నాడీ కణాలని
సూక్ష్మదర్శినిలో పరిశీలించినప్పుడు ఇతర కణాలతో రాని ఓ కొత్త సమస్య తలెత్తింది. నాడీ
కణాలలో కణదేహానికి (cell body) ఎప్పుడూ తోకల్లాగా బోలెడు నాడీ తీగలు తగిలించబడి వుంటాయి.
ఇతర ధాతువుల్లో కణాలకి సామాన్యంగా ఇలాంటి ‘తోకలు’ ఉండవు. ఇవి నాడీ కణాల ప్రత్యేక లక్షణం.
ఇతర కణాలలో కణదేహాలు ఏదో అప్పడాల పిండి ముద్దల్లాగా ప్రత్యేకమైన ఆకారం లేకుండా ఉంటాయి.
నాడీ కణాల తీగలని పరిశీలించిన మీదట ఆ కణాలన్నీ ఈ తీగల చేత కలబడి వున్నాయేమో నన్న సందేహం
వచ్చింది. ఈ తీగలు సన్నని నాళాల లాంటివి అని అనుకుంటే ఈ నాళాలు వివిధ నాడీ కణాల కణ
దేహాలని కలుపుతున్నాయేమో ఆలోచన వచ్చింది. కణానికి కణానికి మధ్య ప్రత్యేకమైన సరిహద్దు
వంటిది లేకుండా, కణాల అంతరంగాలన్నీ ఓ అఖిలఘన రాశిగా కలిసిపోయి వున్నప్పుడు అలాంటి ధాతువుని
syncitium (సిన్శీషియమ్) అంటారు. (చిన్న ఉపమానం:
కొన్ని రైళ్లలో కంపార్ట్ మెంట్లని కలుపుతూ ద్వారాలు ఉంటాయి. వాటిని చూస్తే రైలంతే
ఓ పొడవాటి కంపార్ట్ మెంట్ అని పొరబడే అవకాశం వుంది. సిన్శీషియం అంటే ఇలాంటిదే! కాని
కంపార్ట్ మెంట్లని వేరు చేస్తున్నప్పుడు ఆ ద్వారాలని మూసేస్తారు. కంపార్ట్ మెంట్లు
వేరు వేరుగా ఉన్నాయని అప్పుడు గాని అర్థం కాదు).
కాని నాడీ ధాతువు
ఓ సిన్శీషియం లాంటిదని భావించడంలో మొట్టమొదటి నాడీ శాస్త్రవేత్తలు పప్పులో కాలేశారనే
చెప్పాలి. వాళ్లు అలా అనుకోడానికి కారణం ఆ రోజుల్లో సూక్ష్మదర్శినుల శక్తి సామర్థ్యాల్లోని
పరిమితులే. రెండు నాడీకణాల మధ్య అతిసన్నని సంధి వుంటుంది. అది ఎంత సూక్ష్మమైనదంటే ఆ
రోజుల్లో లభ్యమయ్యే సూక్ష్మదర్శినులలో దాన్ని చూడడం సాధ్యం అయ్యేది కాదు. అప్పటి సూక్ష్మదర్శినుల
వల్ల మరో సమస్య కూడా తలెత్తింది. కణంలో అధిక
శాతం నీరే కనుక కణాలు చాలా మటుకు పారదర్శకంగా ఉంటాయి. కనుక సూక్ష్మదర్శినిలో చూసినా
ఈ పారదర్శకత వల్ల కణానికి కణానికి మధ్య ఎడాన్ని గుర్తించడం కష్టం.
ఈ సమస్యని అధిగమించిన
వాడు కామిలో గాల్జీ (Camillo Golgi). కాణానికి “రంగు వేసే” కొత్త పద్ధతిని కనిపెట్టాడు గాల్జీ. అలా రంగు వేసిన కణజాలాన్ని సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు
ఖాళీ నేపథ్యం మీద కణం కొట్టిచ్చినట్టు కనిపించింది. ఈ కొత్త పద్ధతికి ‘గాల్జీ పద్ధతి’
అని పేరొచ్చింది. సూక్ష్మదర్శిని సాంకేతిక చరిత్రలో ఇదో మైలు రాయి అయ్యింది. గాల్జీ
కనిపెట్టిన ఈ కొత్త పద్ధతిని అద్భుతంగా వాడుకున్నాడు రేమాన్ ఇ కాహాల్ (Ramon y
Cajal). మెదడులో వివిధ ప్రాంతాలకి చెందిన నాడీ
ధాతువుని తెచ్చి సూక్ష్మదర్శినిలో చూశాడు కాహాల్. మెదడు వెనుక భాగంలో ఉండే సెరిబెల్లమ్ అనే ఓ భాగం నుండి తీసిన పుర్కిన్యే
కణం (Purkinje cell) అనే ఓ నాడీ కణాన్ని సూక్ష్మదర్శినిలో చూస్తూ కాహాల్ ఈ కింది చిత్రం
వేశాడు. మామూలుగా నాడీ కణాలలో ఉండే తీగల కన్నా ఈ కణానికి తీగలు చాలా పెద్ద సంఖ్యలో
ఉంటాయి. జడల మర్రి లాంటి ఈ కణంలో లక్షకి పైగా నాడీ తీగలు ఉంటాయి.
ఈ విధంగా సూక్ష్మదర్శినితో
చేసిన పరిశోధనల సహాయంతో మెదడు అంటే, నాడీ థాతువు అంటే ఎలాంటి విభాగాలు, విభేదాలు లేని
చలివిడి ముద్ద లాంటిది కాదని, అందులో ప్రత్యేక అంశాలైన నాడి కణాలు ఒకదాంతో ఒకటి సంబంధం
లేకుండా, వేరు వేరుగా ఉన్నాయని ఓ నిర్ణయానికి వచ్చాడు. ఇతర కణాలకి నాడీకణాల మధ్య ముఖ్యమైన
తేడా విరబోసుకున్న కురుల లాంటి నాడీ తీగలు. నాడీ కణాలకి దేనికదే ప్రత్యేక అస్తిత్వం
వున్నా ఈ తీగల ద్వారా అవి ఒక దాన్నొకటి సంపర్కించుకుంటున్నాయని ఊచించాడు కాహాల్. ఒక
దాంతో ఒకటి సంభాషించుకుంటున్నాయని అనుకున్నాడు. (నాడీ కణాల మధ్య అతి సూక్ష్మమైన ఎడం
ఉంటుందని కాహాల్ ఊహించిన మాట నిజమే. కాని అది అతడికి సూక్ష్మదర్శినిలో కనిపించడం వల్ల
కాదు. అప్పటి సూక్ష్మదర్శినులలో అంత చిన్న సందు కనిపించే అవకాశం లేదని ముందే చెప్పుకున్నాం.
ఊహించి చెప్పినా కాహాల్ చెప్పింది నిజమని తరువాత రుజువయ్యింది.) ఆ విధంగా మెదడు అసంఖ్యాకమైన
నాడీ కణాలతో కూర్చబడ్డ అత్యంత సంక్లిష్టమైన జాలం అని ఊహించుకున్నాడు కాహాల్. ఈ భావనకే ‘నూరాన్ సిద్ధాంతం’ (neuron doctrine) అని పేరు. మెదడులో సూక్ష్మస్థాయి పరిజ్ఞానానికి
సంబంధించి ఎన్నో విప్లవాత్మకమైన పరిణామాలు తెచ్చిన రేమాన్ ఇ కాహాల్ 1906 లో నోబెల్ పురస్కారం లభించింది.
నాడీ కణాల మధ్య
నిజంగానే కొంత ఎడం వుందని నిరూపించడానికి మరి కొంత కాలం ఆగాల్సి వచ్చింది. గత శతాబ్దపు
తొలి దశాబ్దంలో రాస్ హారిసన్ అనే నాడీ శాస్త్రవేత్త ఎదుగుతున్న పిండంలో నాడీ మండలం
ఎలా రూపొందుతుందో పరిశోధించాడు. పిండంలో రూపుదిద్దుకుంటున్న మెదడులో తొలిదశలలో నాడి
కణాల తీగలు ఇంకా వాటి లక్ష్యాలని చేరుకుని వుండవు. ప్రతి నాడీ కణం అది సంపర్కించగోరే
మరో నాడీ కణం దిశగా తన తీగలని పొడిగిస్తూ పంపుతుంది.
ఆ కారణం చేత ఒక దశలో రెండు కణాల మధ్య బంధం లేకున్నా, తదనంతరం వాటిని కలుపుతూ తీగలు
ఏర్పడవచ్చు. పిండం యొక్క పురోగతిని క్రమబద్ధంగా, దశలవారీగా సూక్ష్మదర్శినిలో పరిశిలించినప్పుడు
నాడీ కణాల మధ్య తీగలు ఇంకా కలుసుకోని సందర్భాలు ఎన్నో కనిపించాయి. కనుక నాడీ కణాలు
ప్రత్యేకమైన అంశాలు అని, నాడీ తీగల వల్ల ఏర్పడ్డ బంధాలు మధ్యలో వచ్చినవని, మొదటి నుండీ
వున్నవి కావని రూఢి అయ్యింది.
(ఇంకా వుంది)
0 comments