శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.


జబీర్ తరువాత పరుసవేదంలో మళ్లీ అంత గొప్ప పేరు సాధించిన పరో పర్షియన్ రసాయనికుడు ఉన్నాడు. అతడి పేరు అల్-రజీ (Al-Razi) (క్రీ.శ. 850-925). యూరొపియన్లు ఇతణ్ణి “రాజెస్” అని పిలిచేవారు. ఇతడు కూడా ఎన్నో రసాయనిక ప్రక్రియలని తన రచనల్లో వివరించాడు. ఉదాహరణకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉపయోగించి పోత ఎలా పొయ్యాలో, విరిగిన ఎముకలని ఎలా అతికించాలో ఇతడు స్పష్టంగా వర్ణించాడు. మూలకమైన ఆంటిమొనీ యొక్క లక్షణాలని ఇతడు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. సులభంగా ఆవిరయ్యే పాదరసానికి, సులభంగా నిప్పు అంటుకునే సల్ఫర్ ని కలిపేటప్పుడు, వీటితో పాటు మరో లవణాన్ని కూడా కలపాలని సూచించాడు.

జబీర్ కన్నా ఈ అల్-రజీ ధ్యాస లోహాల మీద కన్నా వైద్యం మీద ఎక్కువగా ఉండేది. ఆ విధంగా పరుసవేదం వైద్యం దిక్కుగా మొగ్గు చూపే ఒరవడి ఇబిన్-సీనా (Ibn-Sina)(క్రీ.శ. 979-1037) అనే మరో పర్షియన్ పరుసవేది కృషిలో కనిపిస్తుంది. లాటిన్ భాషా ప్రభావం వల్ల ఈ పేరు అవిసెన్నా (Avicenna) అని కూడా చలామణిలో ఉండేది. రోమన్ సామ్రాజ్యం పతనమైన కాలానికి, ఆధునిక విజ్ఞానం ఆవిర్భవించిన కాలానికి మధ్య నడిమి కాలంలో ఈ అవిసెన్నా కి వైద్యుడిగా మంచి పేరు దక్కింది. శతాబ్దాలుగా తన పూర్వీకుల వైఫల్యాన్ని దృష్టిలో ఉంచుకుని అసలు ఇతర లోహాల నుండి బంగారాన్ని తయారుచెయ్యడం సాధ్యమా అని సందేహించసాగాడు అవిసెన్నా. తన పూర్వీకులంతా సాధ్యమని నమ్మి ఓడిపోతుంటే, ఇతడు మాత్రం అసాధ్యం అన్న అభిప్రాయంతో ఉండేవాడు. ఆ విధంగా పరుసవేద చరిత్రలో అవిసెన్నా ఓ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించాడు.


యూరప్ లో పరుసవేదం యొక్క పునరుజ్జీవనం

అవిసెన్నా తరువాత అరబిక్ విజ్ఞానం వేగంగా క్షీణించసాగింది. ఇస్లామిక్ ప్రపంచంలో అస్థిర వాతావరణం నెలకొన్న రోజులవి. టర్కులు, మోంగోల్ జాతులు మొదలైన కిరాత జాతుల ఎడతెగని దాడుల వల్ల ఆ సంక్షోభం మరింత తీవ్రతరం అయ్యింది. మూడు శతాబ్దాల తరువాత వైజ్ఞానిక స్ఫూర్తి, జ్యోతి, నేతృత్వం అరబ్ ప్రపంచాన్ని పూర్తిగా విడిచివెళ్లిపోయింది. ఆ స్ఫూర్తి ఇప్పుడు పశ్చిమ యూరప్ ప్రాంతాలని ఆవేశించడం మొదలెట్టింది.

ఇస్లామిక ప్రపంచంలో యూరొపియన్ల మొదటి సంపర్కం క్రైస్తవ మత జైత్రయాత్రల (Crusades) వల్ల కలిగింది. ఆ సంపర్కం కొద్దోగొప్పో శాంతియుతంగానే జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ జైత్రయాత్రల్లో మొట్టమొదటిది క్రీ.శ. 1096 లో జరిగింది. క్రీ.శ. 1099 కల్లా పశ్చిమ యూరప్ కి చెందిన క్రైస్తవ మతస్థులు జెరూసలేమ్ ని పూర్తిగా చేజిక్కించుకున్నారు. అది జరిగిన రెండు శతాబ్దాల తరువాత సిరియన్ తీరం మీద ఓ పరిమిత ప్రాంతంలో క్రైస్తవ సంస్కృతి నెలకొంది. ఇస్లామక్ సముద్రంలో ఓ చిన్న క్రైస్తవ ద్వీపం ఉన్నట్టు అయ్యింది. అక్కడ జీవించే క్రైస్తవులు అడపాదపా పశ్చిమ యూరప్ లోని తమ జన్మస్థానాలని సందర్శిస్తున్నప్పుడు తమతో పాటు కాస్తో కూస్తో అరేబియన్ విజ్ఞానాన్ని కూడా తీసుకుపోయేవారు. ఆ కాలంలోనే స్పెయన్ కి చెందిన క్రైస్తవులు ఎనిమిద శతాబ్దంలో మహ్మదీయులు ఆక్రమించిన భూభాగాలని తిరిగి క్రమంగా తమ హస్తగతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. స్పెయిన్ లో ’మూర్’ లు (Moors) అనబడే ఓ వర్గం వారు మహ్మదీయ మతాన్ని అనుసరించేవారు. ఈ మూర్ లని జయించే ప్రయత్నంలో యూరొపియన్ క్రస్తవులకి అరేబియన్ నాగరికత యొక్క ఘనత గురించి కొంచెం కొంచంగా అర్థమయ్యింది.


(సశేషం...)

అమరత్వాన్ని ప్రసాదించే రాయి

Posted by V Srinivasa Chakravarthy Saturday, January 1, 2011 2 comments


బ్లాగర్లకి నూతన సంవత్సర శుభాకాంక్షలు!


జబీర్ చేసిన ఆవిష్కరణలలో కెల్లా లోహాల రూపాంతరీకరణ (transmutation) కి సంబంధించిన అధ్యయనాలే అతి ముఖ్యమైనవి. పాదరసం ఓ అపురూమైన లోహంగా అతడు భావించేవాడు. మామూలు పరిస్థితుల్లో కూడా ద్రవరూపంలో ఉండే పాదరసంలో పార్థివ తత్వం అతి తక్కువగా ఉంటుంది అనేవాడు. సల్ఫర్ కి ఉండే ప్రత్యేక లక్షణం – జ్వలనీయత (combustibility) – అతణ్ణి ఆకట్టుకుంది. (సల్ఫర్ విషయంలో అతణ్ణి ఆకట్టుకున్న మరో లక్షణం బంగారం లాంటి దాని పచ్చని పసిమి). పాదరసాన్ని, సల్ఫర్ ని వివిధ నిష్పత్తులలో కలపితే వివిధ రకాల లోహాలు తయారు అవుతాయని అతడు అపోహ పడేవాడు. కనుక ఈ రెండు పదార్థాలని కచ్చితంగా ఏ నిష్పత్తిలో కలిపితే బంగారం పుడుతుంది అన్నదే ఇంకా తేలని ప్రశ్న. అయితే అలాంటి మిశ్రమం రూపాంతరీకరణ చెంది అందులోంచి బంగారం పుట్టడానికి మరో మూడో పదార్థం కావలసి ఉంది. అదేంటి అన్నది మరో తేలని ప్రశ్న.

