వాస్కో ద గామా తన సిబ్బందితోపాటు అక్కణ్ణుంచి పలాయనం చిత్తగించాడు.నౌకాదళం ఇంకా ముందుకి సాగిపోయింది. వాతావరణంలో క్రమంగా మార్పులు రాసాగాయి. సముద్రంలో కూడా పోటు ఎక్కువగా ఉంది. ఉవ్వెత్తున కెరటాలు లేచి ఓడలని ఎత్తి పడేస్తున్నాయి. గతంలో దియాజ్ దళం కూడా సరిగ్గా ఇక్కడి నుండే వెనక్కి వెళ్లిపోయారని వాస్కో సిబ్బంది అర్థం చేసుకున్నారు. డిసెంబర్ 16వ తారీఖుకల్లా దియాజ్ బృందం పాతిన ఆఖరు ‘పద్రావ్’ని దాటారు. క్రిస్మస్ రోజుకల్లా దియాజ్ బృందం ఎక్కడి నుండి వెనక్కు తిరిగారో ఆ స్థలాన్ని దాటి 200 మైళ్లు ముందుకి వచ్చేశారు. ఆ తీర ప్రాంతాన్ని ప్రస్తుతం ‘నాటల్’ అంటారు. పోర్చుగీస్‌లో ఆ పదానికి క్రిస్మస్ అని అర్థం.ఇక్కడితో తెలిసిన దారి పూర్తయ్యింది. ఇక ముందున్నది అంతా తెలీని దారే.
నాటల్ ప్రాంతాన్ని దాటి మరో ఎనిమిది రోజులు ప్రయాణించింది వాస్కో ద గామా నౌకా దళం. ఓడలలో మంచినీరు అడుగంటుతోంది. వంటవాళ్ళు వంటలో కూడా సముద్రపు నీరే వాడుతున్నారు. మళ్లీ తీరం మీదకి వెళ్లి మంచినీటి వేట మొదలెట్టాలి. జనవరి 25 నాడు ఓ నదీముఖం కనిపించింది. ఓడలు లంగరు వేసి తీరం మీద ఉన్న ఓ గూడెం వద్ద వాకబు చెయ్యగా ఆ నది పేరు కెలీమానె అని తెలిసింది. ఆ గూడెం నాయకులు ఇద్దరు వాస్కోని కలుసుకున్నారు. ఎప్పట్లాగే వాళ్లకి వాస్కో కొన్ని చవకబారు బహుమతులు ఇచ్చాడు. వాళ్లకి అవి అంతగా నచ్చలేదు. అంతలో వాళ్లు పెట్టుకున్న అందమైన పట్టు టోపీ వాస్కో దృష్టిని ఆకర్షించింది. అదెక్కడిది అని అడిగాడు. పోర్చుగీస్ వారిలాగానే పెద్ద పెద్ద ఓడలతో తూర్పు నుండి కొందరు వస్తుంటారని, ఇవి వాళ్లు తెచ్చిన టోపీలని వాళ్లు సంజ్ఞలు చేసి చెప్పారు. ఇండియాకి దగ్గరపడుతున్నామని వాస్కోకి అర్థమయ్యింది.
ఆ ప్రాంతంలోనే ఓడలు 32 రోజులు ఆగిపోవలసి వచ్చింది. సావో రఫాయెల్ ఓడలో తెరచాప కట్టిన గుంజ తుఫాను ధాటికి విరిగిపోయింది. దాన్ని మరమ్మత్తు కోసం అగారు. కాని అదే సమయంలో సౌకా సిబ్బంది ‘స్కర్వీ’ వ్యాధి వాత పడ్డారు. ఆ రోజుల్లో సముద్రాల మీద సుదీర్ఘ యాత్రలు చేసే నావికులు ఈ స్కర్వీ వ్యాధితో తరచు బాధపడుతుండేవారు. ఆ వ్యాధి సోకినవారికి చిగుళ్లలో నల్లని రక్తం చేరి చాలా బాధిస్తాయి. వ్యాధి ముదిరితే చేతులు, కాళ్లు వాచి కదలడం కూడా కష్టం అవుతుంది. ఆహారంలో వైటమిన్ సి లోపం వల్ల ఈ వ్యాధి వస్తుందని మనకి ఇప్పుడు తెలుసు. వైటమిన్ సి నారింజ, నిమ్మ మొదలైన పళ్లలో ఉంటుంది. ఓడలలో ఎక్కువ కాలం నిలువ ఉండే ఆహారం ఉండేది. పళ్లు తక్కువగా ఉండేవి. కాని ఆ రోజుల్లో వైటమిన్ సి గురించి తెలీకపోయినా, కొన్ని రకాల పళ్లు తింటే వ్యాధి తగ్గిపోతుందని తెలుసు. కనుక తీరం మీదే ఉండే తగిన ఫలహారం తీసుకుంటూ నావికులు తిరిగి ఆరోగ్యవంతులు అయ్యారు.
ఫిబ్రవరి 24 నాడు మళ్లీ యాత్ర మొదలయ్యింది. ఉత్తర-తూర్పు దిశలో ఓడలు ముందుకి సాగిపోయాయి. మార్చి 2 నాడు ఆఫ్రికా తూర్పు తీరం మీద ఉన్న మొజాంబిక్ దేశంలోని మొసాంబిక్ రేవుని చేరుకున్నాయి. ఆ రోజుల్లో మొసాంబిక్ రేవు ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఓ ముఖ్యమైన రేవు. ఇండియా, చైనా, అరేబియా, మలయా మొదలుకొని ఎన్నోదేశాల ఓడలు అక్కడికి వస్తుంటాయి.
(image credits: http://www.christies.com/lotfinder/lot_details.aspx?intObjectID=5234156)
కొలంబస్, వాస్కో ద గామాలాంటి వ్యాసాలను పిడిఎఫ్ లుగా మార్చితే అందరికి చదువు కోవడానికి బాగుంటుంది. దయచేసి అలోచించండి.
వాస్కో ద గామా పూర్తి అయ్యాకే పిడిఎఫ్ చెయ్యండి.
తప్పకుండా చేస్తాను. కాని కొంచెం టైమ్ కావాలి...
పత్రిక వాళ్ళు తొందర చెయ్యడం వల్ల కొలంబస్ కథ కత్తిరించవలాసి వచ్చింది. లేకపోతే మరింత వివరంగా రాసి ఉండొచ్చు. పి.డి.ఎఫ్. చేసే ముందు అలా పొడిగించాలని ఉద్దేశం.
వాస్కో ద గామా విషయంలో అయితే మరీ తగ్గించి రాయడం జరుగుతోంది.
chaala bagundi..chandamama kathalaa