శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

తెలుగులో సైన్స్ ఫిక్షన్

Posted by V Srinivasa Chakravarthy Saturday, March 24, 2012 3 comments


స్నెఫెల్ పర్వతం యొక్క అగ్నిబిలం (crater) ఓ తిరగేసిన శంకువు ఆకారంలో ఉంటుంది. దాని నోటి వ్యాసం ఓ అర లీగు ఉంటుందేమో. లోతు రెండు వేల అడుగులు ఉండొచ్చు. అంత పెద్ద బిలం లోంచి సలసల మరుగుతున్న లావా ఉవ్వెత్తున ఎగజిమ్ముతుంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. బిలం సన్నబడి గల్లా మెడలా మారే చోట దాని చుట్టుకొలత 250 అడుగులు ఉంటుందేమో. బిలంలో నేల వాలు అంత ఎక్కువ కాకపోవడం చేత ఆ ‘మెడ’ వరకు సులభంగానే చేరుకోడానికి వీలయ్యింది. ఉన్నట్లుండి ఎందుకో ఆ బిలం అంతా ఓ పెద్ద పొత్రం లాగా కనిపించింది. అసలు ఆ ఆలోచనకే వెన్ను లోంచి వణుకు మొదలయ్యింది.


https://apetcher.wordpress.com/tag/volcano/
“ఎగేసుకుని ఆ పొత్రంలోకి దూరడం కన్నా వెర్రితనం మరొకటి కనిపించడం లేదు. కొంపదీసి పొత్రం లోపల గాని మందుపాతర ఉంటే అందరం ఆ లోతుల్లోంచి తూటాల్లా గాల్లోకి విసిరేయబడతాం.” భయంకరమైన ఆలోచనలు మెదణ్ణి దొలిచేస్తున్నాయి.




కాని ఎలాగో ధైర్యం చేసుకుని నిబ్బరంగా ముందు నడుస్తున్న హన్స్ వెనకే నోరు మూసుకుని నడక సాగించాను.

అవరోహణా సౌలభ్యం కోసమని కాబోలు హన్స్ సర్పిలాకారపు బాటలో లోపలికి దిగుతున్నాడు. దారి పొడవునా అగ్నిపర్వత శిలలు పడి వున్నాయి. కొన్ని రాళ్లు ముందే వదులుగా ఉన్నాయోమే మా పాదాలు తగిలి కిందకి జారి కింద బిలం లోతుల్లో పడి కనుమరుగు అవుతున్నాయి. అవి దొర్లుకుంటూ కింద పడుతుంటే ఆ చప్పుడు బిలంలో నలుదిశలా మారుమ్రోగుతోంది.

మేం నడుస్తున్న దారిలో కొన్ని చోట్ల మంచు పొరలు ఎదురయ్యాయి. అలాంటి ప్రదేశాలలో హన్స్ ఆచితూచి అడుగు వెయ్యసాగాడు. ఇనుప కొస ఉన్న కట్టెతో మంచులో గుచ్చి పరీక్షిస్తూ, అడుగున ఏవైనా గోతులు ఉన్నాయేమో పరిశీలిస్తూ, నెమ్మదిగా ముందుకు నడవసాగాడు. దారి బాగా దుర్గమంగా ఉన్న ప్రదేశాల్లో అందరం ఒకే త్రాడు పట్టుకుని నడిచాం. ఈ ఏర్పాటు వల్ల ప్రమాదం పూర్తిగా నివారించబడకపోయినా, మరింత సురక్షితంగా అనిపించింది అని మాత్రం చెప్పగలను.

ఆ విధంగా ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, మా గైడుకి కూడా తెలీని అజ్ఞాత దారుల వెంట నడుస్తూ, మధ్యాహ్నాని కల్లా నెమ్మదిగా బిలం యొక్క మెడ ప్రదేశానికి చేరుకున్నాం. తల పైకెత్తి చూస్తే అగ్నిబిలం యొక్క నోరు ఓ పెద్ద చక్రంలా కనిపించింది. ఆ చక్రం మధ్యలో కాస్తంత గగనం చిక్కుకున్నట్టు చిత్రంగా కనిపించింది. బిలం యొక్క అంచుకి ఒక పక్కగా అల్లంత దూరంలో ‘సారిస్’ పర్వతపు హిమ శిఖరం కనిపిస్తోంది.

అగ్నిబిలం అడుగున మూడు పొగగొట్టాలు ఉన్నాయి. అగ్నిపర్వతం విస్ఫోటం జరిగినప్పుడు పర్వత గర్భంలో ఉండే కొలిమి లోంచి అగ్ని, లావా పైకి తన్నుకు వచ్చేది ఈ పొగగొట్టాల లోంచే. ఒక్కొక్క పొగగొట్టం నూరు అడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. వాటి లోంచి తొంగి చూడడానికి నాకైతే ధైర్యం చాలలేదు. కాని ప్రొఫెసర్ మామయ్య మాత్రం హడావుడిగా వెళ్లి మూడింటినీ సర్వే చేసేశాడు. ఆ పొగగొట్టాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, చేతులు చిత్రంగా ఊపేస్తూ, ఎవరికీ అర్థం కాకుండా ఏదో సణుగుతూ భలే ఆర్భాటం చేశాడు. హన్స్, అతడి అనుచరులు మామయ్య కేసి గుడ్లప్పగించి చూశారు. ఈయన ఏమైనా పిచ్చాసుపత్రి నుండి తప్పించుకువచ్చిన బాపతా అని వాళ్లకి సందేహం వచ్చినట్టు వాళ్ళ మొహాల్లో చూచాయగా తెలుస్తోంది.

ఉన్నట్లుండి మామయ్య గట్టిగా రంకె వేశాడు. ఏ కన్నంలోనో కాలు ఇరుక్కుపోయిందేమో నని భయపడి వెంటనే అటు చూశాను. కాని అలాంటిదేం జరిగినట్టు కనిపించలేదు. ఆయనకి గాని, ఆయన కాలికి గాని ఏం ప్రమాదం లేదు. ఓ పెద్ద కంకర శిలకి ముందు చేతులు చాచి, కాళ్లు పంగజాపి నిటారుగా నించున్నాడు. కాసేపు స్థాణువులా నిలబడ్డ మనిషి కాస్తా అంతలో ఏదో పూనకం వచ్చినట్టు,




“ఏక్సెల్! ఏక్సెల్” అని కేకలేశాడు.




నేను ఆయన కేసి పరుగెత్తాను. హన్స్ గాని, ఆయన అనుచరులు గాని ఉన్నచోటి నుండి కదల్లేదు.
“ఇదుగో చూడు,” అంటూ ఆ శిల కేసి చూపించాడు.




(ఇంకా వుంది)





గోళం యొక్క ఘనపరిమాణానికి సూత్రం 4/3 pi r^3 అని చిన్నప్పుడు బళ్లో నేర్పుతారు. కాల్క్యులస్ విధానాలని ఉపయోగించి ఈ సూత్రాన్ని ఎలా సాధించొచ్చో ఇంటర్మీడియట్ లో తెలుసుకుంటాం. అయితే కాల్క్యులస్ అవసరం లేకుండా గోళం యొక్క ఘనపరిమాణాన్ని సాధించే ఓ అద్భుతమైన పద్ధతి కనిపెట్టాడు ఆర్కిమిడీస్. ఆ విధానం ఇలా ఉంటుంది.


ఈ పద్ధతిలో ముందు రెండు వస్తువుల యొక్క ఘనపరిమాణాన్కి సూత్రం తెలియాలి – స్తంభం (cylinder), మరియు శంకువు (cone).
r వ్యాసార్థం, h పొడవు ఉన్న స్తంభం యొక్క ఘనపరిమాణం = p r2 h (pi r^2 h)
ఆధారం యొక్క వ్యాసార్థం r, ఎత్తు h అయిన శంకువు యొక్క ఘనపరిమాణం = 1/3 p r2 h (1/3 pi r^2 h)

ఇప్పుడొక చిన్న కసరత్తు చేద్దాం. r వ్యాసార్థం గల ఒక అర్థగోళాన్ని తీసుకుందాం. అలాగే ఆధారం యొక్క వాసార్థం r, ఎత్తు కూడా r గల ఓ శంకువు ని తీసుకుందాం. ఈ అర్థగోళాన్ని, శంకువుని పక్కపక్కన ఇలా ఉంచుదాం.


ఇప్పుడు h ఎత్తులో రెండు వస్తువులని పరిచ్ఛేదిస్తే, ఆ పరిచ్ఛేదం యొక్క వైశాల్యం ఎంతవుతుందో చూద్దాం. రెండు వస్తువులకి నిలువు అక్షం మీదుగా సౌష్ఠవం (symmetry) ఉంది గనుక, పరిచ్ఛేదాలు రెండూ వృత్తాలే అవుతాయి.


అర్థగోళంలో పరిచ్ఛేదం యొక్క వాసార్థం = sqrt (r^2 – h^2)
కనుక దాని వైశాల్యం = pi (r^2 – h^2) (1)
శంకువు ఆధారం యొక్క వ్యాసార్థం, దాని ఎత్తుతో సమానం కనుక, h ఎత్తులో చేసిన పరిచ్ఛేదం యొక్క వ్యాసార్థం కూడా r అవుతుంది. కనుక,
శంకువు లోని పరిచ్ఛేదం వైశాల్యం = pi (h^2) (2)
ఈ రెండు పరిచ్ఛేదాల వైశాల్యాలని కలిపితే వచ్చేది,

pi (r^2 – h^2) + pi ( h^2) = pi r^2
అంటే ఏ ఎత్తులో కోసినా ఆ రెండు పరిచ్చేదాల మొత్తం = pi r^2 కావడం కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది.
ప్రతీ ఎత్తులోను పరిచ్ఛేదం pi r^2 అయ్యే ఒక వస్తువు ఉంది. అది r వ్యాసార్థం కలిగి నిలువుగా ఉన్న స్తంభం.


అంటే ప్రతీ ఎత్తులోను,
అర్థగోళం యొక్క పరిచ్చేదం వైశాల్యం + శంకువు యొక్క పరిచ్ఛేదం వైశాల్యం = స్తంభం పరిచ్ఛేదం యొక్క వైశాల్యం
ప్రతీ పరిచ్చేదాన్ని, సన్నని మందం ఉన్న పొరలాగా ఊహించుకుంటే, దీన్ని బట్టి మనకి మరో సత్యం అర్థమవుతుంది,

r వ్యాసార్థం గల అర్థగోళం యొక్క ఘనపరిమాణం + r వ్యాసార్థం, r ఎత్తు గల శంకువు యొక్క ఘనపరిమాణం = r వ్యాసార్థం, r ఎత్తు గల స్తంభం యొక్క ఘనపరిమాణం

==> r వ్యాసార్థం గల అర్థగోళం యొక్క ఘనపరిమాణం + 1/3 pi r^3 = pi r^3

==> r వ్యాసార్థం గల అర్థగోళం యొక్క ఘనపరిమాణం = 2/3 pi r^3
==> r వ్యాసార్థం గల పూర్ణగోళం యొక్క ఘనపరిమాణం = 2X 2/3 pi r^3 = 4/3 pi r^3

ఈ విధంగా ఆర్కిమిడీస్ గోళం యొక్క ఘనపరిమాణానికి సూత్రం కనుక్కుంటాడు.



డాగ్రాంట్, మరియు డా కోల్డ్ స్ట్రీం లు సాగర జీవ శాస్త్రంలో ఎనలేని కృషి చేశారు. ముఖ్యంగా డా గ్రాంట్ చుట్టుపక్కల చెరువుల నుండి జంతు సేకరణ కార్యక్రమాలకి వెళ్లినప్పుడు నేను కూడా పాల్గొనే వాణ్ణి. అలా సేకరించిన జంతువులలో ఎన్నింటినో పరిచ్ఛేదాలు కూడా చేసాను. ఈ ప్రయాణాలలో న్యూ హావెన్ కి చెందిన జాలర్లు కూడా పరిచయం అయ్యారు. ఆలుచిప్పల అన్వేషణలో వాళ్లతో బాటు నేను కూడా ఎన్నో సార్లు వెళ్లాను. ఎన్నో చక్కని నమూనాలని సేకరించాను కూడా. పరిచ్ఛేదాలలో పెద్దగా అభ్యాసం లేకపోవడం చేత, నా వద్ద ఉన్నది ఓ పనికిమాలిన సూక్ష్మదర్శిని కావడం చేత, నా ప్రయత్నాలు విజయవంతం కాలేదు. అయినా కూడా ఆ దశలో ఓ ఆసక్తికరమైన ఆవిష్కరణ చేసి, 1826 లో ఆ ఆవిష్కరణని వివరిస్తూ ప్లైనియన్ సమాజం ముందు ఓ పరిశోధనా పత్రం కూడా చదివాను. ఫ్లస్ట్రాకి (Flustra) చెందిన అండకణాలు (ova) సీలియాల సహాయంతో స్వతంత్రంగా కదలగలవని, అవి నిజానికి ‘లార్వే’లే నని ఆ పత్రంలోని సారాంశం. తరువాత మరో పత్రం కూడా చదివాను. ఫూకస్ లోరియస్ పురుగులు శైశవ దశలో చిన్న చిన్న బంతుల్లా ఉంటాయి. ఈ బంతిలాంటి వస్తువులు నిజానికి పోంటోడెల్లా మ్యూరికాటా అనే పురుగు యొక్క అండాశయాలని (egg-cases) అని ఈ రెండో పత్రంలోని తాత్పర్యం.


ఈ ప్లైనియన్ సమాజాన్ని స్థాపించి పోషించింది ప్రొఫెసర్ జేంసన్ అని విన్నాను. దీని సభ్యులలో ఎక్కువగా విద్యార్థులే ఉండేవారు. వీళ్లంతా ప్రకృతి విజ్ఞానం మీద పత్రాలు చదువుకోడానికి, వాటిని చర్చించుకోడానికి విశ్వవిద్యాలయంలో ఓ నేలమాళిగ గదిలో సమావేశం అవుతూ ఉండేవారు. ఈ సమావేశాలని నేను క్రమం తప్పకుండా హాజరు అవుతూ ఉండేవాణ్ణి. వీటి వల్ల ప్రకృతి విజ్ఞానం మీద నా ఆసక్తి మరింత బలపడింది. ఈ ఉత్సాహంలో పాలు పంచుకునే పలువురు స్నేహితులు కూడా ఏర్పడ్డారు.

ఒక రోజు సాయంత్రం ఓ సమావేశంలో పాపం ఓ కుర్రాడు మాట్లాడటానికి లేచి నించున్నాడు.
ఆ మనిషికి ముచ్చెమటలు పోస్తున్నాయి, పెదాలు తడారిపోతున్నాయి. కంఠం వణుకుతోంది. చివరికి ఎలాగో ధైర్యం తెచ్చుకుని, "అధ్యక్షా! ఇంతకీ నేను చెప్పదలచుకున్నది ఏంటో మర్చిపోయాను," అన్నాడు. కుర్రాడు పాపం భలే బెంబేలు పడ్డాడు. ఆ సంఘటనకి సభ్యులంతా అవాక్కయ్యారు. ఏం మాట్లాడాలో తెలీక అంతా మౌనంగా ఉండిపోయారు. మా చిన్నారి సమాజంలో మేం చదివిన పత్రాలు ఎక్కడా అచ్చయ్యేవి కావు. కనుక నేను చదివిన పత్రాలు అచ్చులో చూసుకోవాలని సరదా నాకు తీరనేలేదు. అయితే డా గ్రాంట్ ఫ్లస్ట్రా మీద రాసిన గ్రంథంలో నా బుల్లి ఆవిష్కరణ గురించి ప్రస్తావించారని విన్నాను.

రాయల్ వైద్య సమాజంలో కూడా నేను సభ్యుడిగా ఉండేవాణ్ణి. ఆ సమావేశాలని కూడా క్రమం తప్పకుండా హాజరు అవుతూ వచ్చాను. అయితే అక్కడ చర్చాంశాలు మరీ ఎక్కువగా వైద్య రంగానికి సంబంధించినవి కావడంతో మెల్లగా వాటి మీద నా ఉత్సాహం తగ్గింది. పైగా ఆ సమావేశాలలో బోలెడంత చెత్త మాట్లాడుతూ ఉండేవారు. అయితే కొందరు మంచి వక్తలు కూడా ఉండేవారు. నన్నడిగితే వాళ్లందరిలోకి శ్రేష్ఠుడు సర్ జే. కే-షటిల్వవర్త్. డా గ్రాంట్ నన్ను అప్పుడప్పుడు వెర్నెరియన్ సమాజపు సమావేశాలకి కూడా తీసుకు వెళ్లేవారు. ఇక్కడ జీవ చరిత్ర గురించిన పత్రాలు చదివి, చర్చించేవారు. ఆ పత్రాలని తరువాత "ట్రాన్సాక్షన్స్" లో ప్రచురితం అయ్యేవి. ఆ సమావేశాలలోనే ఉత్తర అమెరికా కి చెందిన పక్షుల అలవాట్ల గురించి ఆడుబాన్ మంచి ఆసక్తికరమైన ఉపన్యాసాలు ఇవ్వగా విన్నాను. అయితే ఆ ఉపన్యాసాలలో అతగాడు వాటర్టన్ యొక్క పరిశోధనలని అన్యాయంగా విమర్శించడం కూడా విన్నాను. మరో విషయం ఏంటంటే ఎడినబర్గ్ లో నాకు తెలిసిన ఓ నల్లవాడు ఉండేవాడు. ఈ పెద్ద మనిషి వాటర్టన్ తో బాటు తన యాత్రలలో కూడా వెళ్లేవాడు. చచ్చిన పక్షులని పూరించి, బొమ్మలు చేసి పొట్టపోసుకునేవాడు. ఆ బొమ్మలు మాత్రం అద్భుతంగా ఉండేవి. కొద్ది పాటి ఫీసు పుచ్చుకుని ఆ కళలన్నీ నాక్కూడా నేర్పించేవాడు. ఇతనితో ఎన్నో సార్లు కూర్చుని కాలక్షేపం చేసేవాణ్ణి. చాలా మంచి వాడు, తెలివైన వాడు.

