శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

భవిష్యత్ ఇంజెక్షన్లు: నానోటెక్నాలజీతో ఔషధ సరఫరా - 2

Posted by శ్రీనివాస చక్రవర్తి Monday, November 30, 2009
ఔషధ సరఫరాలో ఈ BioMEMS కి చాలా భిన్నమైన పద్ధతి, నానోటెక్నాలజీ మీద ఆధారపడ్డ క్వాంటం డాట్ (quantum dot) పద్ధతి. క్వాంటం డాట్లు అంటే కొద్ది పాటి నానోమీటర్లు (నూరు కోట్ల నానోమీటర్లు ఒక మీటరుతో సమానం) పరిమాణం గల స్ఫటికలు. ఇవి సామాన్యంగా కాడ్మియమ్ సెలినైడ్ అనే సెమీకండక్టరు పదార్థంతో నిర్మించబడుతాయి. కొన్ని ప్రత్యేక పౌన:పున్యాల (frequencies) వద్ద కాంతిని గ్రహించడం, ఉద్గారించడం వీటి ప్రత్యేకత. చిన్న క్వాంటం డాట్లు వర్ణమాలలో నీలి ధృవానికి దగ్గరగా ఉన్న కాంతిని, అలాగే పెద్ద క్వాంటం డాట్లు అరుణ ధృవానికి దగ్గరగా ఉన్న కాంతిని గ్రహించి ఉద్గారిస్తాయి.

ఈ క్వాంటం డాట్లకి మందు అణువులని జత చేసి శరీరంలోకి ప్రవేశపెట్టే అద్భుతాన్ని సాధించిన ప్రథములలో ఒకడు షూమింగ్ నై. ఇతడు అట్లాంటా లోని ఎమరీ యూనివర్సిటీ లో బయోమెడికల్ విభాగంలో ప్రొఫెసర్. టాక్సాల్ అనే కాన్సర్ మందుని క్వాంటం డాట్లకి జత చేసి ఓ ప్రత్యేక కాన్సరు చికిత్సా పద్ధతిని ఇతడి బృందం అభివృద్ధి చేసింది. క్వాంటం డాట్ల మీద కాన్సరు మందు టాక్సాల్ తో బాటు ఫోలిక్ ఆసిడ్ రిసెప్టార్లకి అంటుకునే మరో అణువుని కూడా జత చేస్తారు. రక్తప్రవాహంలో కొట్టుకుంటూ పోయే క్వాంటం డాట్ కాన్సర్ కణాల మీద ప్రత్యేకంగా ఉండే ఫోలిక్ ఆసిడ్ రిసెప్టార్లకి అతుక్కుంటుంది. ఆ విధంగా కాన్సరు మందు కాన్సర్ కణాలున్న ప్రాంతాల్లో పోగవుతుంది.

మానవ కాన్సరు కణాలని ఎక్కించి ఎలుకల్లో కృత్రిమంగా కాన్సరు కల్పించవచ్చు. అలా సిద్ధం చేసిన కాన్సరు ఎలుకల్లో క్వాంటం డాట్లని ఇంజక్షను ద్వారా ప్రవేశపెడతారు. కాన్సరు కణాలు ఉన్న భాగం మీద ఇప్పుడు పరారుణ కాంతి ప్రసరిస్తారు. ఆ కాంతిని గ్రహించిన క్వాంటం డాట్లు అదే కాంతిని మళ్లీ ఉద్గారిస్తాయి. అలా వెలువడ్డ కాంతి టాక్సాల్ అణువులని క్వాంటం డాట్లతో జత చేసిన ఉంచిన బంధాలని భేదిస్తుంది. అలా క్వాంటం డాట్ల నుండి విడివడ్డ టాక్సాల్ అణువులు కాన్సర్ కణాల మీద దండెత్తి వాటిని నాశనం చేస్తాయి. అయితే ఈ పద్ధతిలో కాంతి ప్రసారం జరిగితే గాని క్వాంటం డాట్లకి
అంటుకుని ఉన్న మందు అణువులు విడివడవు. అంటే శరీరంలో పైపైన, అంటే చర్మానికి దగ్గరగా ఉన్న భాగాల్లో తప్ప ఈ రకమైన చికిత్స పని చెయ్యదన్నమాట.

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఎట్ సాన్ డియాగోలో బయోమెడికల్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న సంగీతా భాటియా అనే భారతీయ మహిళ పైన చెప్పుకున క్వాంటం పద్ధతిని మరింత ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తున్నారు. మందుని కణాల దాకానే కాక కణాల అంతరంశాలైన న్యూక్లియస్, మైటోకాండ్రియా వంటి చోట్లకి కూడా క్వాంటం డాట్ల సహాయంతో మందు చేరవేసే పద్ధతులని ఈమె రూపొందిస్తున్నారు.

అయితే ఈ ’నానో’ పద్ధతులతోనూ నానా చిక్కులూ ఉన్నాయి! క్వాంటం డాట్లలో వాడే పదార్థానికి, ముఖ్యంగా కాడ్మియంకి శరీరం మీద హానికరమైన ప్రభావం ఉంటుందన్నది వాస్తవం. సంగీతా భాటియా, తన పీజీ స్టూడెంట్ ఆస్టిన్ డ్రేఫస్ తో బాటు చేసిన పరిశోధనల్లో కాడ్మియం క్వాంటం డాట్ల వల్ల కణనాశనం జరుగుతుందని తేలింది. అయితే ఈ క్వాంటం డాట్లకి తగిన రక్షక పూత వేసి ప్రయోగిస్తే వాటి హాణికర ప్రభావం అధికశాతం తగ్గుతుందని భాటియా, డ్రేఫస్ లు తెలుసుకున్నారు.

మొత్తం మీద ఈ నానోటెక్నాలజీకి ఎంత భవిష్యత్తు ఉన్నా, రోగుల మీద పరిపాటిగా ప్రయోగించే రోజులు రావాలంటే ఇంకా ఎన్నో పరీక్షలు చెయ్యాల్సి ఉంటుందని ఎంతో మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో బయోటెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న జోరు చూస్తే రాబోయే పదేళ్లలో అటువంటి ఒరవడులు మన దేశంలో కూడా వస్తాయని ఆశించొచ్చు.

Reference:
Carol E. Webb, Chip Shots, IEEE Spectrum, October, 2004.

1 Responses to భవిష్యత్ ఇంజెక్షన్లు: నానోటెక్నాలజీతో ఔషధ సరఫరా - 2

  1. space effect Says:
  2. RESTORE:వయసు ప్రభావంవల్ల గాని వాతావరణం వల్ల కాని వివిధ రకాల అనారొగ్య కారణాలవల్ల కాని శరీరంలొ కోల్పొతున్న యవ్వనాన్ని తిరిగి పొందే విధంగా దైవకణాల (గాడ్ సెల్ ,గ్లొబల్ ఎనర్జీ, అమృతం) తో శరీర వ్యవస్థ ను పునః స్తాపించడం శరీర ధర్మాలను నిర్వర్తించు జన్యువులు శరీరం లోని నిర్ధేశించబడ్డ గ్రంధుల క్రియాశీలత ఆధారంగా తమ విధులను నిర్వర్తించును

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email