అలా రూపాంతరీకరణ జరగడానికి దొహదం చేసే పదార్థం ఒక రకమైన పొడి అని ప్రాచీన సాంప్రదాయం చెప్తుంది. ఆ పొడిని గ్రీకులు “గ్సెరియాన్” (xerion) అని పిలిచేవారు. గ్సెరియాన్ అంటే గ్రీకులో “తడిలేనిది (అంటే పొడిగా ఉండేది)” అని అర్థం. దాన్ని కాస్తా అరబ్బులు “అల్-ఇక్సిర్” అని మార్చారు. అది యూరొపియన్ల భాషల్లో ఎలిక్సిర్ (elixir) అయ్యింది. కాలక్రమేణా ఆ పొడి పదార్థాన్ని ఇంగ్లీష్ లో philosopher’s stone (తత్వవేత్తల శిల) అని పిలువసాగారు. (1800 ల వరకు కూడా తత్వవేత్తలు అంటే ఆధునిక పరిభాషలో శాస్త్రవేత్తలు అన్న అర్థం ఉండేదని గుర్తుంచుకోవాలి).

నిమ్నజాతి పదార్థాలని బంగారంగా మార్చడానికి అవసరమైన ఈ ఎలిక్సిర్ కి ఇతర అద్భుతమైన లక్షణాలు ఉండేవని కూడా భావించేవారు. ఉదాహరణకి అది సర్వరోగ నివారణి అనుకునేవారు. దాని వల్ల అమరత్వం కూడా సిద్ధిస్తుందని నమ్మేవారు. ఆ విధంగా బంగారాన్ని పండించగోరిన రసాయన శాస్త్రవేత్తలు అమృతమైన జీవనాన్ని కూడా సాధించగోరుతున్నట్టు అయ్యింది.

ఆ కారణం చేత కొన్ని శతాబ్దాల పాటు పరుసవేదులు రెండు మహోన్నత లక్ష్యాల కోసం శ్రమిస్తున్నట్టు అయ్యింది. ఆ లక్ష్యసాధనలో రెండు సమాంతర మార్గాల వెంట పయనిస్తున్నట్టుయ్ అయ్యింది. ఒకటి బంగారం కోసం గాలింపు, రెండు వెలితి లేని స్వస్థత కోసం, మృతిలేని జీవనం కోసం అన్వేషణ.



(సశేషం...)

అరేబియాకి పాకిన ఖెమియా

Posted by V Srinivasa Chakravarthy Thursday, December 23, 2010 5 comments

అరబ్బులు

ఏడవ శతాబ్దంలో అరబ్బులు రంగప్రవేశం చేశారు. అంతకు పూర్వం వారి ప్రభావం ఆ ఎడారి ద్వీపకల్పానికే పరిమితమై ఉండేది. కాని మహమ్మదు ప్రవక్త కొత్తగా స్థాపించిన ఇస్లామ్ మతం వల్ల అరేబియా ప్రాంతం కొత్త ఊపిరి పోసుకుంది. అరబ్బీ సేనలు గొప్ప బలోద్ధతితో అన్ని దిశలలో ముందుకు దూసుకుపోయాయి. ఆ జైత్రయాత్రలో పశ్చిమ ఆసియా లోను, ఉత్తర ఆఫ్రికాలోను విశాల భూభాగాలు వారి హస్తగతం అయ్యాయి. క్రీ.శ. 641 లో ఈజిప్ట్ మీద దండయాత్ర చేశారు. కొన్నేళ్ళలోనే మొత్తం పెర్షియా అంతా అరబ్బుల ధాటికి తట్టుకోలేక వారికి పాదాక్రాంతం అయ్యింది.

పెర్షియాలో అరబ్బులకి గ్రీకుల ప్రాచీన వైజ్ఞానిక సాంప్రదాయంతో సంపర్కం ఏర్పడింది. అలా అనుకోవడానికి ముఖ్యంగా ఓ ప్రత్యేక సంఘటన కారణం కావచ్చు. క్రీ.శ. 670 లో అరబ్బులు కాంస్టాంటినోపుల్ మీద దండయాత్ర చేసినప్పుడు అక్కడ వారికి ఒక విచిత్రమైన “గ్రీకు అగ్ని” ఎదురయ్యింది. నీరు చల్లినా ఆరని విడ్డూరమైన జ్వాల అది. దాని దెబ్బకి ఎన్నో అరబ్బీ ఓడలు మండి బూడిద అయ్యాయి. ఆ జ్వాలని తయారుచేసినవాడు కల్లినికస్ అనే ఓ ఖెమియా ఉపాసకుడు అని చరిత్ర మనకు చెప్తుంది. ఆ నిప్పు ఎలా రాజేయాలో ప్రాంతీయులకి నేర్పించి ఈ కల్లినికస్ అరబ్బు సేనలు వచ్చే లోపలే తన స్వదేశం అయిన ఈజిప్ట్ కి పారిపోయాట్ట!

అరేబియాలో ఖెమియా కాస్తా “అల్-కిమియా” గా మారింది. ఈ పదం తదనంతరం యూరప్ లో, ముఖ్యంగా ఇంగ్లీష్ లో, ఆల్కెమీ (alchemy, అంటే పరుసవేదం) గా మారింది. రసాయనిక శాస్త్ర చరిత్రలో సుమారు రెండు వేల ఏళ్ల పాటు అంటే క్రీ.పూ. 300 నుండి క్రీ.శ. 1600 వరకు ఈ ఆల్కెమీ అన్న పదమే స్థిరంగా నిలిచింది.

క్రీ.పూ. 300 నుండి క్రీ.శ. 1100 వరకు యూరప్లో రసాయనిక చరిత్ర పుటలు ఇంచుమించు ఖాళీగా ఉండిపోయాయనే చెప్పాలి. క్రీ.శ. 650 తరువాత గ్రీక్, ఈజిప్ట్ సాంప్రదాయలకి చెందిన పరుసవేదాన్ని ఉపాసించి, ప్రచారం చేసే బాధ్యత పూర్తిగా అరబ్బుల మీదే పడింది. ఆ కార్యాన్ని వాళ్లు ఓ ఐదు శతాబ్దాల కాలం పాటు కొనసాగించారు. రసాయనిక చరిత్రలో అరబ్బులు పోషించిన పాత్రకి చిహ్నాలుగా ప్రస్తుతం ఎన్నో ఆధునిక రసాయనాల పేర్లు అరబ్ పదాలు కావాడం గమనార్హం. అలెంబిక్, ఆల్కలీ, ఆల్కహాల్, కార్బాయ్, నాప్థా, జిర్కాన్ మొదలైన పదాలన్నీ అరబిక్ నుండి వచ్చినవే.