లియొయార్డ్ హార్నర్ ఒకసారి నన్ను ఎడింబర్గ్ లో రాయల సొసయిటీ సమావేశానికి నన్ను తీసుకెళ్లాడు. ఆ రోజు సభకి అధ్యక్షుడిగా సర్ వాల్టర్ స్కాట్ ఆ పదవిని స్వీకరిస్తూ అంత ప్రముఖ స్థానానికి తాను తగను అంటూ మాట్లాడాడు. ఆయన్ని, ఆ దృశ్యాన్ని సంభ్రమాశ్చర్యాలతో చుస్తూ ఉండిపోయాను. యవ్వన దశలో ఇలా ఈ సమాజానికి, అలాగే రాయల్ వైద్య సమాజానికి హాజరు కావడం వల్ల, ఎన్నో ఏళ్ల తరువాత ఈ రెండు సమాజాలకి గౌరవ సభ్యుడిగా ఎన్నిక కావడం, నేను పొందిన మరే ఇతర గౌరవం కన్నా కూడా మిన్నగా భావిస్తాను. ఆ రోజు అలాంటి గౌరవం నాకు నా జీవితంలో ఎప్పుడో లభిస్తుందని ఎవరైనా చెప్తే ససేమిరా నమ్మేవాణ్ణి కాను. నేను ఇంగ్లాండ్ కి రాజు నవుతానని అనడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఇదే అంతే.

(ఇంకా వుంది)

వైద్య చదువులో డార్విన్

Posted by V Srinivasa Chakravarthy Monday, March 12, 2012 0 comments

ఎడింబర్గ్ లో బోధన అంతా ఉపన్యాసాల మీదుగానే జరిగేది. ఒక్క ప్రొఫెసర్ హోప్ రసాయన శాస్త్రంలో చేప్పే ఉపన్యాసాలు తప్ప తక్కిన వాళ్ల ఉపన్యాసాలు మహా బోరుగా ఉండేవి. స్వాధ్యాయంతో పోల్చితే ఉపన్యాసాల వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ అని నా అభిప్రాయం. చలికాలంలో ఉదయం ఎనిమిది గంటలకి "ఔషధ గుణ బోధిని" (మెటీరియా మెడికా) మీద డాక్టర్ డంకన్ ఇచ్చే ఉపన్యాసాలని తలచుకుంటేనే భయం వేస్తుంది. అలాగే డాక్టర్ --- దేహనిర్మాణ శాస్త్రం మీద ఇచ్చే ఉపన్యాసాలు ఆయన లాగే కళావిహీనంగా ఉండేవి. ఆ విధంగా శవ పరిచ్ఛేదాల పట్ల జుగుప్స బలపడటం నా జీవితంలో ఒక గొప్ప దురదృష్టం అని భావిస్తాను. కాని ఎలాగో ఆ జుగుప్సని దిగమింగుకుని పరిచ్ఛేదాల పట్ల శ్రద్ధ చూబించి ఉంటే బావుండేది. ఆ కౌశలం భవిష్యత్తులో నా పరిశోధనలలో ఎంతో ఉపకరించేది. దీనికి తోడు నాలో బొమ్మలు వేసే సామర్థ్యం కూడా కొంచెం బలహీనంగానే ఉండేది. ఆసుపత్రిలో కూడా క్లినికల్ వార్డులలో క్రమం తప్పకుండా హాజరు అవుతూ ఉండేవాణ్ణి. అక్కడ కొన్ని కొన్ని కేసులు నన్ను చాలా కదిలించేవి. కొన్ని అయితే ఇప్పటికీ స్పష్టంగా గుర్తున్నాయి. కేసులు నచ్చలేదని హాజరు కావడంలో మాత్రం క్రమం తప్పలేదు. వైద్య రంగంలో ఈ అంశం మీద నాకు మరింత బలమైన ఆసక్తి ఎందుకు కలగలేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు.

కేంబ్రిడ్జ్ నుండి బయట పడటానికి ముందు, ఒక వేసవిలో ష్రూస్ బరీకి చెందిన పేద రోగులకి, ముఖ్యంగా స్త్రీలకి, పిల్లలకి, చికిత్స చేయటం మొదలెట్టాను. నేను చూసిన కేసులు, రోగ లక్షణాలు అన్నీ వివరంగా రాసి, మా నాన్నగారికి చదివి వినిపించేవాణ్ణి. అది విని ఆయన కొన్ని మర్పులు చేర్పులు సూచించేవారు. ఏం చికిత్స చెయ్యాలో, ఏం మందులు ఇవ్వాలో చెప్పేవారు. ఒక దశలో అయితే నా సంరక్షణలో ఓ డజను రోగుల దాకా ఉండేవారు. క్రమంగా వైద్యం పట్ల నా ఆసక్తి పెరిగింది. మనుషుల స్వభావాన్ని కచ్చితంగా అంచనా వెయ్యటంలో దిట్ట అయిన మా నాన్నగారు ఒక రోజు నేను వైద్యుణ్ణి కావాలాని ఆయనే తేల్చిచెప్పేశారు. నేను వైద్య వృత్తిలో బాగా పైకి వస్తానట. ఆ మాటకి అర్థం నా వద్దకి చికిత్స కొసం బోలెడు మంది రోగులు వస్తారన్నమాట! వైద్యుడిలో ముఖ్య లక్షణం రోగి ఆత్మవిశ్వాసాన్ని పెంచగలగడం. నాలో ఏం చూసి ఆయన అలా అనుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎడింబర్గ్ ఆసుపత్రిలో రెండు సందర్భాలలో ఆపరేషన్ థియేటర్ లో శస్త్ర చికిత్స జరుగుతుంటే హాజరు అయ్యాను. ఆ రెండు ఆపరేషన్లు చాలా దారుణంగా చేసినవే. రెండిట్లో ఒకటి ఓ పసి వాడి మీద చేసినవి. కాని అది పూర్తి అయ్యే లోపే అక్కణ్ణుంచి పారిపోయాను. మళ్లీ ఎప్పుడు ఆపరేషన్ థియేటర్ ముఖం చూడలేదు. ఆపరేషన్ థియేటర్ దిక్కుగా నా దారి మళ్లించగల శక్తి ఈ భూమి మీద లేదని అనిపించింది. అవి ఇంకా క్లోరోఫారం వాడుకలో లేని రోజులు. ఆ రెండు కేసులు ఓ ఏడాది పాటు నా మనసులో రేపిన కల్లోలం ఇంతా అంతా కాదు.

విశ్వవిద్యాలయంలో మా అన్నయ్య ఒక ఏడాది కాలం మాత్రమే ఉన్నాడు. కనుక మరుసటేడు నేను ఒక్కణ్ణీ అయిపోయాను. దీని వల్ల కొన్ని లాభాలు లేకపోలేదు. ప్రకృతి విజ్ఞాన శాస్త్రం అంటే మక్కువ ఉన్న ఎంతో మంది యువకులతో పరిచయం ఏర్పడింది. వారిలో ఒకడు ఐన్స్ వర్త్. ఇతగాడు తదనంతరం తన అసీరియా యాత్రలని పుస్తక రూపంలో ప్రచురించాడు. ఇతడు వెర్నెర్ సాంప్రదాయానికి చెందిన భౌగోళిక శాస్త్రవేత్త కూడా. పలు రంగాల్లో ఇతడికి ప్రవేశం ఉంది. అలా పరిచయం అయిన మరొక డాక్టర్ కోల్డ్ స్ట్రీం. ఇతడి తీరు వేరు. ఎప్పుడూ హుందాగా, మర్యాదగా ఉంటాడు. దైవభక్తి మెండు. మృదువైన మనస్తత్వం గలవాడు. తదనంతరం జంతు శాస్త్రం మీద మంచి వ్యాసాలు ప్రచురించాడు. ఇక మూడవ వ్యక్తి పేరు హార్డీ. ఇతగాడు మంచి వృక్షశాస్త్రవేత్త అయ్యుండేవాడు. కాని ఇండియాలో ఉండే రోజుల్లో తొందరగానే మరణించాడు. చివరిగా డాక్టర్ గ్రాంట్. ఇతడు నాకు ఎన్నో ఏళ్లు సీనియర్. అసలు నాకు ఎలా పరిచయం అయ్యాడో గుర్తులేదు.

జంతు శాస్త్రంలో ఇతడు కొన్ని బ్రహ్మాండమైన వ్యాసాలు ప్రచురించాడు. కాని లండన్లో యూనివర్సిటీ కాలేజ్ లో ప్రొఫెసర్ గా చేరిన తరువాత కొత్తగా ఏ పరిశోధనలూ చెయ్యలేదు. అలా ఎందుకు జరిగిందో ఇప్పతికీ నాకు అర్థం కాదు. పైకి చూడడానికి కాస్త జడంగా కనిపిస్తాడు గాని ఆ పై పొరకి అడుగున విజ్ఞానం పట్ల అపారమైన ఉత్సాహం ఉన్నవాడు. అతడు ఒకరోజు ఇద్దరం కలిసి నడిచి వెల్తుంటే, లామార్క్ గురించి, అతడి పరిణామ సిద్ధాంతం గురించి ఉత్సాహంగా సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చాడు. అతడు చెప్పిన విషయాలని ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయాను. కాని ఆ మాటలకి నా మనసు మీద ఏ ప్రభావమూ లేదని అనిపించింది. నేను అంతకు ముందు మా తాతగారు రాసిన "జూనోమియా" (జంతువుల నామకరణం) అన్న పుస్తకాన్ని చదివాను. అందులో కూడా ఇలాంటి భావాలే వ్యక్తం చెయ్యబడ్డాయి. ఆ భవాలకి కూడా నా మనసుమీద ఏ ప్రభావమూ ఉన్నట్టు అనిపించలేదు. నా జీవితంలో తొలి దశల్లో అలాంటి భావాలని విని ఉండటం వల్ల, అవి కీర్తింపబడటం విని ఉండటం వల్ల, తదనంతరం నేను రాసిన "జీవ జాతుల ఆవిర్భావం" (Origin of Species) అన్న పుస్తకంలో ఆ భావాలనే సమర్ధించడం జరిగిందేమో ననిపిస్తుంది. ఆ రోజుల్లో జూనోమియా అంటే నాకు గొప్ప ఆరాధన ఉండేది. కాని ఓ పది పదిహేను ఏళ్ల వారడి తరువాత మళ్లీ ఆ పుస్తకం చదివినప్పుడు చాలా నిరాశ చెందాను. అందులో వాస్తవాల కన్నా ఊహాగానం పాలు ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది.

(ఇంకా వుంది)

నేను బళ్లో చదువుకునే తొలి దశల్లో ఒక అబ్బాయి వద్ద "ప్రపంచంలో వింతలు" అన్న పుస్తకం చూశాను. ఆ పుస్తకం ఎన్నో సార్లు చదివాను. అందులో పేర్కొనబడ్డ కొన్ని విషయాలు నిజం కావని నా తోటి పిల్లలతో వాదించడం కూడా బాగా గుర్తు. ఆ పుస్తకం చదివాకే ప్రపంచంలో సుదూర ప్రాంతాలకి ప్రయాణించాలన్న ఆశ నాలో చిగురించింది. ఆ ఆశే బీగిల్ ఓడలో నేను చేసిన మహాయాత్రగా సాకారం చెందింది. బడిలో చివరి దశలలో షూటింగ్ అంటే చాలా మక్కువ ఏర్పడింది. తుపాకీతో పిట్టలు కొట్టడంలో నేను చూబించిన అంకిత భావం ప్రపంచం మరెవరూ ఏ రంగంలోనూ ప్రదర్శించి ఉండరేమో. మొట్ట మొదటి సారి ఓ పక్షిని కొట్టినప్పుడు ఆ ఉద్వేగంతో నా చేతులు ఎంత వణికాయి అంటే, తుపాకిలో మళ్లీ తూటా ఎక్కించడం కూడా కష్టమయ్యింది. ఈ వ్యాపకం చాలా కాలం ఉంది. కొంత కాలానికి తుపాకి ప్రయోగం లో మంచి గురి వచ్చింది.

షూటింగ్ లో మరో ఆట కూడా ఆడేవాళ్లం. ఒక స్నేహితుణ్ణి పిలిచి వెలిగించిన కొవ్వొత్తుని పట్టుకుని గాల్లో మెల్లగా అటుఇటూ ఊపమనేవాణ్ణి. బులెట్ మీద ఒక తొడుగు వేసి దీపాన్ని కొట్టాలి. గురి సరిగ్గా ఉందంటే బుల్లెట్ పేలినప్పుడు పుట్టిన గాలి విస్ఫోటానికి దీపం ఆరిపోతుంది. అయితే ఆ పేలుడు జరిగినప్పుడు ఠాప్ అని కొరడా దెబ్బలా పెద్ద చప్పుడు అయ్యేది. ఈ విషయం గురించి మా కాలేజిలో ఓ టీచరు ఇలా అన్నాడు. "ఈ డార్విన్ భలే చిత్రమైన మనిషిలా ఉన్నాడు. రోజూ తన గదిలో గుర్ర కొరడా పట్టుకుని ఊరికే ఝళిపిస్తూ ఉంటాడు. తన గది పక్క నుండి వెళ్తుంటే ఎప్పుడూ చప్పుళ్లు వినిపిస్తుంటాయి."

బళ్లో ఎంతో మంది మంచి స్నేహితులు ఉండేవాళ్లు. ఆ రోజుల్లో అందరితో చాలా అభిమానంగా ఉండేవాణ్ణి కాబోలు.

ఇక విజ్ఞానం విషయానికి వస్తే ఖనిజాలని సేకరించడం కొనసాగించాను గాని ఆ సేకరణ కొంచెం అవైజ్ఞానికంగా చేసేవాణ్ణి. ఏ కొత్త ఖనిజం కనిపించినా తెచ్చి దాచుకునేవాణ్ణి గాని వాటిని పెద్దగా వర్గీకరించే ప్రయత్నం చెయ్యలేదు. పురుగులని కూడా ఎంతో కొంత శ్రద్ధతో పరిశీలించే వాణ్ణేమో. నాకు పదేళ్లప్పుడు 1819లో వేల్స్ సముద్ర తీరం మీద ఉన్న ప్లాస్ ఎడ్వర్డ్స్ అనే చోట మూడు వారాలు గడిపాను. అక్కడ ఒకసారి నలుపు, సింధూరం రంగులు కలిసిన, hemiptera జాతికి చెందిన, ఓ పెద్ద పురుగు నన్ను బాగా ఆకర్షించింది. ఎన్నో మిడుతలు (జైగానియా జాతికి చెందినవి) కూడా కనిపించాయి.

ఇక ఆ నాటి నుండి చచ్చి పడి ఉన్న ప్రతీ పురుగునీ సేకరించడం ప్రారంభించాలని గట్టిగా సంకల్పించాను. ఎందుకంటే సేకరణ కొసం పురుగులని చంపటం తప్పని మా అక్క చెప్పింది. వైట్ రాసిన 'సెల్బోర్ణ్ అన్న పుస్తకం చదివాక పక్షుల దినచర్యని, అలవాట్లని పరిశీలించడం మీద మక్కువ పెరిగింది. నా పరిశీలనల ఆధారంగా కొంత నోట్సు కూడా తీసుకున్నాను. ఆ వ్యాపకం నాకు ఎంతగా నచ్చిందంటే పుట్టిన ప్రతీ మనిషి పక్షిశాస్త్రవేత్త ఎందుకు కాలేదబ్బా అని అమాయకంగా ఆలోచించేవాణ్ణి.


