శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

వైరల్ వ్యాధులపై పాశ్చర్ విజయాలు

Posted by V Srinivasa Chakravarthy Sunday, December 9, 2012
రోగకారక క్రిమిని క్షీణింపజేసి రోగి లోకి ఎక్కించినప్పుడు, రోగి శరీరంలో ఆ క్రిమినుండి ఆత్మరక్షణ ఏర్పడుతుందన్న చికిత్సా విధానాన్ని అవలంబిస్తూ ఫ్రాన్స్ లో లూయీ పాశ్చర్ కొన్ని అంటువ్యాధులకి విరుగుళ్ళ కోసం అన్వేషణ సాగించాడు.




పాశ్చర్ మొట్టమొదట చికెన్ కలరా (chicken cholera) అనే వ్యాధి మీద ధ్వజం ఎత్తాడు. (దీన్ని కలుగజేసే క్రిమి పాశ్చరెల్లా మల్టోసిడా (Pasteurella Multocida) అనే ఒక రకం బాక్టీరియా. అయితే క్రిమి గురించి, దాని లక్షణాల గురించి అప్పుడు తెలీదు). ఇది కోడిపెట్టలకి సోకే ఒక రకమైన కలరా. రోగం సోకిన పెట్టల నుండి సీరం (serum) ని తీసుకుని రోకకారక క్రిమి గల ద్రావకాన్ని తయారు చేశాడు పాశ్చర్. దాన్ని ఎంతగా సాంద్రం చేశాడంటే ఆ ద్రావకంలో కాస్తంత చర్మం అడుగున ఎక్కిస్తే కోడిపెట్ట ఒక్క రోజులో చచ్చిపోయేది. ఈ ద్రావకంతో పెట్టల మీద ప్రయోగాలు ఆరంభించాడు.

ఓ సారి పాశ్చర్ ఓ నెల సెలవు తీసుకుని మరో ఊరు వెళ్లాడు. బయల్దేరుతూ ప్రయోగాలు నిరాఘాటంగా కొనసాగించమని చార్లెస్ చాంబర్లాండ్ అనే అనుచరుడికి పని అప్పగించి వెళ్లాడు. అయ్యగారు అటు వెళ్ళగానే ఈ పెద్దమనిషి కూడా మరెటో ఉడాయించాడు.

ఓ నెల తరువాత పాశ్చర్ తిరిగొచ్చి తన ప్రయోగాలు కొనసాగించాడు. ఆ నెల రోజులు నిలువ ఉన్న ద్రావకాన్ని మళ్లీ పెట్టల లోకి ఎక్కిస్తే ఈ సారి పెట్టలు కొద్దిగా జబ్బు పడి మళ్ళీ కోలుకున్నాయి. తను తయారు చేసిన ద్రావకం ‘పాడైపోయింది’ అనుకుని మళ్ళీ కొత్తగా ద్రవకాన్ని తయారుచేశాడు. ఈ సారి తయారుచేసిన ద్రావకం కొత్త పెట్టలని హతమార్చింది గాని, అంతముందు రోగం వచ్చి కోలుకున్న పెట్టలని చంపలేకపోయింది. అలా అనుకోకుండానే పాశ్చర్ చికెన్ కలరాకి మందు కనిపెట్టాడు. జెన్నర్ పద్ధతిలో కనిపెట్టబడ్డ మందు కనుక దీన్ని కూడా పాశ్చర్ వాక్సీన్ (vaccine) అని పిలువసాగాడు. అప్పటి నుండి ఈ రకమైన మందులకి వాక్సీన్ అన్న పేరే సార్థకనామం అయ్యింది.



చికెన్ కలరా మీద సాధించిన విజయంతో ఉత్సహం వచ్చిన పాశ్చర్ ఈ సారి ఆంత్రాక్స్ (anthrax) వ్యాధి మీదకి దృష్టి సారించాడు. ఈ వ్యాధిని కలుగజేసే క్రిమి బాసిలస్ ఆంత్రాసిస్ (bacillus anthracis) అనే ఓ బాక్టీరియా. ఈ వ్యాధికి కారకమైన క్రిమి ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందంటే, ఒక పశువుల మందలో ఒక్క పశువుకి సోకినా వేగంగా మొత్తం మంద అంతా రోగం వ్యాపిస్తుంది. అందుకని రోగం ఒక్క పశువుకి సోకిందని తెలియగానే మందలో వున్న పశువులన్నిటినీ చంపి దహనం చేసేవారు. ఆంత్రాక్స్ వ్యాధి కలుగజేసే క్రిమి గల ద్రావకాన్ని క్షీణపరిచి చికెన్ కలరాకి చేసినట్టే పాశ్చర్ ఆంత్రాక్స్ కి కూడా వాక్సీన్ ని రూపొందించాడు.

పాశ్చర్ కి నిజంగా పేరు తెచ్చిన విషయం రేబీస్ వ్యాధి మీద ఆయన సాధించిన విజయం. అంతకుముందు పాశ్చర్ పరిశోధించిన రెండు వ్యాధులు బాక్టీరియల్ వ్యాధులు. కనుక రోగకారక క్రిమిని మైక్రోస్కోప్ లో చూడడానికి వీలయ్యింది. కాని రేబీస్ ని కలుగజేసేది బాక్టిరియా కన్నా చాలా చిన్నదైన వైరస్. కనుక మైక్రోస్కోప్ లో పాశ్చర్ కి క్రిమి దొరకలేదు.

