మాల్థస్ భావాలని అర్థం చేసుకున్న డార్విన్ కి జీవపరిణామాన్ని ఒక ప్రత్యేక దిశలో ప్రేరిస్తున్న అదృశ్య శక్తేమిటో అర్థం అయ్యింది. జనాభాని ఎలాగైతే వ్యాధి, మృత్యువు, యుద్ధం మొదలైన శక్తులు అదుపు చేస్తున్నాయో, ఆ శక్తుల ‘సహజ ఎంపిక’ చేత కొంత జనాభా ఏరివేయబడుతోందో, అదే విధంగా జీవపరిణామంలో కూడా పరిమితమైన ప్రకృతి వనరుల కోసం పోటీ పడడం, మారుతున్న పృథ్వీ పరిస్థితులకి తట్టుకోవడం, అనే ‘సహజ ఎంపిక’ వల్ల కొన్ని జీవాలు, జీవజాతులు ఏరివేయబడుతున్నాయి. జీవజాతుల్లో ఆంతరికమైన వైవిధ్యాన్ని కలుగజేసే విధానాలు ఉండడం వల్ల కొత్త కొత్త రూపాంతరాలు పుట్టడం, వాటిలో సహజ ఎంపికలో గెలువగల రూపాలు నిలదొక్కుకోవడం, తక్కినవి మట్టిగలవడం – పరిణామంలో జరుగుతున్నది ఇదే నని గుర్తించాడు డార్విన్.
ఆ విధంగా తక్కిన వారు ‘ప్రతిభతో కూడిన రూపకల్పన’ అనుకున్నది, వైవిధ్యం + సహజ ఎంపిక అనే జంట శక్తులు పాడే యుగళగీతం అని ప్రతిపాదించాడు డార్విన్. ప్రతిభతో కూడిన రూపకల్పనకి ఆధారం ప్రకృతిలో జరిగే యాదృచ్ఛిక ఘటనలు అనడం ఒక విధంగా విడ్డూరంగా అనిపించింది. జీవజాతుల వికాస క్రమంలో కనిపించే ఎన్నో విశేషాలు కేవలం ఈ రెండు శక్తుల లాస్యంగా వివరించడానికి వీలయ్యింది. వీటికి బాహ్యంగా ఏదో అదృశ్య దివ్య హస్తం యొక్క ప్రమేయం అనవసరం అనిపించింది.
ముప్పై ఏళ్ళ వయసుకే, అంటే 1839 కే, డార్విన్ ఇంత ప్రగాఢమైన, విప్లవాత్మక సిద్ధాంతానికి ప్రాణం పోశాడు. అది కేవలం తార్కిక, తాత్విక చింతన కాదు. అసంఖ్యాకమైన ఆధారాల ఆసరాతో నిలబడ్డ బలమైన, బారైన భావసౌధం. సిద్ధాంతాన్నైతే నిర్మించాడు గాని దాన్ని వెంటనే ప్రచురించడానికి వెనకాడాడు. దాన్ని ప్రచురించడానికి మరో ఇరవై ఏళ్లు ఆగాడు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ సిద్ధాంతం బయట పొక్కితే ఎలాంటి దుమారం లేస్తుందో తనకి బాగా తెలుసు. ఈ సిద్ధాంతాన్ని ప్రకటించడం అంటే మతఛాందస వాదులతో తల గోక్కోవడమే అవుతుంది. మతవాదులని వ్యతిరేకించిన శాస్త్రవేత్తలకి గతంలో ఎలాంటి దుర్గతి పట్టిందో తనకి బాగా తెలుసు. విశ్వానికి కేంద్రం భూమి కాదన్న జోర్డానో బ్రూనోని గుంజకి కట్టి బహిరంగంగా సజీవ దహనం చేశారు. బైబిల్ బోధించిన సౌరమండల నిర్మాణాన్ని ప్రశ్నించినందుకు గెలీలియోని గృహనిర్బంధం చేశారు. అయితే అది కొన్ని శతాబ్దాల క్రితం నాటి మాట. అప్పటికి, పందొమ్మిదవ శతాబ్ద కాలానికి, ఈ విషయంలో ఎంతో పురోగతి జరిగింది. మరీ సజీవదహం చెయ్యకపోయినా కటువైన విమర్శ తప్పదని అనిపించింది. సున్నిత స్వభావుడైన డార్విన్ కి ఆ విమర్శని ఎదుర్కోవడానికి మనస్కరించలేదు.
