మామయ్య దృష్టి ఆ నీడనే అనుసరించింది.
ఆ నీడ పగలంతా కదిలి కదిలి మధ్యాహ్నానికల్లా మధ్య సొరంగం నోటి వద్ద ఆగింది.
“అదుగో! మార్గం తెలిసిపోయింది!” అంటూ రంకె వేశాడు మామయ్య.
“పదండిక. భూమి కేంద్రానికి బయల్దేరదాం.” అన్నాడు మళ్లీ తనే డానిష్ లో.
ఏమంటాడో అని హన్స్ కేసి ఓ సారి ఆత్రంగా చూశాడు మామయ్య.
“Forut!” అన్నాడు హన్స్ నిర్లిప్తంగా.
“Forward” అన్నాడు మామయ్య అందుకు స్పందిస్తూ.
సమయం ఒంటగంట దాటి పదమూడు నిముషాలు అయ్యింది.
(పదహారవ అధ్యాయం సమాప్తం)
అధ్యాయం 17
అవరోహణ మొదలయ్యింది
నేటితో మా అసలు పయనం మొదలయ్యింది. ఇంతవరకు వచ్చిన ఇబ్బందులని ఎలాగో శ్రమపడి జయించాం. కాని ఇక నుండి అడుగడుగునా ఇక్కట్లు ఎదురై ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
(image: http://nashvillegrotto.org/july-18-brenmark-and-parachute-caves-excursion)
నా ఎదుట కనిపిస్తున్న చీకటి గుయ్యారం లోకి, ఆ పాతాళ బిలంలోకి తొంగి చూడడానికి ఇంకా ప్రయత్నించలేదు. దైవఘడియ రానే వచ్చింది. ఇక ముందుకు వెళ్లడమో మొరాయించడమో నిశ్చయించుకోవాలి. కాని మా గైడు వాలకం చూస్తే వెనకాడడానికి సిగ్గేస్తోంది. ఎంత నిశ్చింతగా, నిబ్బరంగా, పొంచి వున్న ప్రమాదాలకి ఏ మాత్రం కంగారు పడకుండా హన్స్ ఈ ప్రయత్నానికి పూనుకున్నాడంటే తన ముందు పిరికి వాడిలా కనిపించడానికి తలవంపులుగా అనిపించింది. హన్స్ లేకపోయి వుంటే మరొక్క సారి మామయ్యతో వాదనకి దిగేవాణ్ణి, ఆయన మనసు మార్చే ప్రయత్నం చేసేవాణ్ణి. కాని హన్స్ ముఖం చూసి నోరు మెదపలేదు. ఒక్కసారి నా ప్రేయసి తీపి జ్ఞాపకాలని మనసులో తలచుకుంటూ మధ్య సొరంగం దిశగా అడుగులు వేశాను.
నా ఎదుట ఉన్న సొరంగం వెడల్పు నూరు అడుగులు ఉంటుందని, చుట్టుకొలత సుమారు మూడొందల అడుగులు ఉంటుందని ఇందాక చెప్పాను. సొరంగం నోటి వద్ద ఉన్న రాతి మీద ఆనుకుంటూ ఓ సారి సొరంగంలోకి తొంగి చూశాను. ఎదుట కనిపించిన దృశ్యానికి వెన్నులోంచి చలిపుట్టుకొచ్చింది. తల తిరిగి మూర్చ వచ్చినంత పనయ్యింది. అంతులేని అగాధంలో ఉండే ఆకర్షణ కన్నా భయంకరమైనది మరేదీ లేదు. ఒక్క క్షణం ఉంటే జారి పడే వాణ్ణే. అంతలో ఏదో చెయ్యి నన్ను చటుక్కున పట్టుకుని ఆపింది. అది హన్స్ చెయ్యి.
ఆ గోతి లోకి ఒక్క క్షణమే చూసినా దాని రూపురేఖల గురించి కొంత అవగాహన కలిగింది. దాని గోడలు కచ్చితంగా నిలువుగా ఉన్నా ఆ గోడల లోంచి పదునైన రాళ్ళు పొడుచుకువస్తూ కనిపించాయి. ఆ రాళ్ల మీద పాదం మోపుతూ కిందకి దిగవచ్చు అనిపించింది. కనుక మెట్ల దారి లాంటి రాళ్లు ఎన్నో ఉన్నాయి కాని ఆ మెట్లకి పక్కన అడ్డుకట్టలా ఏమీ లేదు. పోనీ పైన ఏ బండకో ఓ త్రాడు కట్టుకుని కిందికి దిగినా, తీరా దిగాక ఆ త్రాడుని విప్పుకోవడం ఎలా?
ఈ సమస్యకి మామయ్య ఓ చక్కని పరిష్కారం ఆలోచించాడు. వేలెడు మందం కలిగి నాలుగొందల అడుగుల పొడవు ఉన్న ఓ తాడు తీసుకున్నాడు. మా ఎదురుగా ఓ లావా బండ పొడుచుకు వస్తోంది. దాని మీదుగా అటు ఇటుగా ఈ త్రాటిని వెయ్యాలి. త్రాడు యొక్క మధ్య బిందువు ఈ బండ మీదకి రావాలి. అప్పుడు త్రాడుకి చెరో వైపు మామయ్య, నేను దిగాలి. ఇద్దరం త్రాడు కొసలని చేరుకున్నాక ఒక పక్క త్రాడు కొసని విడిచిపెడితే అవతలి కొస నుండి మొత్తం త్రాడుని లాగేసుకోవచ్చు. ఇలా మళ్లీ మళ్లీ చేస్తూ ఎంత లోతుకైనా చేరుకోవచ్చు.
(ఇంకా వుంది)
0 comments