రేబీస్ వ్యాధి అతిభయంకరమైనది. ఇది జంతువుల నుండి జంతువులకి సోకే వ్యాధి. సాధారణంగా ఇది కుక్క కాటు వల్ల మనుషులకి సోకుతుంది. లాటిన్ లో రేబీస్ అంటే ‘పిచ్చి’. ఈ వ్యాధి సోకిన వ్యక్తిలో మొదట్లో జ్వరం, తలనొప్పి మొదలైన సామాన్య రోగ లక్షణాలు కనిపిస్తాయి. కాని ఇవి త్వరలోనే విషమిస్తాయి. రోగిలో విపరీతమైన, అనియంత్రితమైన కదలికలు కనిపిస్తాయి. ఈ వైరస్ నాడీమండలం మీద ముఖ్యంగా పని చేస్తుంది కనుక మానియా (mania), డిప్రెషన్ (depression) మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి ఇంకా ముదిరితే రోగి కోమాలోకి ప్రవేశించడం జరుగుతుంది. క్రమంగా శ్వాస క్రియ ఆగిపోవడం వల్ల మరణం సంభవించవచ్చు.



క్రిమి కనిపించకపోయినా నిరుత్సాహపడక పాశ్చర్ తన పరిశోధనలు కొనసాగించాడు. రేబీస్ క్రిమి గల ద్రావకాన్ని కుందేళ్లలోకి ఎక్కించి వాటి మీద క్రిమి ప్రభావాన్ని పరిశీలించాడు. రేబీస్ సోకిన కుందేటి వెన్నుపాము (spinal cord) నుండి ధాతువుని (tissue) తీసుకుని, దాన్ని చూర్ణం చేసి, అందులోంచి వచ్చిన ద్రవాన్ని మరో కుందేటి మెదడులోకి ఎక్కించేవాడు. ఒక కుందేటి నుండి తీసిన ద్రవాన్ని మరో కుందేలు లోకి ఎక్కించే ముందు ఆ ద్రవాన్ని తగినంత కాలం నిలువ ఉంచి అది క్షీణించేలా చేశాడు. ఒక దశలో ద్రవాన్ని ఎక్కించడం వల్ల కుందేళ్లు చావడం లేదని గుర్తించాడు. అంటే ఆ దశలో ద్రవం తగినంతగా క్షీణమయ్యిందన్నమాట. రోగకారక క్రిమి నుండి ఇప్పుడు కుందేళ్లలో రోగనిరోధకత ఏర్పడింది. రేబీసి కి ఇక వాక్సీన్ దొరికింది.



పాశ్చర్ తను కొత్తగా కనుక్కున్న వాక్సీన్ ని మానవరోగుల మీద పరీక్షించదలచాడు. జోసెఫ్ మైస్టర్ అనే ఓ తొమ్మిదేళ్ల పిల్లవాణ్ణి ఓ పిచ్చి కుక్క కరిచింది. తన కొత్త మందుని పిల్లవాడి మీద పరీక్షించదలచాడు. అయితే చట్టరీత్యా పాశ్చర్ కి ఈ పరీక్ష చేసే హక్కు లేదు. ఎందుకంటే అతడు శాస్త్రవేత్తే గాని రోగులకి చికిత్స చేసే లైసెన్స్ ఉన్న వైద్యుడు కాడు. ఈ పరీక్షలో ఎంత ప్రమాదం వుందో పాశ్చర్ కి తెలుసు. చికిత్స వల్ల రోగి తప్పకుండా బతుకుతాడన్న హామీ లేదు. నూటికి 15% చికిత్స విఫలమయ్యే ప్రమాదం వుంది. చికిత్స విఫలమైతే తన మీద చట్టపరమైన చర్య తప్పదు.

చికిత్స చెయ్యకపోతే ఎలాగూ పిల్లవాడికి మరణం తప్పదు. చికిత్స విఫలమై తనకి శిక్ష పడ్డా ఫరవాలేదనుకున్నాడు. మరి పాశ్చర్ ప్రమాదానికి వెరవని ధైర్యశాలి. ఇలాంటి సహసాలు చెయ్యడం పాశ్చర్ కి కొత్తేమీ కాడు. రేబీస్ పరిశోధనలలో పాశ్చర్ ఎలాంటి సాహసాలకి ఒడిగట్టిందీ చెప్తూ రచయిత ఏక్సెల్ ముంటే ఒక సన్నివేశాన్ని వర్ణిస్తాడు –



“భయమంటే ఏంటో తెలీని వాడు పాశ్చర్. ఒక సారి ఓ పిచ్చి కుక్క నోట్లోంచి కొంత ఉమ్మిని పైకి తీయాల్సి వచ్చింది. ఆ తీసే తొందరలో జాగ్రత్తలు గాలికి వొదిలేశాడు పాశ్చర్. చేతులకి గ్లోవ్స్ తొడుక్కున్న ఇద్దరు అనుచరులు కుక్కని బల్ల మీద అదిమి పట్టుకుంటే, పాశ్చర్ ఓ గాజు నాళాన్ని నోట్లో పెట్టుకుని, అవతలి కొసని కుక్క నోట్లో దూర్చి కాస్తంత ఉమ్మిని లోపలికి పీల్చడం నేను కళ్లారా చూశాను.”



పాశ్చర్ ధైర్యం చేసి పిల్లవాడి లోకి వాక్సీన్ ఎక్కించాడు. ముందు బాగా క్షీణించబడ్డ ద్రవాన్ని ఎక్కించాడు. క్రమంగా అంతకంతకు విషమమైన ద్రవాన్ని ఎక్కించాడు. పిల్లవాడిలో క్రమంగా రోగనిరోధకత పెరిగింది. కొత్త మందు వల్ల పిల్లాడు బతికాడు.



(ఇంకా వుంది)





0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts