శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

పాతాళానికి ప్రయాణం - 33

Posted by శ్రీనివాస చక్రవర్తి Wednesday, December 9, 2009

మేం బయల్దేరడానికి ఇంకా నలభై ఎనిమిది గంటలుంది. ఈ కాసేపు కూడా హాయిగా ఊపిరి తీసుకునే యోగం లేదు. ప్రయాణానికి సన్నాహాలు చేసుకోవాలి, పకడ్బందీగా సామాను సర్దుకోవాలి. దేన్ని ఎక్కడ సర్దాలో బాగా లోతుగా ఆలోచించి సర్దాలి. పరికరాలు ఒకచోట, ఆయుధాలు ఒకచోట, పనిముట్లు ఒకచోట, సంభారాలు ఒక చోట - మొత్తం నాలుగు భారమైన సామాన్లు.మేం తీసుకెళ్ళే పరికరాల జాబితా -

1. ఐగెల్ సెంటిగ్రేడ్ థర్మామీటరు - ఇది 150 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు చూపిస్తుంది. నన్నడిగితే ఇది ససేమిరా సరిపోదంటాను. భూమి అడుగున మేం అట్టుడికి నట్టు ఉడికిపోతే మా ఉష్ణోగ్రత కొలుచుకోడానికి కూడా ఇది సరిపోదు.

2. ఎనిరాయిడ్ బారోమీటర్ - భూగర్భంలో ఉండే పీడనాలకి మామూలు పాదరసం బారోమీటర్ తట్టుకోలేదు.

3. ఒక క్రోనోమీటర్ (గడియారం)

4. రెండు దిక్సూచులు

5. రెండు రమ్కార్ఫ్ బ్యాటరీ టార్చ్ లైట్లు

ఇక ఆయుధాల విషయానికి వస్తే రెండు పర్డీ రైఫిళ్లు, రెండు పిస్తోళ్లు. అయినా మా ప్రయాణంలో ఆయుధాలెందుకో అర్థం కాలేదు నాకు. మేవేమైనా మృగాలని వేటాడూతున్నామా? కాని మా మామయ్యకి తన పరికరాలు అంటే ఎంత గౌరవమో, ఈ ఆయుధాలన్నా అంతే గురి. అంతే కాక బోలెడంత గన్ కాటన్ కూడా పెట్టుకున్నాడు. గన్ పౌడర్ కన్నా ఇదే శక్తివంతమైనదట.


ఇక పనిముట్ల దగ్గరికి వస్తే - రెండు చేతి గొడ్డళ్లు, రెండు గడ్డపారలు, ఓ పట్టు తాడు, రెండు చిన్న గునపాలు, ఓ పెద్ద కత్తి, ఓ సుత్తి, ఓ పొడవాటి ముడులు వేసిన తాడు. ఈ తాడు పొడవు 300 అడుగులు. మోయాలంటే మహా బరువు.

ఇవి గాక భోజన సామగ్రి. ఇవి ఉన్న పెట్టె మరీ అంత పెద్దది కాకపోయినా, ఆ సంభారాలన్నీ ఆర్నెల్లకి సరిపోతాయన్న ఆలోచనే మనసులో ఒక రకమైన హాయిని కలిగిస్తోంది. నీరు పెట్టుకోలేదు గాని. మేం తెచ్చుకున్న పానీయాలు కేవలం మత్తు పానీయాలు మాత్రమే. అంతర్వాహినుల నుంచి నీరు పట్టుకోవచ్చని మామయ్య ఆలోచన. అందుకే కొన్ని ఫ్లాస్కులు మాత్రం పెట్టుకున్నాం. కాని ఆ అంతర్వాహినులలో నీరు ఏ పరిస్థితిలో ఉంటుందో, సలసలకాగుతుంటుందో ఏమో... అసలైనా నా మాట మామయ్య వినిపించుకుంటేగా!

