మూలకాల అమరిక
1864 లో ఇంగ్లీష్ రసాయన శాస్త్రవేత్త జాన్ అలెగ్జాండర్
రెయినా న్యూలాండ్స్ (1837-1898) ఉన్న మూలకాలు
అన్నిటీనీ పరమాణు భారాల ఆరోహణా క్రమంలో అమర్చాడు. అలా అమర్చాక చూస్తే మూలకాల లక్షణాలు కనీసం
పాక్షికంగానైనా ఒక క్రమంలో ఏర్పడడం కనిపించింది. మూలకాలు అన్నిటీనీ ఏడేసి గడులు ఉన్న
నిలువు గడులలో అమర్చితే, ఒకే పోలికలో ఉండే మూలకాలు ఒకే అడ్డుగడిలో ఉండడం కనిపించింది.
ఆ విధంగా పొటాషియమ్ సోడియమ్ పక్కన చేరింది. సల్ఫర్ ఉండే అడ్డుగడిలోనే సిలీనియమ్ కూడా
చేరింది. కాల్షియమ్ మెగ్నీషియమ్ పక్కన చేరింది. లోగడ డోబ్‍రైనర్ గుర్తుపట్టిన మూడు
త్రికాలు కూడా ఈ అడ్డుగడులలోనే చేరడం కనిపించింది.
న్యూలాండ్స్
ఈ క్రమానికి ‘సప్తపదుల నియమం’ (Law of Octaves) అని పేరు పెట్టాడు. (సంగీతంలో ఎలాగైతే
స, రి, గ, మ, ప, ద, ని తరువాత మళ్లీ ‘స’ వస్తుందో, అంటే సప్తస్వరాలు మళ్లీ మళ్లీ ఎలా వస్తుంటాయో, అదే విధంగా
మూలకాల క్రమంలో ప్రతీ ఎనిమిదవ మూలకం మళ్లీ మొదటి మూలకాన్ని పోలి వుంటుందన్న భావన ఇది.)
అయితే దురదృష్టవశాత్తు ఈ పట్టికలో కొన్ని అడ్డు వరుసలలో బాగా పోలికలు ఉన్న మూలకాలు
ఉన్నా, కొన్ని వరుసలలో బాగా వైవిధ్యం ఉన్న మూలకాలు కూడా ఉన్నాయి. న్యూలాండ్స్ ఎత్తి
చూపుతున్న పోలికలు కేవలం కాకతాళీయాలు అని కొందరు రసాయన శాస్త్రవేత్తలకి అనిపించింది. అందుచేత న్యూలాండ్స్ కి తన పరిశోధనలని ప్రచురించడానికి
సాధ్యం కాలేదు.
న్యూలాండ్స్
నిర్మించిన మూలకాల పట్టిక
రెండేళ్ల తరువాత
ఫ్రెంచ్ భౌగోళిక శాస్త్రవేత్త అలెగ్జాంద్ర్ ఎమీల్ బెగుయే ద చాంకూర్‍త్వా
(1820-1886) కూడా మూలకాలని పరమాణు భారాల ఆరోహణా
క్రమంలో ఏర్పాటు చేశాడు. అయితే ఇతడు మూలకాలని ఒక రకమైన స్తంభాకారపు గ్రాఫు
(cylindrical graph) లో చిత్రించాడు. ఈ పట్టికలో కూడా మూలకాలు కొన్ని నిలువు గడులలో
అమరాయి. అతడు తన పరిశోధనలని ప్రచురించగలిగాడు గాని ఆ గ్రాఫుని ప్రచురించలేకపోయాడు.
ఇతడి పరిశోధనని కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
జర్మన్ రసాయన శాస్త్రవేత్త జూలియస్ లోథార్ మెయర్
(1830-1895) మరి కాస్త ముందుకు వెళ్లాడు. మెయర్
నియత బరువులు ఉన్న, వివిధ మూలకాలతో చెయ్యబడ్డ వస్తువులని తీసుకున్నాడు. ఆ వస్తువుల
ఘనపరిమాణాలని కొలిచాడు. ప్రతీ వస్తువులోను ఆ మూలకం యొక్క పరమాణువుల సంఖ్య ఒకేలా ఉండేలా
పరిస్థితులు ఏర్పాటు చేశాడు. వస్తువులన్నిటిలోను పరమాణువుల సంఖ్య ఒక్కటే కనుక, వాటి
ఘనపరిమాణాలలో తేడా వాటిలోని పరమాణువుల ఘనపరిమాణం వల్లనే వస్తోంది. అంటే వస్తువుల ఘనపరిమాణాల
మధ్య నిష్పత్తి వాటిలోని పరమాణువుల ఘనపరిమాణాల మధ్య నిష్పత్తితో సమానం అని వాదించాడు
మెయర్. అలా కొలిచిన రాశికి ‘పరమాణు ఘనపరిమాణం’ (atomic size) అని పేరు పెట్టాడు.
(ఇంకా వుంది)
> ‘సప్తపదుల నియమం’ (Law of Octaves)
సప్త అంటే ఏడు. మరి మీరిచ్చిన తెలుగుపదంలో ఏడు ఉంటే ఆంగ్లనిర్వచనంలో ఆక్టేవ్ అని ఎనిమిదిని చెప్పే మాట ఉంది గమనించారా?
హాయ్ ఉండేది 7 స్వరాలే కాని చివరి స్వరం మరల పునః ప్రారంభం అవుతుంది స -1 రి -2 గ-3 మ-4 ప-5 ద-6 ని-7 స-8 మొత్తం 7 స్వరాలూ చివరి స్వరం మళ్ళి వస్తుంది
సరిగా చెప్పారు!