(పిల్లలతో జాన్ హోల్ట్)
జాన్ హోల్ట్ ఓ ప్రఖ్యాత అమెరికన్ విద్యావేత్త. అరవైలలో ఆయన రాసిన ’పిల్లలు ఎలా నేర్చుకుంటారు?’ (How children learn?) ’పిల్లలు ఎలా విఫలం అవుతారు?’(How children fail?) ఇత్యాది రచనలు ఆ దేశపు విద్యారంగంలో ఓ విప్లవాన్నే సృష్టించాయి. పిల్లల్లో సహజంగా నేర్చుకోవాలన్న తపన ఉంటుంది అంటాడు హోల్ట్. తమ చుట్టూ అర్థరహితంగా, అయోమయంగా కనిపించే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం వారికొక ప్రాథమిక అవసరం. ఆ అవగాహన సాధించడం కోసం వారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాన్ని మనం పోషిస్తే చాలు. అంతకు మించిన విద్య లేదు. కాని వారిలో ఆ సహజ తాపత్రయాన్ని గుర్తించకుండా, మనం ఓ బాహ్యమైన, అసహజమైన ’విద్యాప్రణాళిక’ని వారి మీద రుద్దుతాం. దాంతో ఆ సహజ ప్రయత్నం నిలిచిపోతుంది. అసలు చదువు ఆగిపోతుంది.
’Learning all the time' అన్న పుస్తకంలో, ఒక అధ్యాయంలో, పిల్లలు విషయాల గురించి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలని, ఒక శాస్త్రవేత్త చేసే సత్యాన్వేషణా ప్రయత్నాలతో చాలా చమత్కారంగా ఈ విధంగా పోల్చుతాడు...
------------
"పిల్లలు తమ అనుభవాన్ని జ్ఞానంగా మలచుకునే విధానం, మన శాస్త్రవేత్తలు సాంకేతిక జ్ఞానాన్ని ఉత్పత్తి చేసే విధానం సరిసమానం."
"ఒక ఆదివారం నాడు నేను బాయిల్స్టన్ వీధి వెంట నడుస్తూ వెళ్తున్నాను. దారిలో ఓ హోటల్ వరండాలో ఒక యువతి కనిపించింది. ఆమె కొడుకే ననుకుంటా ఓ పదిహేను నెలల బాబు వరండా అంతా పాకుతున్నాడు. వాడి తల్లి వాడి చేష్టలకి అడ్డు చెప్పకుండా వాణ్ణి చక్కగా వరండా అంతా పాకనిస్తోంది. పూనుకుని వెళ్లి వాడికి ఏమీ చూపించడం లేదు. అవసరమైతే సహాయం చేస్తోంది చేస్తోంది అంతే. నా ఉద్దేశంలో ఓ పాపాయి చేసే సహజ చేష్టల కన్నా మనోల్లాసం కలిగించే దృశ్యం మరొకటి లేదు. అంచేత వాణ్ణి చూస్తూ అక్కడే ఉండిపోయాను.