దేవుడితో ప్రమేయం లేకుండా కొన్ని ప్రకృతి ధర్మాల అనుసారం పరిణామం జరిగింది అంటే, తననో నాస్తికుడిగా ముద్రవేసే ప్రమాదం లేకపోలేదు. అందుకు తనకి పూర్తిగా మనసొప్పలేదు. ఎందుకంటే ఒక శాస్త్రవేత్తగా ఒక పక్క కచ్చితమైన ఆధారాలు లేనిదే దేనినీ ఒప్పుకోని నిష్ఠ కలవాడే అయినా, వ్యక్తిగత రంగంలో డార్విన్ దైవాన్ని నమ్మేవాడు. ఒక దశలో పూర్తిగా శాస్త్ర చదువులు వదిలి మత విద్యలో చేరిపోవాలని కూడా నిశ్చయించుకోవడం మనకి తెలుసు. మూల విశ్వాసంలో అస్తికుడైన తనని నాస్తికుడని లోకం ఆడిపోసుకుంటే తను తట్టుకోలేడు.
మతానికి సంబంధించిన కారణాలే కాక కేవలం వైజ్ఞానిక పరంగా కూడా డార్విన్ తన సిద్ధాంతాన్ని ప్రచురించడంలో ఆలస్యం చెయ్యడానికి కారణాలు ఉన్నాయి. తన సిద్ధాంతానికి ఎన్నో ఆధారాలు ఉన్నా అత్యున్నత వైజ్ఞానిక ప్రమాణాల దృష్ట్యా అవి సరిపోవని డార్విన్ గుర్తించాడు. కేవలం శాస్త్రపరంగా చూసినా తన సిద్ధాంతాన్ని ఎన్నో విధాలుగా విమర్శించొచ్చు.
ఉదాహరణకి జీవజాతుల్లో అనుకోని వివిధ్యం అవసరమని తన సిద్ధాంతం కోరుతుంది. ఆ వైవిధ్యం ఎలా కలుగుతోంది? దాన్ని కలుగజేసే ప్రకృతిగత విధానాలు ఏమిటి? ఎలాంటి ప్రశ్నలకి సమాధానాలు శోధిస్తూ మరిన్ని ఆధారాలు సేకరిస్తూ పోయాడు. 1851, 1854 లలో తను సేకరించిన ఆధారాలని మాత్రం, పూర్తి సిద్ధాంతన్ని ఎక్కడా ప్రస్తావించకుండా, కొన్ని చిన్న పుస్తకాలుగా ప్రచురించాడు. తను తలపెట్టిన మహాసిద్ధాంత నిర్మాణం గురించి అప్పటికే తన స్నేహితులకి కొందరికి తెలుసు. మరీ ఆలస్యం చెయ్యకుండా చప్పున తన సిద్ధాంతాన్ని ప్రచురించమని శ్రేయోభిలాషులు ప్రోత్సహించారు. “మరీ ఆలస్యం చేస్తే ఇదే విషయాన్ని మరి ఇంకెవరైనా ప్రచురించేస్తారు చూసుకో,” అని తమ్ముడు ఎరాస్మస్ మందలించాడు.
1856 లో తన భావాలన్నిటినీ కొన్ని అధ్యాయాలుగా కూర్చుతూ ఓ పుస్తక రూపం ఇవ్వడానికి ఉపక్రమించాడు. ఆ పుస్తకానికి ‘సహజ ఎంపిక’ అని పేరు కూడా సహజంగా ఎంపిక చేసుకున్నాడు. అలా మొదలైన గ్రంథ రచనా కార్యక్రమం ఓ ఏడాది పైగా సాగింది. 1857 లో విపరీతమైన శ్రమ వల్ల ఆరోగ్యం బాగా దెబ్బ తింది. పని నుండి పక్కకి తప్పుకుని కొంత కాలం విశ్రాంతి తీసుకోక తప్పలేదు.
ఇలా ఉండగా ఓ హఠాత్ సంఘటన జరిగింది. 1858 లో జూన్ నెలలో డార్విన్ కి ఓ ఉత్తరం వచ్చింది. దాన్ని రాసిన వాడు ‘ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్’ అనే ఓ కుర్ర ప్రకృతిశాస్త్రవేత్త. ఇతగాడు ఎన్నో ఏళ్ళుగా మలయ్ దీవుల మీద సంచరిస్తూ ఓ సొంత పరిణామ సిద్ధాంతం కోసం సమాచారం సేకరిస్తున్నాడు. తన పరిశోధనలని క్లుప్తంగా వివరిస్తూ డార్విన్ కి లేఖ రాశాడు. అది చదివిన డార్విన్ నిర్ఘాంతపోయాడు. అన్నీ అచ్చం తన భావాలే! పదాల ఎంపికలో కూడా ఎంతో పోలిక ఉంది. డార్విన్ నీరుగారిపోయాడు. ఇక తన రచనలని ప్రచురించడం వృధా అనుకున్నాడు. ఇప్పుడు ప్రచురిస్తే మరో కొత్త దుమారం లేస్తుంది. చివరికి స్నేహితుల, తోటి శాస్త్రవేత్తల ప్రోత్సాహం మీద డార్విన్, వాలస్ లు ఇద్దరూ కలిసి జులై 1, 1858, నాడు ఓ వ్యాసం ప్రచురించారు. ఆధునిక పరిణామ సిద్ధాంతపు సంగ్రహ రూపం ఆ వ్యాసంలో మొట్టమొదటి సారిగా ప్రకటించబడింది. తదనంతరం డార్విన్ తన భావజాలాన్ని సమీకరిస్తూ ‘జీవజాతుల ఆవిర్భావం’ (The Origin of Species) అనే పేరుతో ఓ పుస్తకాన్ని ప్రచురించాడు. పరిణామ సిద్ధాంతం మీదనే కాక, అసలు మొత్తం జీవశాస్త్రంలోనే ఆ పుస్తకం శిరోధార్యం అని చెప్పుకోవచ్చు.
డార్విన్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతానికి ఎన్నో విమర్శలు వచ్చాయి. కొన్ని కేవలం ఓర్వలేని తనం వల్ల వచ్చినవి. వాటిని డార్విన్ పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని శాస్త్రీయ అభ్యంతరాలకి తన వద్ద సమాధానం లేకపోయింది. కొన్ని సందర్భాలలో ఆ తరువాత జరిగిన శాస్త్ర పురోగతి వల్ల ఆ అభ్యంతరాలు తప్పని తేలింది. డార్విన్ తరువాత ఆ దిశలో పరిశోధించిన ‘నియో డార్విన్’ వాదులు, మరింత సమాచారాన్ని సేకరించి, మూల సిద్ధాంతాన్ని తగురీతుల్లో సవరిస్తూ వచ్చారు. ఇక ఆధునిక జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ మొదమైన రంగాల రంగప్రవేశంతో పరిణామానికి పరమాణు పరమైన ఆధారాలు ఏమిటో అర్థం కాసాగాయి. ఆధునిక జీవశాస్త్రంలో పరిణామ సిద్ధాంతం కేవలం ఓ ప్రత్యేక సిద్ధాంతం కాదు. ఆధునిక జీవశాస్త్రానికి వెన్నెముక లాంటిది పరిణామ సిద్ధాంతం. పరిణామాత్మక దృక్పథంతో చూడకపోతే జీవశాస్త్రంలో ఏదీ సరిగ్గా అర్థం కాదు అంటాడు డోబ్ జాన్స్కీ అనే జీవశాస్త్రవేత్త. అలాంటి అపురూపమైన సిద్ధాంతానికి ఊపిరి పోసిన చార్లెస్ డార్విన్ వైజ్ఞానిక చరిత్రలో చిరస్మరణీయుడు.
(సమాప్తం)
(సమాప్తం)
References:
J. Miller, B. van Loon, Introducing Darwin, Icon Books, UK.
J. Miller, B. van Loon, Introducing Darwin, Icon Books, UK.
Super sir, Thank you very much for this real story.