(సర్ ఆర్థర్ కాటన్)
మన దేశంలోని నదులని అనుసంధానం చెయ్యాలన్న ఆలోచన నేటిది కాదు. ఒకటిన్నర శతాబ్దాల కాలం నాటిది. పందొమ్మిదవ శతాబ్దపు చివరి దశల్లో, ఇండియాలో రైల్వేలు
నిర్మించాలా, జల రవాణా వ్యవస్థని పెంపొందించాలా అని బ్రిటిష్ ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతున్న సమయంలో, జల రవాణా లోని లాభాలు వివరిస్తూ జల రవాణా వ్యవస్థని రూపొందిస్తే మేలని బ్రిటిష్ ప్రభుత్వానికి విజ్ఞాపన సమర్పించిన వాడొకడు ఉన్నాడు. అతడే సర్ ఆర్థర్ కాటన్.
అదే దిశలో పురోగమిస్తూ నదీజలాల అనుసంధానాన్ని సమర్థించిన మరొక మేధావి ఆంధ్రుడైన కె. ఎల్. రావు.
గత ఏడాది వెలువడ్డ, డి.కె. హరి, డి.కె. హెమ హరి లు రాసిన, “యూ టర్న్ ఇండియా” అన్న పుస్తకంలో ఓ అధ్యాయంలో కాటన్-రావుల కృషి గురించి అద్భుతంగా వర్ణించడం జరిగింది. ఆ అధ్యాయం నుండి కొన్ని అంశాలు.
కాటన్ దొర అని, కాటన్ దేవుడు అని గోదావరి జిల్లా ప్రజలు గౌరవంగా పిలుచుకునే సర్ ఆర్థర్ కాటన్ పేరు వినని తెలుగువాడు ఉండడు. విశాలమైన గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించి గోదావరి ప్రజల అభిమానాన్ని దోచుకున్నాడు.
ఇండియాలో నీటి పారుదల వ్యవస్థకి మూలపురుషుడుగా కాటన్ పేరే చెప్పుకుంటారు. ఈయన ఇండియా అంతా విస్తృతంగా సంచరించి, నదీ ప్రాంతాలని క్షుణ్ణంగా సర్వే చేసి, దేశవ్యాప్తమైన జల జాలం (water grid) కి బ్లూ ప్రింట్ తయారు చేసి, 1881 లో బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాడు.
జల సాంకేతిక రంగంలో ఇండియాలో ప్రాచీన కాలం నుండి వస్తున్న కొన్ని సాంప్రదాయాలే తన కృషికి స్ఫూర్తి అని చెప్పుకున్నాడు ఆర్థర్ కాటన్. ముఖ్యంగా తంజావూరులో కావేరి నది మీద నిర్మించబడ్డ ‘కల్లనై’ అనే ఆనకట్ట నిర్మించిన తీరు మీద ఆధారపడి తాను నీటిపారుదల వ్యవస్థలని సూత్రీకరించానని ప్రకటించుకున్నాడు. కావేరి నదిపై ‘కల్లనై’ అనే రాతి ఆనకట్టని క్రీ.శ. 100 లో కరికాల చోళుడు అనే తమిళ రాజు నిర్మించాడు. రెండు వేల ఏళ్ళుగా ఆ ఆనకట్ట మీద నీరు ప్రవహిస్తున్నా ఇప్పటికీ అది చెక్కుచెదర లేదు.
ఈ రంగంలో ప్రాచీన భారతీయ ఇంజినీర్ల ప్రతిభ గురించి కాటన్ ఇలా అంటున్నాడు :
“ఇండియాలో వివిధ ప్రాంతాల్లో లెక్కలేనన్ని ప్రాచీన నిర్మాణాలు ఉన్నాయి…
పూర్వకాలంలో ఇక్కడ ఉండే సాంకేతిక ప్రతిభకి తార్కాణాలైన ఘన నిర్మాణాలివి.
