మా చుట్టూ సమంగా
విస్తరించిన కాంతిలో అతి చిన్న వస్తువులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కనుక వాటిని
కనిపెట్టడం కష్టం కాదు. మొదట్లో నా కళ్లని నేనే నమ్మలేదు. కాని తేరిపార చూశాక నమ్మక
తప్పలేదు. ఆ మహాకాయాలు చెట్ల వెనుక కదలాడుతున్నాయి. అదో మాస్టడాన్ల దండులా వుంది. అవి
శిలాజాలు కాదు. సజీవంగా కదలాడే జంతువులు. 1801
లో ఒయహో లో బురదనేలలో ఇలాంటి జంతువుల ఎముకలు దొరికాయి.ఏనుగుల్లాంటి ఆ మహాకాయాలు
సర్పాల్లాంటి తమ తొండాలతో చెట్ల కింద మట్టిని తవ్వుతున్నాయి. కుళ్ళిపోయిన చెట్ల మొదళ్లని
తమ వాడి అయిన దంతాలతో కుళ్లబొడిచి పెద్ద పెద్ద చెట్లని కూలదోస్తున్నాయి. వాటి ధృఢమైన
దవడల మధ్య ఆ చెట్ల కొమ్మలు పటపట విరుగుతున్నాయి.
ఆ విధంగా పూర్వచారిత్రక
యుగం గురించి, తృతీయ యుగం, తృతీయోత్తర యుగం గురించి నేను కన్న కల నిజమయ్యింది. కాని
కల నిజమయ్యిందని సంబరపడే పరిస్థితిలో లేను! భూగర్భపు
చీకటి లోతుల్లో ఈ మహామెకాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడుతూ ముగ్గురం బిక్కుబిక్కుమంటూ
నించున్నాం!
మావయ్య మాత్రం
ఎంతో ఆసక్తితో వాటి కేసే చూస్తున్నాడు.
“రా!రా!” అంటూ
నా జబ్బ పట్టి లాగాడు. “పద కాస్త ముందుకెళదాం.”
“అమ్మో! నేను
చచ్చినా రాను,” మొరాయించాను. “అటు చూడండి ఓ సారి. అవి కాళ్లు కావు. మద్ది చెట్లు. వాటి
జోలికి వద్దులే మావయ్యా. వాటికి గాని తిక్క రేగిందంటే ఇక మనిషి అన్నవాడు మిగలడు.”
“మనిషి అన్న
వాడు మిగలడని అని నువ్వు అనుకుంటున్నావు ఏక్సెల్! కాని ఓ సారి అటు చూడు. వాటి సమక్షంలో
ఓ చిన్న ఆకారం కనిపిస్తోంది. అది మానవాకారం కాదూ?”
మావయ్య చూపించిన
వైపే చూశాను. నేను ఏం చూస్తున్నానో కాసేపు నాకే అర్థం కాలేదు. కాని నా ఇంద్రియాలు చెప్పే
సాక్షాన్ని ఒప్పుకోక తప్పింది కాదు.
నిజమే. మేం ఉన్న
చోటికి సుమారు పావు మైలు దూరంలో ఓ పెద్ద కౌరీ చెట్టుకి ఆనుకుని ఓ మనిషి నించున్నాడు.
పాతాళ లోకపు
ప్రోటియస్ దేవతలా ఠీవిగా నించున్నాడు.
అతడిది మానవాకారమే
కాని అతడు మామూలు మనిషిలా కనిపించలేదు. అతడు కూడా మహాకాయుడే. ఎత్తు పన్నెండు అడుగులు
ఉంటుందేమో. తల ఎద్దు తలలా వికారంగా వుంది. జుట్టు జడల కట్టుకుపోయి వుంది. అది మనిషి
జుట్టులా లేదు. ఏదో ఆదిమయుగం నాటి ఏనుగు తల మీది బొచ్చులా వుంది. అతడి చేతిలో ఓ ధృఢమైన
దండం కనిపిస్తోంది.
మేం అలా నోరెళ్ళబెట్టి
చూస్తూ ఉండిపోయాం. ఇంతలో ఒంటి మీదకి తెలివి వొచ్చింది. అతడి కంటబడ్డామంటే ఏం జరుగుతుందో
అర్థమయ్యింది.
“పద మావయ్యా!
ఇక్కడీ నుండి వెళ్లిపోదాం,” మావయ్యని బలవంతం చేస్తూ అన్నాను. ఏం అనుకున్నాడో ఏమో మావయ్య
ఒప్పుకున్నాడు.
ఓ పావుగంట తరువాత
ఆ మహాకాయుడి నుండి దూరంగా ఓ సురక్షిత ప్రాంతాన్ని చేరుకున్నాం.
(ఇంకా వుంది)
0 comments