19
వ శతబ్దంలో నాడీమండలం మీద రసాయనాల ప్రభావం గురించి కొన్ని గణనీయమైన పరిశోధనలు
చేసినవాడు క్లాడ్ బెర్నార్డ్ అనే ఫ్రెంచ్ జీవక్రియాశాస్త్రవేత్త. బాహ్యపరిస్థితులు
ఎంతగా మారుతున్నా జీవరాశులు మారని అంతరంగ స్థితిని
నిలుపుకునే ప్రయత్నం చేస్తుంటాయని ప్రతిపాదించిన వాడు ఈ క్లాడ్ బెర్నార్డ్. అలాంటి
మారని అంతరంగ స్థితికి ‘సమానావస్థ స్థితి (homeostasis)’ అని పేరు పెట్టాడు. ఉదాహరణకి ఆరోగ్యవంతుడైన మనిషిలో
రక్తపీడనం, అంతరంగ ఉష్ణోగ్రత మొదలైన రాశులు కొన్ని నియత విలువల దగ్గర ఉంటాయి. ఇలాంటి
ప్రామాణిక రాశులతో కూడుకున్న స్థితినే homeostasis అంటారు. ఆ భావనని అతడి మాటల్లోనే విందాం – “La
fixité du milieu intérieur est la condition d'une vie libre et indépendante” (మారని
అంతరంగ అవస్థ స్వతంత్రమైన, స్వేచ్ఛా జీవనానికి అవసరమైన నియమం.)
ఇతడు శరీరం మీద విషపదార్థాల ప్రభావాన్ని పరిశోధించాడు. ముఖ్యంగా
క్యురారే (curare) మరియు కార్బన్ మోనాక్సయిడ్ ల మీద అధ్యయనాలు చేశాడు. ఈ క్యురారే అనేది కండరం మీద పని చేసే విషం. దక్షిణ
అమెరికాలో దీన్ని వేటగాళ్లు వాడేవారు. క్యురారేలో ముంచిన బాణంతో జంతువుని కొడితే అది
ఊపిరి సలపక ప్రాణాలు విడుస్తుంది. ఎందుకంటే
బాణానికి వున్న విషం యొక్క ప్రభావం వల్ల ఊపిరితిత్తులని అదిలించే కండరాలు స్తంభించిపోతాయి.
ఇలాగే కార్బన్ డయాక్సయిడ్ ఓ విషవాయువు. దీని ప్రభావం వల్ల మతిస్థిమితం తప్పుతుంది,
మనసులో అయోమయ స్థితి ఏర్పడవచ్చు. మూర్ఛ కలగవచ్చు. ఈ వాయువు హెచ్చు మోతాదుల్లో రక్తంలో
కలిస్తే ఆ రక్తం లో ఆక్సిజన్ ని మోసుకుపోయే సామర్థ్యం సన్నగిల్లుతుంది. ఆ కారణం చేత
శరీరానికి తగినంత ఆక్సిజన్ అందక వ్యక్తి మరణించవచ్చు.
విషపదార్థాలు నాడీమండలం మీద పని చేసి హనికర పరిణామాలు కలుగజేసినట్టే,
ఔషధాలు నాడీమండలం మీద హితవైన ప్రభావాన్ని చూపించగలవు. మందులు నాడీమండలం మీద ప్రభావాన్ని
ఎలా చూపుతాయి అన్న ప్రశ్న మీద దృష్టి సారించాడు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన
జాన్ లాంగ్లీ అనే జీవక్రియాశాస్త్రవేత్త. పందొమ్మిదవ శతాబ్దంలో చివరి దశలలో నాడీమండలం
మీద మార్ఫీన్ (ఇదో మత్తు మందు), డిజిటాలిస్ (ఇది గుండె కొట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది,
గుండె యొక్క అపలయలని (arrhythmias) నిరోధిస్తుంది) మొదలైన నాడీ ఔషధాల ప్రభావాన్ని ఏదో
అవిశ్పష్టంగా, అయోమయంగా వివరించేవారు. జీవపదార్థానికి ఔషధాలకి మధ్య ఏదో ప్రత్యేకమైన
సంబంధం (affinity) ఉందని తలపోసేవారు. ఔషధాలు
ఎలాగో నేరుగా ధాతువు (tissue) మీద, కణాల మీద పని చేస్తయని అనుకునేవారు. కాని లాంగ్లీ
మరోలా ఆలోచించాడు. ఔషధం శరీరం మీద పని తీరు కేవలం ఓ రసాయన చర్య అని, రెండు అణువుల మధ్య
జరిగే చర్య తప్ప అది మరేమీ కాదని అతడు ఊచించాడు. ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేసి ఔషధాలు
నేరుగా ధాతువు మీద పని చెయ్యడం లేదని, ఔషదపు అణువు యొక్క ప్రభావన్ని గ్రహించే “సంగ్రాహ
అణువులు” (receiving molecules) ఉంటాయని అతడు
ప్రతిపాదించాడు. వాటికి రిసెప్టార్లు
(receptors) అని పేరు పెట్టాడు. ఈ రిసెప్టార్ ఔషధం యొక్క ప్రభావాన్ని గ్రహించి దాని
ఫలితాలని చుట్టూ ఉన్న ధాతువు మీదకి పంపిస్తుంది.
