బ్రిటిష్ న్యూరాలజిస్టు హూగ్లింగ్స్ జాక్సన్ మూర్చ వ్యాధికి (epilepsy) చెందిన ఒక ప్రత్యేక లక్షణాన్ని
అధ్యయనం చేసేవాడు. మూర్ఛ వ్యాధి వున్న రోగుల్లో కొన్ని సమయాలలో ఉన్నట్లుండి శరీరం వశం
తప్పి, ఒంటి మీద స్పృహ కోల్పోయి, గిగిలా తన్నుకుంటూ కింద పడిపోవడం జరుగుతుంది. అలాంటి
పరిణామం కలగడానికి కారణం మెదడులోని నాడీ విద్యుత్ చర్య అడ్డు అదుపు లేకుండా వ్యాపించడమే.
ఓ కార్చిచ్చులా ఇలాంటి నాడీ విద్యుత్ చర్య ఒక ప్రత్యేక స్థానం నుండి మొదలై మెదడులో
ఇరురుగు పొరుగు ప్రాంతాలకి వ్యాపిస్తుంది. అయితే జాక్సన్ కాలంలో మూర్ఛ వచ్చినప్పుడు
మెదడులో ఏం జరుగుతోంది అన్న విషయం మీద పెద్దగా అవగాహన ఉండేది కాదు. బయటికి కనిపించే
తంతు మాత్రమే తెలిసేది. మూర్ఛ వచ్చినప్పుడు శరీరంలో కనిపించే కంపన కూడా ఒక ప్రత్యేక
తరహాలో వ్యాపిస్తుంది. ముందుగా కంపన చేతిలో మొదలవుతుంది. నెమ్మదిగా మణికట్టుకి, తరువాత
మోచేతికి, అక్కణ్ణుంచి భుజానికి వ్యాపించి, క్రమంగా శరీరం మొత్తాన్ని వశం చేసుకుంటుంది.
ఒళ్ళంతా గిలగిల కొట్టుకోవడం వల్ల తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మనిషి తూలి కింద పడడం
జరుగుతుంది. ఇలాంటి కంపనలని (seizures)
focal motor seizures అంటారు.
Focal motor seizures
ని అధ్యయనం చెయ్యడం మొదలెట్టిన జాక్సన్ కంపన జరుగుతున్నప్పుడు మెదడులో ఏం జరుగుతోందో
ఒక ఊహ కలగసాగింది. శరీరంలో వివిధ అంగాల లోని కదలికలని మెదడులో వివిధ ప్రాంతాలు శాసిస్తాయని
ముందుగా ఊహించాడు. అంతే కాక పక్క పక్కగా వున్న అంగాలని అదిలించే మెదడు ప్రాంతాలు కూడా
పక్క పక్కగా వుండి వుండాలని ఊహించాడు. ఉదాహరణకి చేతిని శాసించే ప్రాంతం పక్కనే ముంజేతిని
శాసించే ప్రాంతం ఉండాలి. దాని అవతల భుజాన్ని శాసించే ప్రాంతం… మెదడులో వివిధ ప్రాంతాల
అమరిక అలా వున్నప్పుడు, ఏ కారణం చేతనో చేతిని శాసించే ప్రాంతంలో అసాధారణ రీతిలో నాడీ
విద్యుత్ చర్య మొదలయ్యింది అనుకుందాం. ఆ చర్య
ఓ కార్చిచ్చులా పక్కనే వున్న ముంజేతిని శాసించే ప్రాంతానికి వ్యాపిస్తుంది. ఆ తరువాత
భుజాన్ని శాసించే ప్రాంతానికి వ్యాపిస్తుంది. అలా వ్యాపించి వ్యాపించి మొత్తం శరీరాన్ని
శాసించే ప్రాంతాలన్నిటీ ఆక్రమిస్తుంది. అప్పుడు శరీరం అంతా కంపనకి లోనవుతుంది.
జాక్సన్ ఊహించిన వర్ణన నిజమే అయితే మెదడులో ఫలానా చోట మొత్తం
శరీరాన్ని శాసించే ఓ ‘మ్యాపు’ లాంటిది వుండాలన్నమాట. ఓ కంప్యూటర్ కీ బోర్డ్ లో ఒక్కొక్క
బటన్ ని నొక్కితే తదనుగుణమైన అక్షరం స్క్రీన్ మీద కనిపించినట్టు, మెదడులో వున్న ఈ మ్యాపుని
ప్రత్యేక స్థానాల్లో ప్రేరిస్తే ఆ స్థానానికి
అనుగుణమైన అంగంలో చలనం ఏర్పడుతుంది. మరి నిజంగానే మెదడులో అలాంటి మ్యాపులు వున్నాయా?
ఈ ప్రశ్నకి మొట్టమొదటి సమాధానాలు మనకి కెనడాకి చెందిన విల్డర్
పెన్ ఫీల్డ్ అనే న్యూరో సర్జన్ అధ్యయనాల నుండి బయట పడ్డాయి. 1950 లలో పెన్ ఫీల్డ్ ఎపిలెప్సీ వ్యాధిని నయం చేసే పద్ధతుల
కోసం అన్వేషిస్తున్నాడు. వృత్తి రీత్యా సర్జన్ కనుక సర్జరీతో ఆ వ్యాధిని నయం చేసే మార్గాల
కోసం వెతకసాగాడు. ఎపిలెప్సీలో సీజర్ మొదలైనప్పుడు మెదడులో ఒక ప్రత్యేక స్థానం నుండి
అసాధారణమైన నాడీ విద్యుత్ చర్య మొదలవుతుంది అని పైన చెప్పుకుందాం. ఆ స్థానాన్నే నాభి
(focus) అంటారు. ఆ నాభి ఎక్కడుందో పట్టుకుని,
సర్జరీ ద్వారా ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తే, లేదా తొలగిస్తే వ్యాధి లక్షణాలు అరికట్ట
వచ్చని పెన్ ఫీల్డ్ ఆలోచన.
ఎపిలెప్టిక్ రోగి సీజర్
గురి అయ్యే క్షణం వరకు ఎదురు చూడకుండా ముందే, కపాలంలో సర్జరీ ద్వారా రంధ్రం చేసి, మెదడులో సంబంధిత ప్రాతాలని బట్టబయలు
చేసి, వివిధ స్థానాలకి విద్యుత్ ప్రేరణ ఇస్తే ఏం జరుగుతుందో పరిశీలించాడు పెన్ ఫీల్డ్.
ఎపిలెప్టిక్ నాభి వద్ద ముందే పరిస్థితి విషమంగా వుండడం వల్ల, ఆ స్థానంలో విద్యుత్ ప్రేరణ
ఇవ్వగానే, ఊహించినట్టుగానే రోగిలో సీజర్ మొదలయ్యింది. ఆ స్థానానికి పరిసర ప్రాంతాలని
సర్జరీ ద్వార తొలగించినప్పుడు ఎన్నో సందర్భాలలో వ్యాధి లక్షణాలు మెరుగుపడ్డాయి.
ఎపిలెప్సీ చికిత్స లక్ష్యంగా గల పెన్ ఫీల్డ్ అధ్యయనాల వల్ల,
వాధికి ఒక చికిత్సామార్గం కనిపించడమే కాక, అనుకోకుండా మరో అధ్బుతమైన విషయం కూడా బయటపడింది.
(ఇంకా వుంది)
Pl complete the article. egarly awaiting for remaining matter
Sudha garu
This is the continuation of the above article...
http://scienceintelugu.blogspot.in/2014/05/blog-post_28.html