స్కూలు దశలో చివరి రోజుల్లో అనుకుంటా మా అన్నయ్య మా ఇంటి పెరట్లో ఉండే పనిముట్ల గదిలో ఒక భాగాన్ని ఒక చక్కని రసాయన ప్రయోగశాలగా తీర్చిదిద్దాడు. రసాయన ప్రయోగాలకి కావలసిన నానా రకాల సరంజామా అందులో ఏర్పాటు చేశాడు. రకరకాల వాయువులు, ఇతర సంయోగాలు అందులో తయారుచేసేవాడు. అప్పట్నుంచి రసాయన శాస్త్రం మీద రాసిన ఎన్నో పుస్తకాలు (ఉదాహరణకి హెన్రీ, మరియు పార్క్స్ రాసిన "కెమికల్ కటెచిసం" (రసాయన బోధిని) మొదలైనవి) తెచ్చి శ్రద్ధగా చదివాను.

ఈ శాస్త్రం నాకు ఎందుకో బాగా నచ్చింది. అర్థ రాత్రి దాటాక కూడా ఆ ప్రయోగశాలలో ఏవో ప్రయోగాలు చేస్తూ ఉండిపోయేవాళ్లం. స్కూల్లో నేను చదివిన చదువుకి ఇది పరాకాష్ట అనుకోవాలి. ఎందుకంటే బడిలో నేను సైద్ధాంతికంగా తెలుసుకున్న దాన్ని ఇక్కడ ప్రయోగాత్మకంగా అర్థం చేసుకో గలుగుతున్నాను. మేము రసాయన ప్రయోగాలు చేస్తున్నామన్న వార్త ఎలాగో స్కూలంతా పొక్కింది. అది చాలా అపురూపమైన విషయం కాబోలు. అందుకు గుర్తుగా నాకు "గ్యాస్" అని పేరు కూడా పెట్టారు. అంతే కాదు. స్కూలు హెడ్ మాస్టరు డాక్టర్ బట్లర్ ఒక సారి అలాంటి పనికి మాలిన పనులు చేస్తున్నందుకు అందరి ముందూ చీవాట్లు పెట్టారు. నేను వట్టి "పోకో క్యురాంటే" నని కూడా అన్యాయంగా తిట్టాడు!
ఆ మాటకి అర్థం నాకు తెలీదనుకోండి. కాని అదేదో పెద్ద తిట్టులా అనిపించింది అప్పుడు.

బడిలో నేను పెద్దగా వెలగపెడుతున్నది ఏమీ లేదని గుర్తించి కాబోలు, మా నాన్నగారు మామూలుగా కన్నా ముందే నన్ను బళ్లోంచి బయటకి తిసి, మా అన్నతో బాటు ఎడింబర్గ్ విశ్వవిద్యాలయంలో పడేశారు (అక్టోబర్, 1825 లో). అక్కడ ఓ రెండేళ్లు గడిపాను. మా అన్నయ్య వైద్య విద్య పూర్తి చేసే సమయానికి (తనకి వైద్యుడిగా పనిచేసే ఉద్దేశం ఉందని అనుకోను) నా వైద్య శిక్షణ ఆరంభం అయ్యింది. ఈ దశ తరువాత కొన్ని చిన్న చిన్న సంఘటనల వల్ల, మాకు వారసత్వంగా బోలెదంత ఆస్తి రాబోతుందని అర్థమయ్యింది. అలా దక్కిన పిత్రార్జితంతో జీవితం సాఫీగా వెళ్లిపోతుందన్న ధైర్యం వచ్చింది. కాని ఇలా ఐశ్వర్యవంతుణ్ణి అవుతానని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏదేమైనా ఉచితంగా ఆస్తి వస్తుందన్న నమ్మకం, వైద్యం చదువుకి సరిపోయేటంతగా కష్టపడకుండా అడ్డుపడింది.

(ఇంకా వుంది)

Awakenings - సినిమా కథ, సమీక్ష - 2

Posted by V Srinivasa Chakravarthy Wednesday, March 7, 2012 5 comments

లియొనార్డ్ ఇచ్చిన మొట్టమొదటి సందేశం చూసి డా. సేయర్ అదిరిపోతాడు. ఆ సందేశం ఇలా ఉంటుంది
RILKESPANTHERRILKES…

దీన్ని కొంచెం శోధించి పదాలని Rilke’s Panther అని వేరు చేస్తాడు. Rainer Rilke పందొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఒక ఆస్ట్రియన్ కవి. ఇతడు రాసిన పద్యాలలో Panther అనే పద్యం కూడా ఉంది. లైబ్రరీకి వెళ్ళి రిల్కె కవితల పుస్తకం తెచ్చి చదువుతాడు డా. సేయర్. ఆ పద్యంలో కొన్ని పంక్తులు -

“వేయి కటకటాలు అతడి గతికి అడ్డుపడుతున్నాయి.
ఆ కటకటాల వెనుక ఉన్నది నిష్ప్రపంచమైన శూన్యం .
ఉక్కిరిబిక్కిరి చేసే ఇరుకు పరిధిలో
పదే పదే కలయదిరుగుతుంటాడు.

తన బలమైన పదఘట్టనలు
మారని కేంద్రం చుట్టూ చేసే నిర్బంధ ప్రదక్షిణ.
ఓ ప్రచండమైన సంకల్పబలం
ఆ కేంద్రంలో నిశ్చేష్టమై పడి వుంది. …

కొన్ని సార్లు ఏ అలికిడీ లేకుండా ఏదో దృశ్యం
కనుపాప తెర పైకెత్తి లోపలికి అడుగిడుతుంది.
సద్దులేని దేహపు ఇరుకు గోడల మధ్యగా
ముందుకి సాగి, హృదయంలోకి దూరి… అంతరించిపోతుంది.”

రిల్కె కవితలు చదివిని డా. సేయర్ కి కనువిప్పు అవుతుంది. అంతవరకు తను రోజూ చూసే ఎన్సెఫలైటిస్ రోగులు జీవచ్ఛవాల్లాంటి వారన్న అభిప్రాయంలో ఉండేవాడు. ఏవో కొన్ని స్వల్పమైన బాహ్య కదలికలు తప్ప లోపల మనసు ఎప్పుడో చచ్చిపోయిందని అనుకునేవాడు. కాని లియొనార్డ్ తనని రిల్కె కవితలు చదవమని సూచించాడంటే నిశ్చయంగా ఆ పద్యాల ద్వార తన మానసిక, ఆంతరిక స్థితి వ్యక్తం చేసుకోవాలనే ఉద్దేశం తప్ప మరొకటి లేదు. పంజరంలో చిలకలా లియొనార్డ్ మనస్సు ఈ వ్యాధిగ్రస్థ దేహంలో బందీగా పడి వుందని గమనిస్తాడు. లియొనార్డ్ నే కాక అలాంటి స్థితిలో ఉన్న ఇతర రోగులకి కూడా ఎలాగైనా విమోచనమార్గం వెతకాలని నిశ్చయించుకుంటాడు.

ఇలా ఉండగా పార్కిన్సన్స్ వ్యాధి కి కొత్త మందు బయటికి వచ్చిందన్న వార్త వస్తుంది. ఎల్-డోపా అనే మందు వల్ల పార్కిన్సన్స్ వ్యాధి వున్న రోగుల్లో అద్భుతంగా గుణం కనిపిస్తోందని తెలుస్తుంది. ఆ మందు గురించి డా. సేయర్ పని చేస్తున్న ఆసుపత్రిలో ఒక నిపుణుడు సెమినార్ ఇస్తాడు. పార్కిన్సన్స్ వ్యాధి రోగులకి, తను చికిత్స చేస్తున్న ఎన్సెఫలైటిస్ వ్యాధి రోగులకి మధ్య వ్యాధి లక్షణాలలో పోలికలు గమనించిన డా. సేయర్ అదే మందుని తన రోగుల మీద ప్రయోగించి చూడాలని అనుకుంటాడు.

ముందు తన రోగుల్లో ప్రతి ఒక్కరికి ఈ కొత్త మందు ఇవ్వాలని అనుకుంటాడు. కాని చీఫ్ ఒప్పుకోకపోవడంతో తనకి బాగా సన్నిహితమైన లియొనార్డ్ కి మాత్రం ఇచ్చి చూస్తాడు. ప్రయోగం చెయ్యడానికి లియొనార్డ్ తల్లి అనుమతి తీసుకుంటాడు. ముందు 500 mg డోస్ ఇచ్చి చూస్తాడు. ఏ ఫలితమూ ఉండదు. డోస్ రెండింతలు చేస్తాడు. అయినా ఏ మార్పూ కనిపించదు. లియొనార్డ్ పక్కనే రాత్రంతా జాగారం చేస్తాడు డా. సేయర్. అర్థరాత్రి ఏదో అలికిడై ఉలిక్కి పడి లేచిన డా. సేయర్ కి పక్కన పక్క మీద రోగి కనిపించడు. చుట్టూ వెతికితే పక్క హాలులో ఒక బల్ల వద్ద కూర్చుని ఏదో రాసుకుంటూ కనిపిస్తాడు లియొనార్డ్! లోకం అంతా నిద్రపోయే వేళ ఇలా మేలుకోకూడదు, వెళ్లి పడుకో మంటాడు డా. సేయర్. ముప్పై ఏళ్ల నిద్ర తరువాత మెలకువ వచ్చింది, మళ్లీ నిద్ర పోవాలని లేదంటాడు లియొనార్డ్.


