మన స్వప్న జీవనం గురించి ఇంతవరకు
అంతో ఇంతో లోతుగా శోధించాం. స్వప్నాలు ఎందుకు ముఖ్యం అంటే స్వప్నాలనే మట్టి లోంచి పుట్టే
మొలకలే మానవ ప్రతీకలు. కాని దురదృష్టవశాత్తు కలలని అర్థం చేసుకోవడం కష్టం. సచేతన మానసం
చెప్పే కథలకి కలలకి మధ్య ఎంతో తేడా వుంటుందని అంతకు ముందే చెప్పాను. నిజజీవితంలో మనం
ఏదైనా అనాలనుకున్నప్పుడు ఆచితూచి మాట్లాడతాం. వాక్యంలో పదాలు పొందిగ్గా వున్నాయో లేదో
చూసుకుంటాం. భావాలు సహేతుకంగా అతుకుతున్నాయోలేదో చూసుకుంటాం. ఉదాహరణకి ఓ చదువుకున్న
వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వాడే ఉపమానాలు కలగాపులగంగా ఉండడానికి ఇష్టపడడు. అలా మాట్లాడితే
భావం అవిస్పష్టం అవుతుందని అనుకుంటాడు. కాని కలల నైజం వేరుగా ఉంటుంది. అర్థం పర్థం
లేని, పరస్పర విరుద్ధమైన చిత్రాలు స్వాప్నికుడి మానసాన్ని క్రమ్ముకుంటాయి. మామూలుగా
ఉండే కాలభావాన సమసిపోతుంది. సర్వసామాన్య విషయాలు కూడా ఏవో విపరీతమైన, విపత్కరమైన అంతరార్థాన్ని
సంతరించుకుంటాయి.
జాగృత జీవనంలో మనం మన ఆలోచనల
మీద ఎంతో క్రమాన్ని, క్రమశిక్షణని ఆపాదించడానికి ప్రయత్నిస్తాం గాని, అచేతనలోని అంశాలు
గందరగోళంగా, కకావికలంగా ఉండడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్క క్షణం ఏదైనా కలని జ్ఞాపకం
తెచ్చుకుని జాగ్రత్తగా గమనిస్తే ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే మామూలుగా మనుషులకి
తమ కలలు అర్థం చేసుకోవడం అంత కష్టం అవుతుంది. మన జాగృత జీవనం పరంగా చూస్తే అవసలు అర్థం
లేనట్టు కనిపిస్తాయి. అందుకే అవి అర్థం కావడం లేదని తలబద్దలు కొట్టుకుంటూ వుంటారు,
లేదా అర్థం కావని వాపోతూ వుంటారు.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం
ఒకటుంది. మన జాగృత జివనంలో మనకి ఎదురయ్యే భావనలలో ఎంతో క్రమం వుందని అనుకుంటాం గాని
వాటిలో నిజంగా మన అనుకున్నంతగా క్రమం గాని, క్రమశిక్షణ గాని లేవని మనం గుర్తించాలి.
మన జాగృదావస్థకి చెందిన భావలలో మనం అనుకున్నంత స్థాయిలో నిర్దిష్టత, స్పష్టత ఉండదు. నిజం చెప్పాలంటే ఆ భావాలని మనం ఎంత నిశితంగా పరిశీలిస్తే
వాటిలోని అంతరార్థం (ముఖ్యంగా హార్దికమైన సారం) అంతగా అవిస్పష్టంగా కనిపిస్తుంది. దానికి
కారణం ఏంటంటే మనం విన్నది, అనుభూతి చెందినది అంతా మన అచేతనలోకి ప్రవేశిస్తుంది. అంతేకాక
మనం మన సచేతన మనస్సులో నిలుపుకున్నది, సంకల్పమాత్రం చేత వ్యక్తం చెయ్యగలిగేది కూడా ఓ కొత్త అచేతనమైన అంతరార్థాన్ని సంతరించుకుంటుంది.
మన జ్ఞాపకాన్ని తిరిగి గుర్తుతెచ్చుకున్న ప్రతీ సారి దానికి ఏదో అచేతనమైన వన్నె అలముకుంటుంది.
మన సచేతన జ్ఞాపకాలు వేగంగా ఓ అచేతన అంతరార్థాన్ని
సంతరించుకుంటాయి. ఆ గూఢార్థానికి ఏదో ఆత్మగతమైన విలువ ఉండి వుండొచ్చు. కాని ఆ అర్థమేమిటో,
ఆ విలువ ఏమిటో మనకి సచేతనంగా తెలియకపోవచ్చు. అదే ఆ భావన యొక్క బాహ్యార్థాన్ని ఎలా మరుగుపరుస్తుందో
మనకి అర్థం కాకపోవచ్చు.
(ఇంకా వుంది)
0 comments