అధ్యాయం 39
విద్యుత్ కాంతులలో పాతాళ తోటల అందాలు
మరో అరగంట పాటు
ఆ ఎముకల బాటలోనే నడుస్తూ పోయాం. ముందు ఏం వుందన్న ఉత్కంఠ మా అడుగులని నడిపిస్తోంది.
ఈ గుహలో ఇంకా ఏం అద్భుతాలు ఉన్నాయో? ఏ వైజ్ఞానిక నిధులు దాగున్నాయో? ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు
అన్నట్టుగా నా మనసు అప్రమత్తంగా వుంది.
ఆ ఎముకల గుట్టల
వెనుక సముద్ర తీరం కనుమరుగయ్యింది. దారి తప్పిపోతామన్న భయం, భక్తి లేకుండా మా ప్రొఫెసరు
మావయ్య దుడుకుగా ముందుకు దూసుకుపోవడమే కాకుండా, నన్ను కూడా వెనుకే బరబర లాక్కుపోతున్నాడు.
అలా మౌనంగా ముందుకు సాగిపోతుంటే ఒక దశలో మాకు కనిపించిన దృశ్యం చూసి అవాక్కయ్యాను.
ఆ ప్రాంతం అంతా ఏదో చిత్రమైన విద్యుత్ కాంతి వ్యాపించి వుంది. అది ఏంటో ఎలా పుడుతోందో
అర్థం కాలేదు గాని అది ప్రతీ వస్తువుని సమానంగా అన్ని పక్కల నుండి ప్రకాశితం చేస్తోంది.
ఒక కేంద్ర బిందువు నుండి కాంతి జనిస్తున్నట్టు లేదు. గాలిలా అన్ని పక్కలా ఆవరించిన
ఆ కాంతి వల్ల నీడలు పడడం లేదు. అది భూగర్భపు కుహరంలో ఉన్నట్టు లేదు. భూమధ్య రేఖ మీద
మిట్టమధ్యాహ్నపు ఎండలో నించున్నట్టు వుంది. ఎక్కడా ఆవిర్లు కనిపించడం లేదు. చుట్టూ
వున్న రాళ్లు, దూరానున్న కొండలు, చెట్ల గుబుళ్లు అన్నీ ఆ విచిత్ర విశ్వజనీన కాంతిలో
మౌనంగా భాసిస్తున్నాయి. మేమంతా హొఫ్ మన్ నాటకంలో నీడలేని మనుషుల్లా వున్నాం.
(ETA Hoffman
1814 లో రాసిన ఓ నాటకంలోని ఓ పాత్ర
పేరు Peter Schlemihl. ఇతగాడు ధనాశ వల్ల తన నీడని సైతానుకి అమ్మేసుకుంటాడు. నీడ పడని
ఆ వ్యక్తి సమాజంలో ఎదుర్కున్న ఇబ్బందుల వృత్తాంతమే నాటకం లోని కథ. – అనువాదకుడు.)
అలా ఓ మైలు దూరం
నడిచాక ఓ విశాలమైన అడవి అంచుని చేరుకున్నాం. అయితే ఇది ఇందాక గ్రౌబెన్ రేవు వద్ద చూసిన
శిలీంధ్రాల అడవి కాదు.
తృతీయ దశకి చెందిన
వృక్ష సంపద ఇక్కడ పూర్ణ వైభవంతో మాకు దర్శనం ఇచ్చింది. పొడవాటి తాళ వృక్షాలు, చక్కని
పాల్మసైట్ లు, ఫిర్, యూ, సైప్రెస్ చెట్లు, ఇవి కాక ప్రస్తుతం వినష్టమైపోయిన ఎన్నో వృక్ష
జాతులు అక్కడ కనిపించాయి. ఈ చెట్ల మీద పొడవాటి అడవి తీగలు గజిబిజిగా అల్లుకుపోయాయి.
“మెత్తని ముఖమల్ లాంటి పాకుడు మొక్కలు” అక్కడి నేలంతా అలముకుని వున్నాయి.
(“మెత్తని ముఖమల్
లాంటి పాకుడు మొక్కలు” అన్న చక్కని శబ్ద ప్రయోగం CP Brown English-తెలుగు నిఘంటువులో
కనిపించింది! – అనువాదకుడు.)
చెట్ల కింద మౌనంగా
ప్రవహించే సెలయేటి తళతళలకి కళ్లు జిగేలు మంటున్నాయి. ఆ సెలయేటి ఒడ్డున ఇంట్లో మనం అలంకారంగా
పెంచుకునే ఫెర్న్ మొక్కల్లాంటి చక్కని ఫెర్న్ మొక్కలు అందంగా తీర్చిదిద్దినట్టు విస్తరించాయి.
