మార్స్ లోకపు కొసలు
మార్స్ ఉపరితలాన్ని పరిశీలించాం. ఎన్నో ముఖ్యమైన ప్రదేశాలు చూశాం. గుట్టలు, మిట్టలు, కొండలు, బండలు, అగాలు, అగడ్తలు, హిమవన్నగాలు, హిమానీనదాలు... అంగారక అవనీతలాన్ని అంగరఖాలా ఆవహించే అగమ్యమైన అరుణానిలాలతో అందరం ఆ లోకాన్ని ఆలోకించాం. ఇక ఆ ప్రపంచపు అంచులే మిగిలాయి. అవే శాశ్వత హిమావృతమైన ఉత్తర, దక్షిణ ధృవాలు.
మార్స్ ధృవాల వద్ద పైపొరలో ఉన్నది గడ్డకట్టుకున్న కార్బన్ డయాక్సయిడ్ అని ముందు చెప్పుకున్నాం. అయితే దాని అడుగున కొంత గడ్డ కట్టిన నీరు కూడా లేకపోలేదు. రెండు ధృవాలని అంతరిక్షం నుంచి చూస్తే తెల్ల రాయంచ కలికితురాయిలా ముద్దొస్తూ ఉంటాయి. రెండు ధృవప్రాంతాలు మార్స్ సగటు ఉపరితలం కన్నా కొన్ని కిమీల ఎత్తున ఉంటాయి. తెల్లని మిట్ట ప్రాంతానికి పల్లానికి మధ్య ఎన్నో మెలికలు తిరిగే లోయలు, దొలిచినట్టుండే కొండ చెరియలు, కేవలం తెలుపు గోధుమ వన్నెలతో వేసిన ఏవో సమకాలీన చిత్రకళాఖండాలలా మనోహరంగా ఉంటాయి.
ధృవప్రాంతాలని చుట్టుముడుతూ దాని నేపథ్యంలా ఎర్పడ్డ విశాలమైన మంచునేల (permafrost) ప్రాంతం ఉంటుంది. ఎత్తుల్లో ఉండే నేలలో ఎక్కువగా మట్టి, గడ్డకట్టిన నీరు కలగలిసి రాయిలా అతికఠినంగా ఉంటుంది. ఋతుచక్రానికి అనుసారంగా ఆ మంచునేల మళ్లీ మళ్లీ కరిగి గడ్డ కట్టడం వల్ల ఆ ప్రాంతం అంతా ఏవో చిత్రవిచిత్రమైన ఆకృతులు ఏర్పడతాయి. వాటి హొయలు చూసి మోసపోయిన మన వారు కొందరు, అవన్నీ అక్కడి ’వాళ్లు’ కట్టిన ఇళ్లు, ఊళ్లు అనుకుని అపోహ పడ్డారు.
ధృవాల వద్ద మంచు కరిగిన నీరు గురించి చెప్పుకోవాలంటే అక్కడి ఋతువుల గురించి చెప్పుకోవాలి. భూమి కక్ష్య ఇంచుమించు వృత్తాకారంలో ఉంటుంది కనుక ఉత్తర గోళార్థం సూర్యుడివైపుకి వాలినప్పుడు అక్కడ ఎండాకాలం వస్తుంది. ఆ సమయంలో దక్షిణ గోళార్థంలో చలికాలం వస్తుంది. కాని మార్స్ కక్ష్య దీర్ఘవృత్తీయం కనుక, ఋతువులు గ్రహం యొక్క వాలు మీదే కాక, సూర్యుడినుండి దూరం మీద కూడా ఆధారపడతాయి.
మార్స్ సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు (perihelion) దక్షిణ ధృవం సూర్యుడి వైపుకి వాలి ఉంటుంది. కనుక అప్పుడు అక్కడ ఎండాకాలం అన్నమాట. ఉష్ణోగ్రత ఆ సమయంలో 30 C దాకా పోవచ్చు.
మార్స్ సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు ఉత్తర ధృవం సూర్యుడి దిశగా ఒరిగి ఉంటుంది. కనుక అప్పుడు దక్షిణ ధృవం బాగా చల్లగా ఉంటుంది. ఉష్ణోగ్రత అక్కడ -140 C దాకా పోవచ్చు. అందుకే దక్షిణ ధృవాలలో వాతావరణ, ఉష్ణొగ్రతలు విపరీతంగా ఉంటాయి. మకాం పెడితే ఉత్తరాన పెట్టమనేది అందుకే!
ఆ(! ఆ నిర్జల, నిర్జన ప్రదేశంలో ఏం మకాంలే? అంటారేమో. నిజమే. నీరు ఉన్నా గడ్డ రూపంలో, కార్బన్ డయాక్సయిడ్ బండ కింద దాక్కుని ఉంది. అంత మాత్రాన దాన్ని తక్కువ అంచనా వెయ్యకండేం? ఉత్తర ధృవం వద్ద ఉండే గడ్డ నీటి ఘనపరిమాణం 1.6 మిలియన్ ఘన కిమీలు! అంటే అది గాని కరిగిందంటే వెయ్యి కిమీల వ్యాసం గల ఉత్తర ధృవ ప్రాంతం మొత్తం 2 కిమీల నీటి అడుగున ఉంటుందట.
ఇకనేం? ఆ ఐసుని కరిగిస్తే చాలు కాబోసు! బాంక్ లోను తీసేసుకోవచ్చు! చుట్టూ కంచెలు కట్టేసుకోవచ్చు! శంఖుస్థాపన ముహూర్తం పెట్టేసుకొవచ్చు!
ఏంటండీ! ముహూర్తం అనగానే నక్షత్రాల కేసి చూస్తున్నారు?
అబ్బ! చూసేశారా? వద్దు. అసలటు చూడనే వద్దు. అవి ఇల్లు కట్టుకోదగ్గ సైట్లు కావు. మార్స్ గ్రహపు సాటిలైట్లు! పరాయి చందమామలు! వాటిని నమ్ముకుంటే బతుకు అమావాస్యే అవుతుంది.
(సశేషం...)
(సశేషం...)
images courtesy:
http://www.edb.utexas.edu/missiontomars/bench/mw.html
http://www.edb.utexas.edu/missiontomars/bench/mw.html
0 comments