సచేతన విషయాలు అచేతనలోకి ప్రవేశించి
మాయమైపోయినట్లే, అచేతన లోనుండి మునుపు ఎన్నడూ సచేతనం కాని కొత్త విషయాలు పైకొచ్చి సచేతన
లోకి ప్రవేశించవచ్చు. కొన్ని సార్లు చిత్తం అంచున ఏదో సంగతి తారాడుతున్నట్టు అనిపిస్తుంది.
మరి కాస్తలో ఏదొ విషయం స్ఫురిస్తుంది అన్న అనుభూతి కలుగుతుంది. ఇలాంటి అనుభవాల బట్టి
మనకి అర్థమయ్యేది ఏంటంటే అచేతన కేవలం గత స్మృతుల భాండాగారం మాత్రమే కాదు. నూతన ఆత్మగత
పరిస్థితుల, భావనల బీజాలు అందులో సంపూర్ణంగా ఉంటాయి. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న నాడు
నేను నా సొంత పంథాలో మనస్తత్వ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. నిజంగానే
ఎప్పుడో మర్చిపోయిన పాత జ్ఞాపకాలే కాక, పూర్తిగా కొత్తవి, సృజనాత్మకమైనవి అయిన భావాలు
కూడా అచేతన లోంచి పెల్లుబుకగలవు. పంకిలంలో పుట్టి పైకి తేలిన పంకజంలా అవి ఆ చీకటి లోతుల్లో
నుండి ఆవిర్భవిస్తాయి.
నిత్య జీవితంలో ఈ సత్యాన్ని
ఎన్నో సార్లు గుర్తిస్తాము. ఏదో సంకటం ఎదురవుతుంది, ఏదో నిర్ణయం తీసుకోవలసి వస్తుంది.
అనుకోని రీతిలో వాటికి పరిష్కారాలు ఉత్పన్నమవుతాయి. ఎంతో మంది కళాకారులు, తత్వవేత్తలు,
శాస్త్రవేత్తల జీవితాలలో ఎన్నో గొప్ప ఆలోచనలు, ప్రేరణలు అచేతన లోంచి పుట్టుకు రావడం
మనం చూస్తాము. అచేతనలో దాగి వున్న భావబీజాలని, జ్ఞాన గనులని ఆవిష్కరించి తత్వశాస్త్రంలో, సాహిత్యంలో, కళలో,
సంగీతంలో, విజ్ఞాన శాస్త్రంలో వాటిని అభివ్యక్తం
చెయ్యగలిగే సామర్థ్యాన్నే మేధస్సు అంటాము.
ఇలాంటీ పరిణామానికి ఓ చక్కని
నిదర్శనం మనకి విజ్ఞాన శాస్త్ర చరిత్రలో కనిపిస్తుంది. ఉదాహరణకి ఫ్రెంచ్ గణితవేత్త
ప్వాంకరే మరియు రసాయనవేత్త కేకులే ల విషయంలో ఎన్నో వైజ్ఞానిక ఆవిష్కరణలు హఠాత్తుగా “అంతఃప్రకాశనాల”
రూపంలో వారి చిత్తంలో మెరిశాయని ఆ శాస్త్రవేత్తలే చెప్పుకున్నారు. ఫ్రెంచ్ తాత్వికుడు
దే కార్త్ కి కూడా ఒక విధమైన “అధ్యాత్మిక” అనుభూతి కలిగిందని అంటారు. “సకల శాస్త్రాలని
కలిపే క్రమం” మెరుపులా తన చిత్తంలో మెరిసిందట. బ్రిటిష్ రచయిత రాబర్ట్ లూయీ స్టీవెన్
సన్ ఎన్నో ఏళ్ళ పాటు మనిషిలోని ఈ “ద్వంద్వాత్మ యొక్క తత్వాన్ని ఎత్తి చూపే” కథ కోసం గాలించగా, ఒక రాత్రి హఠాత్తుగా కలలో డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్ కథ చిత్తంలో
సాక్షాత్కరించిందట.
అలాంటి సమాచారం అచేతన లోంచి
ఎలా ఆవిర్భవిస్తుందో, అది ఎలాంటి రూపాన్ని తీసుకుంటుందో అంతా తరువాత విపులంగా చర్చిస్తాను.
అంతర్యం లోంచి కొత్త సమాచారం పుట్టగలదన్న విషయం మనకి కలలలో కనిపించే ప్రతీకలని పరిశీలిస్తున్నప్పుడు
స్పష్టంగా కనిపిస్తుంది. కలలలో పైకి తేలే చిత్రాలు, భావాలు కేవలం జ్ఞాపకాలు కాలేవని
నా వృత్తి అనుభవంలో నాకు ఎన్నో సార్లు అవతమయ్యింది. మన చేతన యొక్క ప్రాకారాలు ఎన్నడూ
దాటని నిత్యనూతన భావాలెన్నో కలలలో తేటతెల్లమవుతాయి.
(ఇంకా వుంది)
0 comments