జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ విచిత్ర దిన చర్య
ఫారడే, ఆంపియర్ మొదలైన వారి ప్రయోగ ఫలితాలన్నిటినీ సమీకరిస్తూ, విద్యుదయస్కాంత శక్తిని వర్ణించే నాలుగు అద్భుత సమీకరణాలని సూత్రీకరించి, ఆ విధంగా కాంతి కూడా ఒక విద్యుదయస్కాంత తరంగం అని సైద్ధాంతికంగా నిరూపించిన జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ దిన చర్య చాలా విచిత్రంగా ఉండేదట.
అసలు దాన్ని దిన చర్య అనడం కన్నా రాత్రి చర్య అంటే బావుంటుందేమో. ఎందుకంటే ఇతడు నిద్రపోయేవేళలు బహు చిత్రంగా ఉండేవట. సాయంత్రం 5 నుండి 9:30 దాకా నిద్ర, తరువాత 10 PM నుండి 2 AM దాకా చదువు, అర్థరాత్రి 2 నుండి 2:30 వరకు కాంపస్ వీధుల వెంట దిక్కు తెన్ను తెలీకుండా దౌడు తియ్యటం. అదేమిటయ్యా అంటే వ్యాయామమట! దాంతో అలిసి, నిద్రలోకి జారుకుని ఉదయం 7 AM దాకా పడుకోవడం. ఇదీ అతడి రేచర్య!
పిశాచాలు పచార్లు చేసే వేళకాని వేళల్లో మెట్ల మీద, కారిడార్లలో ఉరుకులు పెట్టే ఈ విడ్డూరం మనిషి అంటే ఇరుగు పొరుగు వాళ్లకి చాలా కాలంగా కొంచెం కసిగానే ఉండేదట. ఒక దశలో ఇక సహనం చచ్చి ఈ అర్థరాత్రి దౌడుకి నిరసనగా చెప్పుల, చీపుర్ల వర్షం కురిపించారట ఇరుగుపొరుగువారు. నాటి నుండి ఆ వేళకాని అకాల వ్యాయామం ఆగిపోయింది.
మాక్స్ వెల్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరిన కొత్తల్లో రోజూ ఉదయం ఆరు గంటలకి చర్చిలో ప్రార్థలకి హాజరు కావాలన్న నియమం ఉందని ఎవరో చెప్పారట.
"ఓ అలాగా! ఫరవాలేదు లెండి. అంత వరకు మేలుకుని ఉండడం నాకేం కష్టం కాదు," ధీమాగా జవాబు చెప్పాడట జేమ్స్.
Reference:
K. Krishna Murthy, Spice in Science, Pustak Mahal.
0 comments