ఒక్క రోజులో లియొనార్డ్ లో అంత మార్పు రావడం చూసి ఆసుపత్రి సిబ్బంది అదిరిపోతారు.
మందుని తతిమా రోగులకి కూడా ఇవ్వాలని డా. సేయర్ ఆసుపత్రి చీఫ్ కి సూచిస్తాడు. అయితే దానికి 12,000 డాలర్లు ఖర్చవుతుంది. ఆసుపత్రి అంత ఖర్చు భరించలేదంటాడు చీఫ్. నేరుగా ఆసుపత్రికి విరాళాలిచ్చే దాతలని అడుగుతానంటాడు సేయర్. లియొనార్డ్ లో వచ్చిన మార్పులని ప్రదర్శిస్తూ వీడియో తీసి దాతలకి మందు గొప్పదనం గురించి వివరిస్తాడు. చికిత్సకి నిధులు సమకూరుతాయి.

అందిన నిధులతో తక్కిన రోగులకి కూడా మందు ఇస్తారు. అందరూ నమ్మశక్యం కానంత బాగా కోలుకుంటారు. కొత్త మందు వల్ల దీర్ఘ కాలం అచేతనంగా పడి వున్న వాళ్ళు ఉన్నపళంగా ‘మేలుకుంటారు.’ ఒక్క సారిగా న్యూరాలజీ వార్డ్ కి ప్రాణం లేచొచ్చినట్టు అవుతుంది. అంతవరకు రాళ్లలా పడివున్న రోగులలో ఎక్కడ లేని చైతన్యం వస్తుంది. ఆ సందర్భంలో కొన్ని దృశ్యాలు గమ్మత్తుగా ఉంటాయి. “కొంచెం ఆగు తల్లీ! బీపీ తీసుకోవాలి” అంటూ ఓ నర్సు ఓ ముసలావిడ వెంట పడుతుంటుంది. “పాతికేళ్లు కుర్చీలో కదలకుండా కూర్చున్నాను. అప్పుడేంచేశావు?” అంటూ ఆ పెద్దావిడ పరుగు అందుకుంటుంది.

ఇలా కొంత కాలం గడుస్తుంది. లియొనార్డ్ పరిస్థితి బాగా మెరుగౌతుంది. ఆ కాలంలోనే పౌలా అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఈ అమ్మాయి తన తండ్రిని చూడడాన్కి ఆసుపత్రికి వస్తుంటుంది. లియొనార్డ్ ని మొదట చూసి తనొక రోగి అనుకోదు. తనలాగే ఆసుపత్రికి వచ్చిన సందర్శకుడు అనుకుంటుంది. ఇద్దరి స్నేహం క్రమంగా బలపడుతుంది.

లియొనార్డ్ కి ఆసుపత్రిలో బతుకు దుర్భరంగా అనిపిస్తుంది. బయటికి వెళ్లినా ఎవరినైనా తోడు తీసుకుని వెళ్లాల్సిందే. ఒంటరిగా బయటికి వెళ్లడానికి అనుమతి కోరుకుంటూ అర్జీ పెట్టుకుంటాడు. కాని ఆసుపత్రి అధికారులు ఒప్పుకోరు. ఇక భరించలేక ఒక సారి ఆసుపత్రి నుండి పారిపోడానికి ప్రయత్నించి విఫలమవుతాడు లియొనార్డ్.

ఇంతలో లియొనార్డ్ ప్రవర్తనలో విచిత్రమైన మార్పు కనిపిస్తుంది. మందు సక్రమంగా వేసుకుంటున్నా కూడా ఒంట్లో ఆపుకోలేని చిత్రమైన కదలికలు (dyskinesias) కనిపిస్తుంటాయి. తల విసిరేస్తున్నట్టుగా పదే పదే విదిలిస్తుంటాడు. ఇలాంటి కదలికలని motor tics అంటారు. ఒళ్ళంతా బలంగా ఊగిపోవడం వల్ల నాలుగు అడుగులు వెయ్యడమే గగనం అయిపోతుంది. డా. సేయర్ మందు మోతాదుని రకరకాలుగా మార్చి చూస్తాడు. ఏ ఫలితం ఉండదు.
లియొనార్డ్ పరిస్థితి క్రమంగా దిగజారిపోతుంటుంది. ఏమీ చెయ్యలేని తన అశక్తతకి డా. సేయర్ మనస్తాపం చెందుతాడు. ఇంత కాలం తరువాత మేలుకున్న వ్యక్తి అంతలోనే మళ్ళీ ఆ భయంకర నిద్రలోకి జారుకోవడం అతడు భరించలేకపోతాడు.

ఆ విధంగా ఓ వైద్య సమస్యతో మొదలైన సినిమా, పూర్తి పరిష్కారం లేకుండా ముగుస్తుంది… నిజ జీవితంలో లా.
న్యూరాలజీ లో రోగాలు ఎంత విచిత్రంగా, ఎంత భయంకరంగా ఉంటాయో తెలుపుతుంది ఈ సినిమా. అసలు మందులే లేక, ఉన్నా సరిగ్గా పని చెయ్యక, మొదటికే మోసం వచ్చేలాంటి ‘ఉపఫలితాలు’ (side effects) చూపిస్తూ వైద్య నిపుణులని యాతన పెట్టే మెదడు రోగాల లక్షణాన్ని స్పష్టంగా చూపిస్తుంది. గొప్ప పాండిత్యం, ప్రతిభ మాత్రమే కాక, వైద్యుడికి ఉండాల్సిన అంకితభావం, కరుణార్ద్రహృదయం గల న్యూరాలజిస్ట్ అయిన ఆలివర్ సాక్స్ ని తలపించేలా డా. సేయర్ పాత్రని రాబిన్ విలియమ్స్ అద్భుతంగా పోషించాడు. ( రాబిన్ విలియమ్స్ వైద్యుడి పాత్రని అద్భుతంగా పోషించిన మరో సినిమా కూడా ఉంది. ‘శంకర్ దాదా ఎమ్. బి.బి.ఎస్.’ కి స్ఫూర్తి నిచ్చిన ఆ సినిమా పేరు ‘పాచ్ ఆడమ్స్’.) రోగిగా రాబర్డ్ డి నీరో నటన కూడా అద్భుతం. ముఖ్యంగా చివరి దశల్లో dyskinesias ప్రదర్శిస్తూ అతడు చేసిన నటన చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

ఈ చిత్రం మూడు అకాడెమీ అవార్డ్ నామినేషన్లు అందుకుంది. రాబర్ట్ డి నీరో కి ఉత్తమ నటుడి నామినేషన్ రావడంలో ఆశ్చర్యం లేదు.