అరబ్బీ సామ్రాజ్య విస్తరణ జరిగిన తొలిదశల్లో పరుసవేదం ఎంతో ఉత్కృష్ట దశని చేరుకుంది. మహ్మదీయ పరుసవేదుల్లో బాగా పేరుమోసినవాడు, సమర్ధుడు అయినవాడు జబిర్ ఇబిన్-హయ్యాన్ (రమారమి క్రీ.శ. 760-815). శతాబ్దాల తరువాత ఇతడి పేరు యూరప్ లో “గెబర్” గా ప్రచారం అయ్యింది. అరేబియన్ కథలలో మనకు తారసపడే ప్రఖ్యాత హరూన్-అల్-రషీద్ ఏలికలో, అరబిక్ సామ్రాజ్యం మహర్దశని చేరుకున్న కాలంలో ఈ జబిర్ జీవించాడు.

పరుసవేదం మీద ఇతగాడు విస్తృతంగా రచనలు చేశాడు. ఇతడి శైలి కూడా సులభంగా, అందరికీ అర్థమయ్యేలా ఉండేది. (అతడి తదనంతరం ఎంతో మంది పరుసవేదులు అతడి పేరుపెట్టుకుని పుస్తకాలు రాశారు). అతడు తన పుస్తకాల్లో అమోనియమ్ క్లోరైడ్ గురించి వర్ణిస్తాడు. తెల్ల సీసం (white lead) ఎలా తయారుచెయ్యాలో వివరించాడు. స్వేదన ప్రక్రియ (distillation) తో వెనిగార్ నుండి అసిటిక్ ఆసిడ్ ని ఎలా చెయ్యాలో చూపించాడు. ప్రాచీనులకి తెలిసిన అత్యంత శక్తివంతమైన ఆసిడ్ ఇదే. కస్త బలహీన రూపంలో నైట్రిక్ ఆసిడ్ ని కూడా అతడు తయారు చెయ్యగలిగాడు.


(సశేషం...)



ఒక దశలో గ్రీకు తత్వచింతన అవసాన దశ చేరుకుంది. దాంతో పాటు ఖెమియా కళ కూడా క్షీణించింది. క్రీ.శ. 100 తరువాత ఆ విద్యలో కొత్తగా కనుక్కున్నది ఏమీ లేదనే చెప్పాలి. అలా ఎదుగు బొదుగు లేకుండా స్థబ్దుగా ఉన్న విజ్ఞానంలోని వెలితిని పూడ్చడానికి లేనిపోని అధ్యాత్మిక సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి.

క్రీ.శ. 300 ప్రాంతాల్లో ఈజిప్ట్ కి చెందిన జోసిమస్ అనే రచయిత ఖెమియా మీద 28 పుస్తకాలుగల ఒక గొప్ప విజ్ఞాన సర్వస్వాన్ని (encylcopedia) రాశాడు. అంతకు పూర్వం ఐదు, ఆరు శతాబ్దాలుగా పోగైన ఖెమియా విజ్ఞానాన్ని ఆ గ్రంథాలలో పొందుపరిచాడు. కాని దురదృష్టవశాత్తు అందులో విలువైన సమాచారం చాలా తక్కువనే చెప్పాలి. ఎక్కడో అరుదుగా నాలుగు అర్థవంతమైన విషయాలు దొర్లవచ్చునేమో. ఉదాహరణకి ఒక చోట ఇవ్వబడ్డ వర్ణన బట్టి ఆ వర్ణించబడ్డ పదార్థం ఆర్సెనిక్ అని అర్థమవుతుంది. అలాగే మరో చోట్ లెడ్ అసిటేట్ అనే విషపదార్థం యొక్క తయారీ గురించి కూడా రాశాడు. ఆ పదార్థం తియ్యగా ఉంటుందని కూడ పేర్కొన్నాడు. (ఆ పదార్థాన్ని ఆధునిక భాషలో ’సీసపు చక్కెర’ (sugar of lead) అంటారన్నది గమనించాల్సిన విషయం).

అసలే శిధిలావస్థలో ఉన్న ఈ ఖెమియా కళకి ఒక దశలో చావుదెబ్బే తగిలింది. ఆ వేటు వేసినవాడు రోమన్ చక్రవర్తి డయోక్లిటియన్. ఖెమియా కళ వల్ల మామూలు పదార్థాల నుండి బంగారం చెయ్యడం నలుగురికీ తెలిస్తే, అసలే బలహీనంగా ఉన్న ఆ నాటి రోమన్ ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందని చక్రవర్తి భయపడ్డాడు. ఆ కారణం చేత ఖెమియా మీద ఉన్న పుస్తకాలన్నిటినీ సేకరించి తగులబెట్టించాడు. ఖెమియా విశేషాలు ప్రస్తుతం మనకి పెద్దగా లభ్యం కాకపోవడానికి కారణాల్లో ఈ సంఘటన ఒకటి.

ఖెమియా శైధిల్యానికి మరో కారణం కూడా ఉంది. అవి క్రైస్తవ మతం యొక్క పరపతి, ప్రభావం పెరుగుతున్న రోజులు. క్రైస్తవ మతానికి వ్యతిరేకమైన సాంప్రదాయాలకి, సంస్కృతులకి గడ్డురోజులు మొదలయ్యాయి. క్రీ.శ. 400 లో జరిగిన క్రైస్తవ మతాస్థుల నిరసనలలో అలెగ్జాండ్రియాలోని చారిత్రాత్మక గ్రంథాలయం తగులబడిపోయింది. ప్రాచీన ఈజిప్ట్ కి చెందిన అధ్యాత్మిక సంస్కృతితో లోతైన సంబంధాలు గల ఖెమియా కళ నెమ్మదిగా అంతరించిపోయింది, అదృశ్యమైపోయింది.

ఆ కాలంలోనే గ్రీకు తత్వచింతన రోమన్ సామ్రాజ్యం నుండి ఆనవాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. క్రైస్తవమతం చిన్న చిన్న వర్గాలుగా ఛిన్నాభిన్నం అయిపోయింది. వారిలో నెస్టోరియన్లు అనే ఒక వర్గానికి చెందినవారు ఉండేవారు. ఈ వర్గం వారు ఐదవ శతాబ్దానికి చెందిన నెస్టర్ అనే ఓ సిరియన్ సాధువు యొక్క బోధనలు అనుసరించేవారు. కాన్స్టాంటినోపుల్ కి చెందిన ఛాందస క్రైస్తవులు ఈ వర్గీయులని వేధించేవారు. ఆ వేధింపులు భరించలేక ఆ వర్గీయులు తూర్పుదిశగా పారిపోయి పర్షియాలో తలదాచుకున్నారు. పెర్షియాని ఏలే రాజులు వారికి సాదరంగా ఆశ్రయం ఇచ్చారు (బహుశ రోమ్ కి వ్యతిరేకంగా వీళ్లని వాడుకోవాలని వాళ్ల పన్నాగం కాబోలు).

ఈ నెస్టీరియన్లు గ్రీకు చింతనని, జ్ఞానాన్ని తమతో పెర్షియాకి తీసుకువచ్చారు. దాంతో పాటు పరుసవేదం మీద కూడా ఎన్నో పుస్తకాలు మోసుకువచ్చారు. క్రమంగా వారి ప్రభావం, పరపతి పెరిగి పెరిగి క్రీ.శ. 500 కాలానికి తారస్థాయిని చేరుకుంది.



