“మిత్రులారా!
అవును నిజమే. ఇవన్నీ నాకు తెలుసు. ఇంతే కాదు. నాకు మరెన్నో విషయాలు తెలుసు. ఈ ఎముకలలో
కూవియే, బ్లూమెన్ బాక్ మొదలైన వారు పూర్వ-తృతీయ యుగానికి చెందిన మామత్ మొదలైన స్తన్యజీవుల
ఎముకలు మాత్రమే చూస్తారని కూడా నాకు తెలుసు. కాని ఈ కళేబరాన్ని చూశాక కూడా ఇంకా సందేహించడం
అసలు సైన్స్ నే కించపరిచినట్టు అవుతుంది. దాన్ని మనం చూడొచ్చు, తాకొచ్చు. అది అస్తిపంజరం
కాదు. పూర్తి శరీరం. మానవ శాస్త్ర (anthropology)
పురోగతి కోసం ప్రకృతి చేత జాగ్రత్తగా భద్రపరచబడ్డ కళేబరం.”
మామయ్య చెప్పిన
దానికి అభ్యంతరం చెప్పకుండా ఊరుకున్నాను.
మామయ్య ఇంకా
ఇలా చెప్పుకొచ్చాడు. “దీన్ని సల్ఫ్యురిక్ ఆసిడ్ ద్రావకంలో కడిగితే, ఇందులో పాతుకుపోయిన
మట్టి, గవ్వలు మొదలైన చెత్తంతా తొలగించవచ్చు. కాని ప్రస్తుతం మన దగ్గర అలాంటి ద్రావకం
లేదు. అయినా ఈ కళేబరం దాని కథ అది చెప్పకనే చెప్తోంది.”
ప్రొఫెసరు ఒడుపుగా
ఆ కళేబరాన్ని ఎత్తి పట్టుకుని మాకు చూపిస్తూ తన ఉపన్యాసం కొనసాగించాడు.
“ఇదుగో చూడండి.
ఇది ఆరు అడుగులు లేదు. కనుక ఆ మహాకాయులకి మనకి ఇంకా ఎంతో దూరం వుందన్నమాట. ఇకపోతే ఇది
నిశ్చయంగా కాకేశియన్ జాతికి చెందినదే. అంటే తెల్ల జాతి, మన జాతి. దీని కపాలం కోలగా వుంది. లేక కోడిగుడ్డు
ఆకారంలో వుంది. బుగ్గల్లో ఎముకలు ఎత్తుగా లేవు, గడ్డం పొడుచుకొస్తున్నట్టు లేదు. కనుక prognathism (గడ్డం
పొడుచుకొస్తున్నట్టు ఉండే లక్షణం) ఉందని చెప్పలేం. అదే ఉన్నట్లయితే ముఖ కోణం మరింత
తక్కువై ఉండేది. కావలిస్తే ఆ కోణాన్ని కొలిచి చూడండి. ఇంచుమించు తొంభై డిగ్రీలు వుంది.
ఇవన్నీ చూస్తే ఒక్కటి మాత్రం కచ్చితంగ చెప్పగలుగుతున్నాను. ఈ కళేబరం జాఫెటిక్
(Japhethic) జాతికి చెందినది అంటాను. ఆ జాతి
ఇండియా నుండి అట్లాంటిక్ దాక విస్తరించింది… నవ్వకండి మిత్రులారా! నేను చెప్తున్న దాంట్లో
నిజం ఏంటో కాస్త ఆలోచించండి.”
(బైబిల్ లో నోవా
యొక్క ముగ్గురు కొడుకుల్లో జాఫెత్ ఒకడు. జాఫెతిక్ జాతి అంటే అతడి సంతతి. – అనువాదకుడు)
మావయ్య తన చిత్రవిచిత్ర సిద్ధాంతాలని అడ్డుఅదుపు లేకుండా
ఏకరువు పెడుతున్నప్పుడు శ్రోతలు కొద్దొ గొప్పో నవ్వడం పరిపాటే. దానికి ఆయన కాస్త చిన్నబుచ్చుకోవడం
కూడా పరిపాటే. మావయ్య తన ఉపన్యాసం కొనసగించాడు.
“నిజమే. ఈ శిలాజ
మానవుడు… ఈ వేదిక మీద చెల్లచెదురుగా పడి వున్న మాస్టడాన్ ఎముకలకి సమకాలీనుడు. కాని
అసలు ఇతగాడు భూమిలో ఇంత లోతుకి ఎలా వచ్చాడు, భూమి ఉపరితలం నుండి ఇంత లోతుకి ఎలా జారాడు?
అని అడిగితే ఆ ప్రశ్నకి నా వద్ద సమాధానం లేదనే చెప్పాలి. పూర్వ తృతీయ యుగంలో భూమి పైపొరలలో
తీవ్రమైన సంక్షోభం చెలరేగుతూ ఉండేదని మనకి తెలిసిందే. భూమి చల్లారుతున్న దశలో, పైపొరలో
గాఢమైన గాట్లు, చీలికలు, బీటలు, దోషాలు ఏర్పడి వుండొచ్చు. భూమి ఉపరితలానికి చెందిన
భాగాలు ఆ రంధ్రాల లోంచి లోపలికి జారి వుండొచ్చు. కాని ఇక్కడ నేను నిరాధారంగా ఏమీ మాట్లాడదలచుకోలేదు.
కాని ఇతగాడి చుట్టూరా మోటు గొడ్డళ్లు, చెకుముకి రాతితో చేసిన బాణపు కొసలు మొదలైన వన్నీ
ఉన్నాయి. అవన్నీ రాతి యుగం నాటి పనిముట్లు అనుకోవచ్చు. లేదా ఇతడు కూడా నాలాగే ఓ యాత్రికుడిగా,
వైజ్ఞానిక లోకపు పురోగామిగా ఈ ప్రాంతాన్ని లోగడ సందర్శించి ఉండవచ్చు. అటువంటప్పుడు
ఇతడు ప్రాచీనుడు కాడని, అర్వాచీనుడని అనుకోవాల్సి వుంటుంది.”
ప్రొఫెసరు ఉపన్యాసం
ముగిసింది. జనం – అంటే మేం ఇద్దరం – గట్టిగా చప్పట్లు కొట్టేశారు. ఎందుకంటే మావయ్య చెప్పింది నిజమే ననిపించింది. తన
అల్లుడి కన్నా బాగా తెలివైన వాళ్లు అయితే తప్ప తన వాదనలని కొట్టిపారేయడం అంత సులభం
కాదు.
మరో చిత్రమైన
విషయం ఏంటంటే ఈ సువిస్తారమైన భూగర్భ సమాధిలో ఆ శిలాజ మానవ కళేబరం ఒంటరిగా లేదు. ఈ చుట్టుపక్కల
అలాంటి కళేబరాలు మరెన్నో కనిపించాయి. వీటిలో కాస్త ప్రత్యేకంగా విడ్డూరమైన వాటిని నమూనాలుగా
ఏరుకుని మావయ్య తన వాదనని మరింత పటిష్టం చేసుకోగలడు. ప్రత్యర్థుల నోళ్లు మూయించగలడు.
నిజంగా మేం చూస్తున్నది
కడు విచిత్రమైన దృశ్యం. తరతరాల మనుషులు, జంతువులు అంతా సమిష్టిగా పూడ్చబడ్డ ఓ పురాతన
శ్మశానం ఇది. ఒక ప్రశ్న మాత్రం మనసులో పీకుతోంది. దాన్ని బయటకి అనడానికి కాస్త జంకుగా
వుంది. ఇక్కడ కనిపిస్తున్న జంతువులు, మనుషులు అంతా భూమి ఉపరితలం నుండి కిందికి జారి
పడ్డారని నమ్మడం ఎలా? ఇంతవరకు భూగర్భంలో ఇంత
లోతులో జలచరాలు మాత్రమే కనిపించాయి. కాని నిజంగానే ఈ ప్రాంతాలలో ఒకప్పుడు మనిషి
జీవించి వుంటే, అతగాడు ఇప్పటికీ ఈ పాతాళ సొరంగాలలో ఒంటరిగా సంచరిస్తున్నాడేమో?
(ముప్పై ఎనిమిదవ
అధ్యాయం సమాప్తం)
0 comments