపొట్టి జలపాతాలని చూస్తూ, వాటి గతికి అడ్డుపడే రాళ్లని అవి తన్నే తాపులకి పుట్టే భీభత్సమైన ఘోషని వింటూ ఒక విధమైన తుంటరి ఆనందాన్ని అనుభూతి చెందాను.
ఆదిలోనే హంసపాదు అన్నట్టున్న మా పరిస్థితికి మామయ్య కోపం కట్టలు తెంచుకుంది.
చెడుతో పాటూ మంచి కూడా దాని నీడలా వెంటే వస్తుందంటారు. ప్రస్తుతం ఎంత ఆందోళన చెందుతున్నాడో, అంతకు తగ్గ మోతాదులో ఆనందావకాశాలు కూడా ముందు ఉన్నాయని ఆ క్షణం ప్రొఫెసర్ లీడెన్ బ్రాక్ కి తెలీదు.
(ఇంకా వుంది)

0 comments