పై అంశాల్లోని మొదటి దాంట్లో – అంటే పిల్లల పుస్తకాలని ఇంకా
ఎలా అభివృద్ధి చెయ్యొచ్చునన్న విషయంలో – వాళ్లు చెప్పేది ముమ్మాటికీ నిజం. స్కూళ్లలో
పిల్లలు విధిలేక చదివే పుస్తకాలు చాలా మటుకు అర్థం లేకుండా, అవాస్తవికంగా, పేలవంగా
ఉంటాయి. బోరుకొడతాయి. ఆలోచనని తప్పుదారి పట్టిస్తాయి. ఈ విషయం మీద గణాంక ఫలితాలు చెప్పేదేంటో
చూద్దాం.
“1920 లలో ప్రచురించబడ్డ
వాచకాలలో సగటున 645 విభిన్న పదాలు ఉండేవి. 1930 ల నాటికి ఆ సంఖ్య 430 పదాలకి పడిపోయింది. నాల్గవ, ఐదవ దశాబ్దాలలో …
350 పదాలే వుండేవి. 1960-1963 ప్రాంతాల్లో ప్రచురితమైన ఏడు వాచకాల సంపుటిలో
113 నుండి 173 పదాలే ఉన్నాయి. 1920 లో
సగటున ఒక్క కథలో 333 పదాలు వుండేవి.
1962 నాటికి అది 230 కి దిగింది. మొత్తం పుస్తకంలో విభిన్న పదాల సంఖ్య
1920 లో 425 ఐతే, 1930లో 282 ఐతే, 1940లో 178 ఐతే, 1962లో 153 అయ్యింది.”
పై ఫలితాలని చర్చిస్తూ ప్రచురణ కర్తలు తమ వాచకాల శబ్ద పుష్టిని
తగ్గిస్తూ రావడానికి గల కారణాలని రచయితలు ఇలా వివరిస్తున్నారు.
“ఒక కారణం… ఏంటంటే వాచకాలు ఇంకా ఇంకా నిస్సారంగా అవుతున్న
కొలది పిల్లల పఠన శక్తి ఇంకా ఇంకా తగ్గుతూ వచ్చింది. కాని దీని నుండి నిపుణులు గ్రహించిన
పాఠం ఇది కాదు. పుస్తకాలు పిల్లలకి మరీ కఠినంగా ఉన్నాయి కాబోలు. అందుకే వాటిని ఇంకా
సరళికరించాలి కాబోలు. ఇంకా తక్కువ పదాలే వాడాలి కాబోలు అన్న నిర్ణయానికి వచ్చారు. ఆ
కారణం చేత వచ్చిన ప్రతీ కొత్త ముద్రణలోను ఇంకా ఇంకా తక్కువ పదాలు కనిపిస్తూ వచ్చాయి.
కొన్ని పదాలనే తరచూ వాడుతూ పుస్తకాలు రాయడం జరిగింది. దాంతో అవి చదవడానికి బోరు కొట్టేవి…
ఆ ఒరవడి ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది.”
వాచకాలు ఎంత అధ్వాన్న స్థితిలో ఉన్నాయో ఎత్తి చూపి ఆ పుస్తకం
ఎంతో మేలు చేసింది. కనీసం ఆ ఒక్క కారణం కోసమైనా బెటెల్ హైమ్, జలాన్ ల పుస్తకం చదవాలి.
ఆ పుస్తకం పుణ్యమా అని వాచకాల నాణ్యత తగ్గుతూ వచ్చే ఒరవడి తిరుగబడిందంటే మంచిదే. వాచకాలు
ఉంకా ఉత్సాహకరంగా, స్ఫూర్తిదాయకంగా ఉండాలి, ఆనందాన్నివ్వాలి, చదవాలని అనిపించాలి. ఆ
పరిణామాన్ని కలుగజేసిందంటే ఆ పుస్తకం గొప్ప పుస్తకమనే అనుకోవాలి.
