అలా అంత కాలంగా తప్పుదోవ నుండి మళ్లకుండా ముందుకు సాగుతున్నారంటే అందులో తప్పంతా రసాయనికులదే అనడానికి కూడా లేదు. గెలీలియో, న్యూటన్ తదితరులు రూపొందించిన సంఖ్యాత్మక, గణిత పద్ధతులని స్వీకరించి, తమ రంగానికి వర్తింపజేయడంలో రసాయనికులు కాస్త మందకొడిగా ఉండడానికి ఓ మౌలిక కారణం ఉంది. భౌతిక శాస్త్ర రంగంతో పోల్చితే రసాయనిక రంగం చాలా భిన్నమైనది. భౌతిక శాస్త్రంలో చేసినట్టుగా గణితాన్ని వినియోగించి రసాయనిక విషయాలని వర్ణించడం అంత సులభం కాదు.
అలాంటి పరిస్థితుల్లో కూడా రసాయనికులు కొంత ప్రగతి సాధించకపోలేదు. అసలు గెలీలియో కాలంలోనే అలాంటి రసాయనిక విప్లవం యొక్క తొలి ఆనవాళ్లు కనిపించాయని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఫ్రెమిష్ వైద్యుడు జాన్ బాప్టిస్టా ఫాన్ హెల్మాంట్ (1577-1644) కృషిలో అలాంటి పరిణామాలు తొంగిచూశాయి. ఎదుగుతున్న మొక్కలోని పదార్థం ఎక్కణ్ణించి వస్తుందో ఇతడు తెలుసుకోవాలని అనుకున్నాడు. మొక్క ఎదుగుతుంటే వివిధ దశలలో క్రమబద్ధంగా మొక్క బరువు, అది ఉన్న తొట్టెలోని మట్టి బరువు కొలుస్తూ పోయాడు. ఈ ప్రయోగంలో అతడు సంఖ్యాత్మక కొలమాన పద్ధతి కేవలం రసాయన శాస్త్రంలోనే కాదు, జీవశాస్త్రంలో కూడా ప్రయోగిస్తున్నాడన్న విషయం గమనించాలి.
ఆ రోజుల్లో మనుషులకి తెలిసిన వాయువు మన చుట్టూ కనిపించే గాలి ఒక్కటే. ఘనపదార్థాలతో, ద్రవాలతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా కనిపిస్తుంది. అందుకే మరి గ్రీకులు దీన్ని ఒక మూలతత్వంగా పరిగణించేవారు. అయితే రసాదులు కూడా అప్పుడప్పుడు “గాలుల” గురించి “ఆవిరుల” గురించి మాట్లాడుతూ ఉంటారు గాని, అవి పేరు ఊరు లేని అనామక పదార్థాలు. వాటి లక్షణాలని తేల్చి చెప్తూ కచ్చితమైన ప్రయోగాలు జరిగిన దాఖలాలు లేవు. అందుకని వాటిని పెద్దగా ఎవరూ పట్టించుకునేవాళ్ళు కారు.
(సశేషం...)
0 comments