ఎలాగూ ఇంత వ్యాసం రాశాను కనుక ఇక చివర్లో నా గోడు కొంచెం చెప్పేసుకుంటాను. మన దేశంలో, మన భాషల్లో ఇలాంటి సినిమాలు ఎందుకు రావు? ముఖ్యంగా సైన్స్ అంశాల మీద సినిమాలు మన సంస్కృతిలో ఎందుకంత తక్కువ? ఎప్పుడో తప్పజారి సైన్స్ కి సంబంధించిన సినిమా తీసినా అవి దేవుళ్ళు, దయ్యాలు, సైన్స్, నాన్సెన్స్ అన్నీ కలగలిపిన కుర్మా సినిమాలు తప్ప శుద్ధమైన సైన్స్ అంశాలమీద పకడ్బందీగా తీసిన సినిమాలు బహుతక్కువ. దానికి కారణాలు కొత్తేం కాదు. ఒక ఆధునిక సమాజంలో సైన్స్ ఎలాంటి సహజ పాత్ర పోషించాలో అలాంటి పాత్ర ఇంకా మన సమాజంలో పోషించడం లేదు. సైన్స్ యొక్క ప్రయోజనాలని కొంత వరకు వాడుకోవడం జరుగుతోందే తప్ప సైన్స్ యొక్క తత్వం మన సామాన్య సామజిక చింతనలోకి లోతుగా ఇంకా ప్రవేశించలేదు. సైన్స్ ప్రభావం బలంగా ఉంటే మన సమిష్టి జీవనం ఇంత కల్లోలంగా ఉండదు. సైన్స్ అంటే కేవలం ఉద్యోగావకాశాలని పెంచే ఓ పనిముట్టుగా చూడకుండా, సమిష్టి జీవన ప్రమాణాలని పెంచే ఓ ప్రబల శక్తిగా స్వీకరించాలి. జీవితాన్ని, ప్రపంచాన్ని వైజ్ఞానిక దృష్టితో చూసే అలవాటు మన చేతనలో గాఢంగా నాటుకుపోవాలి. సైన్స్ సమాచారం కేవలం ‘సైన్స్ స్టూడెంట్ల’కి, ‘సైంటిస్టుల’కి మాత్రమే పరిమితం కాకూడదు. సైన్స్ అందరి సొత్తూ కావాలి. వైజ్ఞానిక భావ లహరులు సర్వత్ర సహజంగా ప్రవహించాలి. మన సినిమాలలో, సాహిత్యంలో, జీవన వ్యవస్థలలో, దైనిక జీవనంలో దోషంలేని, సమున్నతమైన వైజ్ఞానిక పరిజ్ఞానం అభివ్యక్తం కావాలి. పశుబలం తప్ప ఏ ఔన్నత్యమూ లేని కథానాయకులతో, రూపం తప్ప వ్యక్తిత్వం సుతరామూ లేని కథానాయికలతో, ఒక జంట నానా తిప్పలూ పడి పెళ్లిచేసుకోవడం తప్ప మరో వస్తువే లేని కథతో, కాస్త చవకబారు సంచనలనం తప్ప ఏ సారమూ లేని నేటి తెలుగు సినిమాలు ఇంతకన్నా దిగజారలేవేమో ననిపిస్తుంది. Awakenings లాంటి సినిమాలు మన సినిమాలకి ‘మేలుకొలుపు’ అయితే బావుంటుంది.

References:
http://en.wikipedia.org/wiki/Awakenings
http://en.wikipedia.org/wiki/Rainer_Maria_Rilke
http://www.thebeckoning.com/poetry/rilke/rilke3.html

Awakenings - సినిమా కథ, సమీక్ష - 1

Posted by V Srinivasa Chakravarthy Sunday, March 4, 2012 0 comments

ఈ మధ్య ఓ చక్కని సినిమా చూడడం జరిగింది. పేరు Awakenings. 1991 నాటి సినిమా. చాలా మంది చూసే ఉంటారు. ఆలివర్ సాక్స్ అనే బ్రిటిష్ న్యూరాలజిస్ట్, పాపులర్ సైన్స్ రచయిత యొక్క జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా ఇది. ఈ కథలో ముఖ్య పాత్ర అయిన డా. మాల్కమ్ సేయర్ పాత్రని రాబిన్ విలియమ్స్ పోషించాడు.

డా. సేయర్ ఓ అమెరికన్ న్యూరాలజిస్టు. ఇతడికి క్లినికల్ వృత్తి కన్నా పరిశోధనల మీద ఆసక్తి ఎక్కువ. 1917-1928 కాలంలో ఎన్సెఫలైటిస్ లెతార్జికా అనే అంటువ్యాధి పెచ్చరిల్లి ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. ఎన్సెఫలైటిస్ వైరస్ ముఖ్యంగా మెదడుని దెబ్బ తీస్తుంది. ఈ వ్యాధి వాత బడ్డ రోగులు నిశ్చేతనంగా శిలాప్రతిమల్లా ఏళ్ళ తరబడి ఉండిపోతారు. ఇలాంటి స్థితిని కెటటోనియా అంటారు. వాళ్లకి వాళ్ళు స్వచ్చందంగా ఏమీ చేసుకోలేరు. అన్నీ మరొకరు చెయ్యాల్సిందే. 1917-1928 కాలంలో ఈ అంటువ్యాధి దుష్ప్రభావం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. బతికి బట్టకట్టిన కొంత మంది దశాబ్దాల పాటు ఇలా శిలలలా పడి ఉంటారు. డా. సేయర్ కి ఇలాంటి కొంత మంది రోగులతో పని చెయ్యాల్సిన బాధ్యత ఏర్పడుతుంది. సరిగ్గా అప్పుడే వచ్చిన ఎల్-డోపా అనే మందు ఈ రోగం మీద సత్ఫలితాలు చూపించొచ్చన్న వార్త వస్తుంది. డా. సేయర్ ధైర్యం చేసి తన రోగుల మీద ఈ మందు ప్రయోగించి చూస్తాడు. కొంతమంది విషయంలో అద్భుతమైన ఫలితాలు కనిపించినా, ఒక రోగి విషయంలో మాత్రం రోగం వికటించి జీవితం మరింత దుర్భరం అయిపోతుంది. క్లుప్తంగా ఇదీ కథ.

డా. సేయర్ ఉద్యోగం వెతుక్కోవడంతో కథ మొదలవుతుంది. న్యూరాలజిస్ట్ పోస్ట్ కోసం ఓ ఆసుపత్రికి అర్జీ పెట్టుకుంటాడు. అయితే డా. సేయర్ గతానుభవం అంతా పరిశోధనా రంగంలోనే ఉందని, క్లినికల్ రంగంలో అనుభవం ఇంచుమించు లేదని ఇంటర్వ్యూ చేసిన వాళ్లకి త్వరలోనే అర్థమవుతుంది.

ఇంతకాలం ఏం చేశారు డాక్టర్? అన్న ప్రశ్నకి డా. సేయర్, “ కొన్ని ఏళ్లు శ్రమపడి 4 టన్నుల వానపాము మాంసం నుండి కొన్ని డెసీగ్రాముల మైలిన్ పదార్థాన్ని వెలికితీసే ప్రయత్నం చేశాను” అంటాడు. (నాడీ తంతుల చుట్టూ ఉండే ఓ సన్నని తెల్లని పొరే ఈ మైలిన్. మల్టిపుల్ స్క్లీరోసిస్ లాంటి నాడీ వ్యాధులలో ఓ మైలిన్ పొర చెడిపోతుంది. మరి అలాంటి రోగం మీద పరిశోధన చెయ్యలాంటే ఆ మైలిన్ పదార్థాన్ని తగు మోతాదులో ముందు సాధించాలి.) రోగుల అవసరాలకి, పరిశోధనా ఫలితాలకి మధ్య (అనివార్యమైన) వారడి ఈ సంభాషణలో స్పష్టంగా కనిపిస్తుంది. వైద్య బృందం ముందు వెనకాడినా చివరికి డా. సేయర్ కి ఆ ఉద్యోగం ఇస్తారు.

అంతకాలం పెట్రీ డిష్ లో కణాలని మైక్రోస్కోప్ లో చూస్తూ కాలం గడిపిన డా. సేయర్ ఒక్కసారిగా న్యూరాలజీ వార్డ్ లో రోగులు, వారి దురవస్థ చూసి తల్లడిల్లి పోతాడు. ముఖ్యంగా తన దృష్టి ఎన్సెఫలైటిస్ రోగుల మీద పడుతుంది. వారంతకి వారు ఏ చలనమూ చూపించకపోయినా, బయటి నుండి వచ్చే ప్రేరణలకి స్పందిస్తారని గమనిస్తాడు డా. సేయర్. ఉదాహరణకి ఒక సన్నివేశంలో డా. సేయర్ చేతి నుండి జారిపోతున్న పెన్ ని, అంతవరకు చలనం లేకుండా కూర్చున్న రోగి చెయ్యి చాచి చటుక్కున అందుకుంటాడు. అది చూసి డా. సేయర్ ఆశ్చర్యపోతాడు. ఇతర రోగులని కూడా పరీక్షించి చూస్తాడు. బంతి విసిర్తే పట్టుకోవడం గమనిస్తాడు. దశాబ్దాల పాటు స్థాణువై ఉన్న వాళ్లలో ఇంత చిన్న కారణం వల్ల చలనం రావడం చూసి నమ్మలేకపోతాడు. ఉత్సాహం పట్టలేక ఆసుపత్రి చీఫ్ ని మరిద్దరు సీనియర్ డాక్టర్లని పిలిచి చూపిస్తాడు. “తమ కంటూ ఏ సంకల్పమూ లేకపోయినా, బంతి యొక్క సంకల్పాన్ని వాడుకుని కదలగలుగుతున్నారు” అని రోగులు ఎలా కదల గలుగుతున్నారో వివరిస్తాడు. ఆ వివరణ సీనియర్ డాక్టర్లకి హాస్యాస్పదంగా తోస్తుంది. నవ్వి వెళ్ళిపోతారు.