(చిత్రం - http://www.corbisimages.com/Enlargement/MF002952.html)


(సశేషం...)

పసిడికి బదులు ఇత్తడి

Posted by V Srinivasa Chakravarthy Wednesday, December 22, 2010 0 comments


గ్రీకు, ఈజిప్ట్ సంస్కృతుల సంగమంలో ఏర్పడ్డ ఖెమియా సాంప్రదాయంలో మనకి తెలిసిన మొట్టమొదటి గొప్ప పండితుడి పేరు బోలోస్. నైలు నది లంక (delta) ప్రాంతంలో ఉన్న మెండెస్ నగరానికి చెందిన ఈ వ్యక్తి రమారమి క్రీ.పూ. 200 ప్రాంతాల్లో జీవించాడు. తన రచనల్లో తరచు డెమోక్రిటస్ పేరు ప్రస్తావిస్తూ ఉంటాడు కనుక ఇతడిని బోలోస్-డెమోక్రిటస్ అని కూడా పిలిస్తుంటారు. కొన్ని సార్లు కుహనా డెమోక్రిటస్ అని కూడా అంటుంటారు.

ఖెమియా కళలో కెల్లా అతి ముఖ్యమైన ఓ సమస్య మీద బోలోస్ శ్రద్ధ వహించాడు. ఒక లోహాన్ని మరో లోహంగా మార్చడం ఎలా? ముఖ్యంగా వెల తక్కువైన సీసం, ఇనుము మొదలైన లోహాలని బంగారంగా మార్చడం ఎలా?

నాలుగు మూలతత్వాల సిద్ధాంతం ప్రకారం విశ్వంలోని వివిధ పదార్థాలన్నీ ఆ మూలతత్వాలతో కూడుకున్న వివిధ మిశ్రమాలే. ఈ భావనకి పరమాణు వాదనతో ప్రమేయం లేదు. పదార్థంలో ఉన్నది పరమాణువులు అనుకున్నా, అవిచ్ఛిన్న పదార్థమైన మూలతత్వాలు అనుకున్నా ఈ భావనలోని సత్యం మాత్రం మారదు. పరమాణువుల రూపంలోనైనా, మూల పదార్థాల రూపంలోనైనా వాస్తవ వస్తువులన్నీ కొన్ని మౌలిక అంశాల మిశ్రమాలే నని ఈ భావన చెప్తుంది. అక్కడితో ఆగక అసలు ఆ మూలతత్వాలు కూడా ఒకటి మరొకదానిగా మారే అవకాశం ఉందని కూడా కొంత ఆలోచన ఉండేది. ఎందుకంటే నీరు ఆవిరై తేమగా అంటే గాలిగా మారుతుంది. ఆ గాలి తిరిగి నీరై వర్షించగలదు. పృథ్వీ తత్వం గల కట్టెని కాల్చితే అందులోంచి అగ్ని, గాలి రెండూ పుడతాయి.

ఇలాంటి వాస్తవ పరిణామాల బట్టి చూస్తే అసలు ఏ మార్పయినా ఎందుకు అసంభవం కావాలి అన్న ప్రశ్న పుడుతుంది. సరైన పద్ధతి తెలిస్తే ఏ పదార్థాన్నయినా మరే పదార్థంగానైనా మార్చొచ్చు. ఒక రకమైన ఎర్ర రాయిని ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా ఇనుముగా మార్చవచ్చు. గ్రీకు యోధుడు అచిలీస్ కాలంలో ఆ పద్ధతి తెలిసేది కాదు. ఇనుప కవచాలకి నోచుకోని అచిలీస్ విధిలేక కంచుకవచాలు వేసుకునేవాడు. ఆ విధంగా ఎర్రరాయిని ఇనుముగా మార్చగలిగి నప్పుడు, దాన్ని బంగారంగా కూడా మార్చలేమా? దానికీ ఏదో పద్ధతి ఉంటుందేమోగా?

నిమ్న జాతి పదార్థాల నుండి బంగారాన్ని పుట్టించే ప్రయత్నం కొన్ని శతాబ్దాల పాటు జరిగింది. అయితే బంగారాన్ని తయారుచేసే పద్ధతిని తెలుసుకునే ప్రయత్నం కన్నా, ఆ పద్ధతి తెలుసని బుకాయించి తమ అధికార బలంతో అమాయకులని మోసం చేసే ప్రయత్నమే సులభమని చాలా మందికి అర్థమయ్యింది. ఆ విధంగా ఖెమియా ఉపాసకులలో మోసగాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఖెమియా యొక్క ఈ అంశాన్ని గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించబోవడం లేదు.

బోలోస్ తన రచనలలో బంగారాన్ని తయారు చేసే పద్ధతులని వర్ణించాడని చెప్తారు. అయితే అది నిజంగా బుకాయింపు కాకపోవచ్చు. రాగిని, జింక్ తో తగు పాళ్లలో కలిపితే ఇత్తడి పుడుతుంది. ఇది పచ్చగా కాస్త బంగారం లాగానే ఉంటుంది. బంగారపు ఛాయ గల ఈ లోహాన్ని తయారు చెయ్యడము, బంగారాన్ని తయారుచెయ్యడము రెండూ ఒక్కటే నని ఆ రోజుల్లో జనం అపోహ పడేవారంటే ఆశ్చర్యం లేదు.

(ఇత్తడి ’డై’, పక్కన రాగి, జింక్ నమూనాలు – వికిపీడియా చిత్రం)
(సశేషం...)



పైగా ఆనాటి ఖెమియా కళ మతానికి సన్నిహితంగా ఉండేది కనుక, ఆ కళని ఉపాసించేవారికి ఏవో మహత్తర శక్తులు ఉన్నాయని, వారికి ఏవో ప్రమాదకరమైన విద్యలు తెలుసని జనం అపోహపడేవారు. (భయంకరమైన భవిష్యత్ జ్ఞానాన్ని కలిగిన జోస్యుల గురించి, పదార్థ లక్షణాలని అద్భుతంగా మార్చగల రసాయనికుల గురించి, దేవతలని ఉపాసించి వారి అనుగ్రహాన్ని, ఆగ్రహాన్ని శాసించే మహత్తర శక్తులు గల అర్చకుల గురించి ఆ రోజుల్లో కథలుగా, గాధలుగా విస్మయంగా, భయంగా చెప్పుకునేవారు. ఆ విధంగా కాస్తోకుస్తో జ్ఞానం కలవారంతా మాంత్రికులుగా, మాయలమరాఠీలుగా చలామణి కాసాగారు.)

ఆ విధంగా సామాన్య జనం వారిని చూస్తి అబ్బురపడుతుంటే, భయపడుతుంటే ఈ “మాంత్రికులు” గర్వంగా మిసం మెలేసేవారు. తమ జ్ఞానంతో జనం యొక్క అజ్ఞానాన్ని పోగొట్టే ప్రయత్నం చెయ్యక వారి అమాయకత్వాన్ని మరింత పోషించే ప్రయత్నం చేసేవారు. అందుచేత ఖెమియా కళని ఉపాసించే వారంతా తమ విద్య గురించి ఎవరికీ అర్థం కాని రహస్య సంకేతాలతో, గోప్యమైన భాషలో రాసుకునేవారు. ఆ కారణం చేత ఎవరికీ అర్థం గాని ఈ విద్యలో సామాన్యులకి అందని ఏదో శక్తి, మహత్తు ఉన్నాయని అంతా భ్రమ పడేవారు.


