జబీర్ తరువాత పరుసవేదంలో మళ్లీ అంత గొప్ప పేరు సాధించిన పరో పర్షియన్ రసాయనికుడు ఉన్నాడు. అతడి పేరు అల్-రజీ (Al-Razi) (క్రీ.శ. 850-925). యూరొపియన్లు ఇతణ్ణి “రాజెస్” అని పిలిచేవారు. ఇతడు కూడా ఎన్నో రసాయనిక ప్రక్రియలని తన రచనల్లో వివరించాడు. ఉదాహరణకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉపయోగించి పోత ఎలా పొయ్యాలో, విరిగిన ఎముకలని ఎలా అతికించాలో ఇతడు స్పష్టంగా వర్ణించాడు. మూలకమైన ఆంటిమొనీ యొక్క లక్షణాలని ఇతడు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. సులభంగా ఆవిరయ్యే పాదరసానికి, సులభంగా నిప్పు అంటుకునే సల్ఫర్ ని కలిపేటప్పుడు, వీటితో పాటు మరో లవణాన్ని కూడా కలపాలని సూచించాడు.
జబీర్ కన్నా ఈ అల్-రజీ ధ్యాస లోహాల మీద కన్నా వైద్యం మీద ఎక్కువగా ఉండేది. ఆ విధంగా పరుసవేదం వైద్యం దిక్కుగా మొగ్గు చూపే ఒరవడి ఇబిన్-సీనా (Ibn-Sina)(క్రీ.శ. 979-1037) అనే మరో పర్షియన్ పరుసవేది కృషిలో కనిపిస్తుంది. లాటిన్ భాషా ప్రభావం వల్ల ఈ పేరు అవిసెన్నా (Avicenna) అని కూడా చలామణిలో ఉండేది. రోమన్ సామ్రాజ్యం పతనమైన కాలానికి, ఆధునిక విజ్ఞానం ఆవిర్భవించిన కాలానికి మధ్య నడిమి కాలంలో ఈ అవిసెన్నా కి వైద్యుడిగా మంచి పేరు దక్కింది. శతాబ్దాలుగా తన పూర్వీకుల వైఫల్యాన్ని దృష్టిలో ఉంచుకుని అసలు ఇతర లోహాల నుండి బంగారాన్ని తయారుచెయ్యడం సాధ్యమా అని సందేహించసాగాడు అవిసెన్నా. తన పూర్వీకులంతా సాధ్యమని నమ్మి ఓడిపోతుంటే, ఇతడు మాత్రం అసాధ్యం అన్న అభిప్రాయంతో ఉండేవాడు. ఆ విధంగా పరుసవేద చరిత్రలో అవిసెన్నా ఓ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించాడు.
యూరప్ లో పరుసవేదం యొక్క పునరుజ్జీవనం
అవిసెన్నా తరువాత అరబిక్ విజ్ఞానం వేగంగా క్షీణించసాగింది. ఇస్లామిక్ ప్రపంచంలో అస్థిర వాతావరణం నెలకొన్న రోజులవి. టర్కులు, మోంగోల్ జాతులు మొదలైన కిరాత జాతుల ఎడతెగని దాడుల వల్ల ఆ సంక్షోభం మరింత తీవ్రతరం అయ్యింది. మూడు శతాబ్దాల తరువాత వైజ్ఞానిక స్ఫూర్తి, జ్యోతి, నేతృత్వం అరబ్ ప్రపంచాన్ని పూర్తిగా విడిచివెళ్లిపోయింది. ఆ స్ఫూర్తి ఇప్పుడు పశ్చిమ యూరప్ ప్రాంతాలని ఆవేశించడం మొదలెట్టింది.
ఇస్లామిక ప్రపంచంలో యూరొపియన్ల మొదటి సంపర్కం క్రైస్తవ మత జైత్రయాత్రల (Crusades) వల్ల కలిగింది. ఆ సంపర్కం కొద్దోగొప్పో శాంతియుతంగానే జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ జైత్రయాత్రల్లో మొట్టమొదటిది క్రీ.శ. 1096 లో జరిగింది. క్రీ.శ. 1099 కల్లా పశ్చిమ యూరప్ కి చెందిన క్రైస్తవ మతస్థులు జెరూసలేమ్ ని పూర్తిగా చేజిక్కించుకున్నారు. అది జరిగిన రెండు శతాబ్దాల తరువాత సిరియన్ తీరం మీద ఓ పరిమిత ప్రాంతంలో క్రైస్తవ సంస్కృతి నెలకొంది. ఇస్లామక్ సముద్రంలో ఓ చిన్న క్రైస్తవ ద్వీపం ఉన్నట్టు అయ్యింది. అక్కడ జీవించే క్రైస్తవులు అడపాదపా పశ్చిమ యూరప్ లోని తమ జన్మస్థానాలని సందర్శిస్తున్నప్పుడు తమతో పాటు కాస్తో కూస్తో అరేబియన్ విజ్ఞానాన్ని కూడా తీసుకుపోయేవారు. ఆ కాలంలోనే స్పెయన్ కి చెందిన క్రైస్తవులు ఎనిమిద శతాబ్దంలో మహ్మదీయులు ఆక్రమించిన భూభాగాలని తిరిగి క్రమంగా తమ హస్తగతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. స్పెయిన్ లో ’మూర్’ లు (Moors) అనబడే ఓ వర్గం వారు మహ్మదీయ మతాన్ని అనుసరించేవారు. ఈ మూర్ లని జయించే ప్రయత్నంలో యూరొపియన్ క్రస్తవులకి అరేబియన్ నాగరికత యొక్క ఘనత గురించి కొంచెం కొంచంగా అర్థమయ్యింది.
(సశేషం...)
0 comments