మరో అత్యద్భుతమైన విషయం ఏంటంటే ఈ చెట్లలో, తీగల్లో, పొదలలో ఎక్కడా రంగు అన్న అంశం కనిపించదు.
మసి పూసిన వెండి రంగు, లేదా పాలిన ఆకులని పోలిన లేత గోధుమ రంగు – ఎటు చూసినా ఈ రంగుల
మిశ్రమాలే కనిపిస్తున్నాయి. ఒక్క పచ్చని ఆకు కనిపిస్తే ఒట్టు! పువ్వులు కూడా వున్నాయి
గాని అవేం పువ్వులు! వన్నె, వాసన లేని గోధుమ రంగు కాగితం పువ్వులు!
ఈ కారడవిలోకి
ఇంకా ఇంకా లోతుగా చొచ్చుకుపోతున్నాడు మావయ్య. నేను వెనుకే మూగగా అనుసరిస్తున్నాను.
అప్పుడో సందేహం కలిగింది. ఇంత వృక్షసంపద ఉన్న చోట మరి భీకరమైన జంతువులు కూడా ఉండాలి
కదా? కొన్ని చోట్ల పెద్ద పెద్ద చెట్లు కింద పడి కుళ్లిన చోట్ల, కాయధాన్యపు మొక్కలు,
ఏసరినే, రుబీషియే మొదలుకొని ఎన్నో తినదగ్గ పొదలు కనిపించాయి. ఇలాంటి మొక్కలు శాకాహారపు
జంతువులకి ఎంతో ఇష్టం. భూమి ఉపరితలం మీద సుదూర
ప్రాంతాలలో పెరిగే చెట్లు ఇక్కడ పక్కపక్కనే పెరగడం ఆశ్చర్యం కలిగించింది. ఓక్ చెట్టు,
తాటి చెట్టు ఇక్కడ ఇరుగు పొరుగు నేస్తాలు. అలాగే ఆస్ట్రేలియా కి చెందిన యూకలిప్టస్
ఇక్కడ నార్వేకి చెందిన పైన్ చెట్టు మీద ఒరిగిపోతోంది. ఉత్తరానికి చెందిన బిర్చ్ చెట్టు
గుబుళ్ళు న్యూజీలాండ్ కి చెందిన కౌరీ చెట్ల గుబుళ్లతో దోబూచులాడుకుంటున్నాయి. వృక్షశాస్త్ర
పండితులకి తలలు తిరిగేలా చెయ్యడం కోసమే తీర్చిదిద్దినట్టు వేడుకగా వుందా విపినం!
అంతలో నాకు కనిపించిన
దృశ్యానికి స్థాణువై నిలుచుండిపోయాను. మావయ్యని కూడా జబ్బ పట్టి ఆపాను.
(ఇంకా వుంది)
వృక్షశాస్త్ర పండితులకి తలలు తిరిగేలా చెయ్యడం కోసమే తీర్చిదిద్దినట్టు వేడుకగా వుందా విపినం!
ఇలాంటి వాక్యాలు ఎలా జాలువారుతాయండీ, మీ మెదడులోంచి.బహు బాగుగా ఉన్నది.
హఠాత్తుగా ఒక్కో భాగం మా మీద విసిరేస్తున్నారు. యేమిటిది?మీరు సొంతంగా రాస్తున్నదా? యెవరయినా ప్రముఖ రచయిత రాసిన దాన్ని తెలుగు చేస్తున్నారా? యేం తెలియదం లేదు. కాస్త వివరించండి. ఒక పత్యేకమయిన కాటగిరీ ఇచ్చి అక్కడ చేరిస్తే మా లాంటి వాళ్ళం మొదటి నుంచి చదవటానికి వీలుంటుంది కదా!
"ఆర్యపుత్రా" అని భర్తని కదా సంబోధిస్తారు ?
అయ్యబాబోయ్! నాకా సంగతి తెలీదు! ఏదో భారీగా వుందని ప్రయోగించాను :-)
సారీ! "ఆర్యా" అని మార్చేసి adjust చేసుకోండి!
ఇది జూల్స్ వెర్న్ మహాశయుడు రాసిన 'Journey to the center of the earth' కి అనువాదం!
ఇలాంటి పుస్తకం సొంతంగా రాస్తే నా జన్మ ధన్యమైపోదా;-)
దీని టాగ్ 'పాతాళానికి ప్రయాణం.' కింద LABELS లో చూడొచ్చు.
ప్రతీ వ్యాసానికి కింద టాగ్ ఉంటోంది. దాన్ని బట్టి పోస్ట్ లని క్రోడీకరించుకోవచ్చు.