పిల్లలు సరదాగా ఓ కథో, పత్రికో చదువుకుంటున్నప్పుడు ఏదో తెలీని
పదం వచ్చిందని అనుకోండి. వెంటనే చదవడం ఆపి ఆ మాట అర్థం కోసం వెదకరు. ఉత్సాహంగా ముందుకు
సాగిపోతున్న కథని ఒక్కమాట కోసం ఆపడం వాళ్లకి ఇష్టం వుండదు. సందర్భాన్ని బట్టి మాట అర్థాన్ని
ఊహించడానికి ప్రయత్నిస్తారు. “అప్పుడా రాజు తన తూణీరంలో నుండి ఓ బాణాన్ని బయటికి తీశాడు,”
అన్న వాక్యంలో ‘తూణీరం’ అంటే కచ్చితంగా తెలీకపోయినా అదేదో బాణాలు పెట్టుకునే పెట్టె
లంటిదో, సంచీ లాంటిదో అని సులభంగా ఊహించుకోవచ్చు. కొంచెం కష్టమైన పదమైతే నాలుగైదు సందర్భాల్లో
పరిచయమైతే దాని మర్మం ఇట్టే తెలిసిపోతుంది.
బాగా చదివే వాళ్లు, మంచి శబ్ద జ్ఞానం గల వాళ్లు ఆ జ్ఞానాన్ని
నిఘంటువులు బట్టీ వేసి సంపాదించరు. మామూలు పుస్తకాలు చదివి సంపాదిస్తారు. నా చిన్నప్పుడు
బాగా చదివే రోజుల్లో కూడా ఎప్పుడూ నిఘంటువు ముట్టుకున్న పాపాన పోలేదు. అసలు నా వద్ద
ఎప్పుడూ నిఘంటువు ఉండేది కాదు. నా జన్మలో పట్టున
50 పదాలు కూడా నిఘంటువులో చూసి వుండను.
ఈ నిఘంటువులు ఎలా రాస్తారో చాలా మందికి తెలీదు. ముందుగా నిఘంటువు
ప్రచురించదలచుకున్న ప్రచురణ సంస్థ కొన్ని వందల మంది ‘సంపాదకుల’ని నియమిస్తుంది. వారికి
తలా ఇన్ని పదాలిచ్చి సమకాలీన సాహిత్యంలో ఆ పదాలున్న వాక్యాలని సేకరించమంటుంది. ఒక్క
పదానికి ఎన్ని వాక్యాలు వీలైతే అన్ని వాక్యాలు పట్టుకోవడం వీళ్ల పని. చలామణిలో వున్న
దినపత్రికలు, వారపత్రికలు, నవళ్లు మొదలైన పుస్తకాలన్నీ గాలించి ఆ పదాలున్న వాక్యాలు
వెతికి పట్టుకుంటారా సంపాదకులు. ఒక్కో పదాన్ని దాన్ని రాసిన రచయిత ఏ అర్థంలో ప్రయోగించాడో
గమనించి, అలా నాలుగైదు సందర్భాలు పరిశీలించి, తద్వార మాటకి అర్థాన్ని నిర్వచిస్తారు.
అంటే పదాల అర్థాన్ని గురించి మనుషుల అభిప్రాయాల సంకలనమే నిఘంటువు అన్నమాట.
నాకో కొత్త పదం ఎదురైనప్పుడు ఆ సందర్భంలో దాని అర్థాన్ని గ్రహించలేకపోయినంత
మాత్రాన, నేను ఏమీ తెలుసుకోలేక పోయానని కాదు. ఆ సందర్భంలో ఆ పదం ఏదో లీలగా అర్థమవుతుంది.
అదే పదం మరో సందర్భంలో ఎదురైనప్పుడు మరో విధంగా అర్థమవుతుంది. అలా ఓ పది పదిహేను సందర్భాల్లో
ఆ పదం ఎదురైతే దాని స్వరూపమేమిటో స్పష్టంగా తెలిసిపోతుంది.
పిల్లలు (నిజానికి ఇది పెద్దలకి కూడా వర్తిస్తుంది) ఏదైనా
చదువుతున్నప్పుడు ఆ చదివిందంతా పూర్తిగా అర్థం కావాలని నియమం ఏమీ లేదు. చదివింది నూటికి
నూరు శాతం ఎవరికీ అర్థం కాదు. చదివిన దాంట్లో ఎంత అర్థమవుతుంది అనేది ఆ చదివేవాడి అనుభవం
మీద ఆధారపడి వుంటుంది. పిల్లలకి వాళ్లు చదివేదేదో ఉత్సాహకరంగా ఉంటే చాలు. ఇంకా ఇంకా
చదవాలని అనిపిస్తే చాలు… మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సందర్భాన్ని బట్టి మాటల అర్థం గ్రహించడానికి
పిల్లలు అలవాటు పడాలి. అసలు మంచి పాఠకుడి లక్షణం అదే. మాటల అర్థం పిల్లలకి చెబితే,
నిఘంటువు చూసి నేర్చుకోమంటే ఆలోచించి మాటల అర్థాన్ని గ్రహించే అలవాటు కోల్పోతారు. మరి
మనకి తెలియని దాన్ని ఆలోచించి, శోధించి తెలుసుకునే సామర్థ్యాన్నే మేధస్సు అంటారు!
(ఇంకా వుంది)
0 comments