న్యూరాన్లు రసాయనాల సహాయంతో సంభాషించుకుంటాయి అని నిరూపించడం
కోసం రెండు కప్ప గుండెలని తీసుకున్నాడు ఆటో లెవీ. రెండు గుండెలనీ వేరు వేరు జాడీలలో
రింగర్ ద్రావకాలలో పెట్టి సజీవంగా ఉంచాడు. కప్ప గుండెని (మనిషి గుండెని కూడా) వేగస్
అనే నాడి నియంత్రిస్తుంది. వేగస్ నాడిని ప్రేరేపించినప్పుడు గుండె లయ నెమ్మదిస్తుంది.
లెవీ తీసుకున్న కప్ప గుండెలకి వేగస్ నాడులు తగిలించి వున్నాయి. వాటిలో ఒక జాడీ లో వున్న
గుండెని విద్యుత్ పరంగా ప్రేరెపించి ఆ జాడీలో వున్న గుండె లయ నెమ్మదిస్తోందని నిర్ధారించుకున్నాడు.
అప్పుడు ఆ జాడీ లోంచి కొంత ద్రావక తీసి రెండో
జాడీలో పోశాడు. అప్పడు రెండవ జాడీలో వున్న గుండె నెమ్మదించడం కనిపించింది.
ఈ పరిణామానానికి కారణం ఇలా వివరించొచ్చు. మొదటి గుండె యొక్క వేగస్ నాడిని ప్రేరేపించినప్పుడు ఆ నాడి నుండి
ఏదో రసాయనం విడుదల పొందింది. ఆ రసాయన ప్రభావం వల్లనే ఆ గుండె నెమ్మదించింది. అయితే
అలా విడుదల పొందిన రసాయనంలో కొంత భాగం ఆ గుండె వున్న ద్రావకంలోకి కూడా ప్రవేశించింది.
అందుకనే ఆ ద్రావకాన్ని మాత్రం రెండవ జాడీ లోకి మార్చినప్పుడు ఆ ద్రావకంలోని రసాయన ప్రభావం
వల్ల రెండవ జాడీలోని గుండె కూడా నెమ్మదించింది. ఆ విధంగా నాడీ ప్రభావాన్ని ఓ రసాయనం
మోసుకుపోతుందని తెలిసింది.
తదనంతర కాలంలో న్యూరాన్లు విడుదల చేసే రసాయనాలకి న్యూరో ట్రాన్స్
మిటర్ (neurotransmitter) అని పేరు పెట్టడం
జరిగింది. అలాంటి రసాయనాలు ఎన్నో కనుక్కోబడ్డాయి. ఒక న్యూరాన్ విడుదల చేసిన న్యూరోట్రాన్స్
మిటర్ అవతలి న్యూరాన్ మీద ఉండే రిసెప్టార్
అనే అణువు మీద ప్రభావం చూపుతుంది. ఆ రిసెప్టారే న్యూరోట్రాన్స్ మిటర్ ని గురించగలదు.
న్యూరోట్రాన్స్‍మిటర్ – రిసెప్టార్ల కలయిక వల్ల రిసెప్టార్ వున్న న్యూరాన్ లో విద్యుత్
చలనాలు పుడతాయి. ఆ విధంగా ఒక న్యూరాన్ మరో న్యూరాన్ మీద ప్రభావం చూపగలుగుతోంది. ఈ రసాయనిక
సంభాషణా కార్యక్రమం అంతా రెండు న్యూరాన్లు కలిసే ఓ చిన్న సంధి స్థానం – దీన్ని సైనాప్స్
(synapse) అంటారు – వద్ద జరుగుతుంది అని తెలిసింది. అయితే కొన్ని సైనాప్స్ ల వద్ద రసాయనాల
ప్రమేయం లేకుండా నేరుగా విద్యుత్ ప్రవాహహాల సహాయంతో సంభాషణలు జరుగుతాయని కూడా తరువాత
తెలిసింది. అలాంటి సైనాప్స్ లని విద్యుత్ సైనాప్స్ లు (electrical synapses) అంటారు.
న్యూరాన్ల మధ్య రసాయన సంభాషణల గురించిన పరిశోధనల్లో పురోగాములైన
ఆటో లెవీ మరియు హెన్రీ డేల్ అనే శాస్త్రవేత్తలకి నోబెల్ బహుమతి లభించింది. ఈ హెన్రీ
డేల్ అసిటిల్కొలీన్ అనే న్యూరోట్రాన్స్ మిటర్ మీద ప్రప్రథమ ప్రయోగాలు చేశాడు. విద్యుత్
సైనాప్స్ ల మీద తొలి పరిశోధనలు చేసిన సర్ జాన్ ఎక్లిస్ కూడా నోబెల్ పురస్కారం లభించింది.
నాడీరసాయన శాస్త్రం (neurochemistry) మరియు నాడీ ఔషధ విజ్ఞానం (neuropharmacology)
అనే విశాలమైన శాస్త్రాలలో ఈ తొలి శోధనలు పునాది రాళ్ళు అయ్యాయి.
0 comments