వాటిని చూస్తుంటే మన నాగరిక అనాగరికులం అనిపిస్తుంది. యుద్ధక్రీడలో మునిగి తేలుతాం గాని ఆ పూర్వీకుల కన్నా మనం ఎంతో అథములం. వారు నిర్మించిన వ్యవస్థలని అనుకరించి, విస్తరింపజేయ లేకపోయినా, వాటికి కనీసం మరమ్మత్తు చేయించి నిలుపుకోవడం కూడా చాతకాని అప్రయోజకులం.
లోతు తెలియని బురద నేలలో పునాదులు ఎలా వెయ్యాలో మనం ప్రాచీన భారతీయుల నుండి నేర్చుకున్నాం.
పునాదులు వెయ్యడంలో వారి నుండి పాఠాలు నేర్చుకుని మనం నేడు వంతెనలు, ఆనకట్టలు, కాలువలు నిర్మించగలుగుతున్నాం.
ఆ విధంగా ఆ ప్రాచీన ఇంజినీర్లకి మనం ఎంతో ఋణపడి వున్నాం.”
సరుకుల రవాణా కోసం రైల్వేలు స్థాపించకుండా, జల రవాణా వ్యవస్థని కల్పిస్తే ఎన్నో లాభాలు ఉన్నాయంటూ 1878 లో ఆర్థర్ కాటన్ బ్రిటిష్ ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించుకున్నాడు. ఆ నివేదిక నుండి కొన్ని ముఖ్యాంశాలు:
ఇండియాకి అవసరమైన రవాణా సౌకర్యాలని తగు మూల్యం వద్ద గాని, తగు మోతాదులో గాని రైల్వేలు అందించలేవు… రైల్వే బాట వెయ్యడానికి మైలుకి 9,000 పౌండ్లు అవుతుంది. ౩౦,౦౦౦ టన్నులు ఒక మైలు రవాణా చెయ్యడానికి 1 పెన్నీ పడుతుంది. అదే జల మార్గం వెంట అయితే ఒక మైలు పొడవున్న మార్గానికి 2,000-8,000 పౌండ్లు పడుతుంది. 1/20 పెన్నీల ఖర్చుతో రెండు మూడు మిలియన్ల టన్నులు రవాణా చెయ్యొచ్చు…
సర్ ఆర్థర్ కాటన్ ఆలోచన ప్రకారం భారీ సరుకులని రవాణా చెయ్యడానికి రైల్వే మార్గంలో కన్నా జల మార్గంలో మరింత సౌకర్యంగా ఉంటుంది. అంతర్దేశీయ జల మార్గ వ్యవస్థాపనకి అయ్యే ఖర్చు కూడా రైల్వేలకి అయ్యే ఖర్చు కన్నా తక్కువే. రవాణాకి అయ్యే ఖర్చు కూడా రైల్వేలలో కన్నా జల మార్గాలలో అతి తక్కువ.
తన భావాలని విమర్శించిన సర్ జార్జ్ హామిల్టన్ కి సమాధానంగా కాటన్ 1878 లో ‘హౌస్ ఆఫ్ కామన్స్’ లో ఇలా అన్నాడు: “మిలార్డ్, పోటెక్కిన గోదావరి నదిలో ఒక్క రోజులో ప్రవహించే జలాలు ఏడాది పొడవునా లండన్ లో థేమ్స్ నదిలో ప్రవహించే జలాలతో సమానం.” ఆ విధంగా ఇండియాలోని జల సంపద ఎంత విస్తారమైనదో బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేస్తూ, దేశంలో జల రవాణా వ్యవస్థల నిర్మాణం కోసం ఎంతో ప్రయత్నించాడు కాటన్. కాని బ్రిటిష్ ప్రభుత్వం తన ప్రతిపాదనకి సుముఖంగా లేదు.
(ఇంకా వుంది)
వారి దూరదృష్టి ప్రస్తుతం మనకు లేదు .మంచి అంశం .