ఆ మధ్య మీ నెల్లూరు
మావయ్య మీతో ఫోన్లో “ఏందిరా? ఫోన్ చెయ్యడం మానేసినావు. కొవ్వు బాగా పట్టిండాదా యేం?”
అనడం విన్నా లేండి. అయినా మీరు అలాంటివన్నీ
పట్టించుకోరని నాకు తెలుసులేండి. అసలు మనుషులు ఒకరొకరు ‘కొవ్వు పట్టిందీ’ ‘కొవ్వు పట్టిందీ’
అని తిట్టుకుంటారు గాని ఈ కొవ్వు అనేది ఎక్కడ పడుతుందీ అన్న విషయం మాత్రం ఎవరికీ తెలిసినట్టు
లేదు. (ఏదో అనేశాడు గాని, మీ నెల్లూరు మావయ్యకి కూడా తెలుసో లేదో నాకు డౌటే!) ఇందాక
డెర్మిస్, ఎపిడెర్మిస్ అని చెప్పుకున్నాం చూడండి. ఆ డెర్మిస్ అడుగున
subcutaneous పొర ఒకటి వుంటుంది. కొవ్వు అక్కడ
పడుతుంది అన్నమాట!
ఇక కొవ్వు ఎందుకు
పడుతుందీ అన్న విషయానికి వద్దాం. మనిషిలో ఈ కొవ్వు అనే పదార్థం ఒక రకమైన షాక్ అబ్సార్బర్
లాంటిది. ఈ మెత్తని కొవ్వు పొర వల్ల అంతరంగ అవయవాలకి కొంత రక్షణ దొరుకుతుంది. అలాగే
ఒంట్లో వేడిమి లోపలే భద్రంగా ఉంచడానికి కూడా కొవ్వు ఉపయోగపడుతుంది. ఇక కొవ్వు వల్ల
మరో లాభం ఏంటంటే దాని వల్ల ఒంటికి కాసిని వొంపుసొంపులు అమరుతాయి – సామాన్యంగా స్త్రీలకి, పనీపాటా లేకపోతే ఆ సౌభాగ్యం
పురుషులకీ సొంతం!
ఇక్కడ చిన్న
ధర్మసందేహం ఏంటంటే కొందరు నిపుణులు ఈ కొవ్వు పొర అసలు నాకు చెందనిది అంటూంటారు. (వాళ్లకి
తప్పకుండా కొవ్వు పట్టింది!) ఎందుకంటే subcutaneous అంటే చర్మానికి అడుగున అని అర్థం. అంటే చర్మం కాదన్నమాటేగా!
అయినా అసలు కొవ్వు నాదా కాదా అన్నది పెద్ద విషయం కాదనుకోండి. మీ దగ్గరుంటే నా దగ్గర
ఉన్నటేగా మరి.
ఇక నా పొరలలో
కెల్లా బలమైనది డెర్మిస్. సంచీలో కూరగాయలు పదిలంగా వున్నట్టు ఈ డెర్మిస్ అనే సంచీలో
దేహాంగాలు బయటికి పొర్లిపోకుండా భద్రంగా ఉంటాయి. ఈ డెర్మిస్ లోనే ఎన్నో నాడులు, రక్తనాళాలు,
గ్రంథులు అన్నీ విస్తరించి వుంటాయి. మీకు ఒక అవగాహన రావాలంటే – సగటున ఒక చదరపు సెంటీంటర్
డెర్మిస్ లో సుమారు నూరు చెమట గ్రంథులు, నాలుగు
మీటర్ల నాడీ తీగలు, వందల కొద్దీ నాడుల కొసలు (nerve endings), 10 రోమ
కూపాలు (hair follicles), 15 తైల గ్రంథులు
(sebaceous glands), ఇక చివరిగా ఒక మీటరు పొడవున్న రక్త నాళాలు ఉంటాయి.
నాలో విస్తరించిన
ఈ రక్తనాళాల జాలానికి మరో ముఖ్యమైన ప్రయోజనం కూడా వుంది. మీరు ఓ రోజు మొదటి రోజు మ్యాట్నీ
కని వెళ్లి, చేతులు కాల్చుకుని, ఎండనపడి ఇంటికి తిరిగొచ్చారు అనుకోండి. ఎంత లేదన్నా
బుగ్గలు కాస్త ఎరుపెక్కుతాయిగా మరి. అది సిగ్గుతోనో, బాధతోనో, సిగ్గుతో కూడిన బాధతోనో
వచ్చిన ఎరుపు అనుకోకండి. అది ఎండకి వొళ్ళు వేడెక్కిపోతుంటే ఆ వేడిమిని వొదిలించుకోడానికి
చర్మంలోని రక్తనాళాలు పన్నిన కుట్ర. అలాగే మీరు డిసెంబర్ నెలలో చలి అని కూడా చూడకుండా తెల్లరే పెద్ద కింగ్ లా వాకింగ్ అని బయల్దేరి పది
కిలోమీటర్లు ఎలాగోలా నడిచేసి ఇంటొకిచ్చేసరికి అద్దంలో ముఖం చూసుకుంటే సున్నపు గోడ నేపథ్యంలో
పాలిన ముఖాన్ని కనిపెట్టడానికి కాస్త ఇబ్బంది అయ్యింది అనుకోండి. దాని కారణం అద్దంలో
చూసుకోవడం వల్ల జడుపు కాదండి. చల్లగాలికి ఒంట్లోని
వేడంతా బయటికి పోకుండా చర్మంలోని రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల ముఖం అలా వెల్ల వేసినట్టు
అయిపోయింది.
ఒంటి మీద చెమట
ఆవిరైతే ఒళ్ళు చల్లబడుతుంది అన్న విషయం చిత్తు కాగితాన్ని విసనకర్రలా వాడడం నేర్చిన
ప్రతీ ప్రాణికి తెలుసుకదండి. కాని నాలో పని చేసే ఎయిర్ కండిషనింగ్ లో ఇంకా చాలా వ్యవహారం
వుందండి. మీ ఒంట్లో ఉష్ణోగ్రత 98.6 F కన్నా
ఓ మూడు, నాలుగు డిగ్రీలు ఎక్కువ అయితే మీకు చాలా అవస్థ. అలాంటిది జరగకూడదనే రెండు చదరపు
మీటర్ల వైశాల్యం గల మీద ఉపరితలం అంతటా ఓ ఇరవై లక్షల చెమట గ్రంథులు సిద్ధంగా ఉంచాను.
ఈ చెమట గ్రంథి బాగా మెలికలు తిరిగిన సన్నని నాళం. చర్మం లోపలి పొరల నుండి ఉపరితలం దాకా
విస్తరించే ఈ నాళాలు ఒక్కొక్కటి 1.25 మీటర్ల
పొడవు ఉంటాయి.
చెమట గ్రంథుల
వల్ల నీరే కాక కొంత ఉప్పు, రక్తంలో వుండే మరి కొన్ని వ్యర్థాలు ఒంట్లోంచి బయటికి పోతాయి.
బయట ప్రశాంతంగా ఉండి పెద్దగా చెమటలు పట్టని రోజు కూడా రోజుని అరకిలో నీరు చెమట గ్రంథుల
ద్వారా బయటికి పోతుంది. ఇక మిట్టమధ్యాహ్న వేళ పిచ్ అరిగిపోయేలా మీరు పిచ్చిగా రన్నులు
తీసే వేళ సుమారు ఆరు కిలోల నీరు ఆవిరైపోతుంది.
ఎండ కాసినప్పుడు,
చలి కాసుకున్నప్పుడు మాత్రమే కాదండి, సిగ్గేసినప్పుడు, భయమేసినప్పుడు, ఇంకా చాలా వేసినప్పుడు
కూడా చెమట గ్రంథులకి పని పడుతుంది అన్నమాట.
(ఇంకా వుంది)
0 comments