ఆ పుస్తకాన్ని చేత్తో పట్టుకుని ఊపుతూ, వణుకుతున్న స్వరంతో
అరిచాడు – “మీరంతా నాకీ పుస్తకం గురించి ఎందుకు చెప్పలేదు?” ఆ అరుపు ఇప్పటికీ నా చెవుల్లో
మారుమ్రోగుతోంది. ఇన్నేళ్ల స్కూలు జీవితంలో ఎవ్వరూ తనని ఆ పుస్తకం చదవమన్లేదే, కనీసం
చూబించను కూడా లేదే, అన్న కోపం బాధ వున్నాయి ఆ అరుపులో. పనికిమాలిన ఊకదంపుడు పుస్తకాలు
చదవమని వేధిస్తారు గాని, ఇలాంటి విలువైన అవసరమైన పుస్తకం చదివించాలని మీకెప్పుడూ అనిపించలేదేం?
అన్న గద్దింపు వుందా అరుపులో.
ఇక్కడ గమనించవలసింది ఏంటంటే Why we can’t wait అన్న పుస్తకం
చదవడం అంత సులభం కాదు. కఠిన పదాలతో, చాంతాడంత వాక్యాలతో చప్పున కొరుకుడు పడదు. లియాన్
చదివే స్కూల్లోనే కాదు, మరే ఇతర హైస్కూల్లోనైనా దాన్ని చదవగల వారు పట్టున పది మంది
కూడా ఉండరని నా నమ్మకం. కాని కేవలం రెండవ తరగతి పిల్లలకి ఉండే పఠన శక్తి గల వాడుగా
వాళ్ల స్కూలు చేత ముద్ర వేయబడ్డ లియాన్, విశ్వప్రయత్నం చేసి ఓ నెల రోజుల్లో పుస్తకాన్ని
పూర్తి చేశాడు. దీన్ని బట్టి మనకి రెండు విషయాలు అర్థమవుతున్నాయి. 1) పిల్లలు తమకి అర్థవంతంగా తోచే పుస్తకాలు చదవడానికి
ఇష్టపడతారు, అపేక్షిస్తారు, ఎదురుచూస్తారు. 2)
అటువంటి పుస్తకాలని వాళ్ల అందుబాటులో పెడితే, పెద్దల నుండి అవసరమైన మేరకు కనీస
సహాయాన్ని మాత్రమే తీసుకుంటూ వాళ్లంతకి వాళ్ళే పుస్తకాలు చదవడం నేర్చుకుంటారు.
పై రెండు సత్యాల్లో మొదటి దాన్ని On learning to read (చదవడం
నేర్చుకోవడం ఎలా?) అన్న పుస్తకంలో రచయితలు
బ్రూనో బెటెల్ హైమ్, కారెన్ జలాన్ లు చక్కగా వివరించారు. కాని రెండవ సత్యాన్ని వాళ్ల
పుస్తకం విస్మరించింది. బోధనా పద్ధతులని మెరుగుపరిచే మార్గాలని విస్తృతంగా చర్చించారు
గాని ఒక అతిముఖ్యమైన విషయాన్ని గమనించలేక పోయారు. అదేమిటంటే పిల్లవాడు అడగని చదువు,
కోరని శిక్షణ ఆ విద్యార్థి ప్రగతికి అడ్డుపడుతుందే గాని మేలు చెయ్యదు.
అయితే నా అభిప్రాయంలో కూడా కొంత లోపం వుండొచ్చు. బెటెల్ హైమ్
చాలా తెలివైన వాడు. గొప్ప వాస్తవికతా దృక్పథం గల వాడు. తమ బోధనా పద్ధతుల్లో, కార్యకలాపాల్లో
అతిస్వల్పమైన సవరణలు కూడా చేసుకోడానికి ఒప్పుకోని స్కూళ్ల మొండి వైఖరిని, పిల్లలకి
ఎంత చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎంత సమయంలో చెప్పాలో అంతా తమ చేతుల్లోనే వుందని భ్రమపడే
స్కూలు అధికారులని బహుశ బాగా అర్థం చేసుకున్న రచయితలు అందుకు పరిష్కారంగా ఈ రకమైన వ్యూహరచన
చేసి వుంటారు. స్కూళ్లలో వాడే ‘వాచకాలు’ (readers) ఎంత ఘోరంగా ఉంటాయో వర్ణించారు. చదివేటప్పుడు పిల్లలు
చేసే పొరబాట్లకి టీచర్లు కటువుగా స్పందిస్తూ శిక్షించే వైఖరిని విమర్శిస్తూ ఆ పద్ధతిని
ఎలా మార్చుకోవాలో చెప్తూ వచ్చారు.
(ఇంకా వుంది)
0 comments