ఎంతో మంది తమ సంకల్ప బలం గురించి
అతిగా ఊహించుకుంటారు. వాళ్లు నిర్ణయించింది, ఉద్దేశించింది తప్ప వారి మనసుల్లో మరింకేమీ
జరగదని, జరగలేదని నమ్ముతారు. కాని మన మనసులో సంకల్పపూర్వకమైన అంశాలు ఉన్నట్లే అసంకల్పిత
అంశాలు కూడా ఉంటాయని గుర్తుంచుకోవాలి. మొదటి రకం అంశాలు వ్యక్తి యొక్క అహంకారం నుండి
జనిస్తాయి. రెండవ రకం అంశాలు అహంకారం నుండి కాక “అవతలి వైపు” నుండీ జనిస్తాయి. ఆ “అవతలి
వైపే” ఇందాక మనం చెప్పుకున్న కథలో సెక్రటరీ తన ఆహ్వానాలు మర్చిపోయేలా చేస్తుంది.
మనం ఒకప్పుడు గుర్తించినవి,
అనుభూతి చెందినవి తదనంతరం మర్చిపోవడానికి ఎన్నో కారణాలు వున్నాయి. అలాగే వాటిని తిరిగి
జ్ఞాపకం తెచ్చుకోడానికి కూడా పలు మార్గాలు వున్నాయి. అలాంటి వాటిలో ఓ ఆసక్తికరమైన పద్ధతిని
“concealed recollection” (ప్రచ్ఛన్న పునఃస్మరణ). అంటే మన సంకల్పం లేకుండా, మన ఎరుక
లేకుండా ఏదో “గుర్తుకు” రావడం అన్నమాట. ఉదాహరణకి ఓ రచయిత ఓ ఆలోచనా స్రవంతిని వ్యక్తం
చేస్తూ రాసుకొస్తున్నాడు, లేదా ఏదో వ్యూహం ప్రకారం ఓ కథ రాస్తున్నాడు అనుకుందాం. కాని
ఉన్నట్లుండి ముందు నిర్ణయించిన మార్గానికి భిన్నంగా ఎటో వెళ్లిపోతాడు. బహుశ ఏదో కొత్త
ఆలోచన వచ్చి వుంటుంది. లేదో మరేదో చిత్రం మనసులో మెదిలి వుంటుంది. కథకి మరో కొత్త వ్యూహం
స్ఫురించి వుంటుంది. ఎలా కొత్త పంథా తొక్కడానికి కారణం ఏంటని అడిగితే చెప్పలేకపోతాడు.
ఆ మార్పుని అతడు గుర్తించలేకపోవచ్చు. తనకి తెలియకుండా, అప్రయత్నంగా తన చిత్తం లోంచి
ఈ కొత్త విషయాలన్నీ పుట్టుకు వచ్చి ఉండొచ్చు. కాని కొన్ని సందర్భాల్లో ఇలా కొత్త తరహాలో
రాసిన విషయం అంతా మరెవరో రచయిత రాసిన దానికి బాగా సన్నిహితంగా ఉందని నిరూపించడానికి
వీలు కావచ్చు. కాని ఆ రచయిత రచనలు ఇతగాడు ఎన్నడూ చదవలేదని అనవచ్చు.
ఇలాంటి పరిణామానికి ఉదాహరణ నాకు
నీట్షే రాసిన Thus spake Zarathustra అన్న పుస్తకంలో కనిపించింది. 1686 నాటి ఓ ఓడకి చెందిన యాత్రా పత్రికలో వర్ణించబడ్డ
ఓ వృత్తాంతం ఆ పుస్తకంలో మక్కీకి మక్కీగా రాయబడింది. 1835 లో (అంటే నీట్షే రాసిన దానికి అర్థ శతాబ్దం ముందు)
ప్రచురించబడ్డ ఓ పుస్తకంలో నేను అనుకోకుండా ఈ నౌకా వృత్తాంతం గురించి చదివాను. అదే వృత్తాంతం Thus space Zarathustra లో కనిపించినప్పుడు దాని ప్రత్యేకమైన శైలి చూసి
నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నీట్షే మామూలుగా రాసే శైలికి దీనికి చాలా తేడా వుంది.