ఉదాహరణకి స్థిరతారల నేపథ్యం మీద కదులుతూ, సంచరిస్తూ కనిపించే ఏడు ఖగోళ వస్తువులు ఉన్నాయి. వాటినే మనం గ్రహాలు అంటాము. అలాగే ఆ రోజుల్లో తెలిసిన ఏడు లోహాలు ఉండేవి. అవి బంగారం, వెండి, రాగి, ఇనుము, తగరం, సీసం, పాదరసం. ఆ ఏడు గ్రహాలకి, ఈ ఏడు లోహాలకి మధ్య ఏదో సంబంధం ఉందని అనుకునేవారు. ఆ విధంగా సూర్యుడిని బంగారంతో ముడి పెట్టారు. అలాగే చంద్రుడికి వెండితోను, వీనస్ కి రాగితోను సంబంధం ఉందని భావించారు. ఆ విధంగా రసాయనిక చర్యలని పౌరాణిక కథలకి మల్లె విచిత్రంగా వర్ణించే పోకడ ఒకటి బయలుదేరింది.

ఆ కాలపు నమ్మకాలకి ఆనవాళ్లు ఆధునిక పరిభాషలో కూడా అక్కడక్కడ తొంగిచూస్తుంటాయి. ఉదాహరణకి ఆధునిక పరిభాషలో silver nitrate అని పిలుచుకునే రసాయనానికి “lunar caustic” అని పేరు ఉంది. ఇక్కడ వెండికి, చంద్రుడికి (“lunar”) మధ్య ఆరోపించబడ్డ సంబంధం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అలాగే పాదరసానికి దాని ఆధునిక నామం mercury గ్రహం నుండి వచ్చింది. దాని అసలు ప్రాచీన నామం hydrargyrum (అంటే ’ద్రవ రూపంలోని వెండి’ అని అర్థం; hydra అంటే నీరు, argentum అంటే వెండి). పాదరసాన్ని సూచించే పాతకాలపు ఇంగ్లీష్ పదం అయిన quicksilver కి కూడా ఇంచుమించు అలాంటి అర్థమే ఉంది.

పదార్థాలకి ఈ విధంగా తీరు తెన్ను లేని నామకరణాలు చెయ్యడం వల్ల, జ్ఞానాన్ని గుట్టుగా ఉంచే పద్ధతి వల్ల రెండు దురదృష్టకరమైన పరిణామాలు ఏర్పడ్డాయి. పరిజ్ఞానం వేగంగా ప్రచారం కాకపోవడం వల్ల అజ్ఞానం లోతుగా పాతుకుపోయింది. ఒకరి తప్పుల నుండి మరొకరు నేర్చుకునే అవకాశం సన్నగిల్లింది. ఒకరి ప్రతిభ నుండి మరొకరు స్ఫూర్తిని పొందే దారి లేకపోయింది. ఎవరికీ అర్థంగాని విచిత్ర పదజాలాన్ని విసరగలిగే చాతుర్యం ఉన్నవాడు నిపుణుడిగా చలామణి అయ్యేవాడు. ఎవడు పండితుడో, ఎవడు మూఢుడో తెలీని అయోమయ వాతావరణం నెలకొంది.
(సశేషం...)

పరుసవేదం

Posted by V Srinivasa Chakravarthy Monday, December 20, 2010 0 comments



అధ్యాయం 2

పరుసవేదం



అలెగ్జాండ్రియా

అరిస్టాటిల్ కాలంలోనే మాసెడాన్ ని (ఇది గ్రీస్ కి ఉత్తరాన ఉన్న ఓ రాజ్యం) ఏలే అలెగ్జాండర్ చక్రవర్తి విశాలమైన పర్షియా సామ్రాజ్యాన్ని జయించాడు. క్రీ.పూ. 323 లో అలెగ్జాండర్ మరణం తరువాత అతడు స్థాపించిన విశాల సామ్రాజ్యం అంతా ముక్కలుచెక్కలు అయ్యింది. అయితే ఆ తరువాత కూడా మిడిల్ ఈస్ట్ కి చెందిన ఎన్నో ప్రాంతాలు ఇంకా గ్రీకుల, మాసెడోనియన్ల హయాంలో ఉండేవి. తరువాత కొన్ని శతాబ్దాల పాటు ఆ ప్రాంతంలో ఎన్నో విభిన్న సంస్కృతుల సమ్మేళనం జరిగింది. ఆ కాలాన్నే హెల్లెనిస్టిక్ కాలం అంటారు.

అలెగ్జాండర్ కింద పని చేసిన సేనాపతులలో ఒకడైన టోలెమీ ఈజిప్ట్ లో ఓ కొత్త రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యానికి అలెగ్జాండ్రియా నగరం రాజధాని అయ్యింది. అలెగ్జాండర్ స్థాపించిన ఈ నగరానికి ఆ చక్రవర్తి పేరే పెట్టారు. అలెగ్జాండ్రియాలో టోలెమీ, ఇంకా అతడి కొడుకైన టోలెమీ II, జ్ఞాన దేవతలైన మ్యూస్ (Muses) ల కోసం ఓ ఆలయాన్ని నిర్మించారు. మ్యూస్ దేవతల ఆలయం కనుకనే దాన్ని మ్యూసియమ్ (Museum) అన్నారు. వర్తమాన ప్రపంచంలో ఓ పరిశోధనా కేంద్రానికో, ఓ విశ్వవిద్యాలయానికో ఎలాంటి స్థానం ఉంటుందో ఆ రోజుల్లో ఆ మ్యూసియమ్ కి అలాంటి స్థానమే ఉండేది. ఆ మ్యూసియమ్ తో పాటు ప్రాచీన లోకంలో కెల్లా అతి పెద్దదైన ఓ గొప్ప గ్రంథాలయాన్ని కూడా నిర్మించారు.

ఆ విధంగా ఒక పక్క ఈజిప్షియన్లకి సాంప్రదాయ బద్ధంగా వస్తున్న ఆచరణాత్మక రసాయనిక విజ్ఞానం, మరో పక్క గ్రీకు సాంప్రదాయం నుండి వచ్చిన సైద్ధాంతిక విజ్ఞానం రెండూ చేతులు కలిపాయి. అయితే అలాంటి సంగమం వల్ల పూర్తిగా మంచే జరిగిందని చెప్పడానికి లేదు. ఈజిప్షియన్లు తమకి తెలిసిన రసాయన విద్యని ప్రత్యేకించి చనిపోయిన వారి దేహాలని భద్రపరచడం కోసం, తదితర మతపరమైన ఆచారాల కోసం మాత్రమే వాడేవారు. ఈజిప్షియన్ ఆచారం ప్రకారం ఐబిస్ అనే పక్షి తలకాయ గల థోథ్ అనే ఓ దేవత రసాయన విద్యకి అధిదేవత. ఈజిప్షియన్ రసాయనిక నైపుణ్యాన్ని చూసి మురిసిపోయిన గ్రీకులు ఆ విద్యని, ఆ విద్యతో పాటు ఈజిప్షయన్ల అధ్యాత్మిక సాంప్రదాయాలని, నమ్మకాలని కూడా పూర్తిగా స్వీకరించారు. అంతేకాక గ్రీకు దేవత అయిన హెర్మిస్, ఈజిప్షియన్ల దేవత అయిన థోథ్ ఇద్దరూ ఒక్కరే నని కూడా గ్రీకులు భావించేవారు.

