సందేహం ఏవుంది? పైకే వెళ్లాలి.
ఎక్కడైతే దారి తప్పానో ఆ చోటికి వేగంగా చేరుకోవాలి. ప్రవాహం ఎక్కడుంతో తెలుసుకుంటే దాని సహాయంతో మళ్లీ స్నెఫెల్ పర్వతపు నోటి వద్దకు చేరుకోవచ్చు.
ఈ ఆలోచన ఇంతకు ముందే ఎందుకు రాలేదబ్బా? తిరిగి హన్స్ బాక్ ప్రవాహం ఎక్కడుందో పట్టుకోవడమే నా తక్షణ కర్తవ్యం. వడిగా అడుగులేస్తూ ముందుకి సాగాను. వాలు కాస్త ఎక్కువగా ఉండడంతో నడక కాస్త కష్టమయ్యింది. పెద్దగా ఆశ లేకపోయినా మనసులో సందేహం మాత్రం లేదు.
ఒక అరగంట పాటు ఏ అవరోధమూ ఎదుట పడలేదు. సొరంగంలో శిలల ఆకారాల బట్టి, చీలికల విన్యాసాల బట్టి దారిని పోల్చుకోడానికి ప్రయత్నించాను. అంతా అగమ్యగోచరంగా వుంది. ఇలాగే ఇంకా ముందుకి పోతే నేను మొదట బయల్దేరిన చోటికి పోగలనని నమ్మకం పోయింది. ఆ మార్గం అంతానికి చేరుకున్నాను. ఎదురుగా ఓ దుర్భేద్యమైన గోడ… నిస్సత్తువతో ఆ బండ మీదే కుప్పకూలిపోయాను.
మనసంతా చెప్పలేని ఆవేదన ఆక్రమించుకుంది. మనసు అదుపు తప్పుతోంది. ఎదురుగా ఉన్న బలమైన బండ మనసులో అంత వరకు ఉన్న చిన్ని ఆశని చిదిమేసింది.
అల్లిబిల్లిగా అల్లుకుపోయిన ఈ చీకటి పాతాళ మార్గాల లోంచి తప్పించుకుని బయటపడడం అసంభవం అనిపించింది. ఈ ఘోర తమస్సులో దారుణమైన చావు చావాల్సిందే. అప్పుడో విపరీతమైన ఆలోచన మనసులోకి చొరబడింది. భవిష్యత్తులో ఏదో ఒక రోజు భూగర్భంలో ముప్పై కోసుల లోతులో నా శిలాజాలు దొరికి, అది గొప్ప వైజ్ఞానిక చర్చకి కారకం అవుతుందేమో!
ఏదో అనడానికి ప్రయత్నించాను కాని గొంతు పెగలలేదు. ఊపిరి అందలేదు.
ఏదో చెప్పరాని భయం గుండెని పిండేస్తోంది. ఇందాక కింద పడినప్పుడు నా లాంతరు దెబ్బ తింది. దీపం మినుకు మినుకు మంటోంది. ఏ క్షణాన అయినా కొండెక్కొచ్చు.
లాంతరు తీగలోని కరెంటు ప్రవాహం పలచబడుతుంటే మనసు విలవిలలాడింది. నల్ల బడుతున్న గోడల మీద చివరి నీడలు తారాడుతున్నాయి. కన్నార్పకుండా ఆ ఆఖరు కాంతులనే ఆత్రంగా చూస్తూ ఉండిపోయాను. ఏ క్షణమైన ఆ చిరుదివ్వె ఆరిపోవచ్చు. దట్టమైన చీకటి తెర నా పరిసరాలని ఆవరించవచ్చు.
ఆ ఆఖరు విస్ఫులింగం క్షణకాలం కంపించి చీకట్లో కలిసిపోయింది. అంతవరకు గుండె లోతుల్లో అణచి వుంచిన ఆవేదన అంతా ఆక్రందనగా వెలువడింది. భూమి ఉపరితలం మీద ఎలాంటి చీకటి రాత్రులలో అయినా పూర్తిగా కాంతివిరహితమైన తమస్సు ఉండదు. తారాకాంతిలో కంటికి ఎంతో కొంత కనిపిస్తుంది. కాని ఇక్కడ ఒక్క కాంతి రేణువు కూడా లేదు. ఇంత ప్రగాఢమైన చీకట్లో గుడ్డి వాణ్ణి అయిపోతున్నట్టు అనిపించింది.
నాకు మతిస్థిమితం తప్పుతోంది. చేతులు చాచి తముడుకుంటూ, తడబడుతూ ముందుకి సాగడానికి ప్రయత్నించాను. దారి తెన్నులు తెలీకుండా ఆ గజిబిజి త్రోవల వెంట పరుగెత్తడానికి ప్రయత్నించాను. గుండెలు అవిసిపోయేలా కేకలుపెట్టాను. గోడలకి గుద్దుకుని తల నుండి చేతుల నుండి రక్తం కారుతున్నా కూడా నా ఉన్మత్త స్థితిలో ఆ బాధ కూడా స్పష్టంగా తెలీడంలేదు. తల నుండి ధారగా కారుతున్న రక్తం పెదాలని తడుపుతోంది. ఈ సారి ఏ కరకురాతికో గుద్దుకుని తల పూర్తిగా చితికిపోతే బావుణ్ణని అనిపించింది.
అలా ఎంత సేపు నడిచానో, ఎటు నడిచానో కూడా తెలీదు. కొన్ని గంటలు గడిచాయేమో పూర్తిగా ఓపిక పోయి నేల మీద కుప్పకూలిపోయాను. అంతలో స్పృహ తప్పింది.
(ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం)
(ఇంకా వుంది)
Eagerly waiting for the next post.