ఆ పాత పుస్తకాన్ని నీట్షే తప్పకుండా చూసే వుంటాడని నా నమ్మకం. కాని ఆ పుస్తకం గురించి
ఎక్కడా ప్రత్యేకించి ప్రస్తావించలేదు. ఈ విషయం గురించి వాకబు చేస్తూ నీట్షే చెల్లెలికి
ఉత్తరం రాశాను. అప్పటికి ఆమె ఇంకా బతికే వుంది. వాళ్ల అన్నయ్యకి ఆ పుస్తకం గురించి
తెలుసని, అన్నయ్యకి 11 ఏళ్ల వయసులో అన్నా చెల్లెళ్లు
ఇద్దరూ కలిసి ఆ పుస్తకం చదవడం గుర్తని రాసింది. సందర్భం బట్టి చూస్తే ఇక్కడ నీట్షే
గ్రంథచౌర్యానికి పాల్పడ్డాడని అనుకోడానికి లేదు. అది చదివిన యాభై ఏళ్ల తరువాత ఆ విషయం
తన సచేతన స్మృతి నుండి జారిపోయి వుంటుందని అనిపిస్తోంది.
(Image credits: http://theamericanreader.com/nietzsche-apostle-the-emancipatory-potential-of-self-praise/)
ఈ రకమైన స్మరణంలో తెలీకుండానే
మునుపు విన్న, లేక చదివిన విషయాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి
ఓ వాగ్గేయకారుడు తన చిన్నతనంలో ఓ జానపద గీతమో, పల్లెపదమే విని వుంటాడు. పెద్దయ్యాక
ఓ కఠినమైన బృంద వాద్యానికి సంగీతం కూర్చుతున్న సమయంలో ఆ పాత బాణీ పదే పదే తన చిత్తంలో
పైకి తేలుతున్న అనుభూతి కలుగవచ్చు. ఈ సందర్భంలో అచేతనకి చెందిన ఓ ఆలోచన, లేక చిత్రం
తిరిగి సచేతన లోకి ప్రవేశించింది.
ఇంతవరకు నేను వర్ణించింది మానవ
చిత్తానికి చెందిన ఈ అత్యంత సంక్లిష్టమైన విభాగం గురించిన కొన్ని ప్రాథమిక విషయాలు
మాత్రమే. ఈ వర్ణన బట్టి కలలలో మనకి కనిపించే ప్రతీకలు ఎక్కణ్ణుంచి పుట్టుకొస్తాయో కొంత
అవగాహన కలిగి వుంటుంది. ఈ అచేతన పదార్థంలో నానా రకాల తపనలు, ఆరాటాలు, ఉద్దేశాలు ఉండి
వుండొచ్చు. ఎన్నో రకాల అహైతుకమైనవి, సహైతుకమైనవి అయిన ఆలోచనలు, నిర్ణయాలు, నమ్మకాలు
ఉండొ వుండొచ్చు. ఈ ఆవేశాలు, ఆలోచనలు అన్నీ విశాలమైన అచేతనా సముద్రం యొక్క పాక్షిక,
తాత్కాలిక ప్రతినిధులు కావచ్చు.
ఒక రకంగా చెప్పాలంటే అలాంటి
సమాచారం అంతా అధికభాగం అచేతనం కావడానికి కారణం మన సచేతన చిత్తంలో వాటికి స్థలం లేకపోవడమే.
కొన్ని ఆలోచనల విషయంలో వాటి లోని భావావేశపు శక్తి అణగారిపోవడం వల్ల ఆ ఆలోచనలు అచేతనమై
పోయి వుండొచ్చు. ఆ ఆలోచనల మీద మనకి ఆసక్తి సన్నగిల్లడం వల్ల, అవి అముఖ్యం అనిపించడం
వల్ల, వాటి మీద ధ్యాస సన్నగిల్లడం వల్ల వాటిని మన కంటికి కనిపించకుండా అచేతనలోకి తోసేయడం
జరుగుతుంది.
ఈ విధంగా మర్చిపోవడం ఎంతో అవసరం.
అదే జరగకపోతే మనం అనుభూతి చెందిన ప్రతీ విషయం మన సచేతన మానసంలో అనుక్షణం మెదులుతూ వుంటుంది.
ఇక అటువంటప్పుడు అనవసర విషయాలతో మన చిత్తాలు కిక్కిరిసిపోతాయి, ఉక్కిరిబిక్కిరి అవుతాయి.
ఈ విషయం పట్ల ఈ రోజుల్లో ఎంత అవగాహన వుందంటే మనస్తత్వ శాస్త్రం ఏ మాత్రం తెలిసిన వారికైనా
ఇది నిజమని తెలుస్తుంది.
(ఇంకా వుంది)
0 comments