విద్యుత్ రసాయన శాస్త్రం, నాడీ రసాయన శాస్త్రం మొదలైన శాస్త్రాలలో
జరిగిన పురోగతి వల్ల న్యూరాన్ల మధ్య సంకేతాల మార్పిడి ఎలా జరుగుంది అన్న విషయం మీద
ఎంతో అవగాహన పెరిగింది. అలాగే నాడీ రోగుల మీద జరిగిన అధ్యయనాల వల్ల కూడా ఎనలేని నాడీ
విజ్ఞానం బట్టబయలు అయ్యింది. మెదడులో వివిధ విభాగాలు కలిసికట్టుగా పని చేస్తే ఒక వ్యక్తి
యొక్క ప్రవర్తనని ఎలా శాసిస్తాయో తెలిసింది.
ఫ్రాన్స్ గాల్ రూపొందించిన ఫ్రీనాలజీ అనే కుహనా రంగం గురించి
అంతకు ముందు విన్నాం. ఆ నాటి నుండి కూడా మెదడులో వివిధ అంగాలకి, మెదడు యొక్క వివిధ
క్రియలకి మధ్య సంబంధం గురించి రెండు పరస్పర విరుద్ధ చలామణిలో ఉన్నాయి. ఆ రెండు సిద్ధాంతాలు
నిర్ధారణ కోసం కొన్ని శతాబ్దాల పాటు పోటీ పడుతూ వచ్చాయి.
వీటిలో మొదటి సిద్ధాంతాన్ని ప్రాంతీయతా వాదం (localization
view) అంటారు. మెదడు యొక్క ప్రతీ క్రియకి ఓ ప్రత్యేక మెదడు ప్రాంతం బాధ్యత తీసుకుంటుందని
ఈ వాదం చెప్తుంది. దీనికి విరుద్ధ సిద్ధాంతాన్ని ‘సమగ్ర క్షేత్ర వాదం’ (aggregate
field view) అంటారు. మానవ ప్రవర్తనలోని ప్రతీ అంశం మీదా మెదడులోని అన్ని ప్రాంతాలు
ఉమ్మడిగా ప్రభావం చూపిస్తాయని ఈ వాదం నమ్ముతుంది. అసలు ఫ్రీనాలజీయే ఒక విధంగా ప్రాంతీయతా
వాదానికి ఒడంబడిన ఒక సిద్ధాంతం. ఎందుకంటే ఫ్రీనాలజీ ప్రకారం వివిధ మెదడు భాగాలు ప్రత్యేక
మానవ లక్షణాలకి ప్రతినిధులు. కాని ఫ్రీనాలజీ ఒక వైజ్ఞానిక సిద్ధాంతం కాదు. ఎందుకంటే
దానికి ఎలాంటి వాస్తవ ఆధారాలు లేవు. ఒక రకంగా అదొక మూఢనమ్మకం లాంటిది అనుకోవాలి.
ఇలా ఉండగా పందొమ్మిదవ శతాబ్దంలో ఫ్రాన్స్ కి చెందిన పియర్
ఫ్లోరెన్స్ అనే జీవక్రియాశాస్త్రవేత్త ఈ ప్రాంతీయతా వాదాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించదలచుకున్నాడు.
ఆ ప్రయోగాల కోసం కొన్ని జంతువులని ఎంచుకున్నాడు. వాటి మెదళ్లలో వివిధ చోట్ల గాయాలు
చేస్తూ వచ్చాడు. గాయ పడ్డ జంతువుల ప్రవర్తనలో మార్పులని సూక్ష్మంగా గమనించాడు. తన పరిశీలనల్లో
అర్థమైనది ఏంటంటే మెదడులో గాయం ఎక్కడ అయ్యింది అన్నది అంత ముఖ్యం కాదు, గాయం యొక్క
విస్తృతి ఎంత అన్నదే ముఖ్యం. గాయం పెరుగుతున్న కొద్ది ప్రవర్తనలో మార్పు అంత ప్రస్ఫుటంగా
ఉంటుంది. అంటే మెదడులోని అంగాలన్నీ కలిసికట్టుగా జంతువు యొక్క ప్రవర్తనని శాసిస్తున్నాయన్నమాట.
ఈ పరిశోధనలు ‘సమగ్ర క్షేత్ర వాదం’ ని సమర్ధిస్తున్నట్టుగా అనిపించింది.
తదనంతరం ఇరవయ్యవ శతాబ్దపు తొలి దశల్లో కార్ల్ లాష్లే అనే శాస్త్రవేత్త
ఇంచుమించు ఇలాంటి ప్రయోగాలే చేశాడు. ఎలుకలకి చిక్కువ్యూహాల (maze) లోంచి తప్పించుకుని బయటపడే ఒడుపు ఉంటుంది. ఎంత తక్కువ
సమయంలో అలాంటి చిక్కువ్యూహాల నుండి తప్పించుకోగలిగితే ఆ ఎలుక సామర్థ్యం అంత ఎక్కువ
అన్నట్టుగా పరిగణించాడు లాష్లే. ఇప్పుడు ఆ ఎలుకల మెదళ్లలో కత్తితో సన్నని కోతలు కోశాడు.
అలా కోసిన కోతల మొత్తం పొడవుకి, ఎలుకలు చిక్కువ్యాహాల నుండి తప్పించుకోడానికి పట్టే
సమాయానికి మధ్య సంబంధాన్ని పరిశీలించాడు. ఆ ప్రయోగాల బట్టి అర్థమైనది ఏంటంటే మెదడులో
కోతలు ఎక్కడ జరిగాయి అన్నది ముఖ్యం కాదు. మొత్తం కోతల పొడవు ఎంత, అంటే మొత్తం గాయం
యొక్క విస్తృతి ఎంత, అన్నదే ఎలుక యొక్క సామర్థ్యాన్ని శాసిస్తుంది. గాయం ఎక్కడైనా అది
ఎక్కువైతే అంత మేరకు ఎలుక సామర్థ్యం పడిపోతుంది. ఆ విధంగా లాష్లే ప్రయోగాలు కూడా సమగ్ర
క్షేత్ర వాదాన్ని సమర్థిసున్నట్టు అనిపించింది.
కాని మెదడు వ్యాధులకి సంబంధించిన కొన్ని పరిశీలనలు ఇందుకు
భిన్నమైన కథ చెప్తున్నట్టు అనిపించింది.
(ఇంకా వుంది)
0 comments