అంతకు పూర్వం అయోనియాకి చెందిన తాత్వికులు మతాన్ని, విజ్ఞానాన్ని వేరు వేరుగా ఉంచారు. రెండూ కలియని దిక్కులుగా ఉండేవి. కాని ఈజిప్ట్ లో జరిగిన ఈ కొత్త మత, విజ్ఞానాల సంగమం వల్ల జ్ఞానం యొక్క పురోగతి మందగించింది.



(సశేషం...)

గ్రీకుల “అణువులు”


పదార్థ లక్షణాల గురించి ఆలోచించిన ప్రాచీన గ్రీకు తాత్వికులలో మరో ముఖ్యమైన ప్రశ్న కూడా బయలుదేరింది. అది పదార్థం యొక్క భాజనీయతకి సంబంధించిన ప్రశ్న. ఒక రాయిని బద్దలు కొట్టి చిన్న చిన్న ముక్కలుగా చేశాం అనుకుందాం. ఆ ముక్కలు కూడా ఇంకా రాతి ముక్కలే. ఆ ముక్కలని ఇంకా బద్దలు కొడితే పొడి గా మారుతాయి. ఆ పొడిలో చాలా చిన్న రేణువులు ఉంటాయి. అలా పదార్థాన్ని విభజిస్తూ పోతే ఏం జరుగుతుంది? అలా ఎంతవరకు విభజించగలం?

ఈ విషయంలో అయోనియాకి చెందిన లూసిప్పస్ (క్రీ.పూ. 450 రమారమి) ఓ ముఖ్యమైన భావన వ్యక్తం చేశాడు. ఏ పదార్థాన్నయినా అనంతంగా విభజిస్తూ పోవచ్చని అంతవరకు మనుషులు నమ్మేవారు. కాని అలా జరగదన్నాడు లూసిప్పస్. పదార్థాన్ని విభజిస్తూ పోతే ఒక దశలో మనకి ఎంత చిన్న రేణువులు మిగులుతాయంటే, వాటిని అంత కన్నా చిన్న భాగాలుగా బద్దలు కొట్టడానికి వీలుపడదన్నాడు.

లుసిప్పస్ శిష్యుడైన డెమాక్రిటస్ (క్రీ.పూ. 470-380 రమారమి) ఈ భావనని మరింత ముందుకి తీసుకెళ్లాడు. ఇతగాడు ఉత్తర ఏజియాకి చెందిన అబ్డెరా నగరానికి చెందినవాడు. పదార్థంలో ఈ అతి చిన్న రేణువులని ఇతగాడు “అటొమోస్” (atomos) అన్నాడు. అంటే “అవిభాజ్యం” అని అర్థం. పదార్థాన్ని అనంతంగా విభజించడం సాధ్యం కాదని, పదార్థం కనిష్ఠ పరిమాణం గల రేణువులతో కూడుకున్నదని చాటే బోధననే పరమాణువాదం (atomism) అంటారు.

ఇక్కడితో ఆగక డెమాక్రిటస్ అంతకు ముందు అరిస్టాటిల్ చెప్పిన మూల తత్వాలకి, ఈ పరమాణువులకి మధ్య లంకె పెట్టాడు. ఒక్కొక్క మూలతత్వంలోను ప్రత్యేక లక్షణాలు గల పరమాణువులు ఉన్నాయన్నాడు. పరమాణువుల పరిమాణం, ఆకారం కూడా అవి ఉన్న మూలతత్వాన్ని బట్టి మారుతుంది అన్నాడు. మనం చుసే వస్తువుల లోని మూల తత్వాలన్నీ వివిధ రకాల పరమాణువులు వివిధ నిష్పత్తులలో కలియగా ఏర్పడ్డవే నన్నాడు. కనుక పరమాణువుల మిశ్రమాన్ని మార్చితే పదార్థం మారిపోతుంది అన్నాడు.

ఆధునిక పరమాణు విజ్ఞానానికి ఈ ప్రాచీన భావాలకి మధ్య ఎంతో సాన్నిహిత్యం కనిపించి ఆశ్చర్యం కలుగుతుంది. అయితే డెమాక్రిటస్ కి ఈ భావనలని ప్రయోగాత్మకంగా నిరూపించే అవకాశం లేకపోయింది. ( గ్రీకు తాత్వికులు ప్రయోగాలు చేసేవారు కారు. కేవలం కొన్ని “మూల సూత్రాల” నుండి బయలుదేరి, తర్కాన్ని ఉపయోగించి, వాదన ద్వార సత్య నిర్ణయం చేసేవారు.)

పదార్థాన్ని ఒక స్థాయికి మించి విభజించలేం అన్న భావన చాలా మంది తాత్వికులకి, ముఖ్యంగా అరిస్టాటిల్ కి, అసంగతంగా తోచింది. ఆ భావనలో వారికి అంతర్వైరుధ్యం ఉన్నట్టు తోచింది. కనుక దాన్ని సమ్మతించలేకపోయారు. కనుక డెమాక్రిటస్ తరువాత రెండు వేల ఏళ్ల వరకు ఆ ప్రసక్తి మళ్లీ ఎవరూ ఎత్తలేదు.

అలాగని పరమాణువాదం పూర్తిగా చచ్చిపోయిందని కాదు. తదనంతరం గ్రీకు తాత్వికుడు (క్రీ.పూ. 342-270) ఎపిక్యూరస్ పరమాణు వాదాన్ని తన చింతనలో భాగంగా చేసుకున్నాడు. అతడి తరువాత కొన్ని శతాబ్దాల పాటు అతడి భావాలని స్వీకరించి, ప్రచారం చేసినవాళ్లు ఉన్నారు. అలా ప్రచారం చేసిన వారిలో ఒకడు రోమన్ కవి టైటస్ లుక్రెటియస్ కారస్ (క్రీ.పూ. 95-55). ఇతణ్ణి లుక్రెటియస్ అని పిలుస్తారు. తన పూర్వీకులైన డెమొక్రిటస్, ఎపిక్యూరస్ ల భావనలని వివరంగా వర్ణిస్తూ అతడు De Rerum Natura (పదార్థం యొక్క స్వభావం) అనే ఓ సుదీర్ఘ కావ్యం రాశాడు. కేవలం మనోల్లాసానికి మత్రమే కాకుండా శాస్త్రబోధనకి పనికొచ్చే కావ్యాలు అరుదు. అలాంటి అరుదైన కావ్యాలలో ఒకటిగా ఈ పుస్తకాన్ని పరిగణిస్తారు.

డెమొక్రిటస్, ఎపిక్యూరస్ ల రచనలు ప్రస్తుతం మనకి పెద్దగా మిగలకపోయినా, లుక్రెటియస్ కావ్యం మాత్రం మనకిప్పుడు సమగ్రంగా దొరుకుతుంది. రెండు వేల ఏళ్ల నాటి పరమాణువాదాన్ని ఆధునిక వైజ్ఞానిక యుగం వరకు భద్రంగా తీసుకొచ్చింది ఈ గ్రంథం.

(సశేషం...)


అనాక్సీమినీస్ కాలంలోనే పెర్షియన్లు అయోనియా తీరం మీద దండెత్తారు. తిరగబడ్డ అయోనియన్లని పెర్షియన్లు ఉక్కుపాదంతో తొక్కేశారు. అలాంటి విషమ పరిస్థితుల్లో వైజ్ఞానిక సాంప్రదాయం కాస్త బలహీనమైనా కొంత రసాయనిక పరిజ్ఞానం పశ్చిమదిశగా వ్యాపించింది. అయోనియాకి కాస్త దూరంలో సామోస్ అనే దీవి మీద జీవించే పైథాగొరాస్ (క్రీ.పూ. 582-497) క్రీ.పూ.529 లో సామోస్ వదిలి దక్షిణ ఇటలీ ప్రాంతానికి ప్రయాణించాడు. అక్కడ అతడు చేసిన బోధనలు ఎన్నో తరాల వారిని ప్రభావితం చేశాయి.

పైథాగొరాస్ బోధనల చేత ప్రభావితుడైన వారిలో ముఖ్యుడు ఎంపిడోకిలిస్ (క్రీ.పూ. 490-430) అనే గ్రీకు తాత్వికుడు. ఇతగాడు సిసిలీకి చెందిన వాడు. విశ్వ పదార్థాలన్నిటికీ మూల పదార్థం ఏమిటి? అన్న ప్రశ్న ఎంపిడోకిలిస్ ని కూడా వేధించింది. తన పూర్వీకులు ఇచ్చిన సమాధానాలలో ఏది నిజమో అతడు తేల్చుకోలేకపోయడు. కనుక గత పరిష్కారాలన్నిటిని సమన్వయ పరిచే పరిష్కారం ఒకటి ఆలోచించాడు.

అలాంటి మూలపదార్థం ఒక్కటే కావలసిన అవసరం ఏముంది? అలాంటివి నాలుగు ఉండొచ్చుగా? హెరాక్లిటస్ సూచించిన అగ్నికి, అనాక్సీమినిస్ సూచించిన గాలికి, థేల్స్ సూచించిన నీటికి, ఎంపిడోకిలిస్ మట్టిని జతచేశాడు.

తదనంతరం గ్రీకు తాత్వికులందరిలోకి మహోన్నతుడైన అరిస్టాటిల్ (క్రీ.పూ. 384-322) ఈ ’నాలుగు మూలతత్వాల సిద్ధాంతాన్ని సమ్మతించాడు. అయితే ఆ మూలతత్వాలు, వాటి పేర్లకి సంబంధించిన భౌతిక పదార్థాలు, రెండూ ఒక్కటే నని అరిస్టాటిల్ ఎప్పుడూ అనుకోలేదు. “నీరు” అన్న పేరు గల మూలపదార్థం, మనం తాకితే తడిగా అనిపించే భౌతిక పదార్థం నీటితో సమానం కాదు. భౌతిక పదార్థం నీటికి, “నీరు” అన్న పేరు గల మూలపదార్థం అత్యంత సన్నిహితంగా ఉంటుంది అంతే.

ఈ మూలతత్వాలు రెండు పరస్పర విరుద్ధ లక్షణాల జతల సంయోగాలని అనుకున్నాడు అరిస్టాటిల్. ఆ లక్షణాలలో ఒక జత: వేడితనం-చల్లదనం. రెండవ జత: తడి-పొడి. ఒకే వస్తువుకి పరస్పర విరుద్ధ లక్షణాలు ఉండలేవు. కనుక ఏ వస్తువుకైనా మొదటి జత లక్షణాలలో ఒకటి, రెండవ రెండవ జత లక్షణాలలో ఒకటి ఉంటాయి. అంటే మొత్తం నాలుగు సంయోగాలు అన్నమాట. ఒక్కొక్క సంయోగం ఒక్కొక్క మూలతత్వాన్ని నిర్వచిస్తుంది. ఉదాహరణకి “వేడి, పొడి” లక్షణాలు కలిస్తే అది అగ్ని అవుతుంది. అలాగే “వేడి, తడి” కలిస్తే గాలి. “చల్ల, పొడి” కలిస్తే భూమి. “చల్ల, తడి” కలిస్తే నీరు.

ఇక్కడితో ఆగక అతడు మరో మెట్టు ముందుకు వేశాడు. ప్రతీ మూలతత్వానికి దాని స్వంత స్వాభావికమైన లక్షణాలు ఉంటాయి. ఉదాహరణకి కింద పడడం భూమి లేదా మట్టి యొక్క తత్వం. అలాగే పైకి ఎగయడం అగ్ని యొక్క తత్వం. కాని ఖగోళ వస్తువులకి చెందిన పదార్థం మాత్రం భూమి మీద ఉన్న పదార్థాల కన్నా చాలా భిన్నంగా ఉన్నట్టు తోచింది. అవి కింద పడనూ పడవు, పైకి పోనూ పోవు. అవి ఎల్లకాలం భూమి చుట్టూ మారని వృత్తాకార కక్ష్యల్లో తిరుగుతూ ఉంటాయి.

కనుక దివి లోకం అంతా ఈ నాలుగు తత్వాలకి భిన్నమైన మరేదో ప్రత్యేక తత్వంతో నిర్మించబడి ఉండాలని ఊహించాడు అరిస్టాటిల్. ఆ తత్వానికి “ఈథర్” అని పేరు పెట్టాడు. ఈథర్ అంటే ప్రకాశించేది అని అర్థం. మరి ప్రకాశం అనేది దివి సీమలో కనిపించే వస్తువుల ప్రథమ లక్షణం. దివి సీమ అంతా అద్భుతమైన నిత్యతతో వెలుగారుతూ ఉంటుంది కనుక ఈ ఈథర్ అనే పదార్థం శాశ్వతమై, పరిపూర్ణమై, అమోఘమై, అవినాశమై వెలుగొందుతూ ఉంటుందని, ఇక్కడ మనకి కనిపించే నాలుగు తత్వాల కన్నా ఈ తత్వం చాలా భిన్నమైనదని ఊహించాడు అరిస్టాటిల్.

(గ్రీకులు బోధించిన “మూల తత్వాలు” (elements) అన్న భావనలనే మన దేశంలో పంచ భూతాలు అని పిలుచుకుంటాం. గ్రీకులు మొదటి నాలుగు తత్వాలు, పంచ భూతాలు మొదటి నాలుగు భూతాలకి సరిసమానం. అవి పృథ్వి (మట్టి), ఆపస్ (నీరు), అగ్ని, వాయువు (గాలి). పంచభూతాల్లో చివరిదైన ఆకాశం, గ్రీకులు చెప్పిన “ఈథర్” తో సరిసమానం అనుకోవాలి. – అనువాదకుడు).

ఆ విధంగా ప్రపంచంలోని వస్తువులన్నీ ఈ నాలుగు తత్వాలతో కూడుకుని ఉన్నాయన్న భావన రెండు వేల ఏళ్ల పాటు రాజ్యం చేసింది. ఆధునిక విజ్ఞానం ఈ భావనలకి ఎప్పుడో తిలోదకాలు వదిలేసినా, సామాన్య పరిభాషలో ఈ భావాలు తరచు ఎన్నో సందర్భాల్లో దొర్లుతూనే ఉంటాయి. ఉదాహరణకి “పంచ భూతాల సాక్షిగా” అంటాం. అంటే మన చుట్టూ ఎప్పుడూ ఉండే మట్టి, గాలి మొదలైన వాటి సమక్షంలో అని ఉద్దేశం. గ్రీకులు బోధించిన ఐదవ మూలతత్వం అయిన ఈథర్ నే లాటిన్ లో “quint essentia” (పంచమ తత్వం) అంటారు. అది మచ్చలేని, నిత్య పదార్థం కనుక ఇంగ్లీష్ లో quintessence అన్న పదానికి అమలిన, అద్భుత సారం అన్న అర్థం వచ్చింది.

(సశేషం...)

గ్రీకుల “మూల తత్వాలు”

Posted by V Srinivasa Chakravarthy Saturday, December 18, 2010 0 comments


ప్రాచీన గ్రీస్ లో అయోనియా ప్రాంతానికి చెందిన మెలిటస్ నగరంలో ఉండేవాడు థేల్స్. ఈ అయోనియా పశ్చిమ ఏజియన్ సముద్ర తీరం మీద ఉండేది. ఇది ఆధునిక టర్కీ దేశంలోకి వస్తుంది. థేల్స్ చింతన ఈ ప్రశ్నతో మొదలై ఉండొచ్చు. ఒక పదార్థం మరో పదార్థంగా మారగలిగినప్పుడు, అసలు పదార్థం యొక్క లక్షణం ఎటువంటిది? ఉదాహరణకి కాల్చిన నీలి రంగు రాయి రాగిగా మారుతుందని మనకి తెలుసు. మరి రాయి దాని నిజస్వరూపమా, రాగి దాని నిజస్వరూపమా? లేక ఈ రెండూ కాని మరేదో తత్వమా? అలాగే ఒక పదార్థాన్ని మరే ఇతర పదార్థంగానైనా (ఏకబిగిన కాకపోయినా దశలవారీగా) మార్చగలమా? అదే నిజమైతే పదార్థాలన్నీ ఏదో మహత్తరమైన ఒకే మూలపదార్థం యొక్క విభిన్న రూపాలు అనుకోవచ్చా?

ఈ చివరి భావన నిజమని నమ్మాడు థేల్స్. పదార్థాలన్నీ ఒకే మూలపదార్థపు విభిన్న రూపాలనుకున్నాడు. ఆ భావనలో, విశ్వం పైన చూడడానికి సంక్లిష్టంగా కనిపించినా, దాని మూలంలో ఏకత్వం, సరళత్వం ఉన్నాయన్న నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇంతకీ ఆ మూల పదార్థం ఏంటి? ఆ మూలతత్వం ఏమిటి?

ఆ తత్వం నీరు అని నమ్మాడు థేల్స్. ఎందుకంటే పదార్థాలు అన్నిట్లోకి నీరు అత్యంత సమృద్ధిగా ఉన్నట్టు కనిపిస్తుంది. నేలకి నలుదిశలా నీరు ఆవరించి ఉండడం కనిపిస్తుంది. వాతావరణంలోను నీరు తేమ రూపంలో వ్యాపించి ఉండడం కనిపిస్తుంది. నేలలోకి కూడా నీరు ఇంకి లోతుగా చొచ్చుకుపోతుంది. నీరు లేకపోతే జీవసృష్టి అసంభవం. కనుక భూమి ఓ చదునైన పళ్లెంలా ఉందని ఊహించుకున్నాడు థేల్స్. ఎల్లలులేని నీటి సముద్రం మీద ఆ పళ్లెం తేలుతున్నట్టు ఊహించుకున్నాడు.

పదార్థాలన్నీ ఒకే మూలపదార్థపు భిన్న రూపాలు అన్న థేల్స్ భావనకి త్వరలోనే ఎంతో ఆదరణ లభించింది. పండితులు దాన్ని సమ్మతించసాగారు. అయితే ఆ మూలతత్వం నీరు అన్న సూచన మీద మాత్రం కొంత వివాదం బయలుదేరింది.

థేల్స్ జీవించిన శతాబ్దానికి తదుపరి శతాబ్దానికల్లా ఖగోళశాస్త్ర రంగంలో చింతన బాగా మారింది. ఆకాశం గోళార్థం అని కాక పూర్ణగోళం అని ఇప్పుడు మనుషులు నమ్మసాగారు. అలాగే భూమి కూడా పూర్ణగోళం అని, ఖాళీ ఆకాశంలో ఆ గోళం ఒంటరిగా వేలాడుతోందని నమ్మసాగారు.

అయితే పూర్తిగా శూన్యమైన ప్రదేశం ఎక్కడా ఉండదని గ్రీకులు అనుకునేవారు. అందుకే భూమికి ఆకాశానికి మధ్య పూర్తి శూన్యం ఉండలేదని అనుకునేవారు. మనకి తెలిసినంత మేరకు, మనుషుల అనుభూతి విస్తరించినంత మేరకు, భూమికి ఆకాశానికి మధ్య వ్యాపించి ఉన్నది గాలే కనుక, ఆ గాలి అనంతంగా ఆకాశం అంచులవరకు వ్యాపించి ఉండేదని అనుకునేవారు.

ఇలాంటి తర్కాన్ని అనుసరించిన అనాక్సీమినీస్ అనే మరో గ్రీకు తాత్వికుడు ఆ ఏకైక మూలపదార్థం గాలి అని భావించాడు. క్రీ.పూ. 570 కి చెందిన ఈ అనాక్సీమినీస్ కూడా మిలెటస్ నగరానికి చెందినవాడే. భూమికి దూరంగా ఉన్నప్పుడు ఆ పదార్థం విరళంగా గాలిలా ఉన్నా, కేంద్రాన్ని సమీపిస్తున్న కొద్ది మరింత సాంద్రమై నీరు, నేల మొదలైన పదార్థాల ఏర్పాటుకు కారణం అవుతోంది అనుకున్నాడు.

ఇలా ఉండగా పొరుగూరు అయిన ఎఫెసస్ కి చెందిన హెరాక్లిటస్ (క్రీ.పూ. 540-475) మరో కోణం నుండి ఆలోచించసాగాడు. మర్పే విశ్వం యొక్క ముఖ్యలక్షణం అనుకుంటే అన్నిటికన్నా గొప్ప మారుదల గల పదార్థమే మూల పదార్థం అవుతుంది. అగ్నే ఆ పదార్థం అని భావించాడు హెరాక్లిటస్. అన్నిట్లోను అంతర్లీనంగా ఉండే అగ్నే నిరంతర మార్పుకి కారణం అవుతోంది.

(సశేషం...)

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts