నా తర్కానికి మామయ్య నుండి ఏ సమాధానమూ రాలేదు. నేను నా వాదాన్ని ఇంకా పొడిగించాను.
“మరో విషయం ఏంటంటే పదహారు కోసుల లోతు చేరడానికి నేలకి సమాంతరంగా ఎనభై ఐదు కోసులు ప్రయాణించాల్సి వచ్చింది. అంటే భూమి కేంద్రాన్ని చేరాలంటే దక్షిణ-తూర్పు దిశలో ఎనిమిది వేల మైళ్ల దూరం ప్రయాణించాలి. కాని అలా చేస్తే భూమి కేంద్రాన్ని చేరకుండా ఉపరితలం మీద ఏదో బిందువు వద్దకి చేరుకుంటాం.”
“నీ వాదన అంతా అయోమయంగా వుంది. నీ లెక్కలన్నీ తప్పుల తడకలు,” కోపంగా అన్నాడు మామయ్య. “అసలు నీ వాదనకి ఆధారం అంటూ ఏవైనా వుందా? ఈ మార్గం సూటిగా మన గమ్యానికి చేర్చదని నమ్మకం ఏంటి? అంతే కాక దీనికి పూర్వచరిత్ర వుంది. గతంలో ఒకరు సాధించిన దాన్ని మళ్లీ సాధించడం ఏమంత కష్టం?”
“కావచ్చు. అనుమతిస్తే మరో విషయం చెప్పాలనుకుంటూన్నాను.”
“అనుమతి నీ నోరు మూసుకోడానికి అయితే ఇస్తాను. నీ తలతిక్క మాటలిక ఆపితే బావుంటుంది.”
ప్రొఫెసర్ ముఖంలో తాండవిస్తున్న రౌద్రాన్ని చూసి కాస్త వెనక్కు తగ్గాను.
“ఒకసారి నీ బారోమీటర్ కేసి చూడు, ఏవంటోది అది?” మామయ్య అడిగాడు.
“ఇక్కడ వత్తిడి బాగా వుందని తెలుస్తోంది.”
“బావుంది. నెమ్మదిగా కిందకి పోతుంటే, ఒక్కొక్క దశలోను వాతావరణానికి అలవాటు పడుతూ పోతే, మనకి ఏ ఇబ్బందీ ఉండదన్న మాట.”
“ఇబ్బంది ఏమీ ఉండదు. చెవులలో కాస్తంత నొప్పి పుడుతుందంతే.”
“అదొక సమస్యే కాదు. ఎప్పుడు బాధ అనిపించినా కాస్త వేగంగా శ్వాస తీసుకుంటే సరిపోతుంది.”
“అవును నిజమే. చక్కగా సరిపోతుంది,” మామయ్య మాటలకి తందానా అనకపోతే ఏం జరుగుతుందో అర్థమయ్యింది. “ఇలాంటి సాంద్రమైన వాతావరణంలో జీవిస్తుంటే భలే హాయిగా వుంది కదూ? ఇక్కడ శబ్దం ఎంత తీవ్రంగా ఉందో కదా?”
“అవును. చెవిటి వాడికి కూడా సులభంగా వినిపించేలా.”
“కాని గాలిలో ఈ సాంద్రత వల్ల వినికిడి మరింత పదును అవుతుందేమో?”
“అవును. ఓ పాతకాలపు సిద్ధాంతం ప్రకారం మరి అలాగే జరగాలి. మనం కిందికి దిగుతున్న కొద్ది వస్తువుల బరువు తగ్గుతుంది అన్నది తెలిసిన విషయమే. భూమి ఉపరితలం వద్దనే బరువు బాగా తెలుస్తుంది. కేంద్రం వద్ద అసలు బరువే ఉండదు.”
“అది నాకూ తెలుసు. కాని ఒక విషయం చెప్పండి. కేంద్రం వద్ద గాలి సాంద్రత నీటి సాంద్రతని సమీపించదా?”
“తప్పకుండా. ఏడొందల పది వాతావరణ పీడనాల వద్ద అలాగే జరుగుతుంది.”
“మరి ఇంకా అడుక్కి పోతేనో?”
“ఇంకా అడుక్కి పోతే సాంద్రత ఇంకా పెరుగుతుంది.”
“మరి ఇంకా లోపలికి పోయేదెలా?”
“జేబుల్లో రాళ్లు రప్పలు నింపుకోవాలంతే!”
“అబ్బ! మావయ్యా! ఏ ప్రశ్న అడిగిన్నా తడుముకోకుండా సమాధానం చెప్తావు!”
అంతూ పొంతూ లేని ఈ అసంభవాల మీద చర్చని ఇక పొడిగించదలచుకోలేదు. నాకైతే ఓ ముఖ్యమైన అసంభవం కనిపిస్తోంది. కాని మళ్లీ మామయ్యని కదిలించదలచుకోలేదు.
వెయ్యి వాతావరణ పీడనాల వద్ద గాలి కూడా ఘన దశని చేరుకుంటుంది. మా దేహాలు ఆ ఒత్తిడిని తట్టుకోగలిగినా అంతకు మించి ముందుకు పోవడం మూర్ఖత్వం. అక్కడ ఇక తర్కానికి తావే లేదు.
కనుక మామయ్య తో మళ్లీ వాదించలేదు. నేను ఏం అన్నా మామయ్య సాక్నుస్సేం మంత్ర ప్రయోగంతో నన్ను నోరు మూయించేస్తాడు. ఆ పాత కాలపు ఐస్లాండ్ పండితుడి భూగర్భ యాత్రా వృత్తాంతం నిజమేనని అనుకున్నా కూడా, ఒక ముఖ్యమైన ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. పదహారవ శతాబ్దంలో పీడనాన్ని కొలిచే సాధనాలు లేవు కనుక ఆ పెద్ద మనిషి ఎంత లోతుకి వెళ్లాడో చెప్పడం కష్టం.
కాని ఆ ప్రశ్న నా మనసులోనే ఉండిపోయింది.
ఇక తక్కిన రోజంతా లెక్కల లోను, కబుర్లలోను గడిచిపోయింది. ప్రొఫెసర్ లీడెన్ బ్రాక్ గారి అభిప్రాయాల మీద విశ్వాసం పెంచుకోవడం అలవరచుకున్నాను. ఏం జరిగినా ఏమీ పట్టనట్టు, కళ్ళు మూసుకుని కనిపించని గమ్యం దిశగా చిద్విలాసంగా ముందుకి సాగిపోయే హన్స్ ని చూస్తే ఒకపక్క చిర్రెత్తుకొస్తోంది.
(ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తం)
0 comments