“On learning to read” (చదవడం ఎలా?) అన్న పుస్తకంలో పిల్లల
పొరబాట్ల అంతరార్థం ఎలా తెలుసుకోవాలి అన్న విషయం మీద చాలా చర్చ జరిగింది. ఏదో అజ్ఞానం
వల్ల, నిర్లక్ష్యం వల్ల పిల్లలు తప్పులు చేస్తుంటారు. ఆ తప్పుల్ని చప్పున చక్కదిద్దాలి,
అవసరమైతే ఓ రెండు ఇచ్చుకోవాలి, నాలుగు అంటించాలి – అసలు ఆ పద్ధతే తప్పు అంటారు రచయితలు.
పిల్లలు చేసే పొరబాట్లు వాళ్లకి అర్థవంతంగానే ఉంటాయి. టిచర్లు ఈ విషయాన్ని గమనించి
అది వాళ్లకి తెలుసు అన్న విషయాన్ని పిల్లలకి తెలియజేయాలి. పిల్లల పొరబాట్లలో ప్రచ్ఛన్నంగా
ఉండే అర్థాలేంటో టీచర్లు వెదికి పట్టుకుని వాటిని పిల్లలకి వెల్లడి చెయ్యాలి. ఇదే ఒక
విధమైన ప్రాధమిక మనస్తత్వ విశ్లేషణని పోలిన ప్రక్రియ.
మంచి అనుభవం గల మనస్తత్వ శాస్త్రవేత్తలు కావడంతో, రచయితలు
ఈ అంతరార్థాలని వెదికి పట్టుకొవడంలో గొప్ప నేర్పు ప్రదర్శించారు. అలాంటి వాళ్లు పొరబడతారా?
పుస్తకంలో వాళ్లు పేర్కొన్న ఉదాహరణలు మాత్రం పిల్లలు చేసే ఎన్నో పొరబాట్లలోని అర్థాలని
బోధపరిచేవిగా ఉన్నాయి. కాని రచయితలు చదవడం నేర్పే ప్రతీ టిచరు వాళ్ల పద్ధతినే వాడాలి,
వాళ్ల మార్గంలోనే నడవాలి అని పట్టుబడుతున్నారు. ఈ విషయంలో మాత్రం నేను వాళ్లతో ఏకీభవించలేను.
చదవడంలో వచ్చే పొరబాట్లని అంత సూక్ష్మంగా పరిశోధించి ఆ ఫలితాలని
వెల్లడించడం నిజంగా విశేషమైన పనే. కాని ఆ పద్ధతి ఆచరణాత్మకం కాదు. ఎందుకంటే రచయితలు
సూచించినంత ఓపిగ్గా, మర్యాదగా, వివేకవంతంగా పిల్లల పొరబాట్లకి స్పందించే టిచర్లు చాలా
అరుదు. టీచర్లకి అలా చెయ్యడానికి కావలసిన శిక్షణ గాని, సమయం గాని, ఉద్దేశం గాని అన్నిటికన్నా
మించి ఇలాంటి కృషిలో ఎంతో అవసరమైన లక్షణాలు – పిల్లల పట్ల ప్రేమాభిమానాలు – ఉండవు.
అసలు స్కూళ్లు నిజంగా ఈ పద్ధతిని అమలు జరపాలి అని గట్టిగా అనుకుంటే దాని వల్ల జరిగే
మేలు కన్నా కీడే ఎక్కువ. అసలే ఈ రోజుల్లో పిల్లలు, చదువులు అన్న అంశం మీద కుహనా మనస్తత్వ
పరిశోధనలు, తలతిక్క విశ్లేషణలు పెచ్చరిల్లిపోతున్నాయి. దానికి తోడు ఇలాంటి సున్నితమైన
పద్ధతిని అందరూ పాటించాలని నిర్బంధిస్తే…
కనుక ఇలాంటి తంటాలవీ అనవసరం అని నా అభిప్రాయం. అసలు టీచర్లు
పిల్లల్ని క్లాసులో అందరి ముందు బిగ్గరగా చదవమనడం మానేస్తే మంచిది. అప్పుడు వాళ్ల పొరబాట్లు
తెలుసుకోనూ అక్కర్లేదు, వాటికి స్పందించనూ అక్కర్లేదు. పిల్లలకి వారి సరదా కోసం వారికి
వారు చదువుకునేలా మంచి ఆసక్తికరమైన పుస్తకాలు అందజేస్తే చాలా మటుకు పొరబాట్లు వాటంతకవే
మటుమాయం అయిపోతాయి.
0 comments