అన్నీ చెప్పాను గాని ఓ ముఖ్యమైన విషయం మరిచాను. ఓ చిన్న మందుల పెట్టె, అందులో ఓ చిన్న కత్తెర, కాళ్లు చేతులు గట్ర విరిగితే కట్టుకోడానికి కావలసిన సామగ్రి. వీటితో పాటు చిన్న చిన్న సీసాల్లో డెక్స్ ట్రీన్, ఈథర్, లెడ్ ఎసిటేట్, వెనిగార్ మొదలైన మందులు.

అన్నిటితో పాటు కావలసినంత పొగాకు కూడా మూటగట్టుకోవడం మర్చిపోలేదు మామయ్య. కావలసినంత బంగారం, వెండి, ధనం నోట్లు కూడా పెట్టుకున్నాడు. ఆరు జతల బూట్లు కూడా పెట్టుకున్నాం.పద్నాలుగో తారీఖు మొత్తం ఈ సామానంతా సరిచూసుకోవడం, సర్దుకోవడంతోనే సరిపోయింది.

సాయంత్రం రెయిక్ జావిక్ నగర మేయర్ అయిన బారన్ ట్రామ్ప్స్ తో విందు చేశాం. ఆ ఊరికి చెందిన పేరుమోసిన డాక్టరు డా. హయల్టలిన్ కూడా విందుకి విచ్చేశారు. ఫ్రెడిరిక్సెన్ గారు రాలేదు. మేయర్ గారికి, డాక్టరు గార్కి మధ్య ఏవో భేదాభిప్రాయాలు ఉండడంతో ఇద్దరూ ఒకరి మీద ఒకరు అలిగి ఉన్నార్ట. కనుక విందులో ఇద్దరూ ఒకరితో ఒకరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. దాంతో మామయ్య రెచ్చిపోయే విందు జరిగినంత సేపు తానొక్కడే గుక్కతిప్పుకోకుండా మాట్లాడేడు.

పదిహేనవ తారీఖు కల్లా మా సన్నాహాలు పూర్తయ్యాయి. ఫ్రెడిరిక్సన్ గారు మామయ్య కి ఓ చక్కని, సవివరమైన ఐస్లాండ్ మ్యాప్ బహుకరించారు.
ఇంత సవివరమైన మ్యాప్ ఖనిజవేత్తల పాలిటి పెన్నిధి.

మర్నాడు ఉదయం గుర్రాల సకిలింపులకి తెలివి వచ్చింది. త్వరగా ముస్తాబై వీధిలోకి వచ్చాను. మా సహచరుడు హన్స్ మౌనంగా, ఒడుపుగా పనిచేసుకు పోతున్నాడు. మా మామయ్య సంగతి పని తక్కువ, రంకెలు ఎక్కువ అన్నట్టుగా ఉంది. కాని హన్స్ అవేమీ పెద్దగా పట్టించుకున్నట్టు లేదు.

ఆరు గంటలకి ప్రయాణానికి సిద్ధం అయ్యాం. ఫ్రెడిరిక్సన్ గారు వీడ్కోలు చెప్తూ కరచాలనం చేశారు. ఆయన ఔదార్యానికి మామయ్య కృతజ్ఞతలు చెప్పాడు.
నేను సైతం వీడ్కోలు చెప్పాలని కష్టపడి ఓ రెండు లాటిన్ వాక్యాలు పలికాను. అందుకు సమాధానంగా ఫ్రెడిరిక్సెన్ గారు వర్జిల్ కవి అన్న వాక్యం ఒకటి పేర్కొన్నారు:

"Et quacumque viam dedent fortuna sequamur."

"విధి చూపిన మార్గమ్మున
పయనించుము రయమ్మున."

3 comments

 1. Hi Srinivas garu, Can you please continue this article. I read all these 33 parts in a day. Very simple narration ,except names every thing is like a telugu story.

   
 2. Lakshminaresh garu:
  Will certainly try continuing that serials soon...

   
 3. Thanks for your reply srinivas garu...every I am looking for next article...

   

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email