ఆ ఎర్రని భూమికలో మన భావి జీవన బీజాలా?
మెర్క్యురీలు, వీనస్ లు నివాస యోగ్యం కావని నిర్ధారించాం.
ఇక మనం దృష్టి సారించాల్సిన తదుపరి గ్రహం మార్స్. ఆ ఎర్రని నేలపై మన భవిష్యత్తుకు పునాదులు వేసుకోగలమా? అక్కడ రాజ్యాలు స్థాపించి, నగరాలు నిర్మించి, అక్కడి నేలలో హరిత సంపత్తిని వెలయింపజేసి, గాలికి ఊపిరి పోసి, సమైక్యంగా, సనాగరికంగా, సహజీవనాన్ని సాగించగలమా? ఇన్ని వసతులు, వనరులు ఉన్న ఈ పుడమి మీదే మనకి అది సాధ్యం కావడం లేదు. ఏమీ లేని ఆ మరుభూమి మీద, ఆ మరో భూమి మీద అదంతా అయ్యేపనేనా?
ఏమో ఏం తెలుసు? రియల్ ఎస్టేట్ వ్యవహారాలలో అనుభవజ్ఞుల వద్ద నుండి తరచు వింటుంటాం. "మేం ఈ సైటు కొన్నప్పుడు ఇక్కడ ఒక్క కాకి కూడా కనిపించేది కాదు. ఇప్పుడు చూడు ఎంత డవలప్ అయ్యిందో!!!" కనుక మార్స్ విషయంలో కూడా ఏం మహత్యం జరగనుందో? మహత్యం మాటేమోగాని బృహత్తరమైన మానవ ప్రయత్నం మాత్రం ఆ దిశలో జరుతున్నట్టుగానే ఉంది.
మరో గ్రహానికి వలస పోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. మనుషుల గ్రహాంతర యానం ఇంతవరకు కాల్పనిక విజ్ఞానానికే పరిమితం. అలాంటి దాన్ని వాస్తవం చెయ్యాలంటే ఎంత విస్తృతమైన వ్యూహరచన జరగాలి, ఎన్ని దశాబ్దాల సమాలోచన, సన్నాహం, ఎంత ఖర్చు... కాని ఈ విషయాలన్నిటి మీద చాలా సీరియస్ గానే చర్చ ఎంతో కాలంగా జరుగుతోంది. మార్స్ మీద ప్రవాస ప్రయత్నాల మీద సదస్సులు, సమాజాలు, ఏర్పడ్డాయి. ఎన్నో పథకాలు రూపొందించబడ్డాయి.
మనిషి మార్స్ కి వలస వెళ్లడం అనేది నేడో రేపో జరిగే విషయం కాదు. అసలంటూ జరిగినా కొన్ని శతాబ్దాలుగా దశలవారీగా జరిగే వ్యవహారం అది.
మానవ రహిత వ్యోమనౌకలు వెళ్లడం మెదటు మెట్టు (ఇది ఇప్పటికే జరిగింది). మనుషులు అక్కడికి చేరడం తదుపరి మెట్టు. ఆ తర్వాత అక్కడ చిన్న స్థావరాల ఏర్పాటు. క్రమంగా అక్కడ భౌతిక పరిస్థితులని మరింత పెద్ద ఎత్తున మానవ నివాసానికి అనువుగా సంస్కరించుకోవడం తదుపరి సుదీర్ఘ దశ. తరువాత పెద్ద ఎత్తున వలస పోవడం, చిన్న చిన్న నగరాలు నిర్మించుకోవడం. రాజ్య స్థాపన, పాలన...
ఓ కొత్త సైటు కొనే ముందు, ఆ సైటుని ఒకటికి రెండు సార్లు సందర్శించి, దాని గురించి వీలైనన్ని వివరాలు సేకరించాలని మన రియల్ ఎస్టేట్ పితామహులు చెప్తుంటారు. కనుక ఊహల్లోనే ఓ సారి ఆ ఎర్ర గ్రహానికి ఎగిరెళ్లి చూసొద్దాం.
బయల్దేరే ముందు అక్కడి వాతావరణానికి అనుగుణమైన దుస్తులు తీసుకుపోవడం మంచిది. భూమి మీద లాగానే మార్స్ మీద కూడా ఋతువులు ఉంటాయి. అవి గ్రీష్మం, వసంతం, శీతాకాలం, శరత్ కాలం. మార్స్ మీద ఋతువుల గురించిన పరిజ్ఞానం మనిషికి కొన్ని శతాబ్దాలుగా ఉంది. అక్కడ ధృవప్రాంతాల్లోని మంచు ఎండాకాలంలో కరగడం, తిరిగి చలి కాలంలో మంచు ఏర్పడడం భూమి మీద నుంచి చూసే పరిశీలకులకి శతాబ్దాలుగా తెలిసిన విషయం. కనుక మనం అక్కడ చేరుకునేటప్పటి ఋతువుని బట్టి దుస్తులు మూటగట్టుకోవచ్చు... అనుకుంటారేమో. కాని చిక్కేంటంటే అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత -87 C అయితే, గరిష్ఠ ఉష్ణోగ్రత -46 C అవుతుంది. కనుక చలి దుస్తులు దండిగా పట్టుకోవడం మర్చిపోకండేం?
మార్స్ మీద రోజు 24 గంటల 40 నిముషాలు ఉంటుంది. రోజుకి 48 గంటలు ఉంటే బావుణ్ణు అనుకునే శ్రమవ్యసన పరులకి మార్స్ అంత ఉత్సాహం కలిగించకపోవచ్చు. (అలాంటోళ్లకి వీనస్సే మందు!!!)
(సశేషం...)
0 comments