ఇలాంటి రిసెప్టార్లు మరి న్యూరాన్ల మీద ఉంటాయని అనుకుంటే వాటి
ప్రయోజనం ఏమిటి? ఎందుకంటే ఔషధం అనేది మనిషి ప్రయోగిస్తే శరీరంలోకి ప్రవేశించే పదార్థం.
న్యూరాన్ల మీద రిసెప్టార్లు మరి మనిషి ప్రవేశపెట్టిన ఔషధాలకి స్పందించడం కోసం కాచుకు
కూర్చోలేదు. ఔషధాలతో ప్రత్యేకమైన సంబంధం లేకపోతే మరి న్యూరాన్ల మీద రిసెప్టార్లు ఏం
చేస్తున్నట్టు? ఈ ప్రశ్నకి సమాధానంగా న్యూరాన్లు పరస్పర రసాయనాల సహాయంతో సంభాషించుకుంటాయి అన్న అవకాశం సూచించబడుతోంది.
ఈ రకమైన చింతనలో ముందున్న వాడు ఆటో లెవీ (Otto Loewi). 1920 ల ప్రాంతాల్లో ఈ ఆటో లెవీ రసాయనాల సహాయంతో న్యూరాన్లు
సందేశాలు పంపుకుంటాయి అన్న విషయాన్ని నిరూపించడానికి తగ్గ విధానం కోసం అన్వేషించసాగాడు.
ఆటొ లెవీ కి ముందు ఈ విషయం మీద కొంత సంధిగ్ధం ఉండేది. న్యూరాన్లు విద్యుత్ సందేశాలతో
సంభాషించుకుంటాయి అని ఒక వర్గం నమ్మితే, రసాయనాలతో సంభాషించుకుంటాయని మరో వర్గం వాదించేది.
ఈ సంగతేంటో తేల్చడానికి పూనుకున్నాడు ఆటో లెవీ.
ఆటో లెవీ
అది 1921 సంవత్సరం. ఆ రోజు ఈస్టర్ పండగ. శనివారం. ఆ రాత్రి తనకి ఓ చిత్రమైన కల వచ్చింది.
తను అన్వేషిస్తున్న ప్రయోగం ఎలా చెయ్యాలో ఆ వివరాలన్నీ ఆ కలలో కనిపించాయట. వెంటనే మేలుకుని
కలలో కనిపించిన వివరాలన్నీ ఆదరబాదరాగా ఓ చిన్న
నోట్ బుక్ లో రాసుకున్నాడు. మర్నాడు ఉదయం లేవగానే రాత్రి కల గన్న సంగతి, ఆ వివరాలు
రాసుకున్న సంగతి గుర్తొచ్చింది. సంతోషం పట్టలేకపోయాడు. తను రాసుకున్న నోట్ బుక్ తెరిచి
చూస్తే రాత్రి నిద్రలో రాసిన కోడి గీతలు కనిపించాయి. ఏం రాసుకున్నాడో ఎంత తలబాదుకున్నా
అర్థం కాలేదు.
రాత్రి వచ్చిన కలని గుర్తు తెచ్చుకోడానికి ఆ రోజు పగలంతా ప్రయత్నించాడు.
అది తన జీవితంలోనే అతి దీర్ఘమైన రోజు అని చెప్పుకున్నాడు. అయితే అదృష్టవశాత్తు ఆ మర్నాడు
రాత్రి కూడా అదే కల వచ్చిందట. ఈ సారి కల రాగానే ఊరికే ఏవో పిచ్చిగీతలు గీసి తిరిగి
నిద్రలోకి జారుకోకుండా వెంటనే ప్రయోగశాలకి బయల్దేరాడు… అప్పటికప్పుడు ఆ ప్రయోగం చేసి
చూద్దామని.
(ఇంకా వుంది)
0 comments