అధ్యాయం 27
చిమ్మ చీకట్లో చిన్ని ఆశ
నా ఆవేదన వర్ణించడానికి నాకైతే మాటలు చాలవు. సజీవంగా భూస్థాపితం అయినట్టు అనిపిస్తోంది. ఆకలి దప్పులతో ఈ చీకటి లోతుల్లో సమసిపోవడం ఖాయం.
యాంత్రికంగా ఓ సారి చేత్తో నేల తడిమాను. కింద శిల అతి కఠినంగా అనిపించింది.
ప్రవాహం నుండి అలా ఎలా దూరమయ్యాను? నాకు తోడుగా ఆ ప్రవాహం లేకపోవడం భరించరాని యాతనగా వుంది. ఇప్పుడు గుర్తొచ్చింది. పొరబాటు ఎక్కడ జరిగిందో అర్థమయ్యింది. ఇందాక నేను కుడి పక్క దారి తీసుకున్నప్పుడు ప్రవాహపు శబ్దం లేకపోవడం అప్పుడు గమనించలేదు. ఆ సమయంలో నేనొక దారి తీసుకుంటే, హన్స్ బాక్ ప్రవాహం మరో వాలుని అనుసరిస్తూ మరో దారి పట్టింది.
మరి ఇక్కడి నుండి వెనక్కి వెళ్లేదెలా? జాడ తెలుసుకోడానికి కరకు శిల మీద అడుగుజాడలు కూడా లేవు. ఏం చెయ్యాలో దిక్కుతోచలేదు. ఇక నాకేందారి దేవుడో?
ఇంత విపరీతమైన లోతులో తప్పిపోయి ఒంటరిగా ఇలా… ముప్పై కోసుల మందం వున్న రాతి పొర నా నెత్తిన ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు అనిపించింది. ఆ భారానికి నలిగి నుజ్జై పోతున్న భావన…
భూమి ఉపరితలం గురించి ఆలోచించడానికి ప్రయత్నించాను. కాని ఎంత ప్రయత్నించినా మనసు వశపడలేదు. కోనిగ్స్ స్ట్రాసె లో మా ఇల్లు, నా బంగారు గ్రౌబెన్, మనుషులతో వాహనాలతో, నానా విధ వస్తు సంజాతంతో కూడుకున్న మానవ జీవన స్రవంతి… ఆ సజీవ ప్రపంచానికి అట్టడుగున భూగర్భంలో బిక్కుబిక్కు మంటూ ఒంటరిగా, నిస్సహాయంగా సంచరిస్తూ నేను… మా యాత్రలో ముఖ్యమైన ఘట్టాలు మనోవేదిక మీద కదలాడాయి… ఐస్లాండ్, మిస్టర్ ఫ్రెడెరిక్సెన్, స్నెఫెల్ పర్వతం… ఒక్క ఆశాకిరణం ప్రసరించడానికి కూడా అవకాశం లేని చిమ్మ చీకటి నా మనసులో చోటు చేసుకుంది. నిస్సహాయంగా చతికిలబడడం తప్ప ఏమీ చెయ్యలేని దుస్థితి.
నా పైనుండి నన్ను నిర్బంధిస్తున్న దుస్తర, సువిస్తార శిలా స్తరాలని భేదించి నా చుట్టూ ఉన్న తీవ్రతమస్సులో తేజోవృష్టి కురిపించగల శక్తి ఎక్కడుంది? నాకు సరైన దారి చూపించి నన్ను తిరిగి నా వాళ్ల వద్ద ఎవరు చేర్చగలరు?
“ఎక్కడున్నావు మావయ్యా?” ఆ తలంపుకే కళ్ళంట నీళ్లొచ్చేశాయి.
ఇప్పుడాయన ఎక్కడున్నాడో ఎమో? నేను తప్పిపోయానని ఆయన ఎంత బాధపడుతున్నాడో?
లౌకిక మైన ఆసరాలన్నీ తొలగిపోయాక ఇక పారలౌకికమైన ఆలంబన కోసం చేతులు చాచాను. ఒక్కసారి మనసులో నా చిన్నతనం మెదిలింది. అమ్మ గుర్తొచ్చింది. నేను బాగా చిన్నప్పుడే అమ్మ వెళ్లిపోయింది. కనుక ఆమె జ్ఞాపకాలన్నీ బాగా చిన్నతనానికి చెందినవే. అప్రయత్నంగా నేల మీద మోకరిల్లి సహాయం కోసం దైవాన్ని అర్థించాను.
భగవంతుడి అండ అంటూ ఒకటుందన్న స్ఫురణ కలిగాక కొండంత బలం వచ్చింది. నా భయాలన్నీ ఒక్కొటొక్కటిగా గాలికెగిరిపోయాయి. మనసంతా లగ్నం చేసి పరిష్కారం కోసం ఆలోచించసాగాను.
నా దగ్గర మూడు రోజులకి సరిపోయే పచ్చార్లు మాత్రమే ఉన్నాయి. ఫ్లాస్క్ నిండుగా వుంది. కాని ఒంటరిగా ఎంతో సేపు ఉండలేను.
ఇంతకీ ఇప్పుడు ఎలా వెళ్లాలి? పైకా కిందకా?
(ఇంకా వుంది)
పరమానందం,అలౌకికానందం.తెలుగులో ఎంత అమోఘమైన వర్ణన!(అదీ తెలుగులో).