మార్స్ గ్రహం మీద కాలువలు ఉన్నాయా?
పందొమ్మిదవ శతాబ్దం అంతంలో మార్స్ ఉపరితలాన్ని దూరదర్శినితో పరిశీలించిన ఇటాలియన్ ఖగోళశాస్త్రవేత్త జియొవానీ షియాపరెల్లీకి మార్స్ గ్రహోపరితలం మీద పొడవాటి రేఖలు కనిపించాయి. వాటిని ఇటాలియన్ లో canali అని పిలుచుకున్నాడు. ఇటాలియన్ లో canali అన్న మాటకి అర్థం channel (సహజ కాలువ). కాని ఇంగ్లీషు వాళ్లు దాన్ని canal (కృత్రిమ కాలువ) గా అనువదించుకున్నారు. తను చూసిన ఆ కాలువలని చిత్రిస్తూ ఎన్నో మాపులు కూడా గీశాడు (చిత్రం). షియాపరెల్లీ తరువాత అమెరికాకి చెందిన పార్సివాల్ లొవెల్ అనే ఖగోళవేత్త ఈ భావనని ఇంకా ముందుకి తీసుకెళ్ళాడు. మార్స్ మీద ఉన్న నాగరక జీవులే ఈ కాలువలు నిర్మించారని అతడు భావించాడు. ఇక ఆనాటి నుండి మార్స్ ని పరిశీలించిన ప్రతి ఒకరికి, మన వినాయకుడి పాలారగింపులా, మార్స్ గ్రహోపరితలం నిండా కృత్రిమ కాలువల గజిబిజి గీతలే కనిపించాయి. మార్స్ గ్రహం మీద హిమానీ ధృవప్రాంతాలలో కరిగిన నీటిని ఈ కాలువలు గ్రహమధ్య రేఖ వద్ద ఉండే సస్యశ్యామల ప్రాంతాలకి తరలిస్తున్నాయన్న సిద్ధాంతం కూడా ఒకటి బయలుదేరింది. తదనంతరం ఇ.ఇ. బర్నార్డ్ అనే అమెరికన్ ఖగోళవేత్త ఈ సంగతి తేలుద్దామని మార్స్ పరిశీలనలకి పూనుకున్నాడు. తన పూర్వులు చూసిన కాలువలేవీ అతడికి కనిపించలేదు. తరువాత 1903 లో జె.ఇ.ఇవాన్స్ మరియు ఇ. మౌండర్ లు అదంతా కేవలం దృశ్య భ్రాంతి అని నిరూపించారు. క్రమంగా మరింత మెరుగైన పరికరాలతో చేసిన పరిశీలనల వల్ల ఆ కాలువల కథనం అంతా పుక్కిటి పురాణం అని తేలింది.
మార్స్ పై మారినర్ లోయ
మారినర్ వ్యోమ నౌక మొట్టమొదట కనుక్కుంది కనుక ఈ లోయకి మారినర్ లోయ అని పేరొచ్చింది. ఉండడానికి, ఊళ్లు నిర్మించుకోడానికి అనువుగా ఉండకపోయినా చూసి రావడానికి బాగానే ఉంటుంది. అయితే ఆ చెరియ అంచు వరకు లోయలోకి తొంగి చూడడానికి స్టీలు గుండె ఉండాలి. గుండె జబ్బుల వాళ్లకి అది నిషిద్ధం! ఎందుకంటే ఆ లోయ లోతు... ఎంత అనుకుంటున్నారు?... 100 అడుగులా? 1000 అడుగులా? ఉహు... 10 కిలోమీటర్లు!!! పైగా దుమారాల వల్ల చెరియ అంతా ఇసుక ఇసుకగా ఉంటుంది. మనం పాదం మోపినప్పుడు కింద నేల కొంచెం సడెలెనా? జీవితం పాతాళానికి ప్రయాణమే అవుతుంది!
అందుకే ఈ లోయని చూడాలంటే విమానం నుంచి చూడాలి. మార్స్ వాతావరణంలో విమాన యానం కూడా కొంచెం తేడాగానే ఉంటుంది. వాతావరణం పలుచగా ఉండడంతో ఇక్కడ విమానానికి రెక్కలు బాగా విశాలంగా ఉండాలి. (భూమి ఉపరితలం వద్ద వాతావరణ పీడనంలో ఇక్కడ ఉపరితలం వద్ద వాతావరణ పీడనం నూరో వంతు ఉంటుంది.) కాని గ్రహం చిన్నది కనుక, గురుత్వం తక్కువ కనుక (భూమి గురుత్వంలో 0.38 వంతు) ఒక ఎత్తు వరకు గాల్లోకి లేస్తే చాలు, ఆ పైన సునాయాసంగా గాలిపటంలా తేలిపోతుంది.
---
సుబ్బారావ్: "ఏం బాబూ? గురుత్వం అంత తక్కువ అని ఇప్పుడంటున్నావ్! మా ఎముకలేంగావాలి?"
రియలెస్టేట్ ఏజెంటు: "ఎకరం రూపాయికి పోతోంది. ఎముకల కోసం చూసుకుంటారేంట్సార్?"
---
ఇంత వెడల్పయిన లోయ భూమి మీద ఎక్కడా చూసి ఉండరు. మార్స్ ముఖం మీద 600 కిమీల వెడల్పున్న గాటు ఈ లోయ. సూర్యోదయ సమయంలో గాల్లోకి లేస్తే తూరుపులో నింగి నేల కలిసే చోట, విడుతున్న పొగమంచు మాటున ఎర్రని కాంతుల చిరుమందహాసం మనసుని గిచ్చినట్టవుతుంది.
పేరుకి ఇది లోయ అయినా నదీ ప్రవాహం నేలని కోయగా ఏర్పడ్డ లోయ కాదిది. ఉత్తరంలో థార్సిస్ కుంభ ప్రాంతం పైకి లేస్తున్నప్పుడు ఆ భారానికి మార్స్ గ్రహపు పైపొర (crust) లో ఏర్పడ్డ పగుళ్లే ఈ లోయ అని ఖగోళ శాస్త్రవేత్తల అభిప్రాయం. నదీ ప్రవాహాల వల్ల ఈ లోయ ఏర్పడకపోయినా, ఒకసారి ఏర్పడ్డాక అక్కడ నీరు చేరుకుంది అనడానికి దాఖలాలు ఉన్నాయి. శిలాశాస్త్రం గురించి బాగా తెలిసిన వారు ఈ లోయల అంచుల వద్ద ఉండే పలువన్నెల రాతి స్తరాలలో ఉన్నది అవక్షేపక శిల (sedimentary rock) అని తెలుసుకుంటారు. అంటే ఒకప్పుడు ఆ ప్రాంతం జలమయమై ఉండేదన్నమాట.
అయినా మీ పిచ్చి గాని, ఇంత దూరం వచ్చి పది కిలోమీటర్ల లోతున్న గోతిలో ఇళ్ళు కట్టుకుని బతికే బదులు, భూమి మీదే ఏ గనిలోనో తలదాచుకుని మహారాజులా బతకొచ్చు!!! పదండి. ఈ గోతి లోంచి బయటపడి ఇతర ప్రాంతాలు సందర్శిద్దాం.
(సశేషం...)
0 comments