పంచమంలో పర్యటిస్తున్న కొద్ది దాన్ని సృష్టించిన జాతి మీద మా గౌరవం పెరగ సాగింది. ఐదు మిలియన్ సంవత్సరాల పాటు నిక్షేపంలా ఉన్న వాళ్ల సంస్కృతికి చెందిన జ్ఞాపికలని మేం మొట్టమొదటి సారిగా స్పృశిస్తున్నాం. వాళ్లు మరో తారామండలం నుండి వచ్చిన వాళ్లే కావచ్చు. కొండంత కాయం వున్న మహాకాయులే కావచ్చు. కాని వారికి మన మానవజాతికి మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. వాళ్లని కలుసుకునే మహాభాగ్యం, విశ్వవ్యవధుల ప్రమాణాలతో పోల్చితే, తృటిలో తప్పిపోవడం బాధకలిగిస్తుంది.
కాని మామూలుగా పురావస్తు పరిశోధకులు ఎదుర్కునే ఇబ్బందులు మాకు ఎదురు కాకపోవడం ఒక విధంగా మా అదృష్టమే అని చెప్పాలి. ఇంతకాలం అక్కడి శుద్ధ శూన్యంలో ఆ వస్తువులన్నీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. నౌక యొక్క ఉపరిభాగాలలో ఉన్న వస్తువులన్నీ ఆ జాతివాళ్లు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉండేవో అచ్చం అలాగే ఉన్నట్టు ఉన్నాయి. బహుశ వారి స్వగ్రహానికి, స్వగృహానికి గుర్తుగా ఈ వస్తువులన్నీ ఇక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ వహించి, పదిలంగా భద్రపరచుకున్నారేమో. అందుకే అక్కడ ఫోటోలు తీస్తున్నప్పుడు కూడా ఒక పక్క ఏదో అపరాధ భావం మనసులో పీకుతూ ఉండేది. అంతేకాక మా దుడుకు పనులని చూసి ఒళ్లు మండి ఏ లోకోత్తర జీవులో భళ్లున ఆ లోహపు గోడలలోంచి ఊడి పడి మాకు తగిన శాస్తి చేస్తారేమో నని ఒకపక్క భయంగా కూడా ఉండేది.
నాలుగో రోజు మా పంట పండింది. నౌక యొక్క దక్షిణ గోళార్థంలో గాలిస్తున్న కాప్టెన్ వర్ధమాన్, గౌరంగ్ లు ఓ ’కళావస్తు ప్రదర్శనశాల’ ని కనుక్కున్నారు. దాని అసలు పేరేంటో తెలీదు గాని మాకు మాత్రం అది అలాగే అనిపించింది. ఇతర భవనాల లాగానే ఇది కూడా చాలా పెద్దది. లోహంతో చేసినదే అయినా మిగతా భవనాలలాగా కఠినంగా, కర్కశంగా లేదు. ఇదేమైనా ఆలయమా? బార్హస్పతేయులకి ఒక మతం లాంటిది ఉంటే ఎలా ఉంటుందో? అది కళానిలయమో, ఆలయమో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. అందుకే ’కళాలయం’ అన్న పేరే దానికి సార్థకం చేసేశాం!
అలా ఆ భవనాన్ని కలయదిరుగుతూ ఉంటే ఒక చోట ఒక చిన్న వృత్తాకారపు గది కనిపించింది. ఆ గది వద్ద ఆరు వేరు వేరు సొరంగ మార్గాలు కలుస్తున్నట్టుగా ఉంది. గోడల మీద ఏదో లిపి లోతుగా చెక్కబడి ఉంది. నా టార్చిలైటు కాంతిని గోడల మీద ప్రసరిస్తూ అక్షరాలని అనుసరిస్తూ ముందుకి సాగాను. అప్పుడు కనిపించిందది. ఓ నిలువెత్తు శిల్పం. మొట్టమొదటి సారిగా ఓ గొప్ప కళాఖండాన్ని చూసినప్పుడు ఆ దృశ్యం మనసు మీద వేసిన ముద్రని జ్ఞాపకం తెచ్చుకోవడం కష్టం. అదొక అపురూపమైన అనుభవం. బార్హస్పతేయులు ఎలా ఉంటారో మొట్టమొదటి సారిగా ఆ శిల్పాన్ని చూశాకే తెలిసింది. సరీసృపంలా పొడవైన, నాజూకైన శరీరం. దాని లోతైన కళ్లు నా అంతర్యాన్ని తడుముతున్నట్టు ఉన్నాయి. దాని ముఖంలో గాని, శరీరంలో గాని ఎక్కడా మానవాకృతి కనిపించడం లేదు. దాని నాలుగు చేతుల్లో రెండు చేతులు దాని చాతీ మీద ఒకదాన్నొకటి పెనవేసుకుని ఉన్నాయి. మిగతా రెండు చేతుల్లో ఏవో సాధనాలు – ఆయుధాలేమో – ఉన్నాయి. నేను చూస్తున్నది ఏదో అపరిచిత జీవి శిల్పమే కావచ్చు, కాని దాని ముఖకవళికలలో తొంగి చూస్తున్న భావావేశం స్పష్టంగా కనిపిస్తోంది. అందులో ప్రజ్ఞ ఉంది, గొప్ప బలంతో, అధికారంతో వచ్చే గాంభీర్యం, రాజసం ఉంది. కాని ఎందుచేతనో విచారం కూడా స్పురించింది. అంత శ్రమ పడి, అంత సృష్టి చేశాక అదంతా వృధాగా వదిలేయాల్సి వస్తుందని విచారమేమో! అందుకేనేమో, మా ప్రొఫెసర్ ఒక సారి వీళ్ల గురించి “మానవత్వం గల మానవేతరులు” అని వర్ణించారు.
ఆ భవనంలో మొత్తం పది నుండి ఇరవై మిలియన్ల కళా వస్తువులు ప్రదర్శించబడ్డాయి. కాని బార్హస్పతేయుల రూపాన్ని తెలిపే శిల్పం అక్కడ ఒక్కటే ఉండడం ఆశ్చర్యం కలిగించింది. వాళ్ల వ్యక్తిగత రూపాలని శిల్పాలుగా ప్రదర్శించుకోవడం గురించి వాళ్లలో ఏదైనా నీషేధం ఉందా? అంత అధునాతన జాతిలో కూడా అలాంటి నిషేధాలు, నమ్మకాలు ఉంటాయా? ఏమో? ఆ గోడల మీద లిపిని అర్థం చేసుకోగలిగితే రహస్యం విడుతుందేమో....
నా మనసు నిండా కోటి ఆలోచనలు హోరు పెడుతున్నాయి.
కొద్ది నిముషాల తరువాత మా మిత్రులతో కలిసి నౌక వద్దకి బయలుదేరాను. ఆ శిల్పం గురించి మా ప్రొఫెసర్ కి పూస గుచ్చినట్టు చెప్పాలి. ’ద్వారం’ లోంచి అందరం బయటపడ్డాం. లోపల ఇందాక చూసిన కళావస్తుప్రదర్శన శాల మాత్రమే కాదు అసలు ఈ లోకమే ఓ కళాఖండం అనిపించేలా ఉంది బయట దృశ్యం. రగిలే జూపిటర్ ముఖం విరజిమ్మే బంగరు తేజం విశాలంగా విస్తరించిన లోహపు మైదానం మీద లాస్యం చేస్తోంది. అంతులేని రోదసిలో మౌనంగా మెరుస్తున్న తారకల కింద, తడిలేని పసిడి వానలో తడుస్తూ, ఆ ప్రశాంత రజనీ దృశ్యాన్ని కాసేపు ఆస్వాదించాం.
అంతలో ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ శేషు గొంతు రేడియోలో వినిపించింది.
“ఏయ్! అదేంటి ప్రొఫెసర్ నౌక స్థానాన్ని మార్చేశాడా?”
“నౌక స్థానాన్ని మార్చడం ఏవిటి? నాన్సెన్స్. అది ఎక్కడ ఉండేదో అక్కడే ఉంది,” కాస్త విసుగ్గా అన్నాను.
తల తిప్పి చూస్తే శేషు అలా పొరబడడానికి కారణం ఏంటో అర్థమయ్యింది. అల్లంత దూరంలో మరో నౌక కనిపించింది.
మాకు అతిథులొచ్చారు.
(సశేషం)
బాగుంది.