"ఆ బాబు చేతులకి రెండు ప్లాస్టిక్ గాజులు ఉన్నాయి. వాటిని తీసి రకరకాలుగా ఆడుకుంటున్నాడు. కొన్ని సార్లు రెండు గాజులు ఒకే చేతికి వేసుకునేవాడు. కొన్నిసార్లు మళ్లీ ఆవి వేరు వేరు చేతుల మీద కనిపించేవి. ఒకసారి ఒక గాజుని ఒక చేతి మీద మోచేతి దాకా ఎక్కించుకున్నాడు. ఇప్పుడు రెండో గాజుని కూడా అదే చేతికి తొడగాలని చూశాడు. అయితే ఆ రెండో గాజుని కూడా మొదటి గాజు లాగే చేతికి ఎక్కించకుండా ఊరికే బయటి నుండి తెచ్చి మొదటి గాజు పక్కన పెట్టి నొక్కి చూసేవాడు. అలా నొక్కి మొదటి గాజు లాగే రెండోది కూడా అక్కడే అతుక్కుని ఉండిపోతుంది అనుకున్నాడో ఏమో! కాని ఆ పథకం పని చెయ్యలేదు. వాడి మనసులో ఒకే చేతి మీద రెండు గాజులు పక్కపక్కన ఉండే దృశ్యం ఉన్నట్లుండి. కాని దాన్ని సాధించే ప్రయత్నంలో మాత్రం తప్పు చేస్తున్నాడు. అసలు మొదటి గాజు చేతి మీదికి ఎలా ఎక్కించుకున్నాడో మరిచిపోయాడు. మళ్లీ రెండు గాజులూ కలిపి పట్టుకుని ఒకే చేతికి ఎక్కించుకోగలిగేవాడు. కాని ఒకదాని తరువాత ఒకటి ఎక్కించుకునే ప్రయత్నంలో విఫలుడవుతున్నాడు. ఈ చిక్కుని ఎలా సాధిస్తాడా అని కుతూహలంగా చాలా సేపు చూస్తూ ఉండిపోయాను. వాడు ఓ సమస్యతో కుస్తీ పడుతున్న విషయం వాళ్ల అమ్మ కూడా గమనించినట్టు లేదు. పిల్లల చేష్టలని ఇలా నిశితంగా పరిశీలిస్తూ పోతే వాళ్లు ఎలా నేర్చుకుంటారో, ఏఏ కారణాలు నేర్చుకునే ప్రయత్నానికి దొహదం చేస్తాయో, ఏఏ కారణాలు అడ్డుపడతాయో బాగా తెలుసుకోవచ్చు."
"పిల్లలు స్వతహాగా వాళ్ల చుట్టూ ఉండే పరిసరాల గురించిన అవగాహన సాధించడానికి విశ్వప్రయత్నం చేస్తుంటారు. పిల్లలు తమ అనుభవాన్ని జ్ఞానంగా మలచుకునే విధానం, మన శాస్త్రవేత్తలు సాకేతిక జ్ఞానాన్ని ఉత్పత్తి చేసే విధానంతో సరిసమానం. పిల్లలు విషయాలని గమనిస్తారు. వాటి గురించి ఆలోచిస్తారు. అబ్బురపడతారు. తెలియనిదాన్ని ఊహించుకుంటారు. దాని గురించి ప్రశ్నించుకుంటారు. తర్కించి తెలుసుకోవాలని చూస్తారు. ఆ ప్రశ్నలకి సమాధానాలని అల్లుకుంటారు. కొత్త కొత్త సిద్ధాంతాలని కల్పించుకుంటారు. ప్రతిపాదనలు చేసుకుంటారు. ఇంకా ఇంకా పరిశీలించి, ప్రయోగాలు చేసి, చదివి, ఆ ప్రతిపాదనలు సరైనవో కాదో నిర్ధారణ చేసుకుంటారు. వాళ్ల నమ్మకాలు ప్రయోగాల్లో తప్పని తేలితే పాత సిద్ధాంతాలని కూలదోస్తారు. పరిశోధన ముందుకి సాగిపోతుంది. ఈ ప్రక్రియనే పెద్దవాళ్ల భాషలో ’వైజ్ఞానిక పద్ధతి’ (scientific method) అంటారు. పుట్టిన మరుక్షణం నుండి అనుక్షణం పిల్లలు పడే ప్రయాస అది."
"ఆ ప్రయాసని నియంత్రించే ప్రయత్నంలో ఆ సహజ ప్రవాహానికి మనం అడ్డువేస్తాం. అలా పెద్దరికం అన్న పేరుతో మనం మళ్లీ మళ్లీ దుడుకుగా అడ్డుపడుతూ పోతే ఏదో ఒకనాడు ఆ ప్రవాహం నిలిచిపోతుంది. పిల్లవాడిలో అంతవరకు సజీవంగా ఉన్న శాస్త్రవేత్త ఆరోజే చచ్చిపోతాడు."
0 comments