కాని డా. సేయర్ వివరణ తన వార్డులో పని చేసే ఎలియనోర్ కాస్టెలో అనే నర్స్ కి నచ్చుతుంది. డా. సేయర్ సామర్థ్యం మీద ఆమెకి నమ్మకం, గౌరవం ఏర్పడతాయి. ఇద్దరూ కలిసి మిగతా రోగుల పరిస్థితిని కూడా మెరుగుపరచాలని ప్రయత్నిస్తారు. తగు రీతిలో బాహ్య ప్రేరణలు ఇచ్చి వారిని మరింత చైతన్యవంతం చెయ్యాలని చూస్తారు. ఒక సారి ఒక వృధ్ధురాలిని నడిపించాలని చూస్తారు. ఎన్ని ‘ఎర’లు చూపించినా ఉన్న చోటనే నించుంటుంది కాని కదలదు. ఆమెని ఎలా కదిలించాలా అని డా. సేయర్ ఆలోచనలో పడతాడు. అలా ఆలోచిస్తూ ఒక రోజు తన వార్డు కిటికీ లోంచి కిందకి చూస్తుంటే కింద కొంత మంది పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తారు. వారిలో ఒక పాప తొక్కుడుబిళ్ళ ఆడుతూ కనిపిస్తుంది. ఒక్కక్క గడిని గెంతుతూ, దాటుతున్న ఆ పాపని చూడగానే డా. సేయర్ మనసులో ఓ అద్భుతమైన ఆలోచన మెదుల్తుంది.

డా. సేయర్ పని చేసే న్యూరాలజీ వార్డులో నేల ఎలాంటి చిహ్నాలు లేని తల్లని నేల. ఆ నేల మీద చదరంగంలో నలుపు, తెలుపుల గడులు వచ్చేలా రంగులు వెయ్యడం మొదలెడతాడు. ఈ ఆలోచన నచ్చిన నర్సు ఎలియనోర్ కూడా సహాయం చేస్తుంది. అంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేని ఆ వృద్ధ రోగి ఈ గడుల మీద సులభంగా నడవగలుగుతుంది.

ఇలా ఉండగా లియనార్డ్ లోవ్ (రాబర్ట్ డి నీరో) అనే రోగితో డా. సేయర్ కి ఓ ప్రత్యేక అనుబంధం ఏర్పడుతుంది. ఇతగాడు బళ్ళో చదువుకునే రోజుల్లో వ్యాధి సోకుతుంది. అంతవరకు క్లాసులో అన్ని సబ్జెక్ట్లలో రాణించిన పిల్లవాడు ఒక్క సారిగా అచేతనంగా మారిపోతాడు. అప్పట్నుంచి తల్లే తనని కనిపెట్టుకుని చూసుకుంటూ ఉంటుంది. వయసు పైబడ్డ ఆ తల్లి నుండి లియొనార్డ్ గురించి మరింత సమాచారం రాబట్టుతాడు. తన బద్ధ స్థితి నుండి లియొనార్డ్ ఎలాగైనా బయటికి తేవాలని అనుకుంటాడు. కనీసం తన మనసులో ఏవుందో తెలుసుకోవాలని అనుకుంటాడు. ఓ ‘ఔజా’ బోర్డుతో లియొనార్డ్ తో మాట్లాడొచ్చని తెలుసుకుంటాడు. “దెయ్యాలతో” మాట్లాడడానికి వాడే ఈ బోర్డులో ఓ పాయింటర్ ఉంటుంది. చుట్టూ అక్షరాలు ఉంటాయి. పాయింటర్ ని కదిలిస్తూ వరుసగా అక్షరాలని సూచిస్తూ పోవచ్చు. ఆ బోర్డుని ఉపయోగించి లియొనార్డ్ ఇచ్చిన మొట్టమొదటి సందేశం చూసి డా. సేయర్ అదిరిపోతాడు. ఆ సందేశం ఇలా ఉంటుంది

RILKESPANTHERRILKES…

(ఇంకా వుంది)

నోరు మూయించగల నూతన సాధనం

Posted by V Srinivasa Chakravarthy Saturday, March 3, 2012 0 comments




లొడలొడ వాగే వాగుడు కాయల వల్ల బాధపడే వారికి ఒక చక్కని వార్త.



అలాంటి వాళ్ళ నోళ్లు మూయించగల ఓ విచిత్ర సాధనాన్ని కనిపెట్టారు ఇద్దరు జపనీస్ శాస్త్రవేత్తలు. నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కి చెందిన కజుటకా కురిహరా, మరియు ఒచనొమిజు యూనివర్సిటీ కి చెందిన కొజి త్సుకడా లు కనిపెట్టిన ఈ సాధనం చాలా సరళమైన సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది.

మనం మాట్లాడే టప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో వింటుంటాం. ఈ auditory feedback ఆధారంగా ఇప్పుడే పలికిన శబ్దం సరిగ్గా వుందో లేదో సరిచూసుకుంటూ, కొత్త శబ్దాలని పలుకుతుంటాం. ఆ feedback లేకపోయినా, లేదా అందులో దోషాలు ఉన్నా మాట్లాడడం కష్టం. ఈ సూత్రాన్ని ఉపయోగించే కురిహరా, త్సుకడా లు తమ సాధనాన్ని కనిపెట్టారు.
ఈ పద్ధతిలో మనిషి పలుకుతున్న శబ్దాలని రికార్డ్ చేసి 0.2 sec ఆలస్యంగా అదే శబ్ద స్రవంతి ని తిరిగి ప్లే చేస్తారు. వ్యక్తి మాట్లాడుతున్న మాటలకి ఈ శబ్దాలు ఒక రొదలాగా అడ్డుపడతాయి. అంటున్న మాటలతో పాటు ఈ ఆలస్యంగా వస్తున్న శబ్దాలు కూడా వినిపించడం వల్ల, ఆ feedback ని ఎలా అర్థం చేసుకోవాలో తెలీక మెదడు తికమక పడుతుంది. దాంతో మాట్లాడ్తున్న వ్యక్తి ఠక్కున ఆగిపోతాడు.

దీని ప్రయోగం వల్ల ఆరోగ్యానికి హాని లేదు కాని ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా నిరర్ధక వాగ్ధాటి అతిగా ఉండే మన దేశీయుల విషయంలో ఈ సాధనం చాలా అవసరం అనిపిస్తుంది. రైలు ఎక్కిన దగ్గర్నుండి ఏమేం తింటున్నది, కిటికీలో తలపెట్టి ఏమేం చూస్తున్నది అన్నీ విడమర్చి ఫోన్లో ఎవడో దూరబాధితుడికి ఏకరువు పెట్టే శాల్తీల నుండి మనకి విముక్తి కలగాలంటే పైన చెప్పిన సాధనమే శరణ్యం.

అయితే మన దేశంలో ఇందుకు వ్యతిరేక సమస్య కూడా ఉంది. ఒక బ్యాంక్ కి వెళ్ళి “అయ్యా! డీడీలు ఎక్కడ ఇస్తారు?” అనడిగితే, అలా ఓ కనుసన్న చేస్తాడు ఆసామి. వికిపీడియాలో ఉన్న సమాచారం అంతా ఆ కనుసన్నలోనే వెతుక్కుని, తవ్వుకుని తెలుసుకోవాలి మనం! అంతేగాని కష్టపడి నోరు విప్పి కౌంటర్ నంబర్ చెప్పడు. అలా అవసరమైనప్పుడు కూడా నోరు తెరవకుండా ముగ్ధగా, మూగగా, ముభావంగా ఉండిపోయే శాల్తీల నోరు తెరిపించే సాధనాన్ని కూడా ఆ జపనీస్ శాస్త్రవేత్తలే కనిపెట్టేస్తే ఓ పనైపోతుంది!

PS: ఇలాంటి సూత్రాన్నే మరో సందర్భంలో కూడా వాడుకోవచ్చు. కొన్ని సార్లు ఏదో (పనికిమాలిన) పాట మనసులో అదేపనిగా ఆడుతూ ఉంటుంది. దాన్ని ‘ఆఫ్’ చేసే మార్గం కనిపించదు. అలాంటి పాటని ఆపడానికి ఓ చిన్న చిట్కా ఉంది. అదే పాటని ఇచ్ఛాపూర్వకంగా మనసులో ప్లే చేసుకోవాలి. అయితే దానంతకి అది ప్లే అవుతున్న పాటకి కాస్త ఆలస్యంగా మనం ఇచ్ఛాపూర్వకంగా తలచుకుంటున్న పాట మనసులో ప్లే అవ్వాలి. మదిలో రొద ఇట్టే సద్దుమణిగిపోతుంది.




http://news.yahoo.com/blogs/technology-blog/weird-gun-future-attacks-words-not-people-193050045.html

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts