అక్టోబర్ స్కై అన్న పేరు గల హాలీవుడ్ చిత్రం 1999 లో విడుదల అయ్యింది. ఓ నిజజీవిత కథ ఆధారంగా తీసిన ఈ చిత్రం ఓ చిన్న గ్రామానికి చెందిన నలుగురు కుర్రాళ్ల కథ. కథ జరిగిన కాలం 1957. పెద్దగా సౌకర్యాలు లేని ఆ కుగ్రామానికి చెందిన ఆ కుర్రాళ్లకి కొన్ని కారణాల వల్ల ఓ రాకెట్ తయారుచెయ్యాలని ఆలోచన వస్తుంది. ఎన్నో కష్టనష్టాలకి ఓర్చి, ఎంతో వ్యతిరేకతని ఎదుర్కుని చివరికి ఓ చిన్న రాకెట్ తయారు చేస్తారు. ఆ రాకెట్ ని ఓ జాతీయ స్థాయి సైన్స్ ప్రాజెట్ పోటీ లో ప్రదర్శించి మొదటి స్థానంలో విజయం సాధిస్తారు. అత్యంత స్ఫూర్తి దాయకమైన ఈ కథలో ముఖ్య పాత్ర పేరు ‘హోమర్ హికమ్.’ ఇతడు రాసిన పుస్తకమే యూనివర్సల్ స్టూడియోస్ బానర్ కింద సినిమాగా విడుదల అయ్యింది. ఈ పుస్తకానికి రచయిత హోమర్ హికమ్ మొదట పెట్టిన పేరు Rocket Boys (రాకెట్ కుర్రాళ్లు). అయితే సినిమాకి అలాంటి పేరు పెడితే “ముప్పై ఏళ్లు నిండిన స్త్రీలు ససేమిరా చూడరు” అని యూనివర్సల్ స్టూడియోస్ సిబ్బంది అభిప్రాయపడడం చేత Rocket Boys అన్న పేరుని కాస్తా Ocober Sky అని మార్చవలసి వచ్చింది. ఇక్కడ తమాషా ఏంటంటే ‘Rocket Boys’ అన్న పదజాలంలోని అక్షరాలని తారుమారు చేస్తే అది ‘October Sky’ అవుతుంది. ఈ కథ పిల్లలకి ఎంత స్ఫూర్తి దాయకంగా ఉంటుందంటే ఈ పుస్తకాన్ని అమెరికాలో ఎన్నో బళ్లు పిల్లలు తప్పనిసరిగా చదవాల్సిన సాహిత్యంలో భాగంగా స్వీకరించాయి.
ఈ సినిమా కథని విపులంగా కొన్ని పోస్ట్ లలో చెప్పుకు రావాలని ఉద్దేశం.
అక్టోబర్ 4, 1957 లో రష్యా స్పుట్నిక్ ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలో కక్ష్యలో పెట్టగలిగింది. స్పుట్నిక్ విజయంతో అంతరిక్ష రంగంలో అమెరికా రష్యాల మధ్య మహోగ్రమైన పోటీ మొదలవుతుంది. ఇంత ముఖ్యమైన రంగంలో రష్యా అమెరికా కన్నా ముందు ఉండడం అమెరికాలో సంచలనం సృష్టిస్తుంది. రాకెట్ టెక్నాలజీలో పై చేయిగా వున్న రష్యా ఆ టెక్నాలజీని ఉపయోగించి అమెరికా మీద దెబ్బ తీస్తుందేమో నన్న భయం మొదలవుతుంది. రష్యా స్పుట్నిక్ ని పంపడం అనే ప్రపంచ ఘట్టమే మన సినిమా కథకి సందర్భాన్ని, నేపథ్యాన్ని సమకూరుస్తుంది.
కథా స్థలం అమెరికాలో, వెస్ట్ వర్జీనియాలో కోల్ వుడ్ (Coalwood) అనే ఓ చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఓ బొగ్గు గని తప్ప మరేమీ లేని పరిస్థితి ఉంటుంది. ఆ పల్లెలో ఓ చిన్న బడి. ఆ బడిలో చదువుకుని బయటికి వచ్చిన వారిలో ఇంచుమించు అందరూ ఆ బొగ్గుగనిలో పని చేస్తారు. బహు కొద్ది మంది అదృష్టవంతులు మాత్రం, - ఫుట్ బాల్ లో ప్రావీణ్యత ఉన్న వారు – ఫుట్ బాల్ స్కాలర్ షిప్ మీద పొరుగు ఊళ్ళో కాలేజిలో చదువుకునే భాగ్యానికి నోచుకుంటారు.
స్పుట్నిక్ లాంచ్ జరిగిన నేపథ్యంలో కోల్ వుడ్ లో జనం రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు.
‘రాకెట్లు ఉపయోగించి రష్యా మన మీద బాంబులు వేస్తుందో ఏమో?’ అంటాడు ఒకడు. ‘ఆ వేసేదేదో ఈ పల్లె మీద పడేస్తే శని వదిలిపోతుంది,’ అంటాడు మరొకడు.
స్పుట్నిక్ గురించి రేడియోలు హోరెత్తిస్తూ ఉంటాయి.
“గంటకి 18,000 మైళ్ల వేగంతో, భూమికి 559 మైళ్ల ఎత్తులో, 96 నిముషాలకి ఒకసారి భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటుంది ఈ ఉపగ్రహం. సాయంత్రం సూర్యాస్తమయం జరిగిన గంట తరువాత, సూర్యోదయానికి ఓ గంట ముందు ఈ ఉపగ్రహం ‘అక్టోబర్ ఆకాశం’లో దర్శనమిస్తుంది.” అంటూ ఆ రేడియో ప్రోగ్రాం ఉపగ్రహం వివరాలు తెలుపుతుంది.
అదే ప్రోగ్రాంలో, అమెరికాకి చెందిన ‘వెర్నర్ ఫాన్ బ్రౌన్’ (Wernher von Braun) అనే రాకెట్ శాస్త్రవేత్త “దగ్గర్లోనే అమెరికా కూడా కృత్రిమ ఉపగ్రహాలని అంతరిక్షంలోకి పంపనుంది” అని ప్రకటిస్తాడు.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ నుండి అమెరికాకి వలస పోయిన ఎంతో మంది శాస్త్రవేత్తలలో ఈ ఫాన్ బ్రౌన్ ఒకడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలానికి జర్మనీ రాకెట్ టెక్నాలజీని బాగా అభివృద్ధి పరచుకుంది. అయితే రాకెట్ లని అంతరిక్ష ప్రయోజనాల కోసం కాక, క్షిపణులు (missiles) రూపంలో యుద్ధ ప్రయోజనాల కోసం వాడుకుంది. జర్మనీ పంపిన V2 రాకెట్లు యూరప్ లో శత్రు దేశాల మీద నిప్పులు కురిపించి భీభత్సం సృష్టించాయి. ఆ V2 రాకెట్ల నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించినవాడు ఈ వెర్నర్ ఫాన్ బ్రౌన్. యుద్ధం తరువాత ఇతగాడు అమెరికాలో NASA లో చేరిపోతాడు. తదనంతరం Saturn-V అనే రాకెట్ సీరిస్ నిర్మాణంలో ఇతడు ముఖ్య పాత్ర ధరించాడు. ఓ దశకం తరువాత చందమామ వద్దకి మనిషిని మోసుకు పోయిన అపోలో మిషన్ ఈ అత్యంత శక్తివంతమైన Saturn-V రాకెట్ వల్లనే సాధ్యమయ్యింది.
స్పుట్నిక్ గురించి దేశం అంతా ఇంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో అదెలా ఉంటుందో నన్న కుతూహలంలో ఓ రోజు సాయంతం కోల్ వుడ్ ప్రజలంతా ఒక చూట గుమిగూడుతారు. మామూలుగా ఉపగ్రహాలు ఎంత చీకట్లోనైనా నేల నుండి చూస్తే కనిపించవు. కాని స్పుట్నిక్ లో ఓ ప్రత్యేకత వుంది. దాని సోలార్ పానెళ్లు ఎలా అమర్చారంటే వాటి మీద సూర్యకాంతి పడ్డప్పుడు అది ప్రతిబింబించి భూమి నుండి కనిపిస్తుంది. కనుక చీకటి ఆకాశంలో చిన్న కదిలే తారలా అందంగా కనిపిస్తుంది.
ఆకాశంలో అంత ఎత్తులో అంత వేగంగా కదిలే ఓ మానవ నిర్మిత వస్తువు కనిపించడం కోల్ వుడ్ ప్రజలకే కాదు, ప్రపంచ ప్రజలందరికీ అదే ప్రథమ అనుభవం. స్పుట్నిక్ దృశ్యం కోల్ వుడ్ ప్రజలలో కలకలం రేకెత్తిస్తుంది.
ఆ బృందంలో ఓ పిల్లవాడు కూడా ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూసి బాగా ప్రభావితం అయిన ఆ పిల్లవాడి మనసులో ఓ ఆలోచన మెరుస్తుంది.
(ఇంకా వుంది)
Very exciting.keep it up..!
ఇలాంటి మంచి సైన్స్ సినిమాలను పరిచయం చేయండి.
మంచి టపా. చక్కగా రాశారు. అభినందనలు.
Chala bagundi. Science ante naku pranam.
కామెంట్లకి ధన్యవాదాలు.
ఈ సినిమాని ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ లింక్ కి వెళ్ళండి.
http://www.filecrop.com/search.php?w=:October.Sky.part&m=1
ఎనిమిది పార్ట్స్ ఉన్న లింకుల నుంచీ నేను డౌన్లోడ్ చేసాను. దానిలో ఇంకేదో భాషలో డబ్బింగ్ ఉంది. నేను దానిలోంచీ డబ్బింగ్ తీసేసి ఇంగ్లీషు ఒక్కటే ఉంచి సేవ్ చేసుకున్నాను.