నేను ఐదో క్లాసు టీచరుగా పని చేసే రోజుల్లో క్లాసులో పిల్లల
మాటలు, చేష్టలు అన్నీ జాగ్రత్తగా పరిశీలించి వివరంగా రాసుకునేవాణ్ణి. అది పిల్లల కంటబడ్డా
చదవలేనంత చిన్న దస్తూరీతో రాసుకునేవాణ్ణి. మెల్లగా నేను వాళ్ల గురించే రాస్తున్నానని
అర్థమయ్యింది. “ఏం రాస్తున్నారు?” అని అడిగేవారు. క్రమంగా వాళ్ల పట్ల నా మనోభావం అర్థమై
నా మీద విశ్వాసం ఏర్పడింది కాబోలు. నా రాతల్ని పట్టించుకోవడం మానేశారు. కాని నేను చేస్తున్నదేమిటో,
వాళ్ల నుండి నేను ఏం తెలుసుకోగోరుతున్నానో స్పష్టంగా ముందే చెప్పేస్తే బావుంటుందని
అనిపిస్తుంది. అలా చేస్తే వాళ్లు నా అధ్యయనాలలో ఇష్టపూర్వకంగా పాల్గొనేవారు అనిపిస్తుంది.
గ్లెండా బిసెక్స్ ప్రత్యేకించి రాయడం నేర్పించలేదు. కనీసం
రాయమని ప్రోత్సహించనుకుడా లేదు. ఆమె రాస్తుంటే ఆమెలాగే రాయాలన్న తపనే ఆ పిల్లవాడికి
ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అక్షరాలు వాటి ఉచ్ఛారణ మాత్రమే నేర్పించింది. ఆ అక్షరాలని
తనకి తోచినట్టు కూర్చుకుని పదాలని నిర్మించుకుని ఆ పిల్లవాడే రాయడం మొదలెట్టాడు. మొదట్లో
పదాల కూర్పులో ఎన్నో తప్పులు దొర్లేవి. అచ్చక్షరాలని వదిలేసేవాడు. అలవాటు మీద మెల్లగా
తనే తప్పులు దిద్దుకుంటూ వచ్చాడు.
గ్లెండా బిసెక్స్ కొడుకు పాల్ ఇంతకీ రాయడం ఎందుకు నేర్చుకున్నాడు?
ఎవరి సహాయం లేకున్నా రాత నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? వాళ్లమ్మని మెప్పించాలనా?
క్లాసు పుస్తకాలు ముందే చదివేసి తోటి విద్యార్థులని,
టీచర్లని మెప్పించాలనా? ఇవేవీ కారణాలు కావు. అసలు కారణం ఏమిటో గ్లెండా బిసెక్స్ స్పష్టంగా
చెప్తుంది. తన మనసులో మాటని వ్యక్తం చేసుకోడానికి రాయడం నేర్చుకున్నాడు. రాత అనే మాధ్యమంతో
తోటి వారితో మాట్లాడడానికి నేర్చుకున్నాడు.
పాల్ చదువు ఎలా నేర్చుకుంటున్నాడో తెలుసుకునే ప్రయత్నంలో గ్లెండా
ఆ పిల్లవాణ్ణి ఎన్నో ప్రశ్నలు అడిగేది. పరీక్షల్లాంటివి ఎన్నో పెట్టేది. పరీక్షలు అంటే
మామూలుగా స్కూళ్లలో పెట్టే పరీక్షల్లాంటివి కావు. స్కూళ్లలో పెట్టే పరీక్షలు పిల్లలకి
ఎంత తెలుసో, ముఖ్యంగా ఎంత తెలీదో తెలుసుకోడానికి పెట్టేవి. కాని ఈ పరీక్షల ఉద్దేశం
అది కాదు. కొడుకు ఏదో నేర్చుకుంటున్నాడు అని తెలుసు. అయితే ఏం నేర్చుకుంటున్నాడు? ఎలా
నేర్చుకుంటున్నాడు? ఏ పద్ధతిలో నేర్చుకుంటున్నాడు? చదువు అనేది ఓ ప్రయాణం లాంటిది అనుకుంటే
ఆ ప్రయాణంలో మజిలీలు ఏంటి? చదువు అనే ప్రక్రియలో మధ్యంతర దశలేంటి? ఇదీ ఆవిడ తెలుసుకోగోరేది.
దీన్ని తెలిపేందుకే పరీక్షలు.
“పాల్ తనకై తానే లక్ష్యాలు నిర్మించుకుని వాటి కోసం కృషి చేసేవాడు.
ఒక స్థాయిలో లక్ష్యాలు నెరవేరగానే పై స్థాయి లక్ష్యాలు తనే రూపొందించుకుని కృషి కొనసాగించేవాడు.
ఇలా ఇంకా ఇంకా కష్టమైన లక్ష్యాల కోసం శ్రమించేవాడు. ఆ విధంగా అంతకంతకు జటిలమైన లక్ష్యాల
కోసం శ్రమిస్తూ ఎంతో మంది పిల్లల లాగానే సహజంగా పురోగమిస్తూ వచ్చాడు.”
ఎదిగే పిల్లలు సరిగ్గా ఇలాగే ఎదుగుతారు. కాని అదంతా స్కూల్లో
చేరిందాకానే. ఒకసారి స్కూల్లో చేరాక లక్ష్యాలని వాళ్లంతకు వాళ్లు నియమించుకోవడం అంటూ
ఉండదు. స్కూలే వారి లక్ష్యాలని నిర్దేశిస్తుంది. ఏం నేర్చుకోవాలో, ఎలా నేర్చుకోవాలో,
ఎంత లోపల నేర్చుకోవాలో – అన్నీ స్కూలే శాసిస్తుంది. స్కూలు నిర్దేశించే లక్ష్యాలు పిల్లలని
బెదరగొడతాయి. ఫలానా పద్ధతి ఒప్పజెప్పకపోతే తిట్లే, ఫలానా పాఠం రాసుకు రాకపోతే తన్నులే
– ఇదీ స్కూలు పద్ధతి. దాంతో స్వచ్ఛందంగా లక్ష్యాలు ఎంచుకునే అలవాటు, వాటి కోసం పాటుపడే
అలవాటు చచ్చిపోతుంది. అందుకే కాబోలు చాలా మంది పిల్లలు స్కూల్లో చేరకముందే చదవడం, రాయడం
నేర్చుకుంటారు.
“మీ పిల్లలకి ఇది నేర్పించండి,” “మీ పిల్లలకి అది నేర్పించండి”
అని రాసే పుస్తకాలని నేను ఒప్పుకోను. అలాంటి పుస్తకాలు పిల్లల్లో తమంతకు తాము తెలుసుకోవాలన్న
ఉత్సాహాన్ని, తమంతకు తాము తెలుసుకోగలమన్న నమ్మకాన్ని అణగదొక్కుతాయి. మరొకరు చెబితే
తప్ప తెలుసుకోలేమన్న అభిప్రాయాన్ని కలుగజేస్తాయి.
“కెనెత్ గుడ్మన్, చార్లెస్ రీడ్, పియాజే… (వంటి విద్యావేత్తలు నిరూపించినట్టు), పిల్లలు చేసే పొరబాట్లు
కేవలం యాదృచ్ఛికమైనవి కావు. (తెలిసో తెలీకో) వాళ్లు అనుసరిస్తున్న విజ్ఞాన వ్యవస్థలకి
అవి ప్రతిబింబాలు. విద్యార్థులు చేసే పొరబాట్లు వట్టి తప్పులు అని కొట్టిపారేయకుండా,
అందులో చదువుకి అవసరమైన ఎంతో సమాచారం ఉందని గుర్తించగలిగితే, విద్యార్థులు కూడా అలాంటి
నిర్మాణాత్మక దృక్పథాన్ని అలవరచుకుంటారు.”
Mind storms అనే పుస్తకంలో
సీమోర్ పాపర్ట్ ఈ విషయాన్నే బాగా స్పష్టపరిచాడు.
కంప్యూటర్ వాడడం నేర్చుకుంటున్నప్పుడు ఎవరికైనా మొదట్లో ఓ ప్రత్యేక ఇబ్బంది ఎదురవుతుంది. కంప్యూటర్ అవుట్
పుట్ ఒకలా ఉంటుందని ఆశిస్తే, వాస్తవంలో మరొకలా ఉంటుంది. విషయం తెలీక కంప్యూటర్ ని ఆడిపోసుకుంటారు.
తప్పు కంప్యూటర్ లో లేదు. ప్రోగ్రాం లో వుంది. దాన్నే ‘బగ్’ అంటారు. దాన్ని సరిదిద్దితే
అంతా సర్దుకుంటుంది. అలాగే పిల్లలు చేసే పొరబాట్ల వెనుక కూడా ఒక హేతువు ఉండొచ్చు. ఒక
తప్పుడు నమ్మకమో, ఓ తప్పుడు భావమో ఉండొచ్చు. ఒక సందర్భంలో నేర్చుకున్న సత్యాన్ని, మరో
సందర్భంలో తప్పుగా వర్తింపజేస్తూ ఉండచ్చు. లేకపోతే వాళ్లు నేర్చుకునే సమాచారంలోని అవకతవకలకి
తికమకపడుతూ ఉండొచ్చు. ఆ తికమకని స్పష్టం చేస్తే, ఆ సందేహాన్ని తీరిస్తే, ‘ముద్దార నేర్పిస్తే,’
చదువు చెప్పే ప్రయత్నంలో పిల్లలతో పెద్దలు అనవసరంగా కుస్తీ పట్టనక్కర్లేదని నా అభిప్రాయం.
(ఇంకా వుంది)
0 comments