భోజనం సిద్ధమయ్యింది. ప్రొఫెసర్ మామయ్య ఆయన వంతు ఆయన ఆవురావురని తినేశాడు. ప్రయాణంలో పస్తులు ఉండడం చేసి కాబోలు, ఆయన కడుపు చెరువు అయినట్టు పళ్ళెంలో ఉన్నదంతా హాం ఫట్ చేసేశాడు. భోజనంలో పెద్దగా విశేషమేమీ లేదు. కాని మేము ఉంటున్న ఇంటాయన ఆతిథ్యం మహిమ కాబోలు. భోజనం మరింత రుచిగా అనిపించింది. ఈయన చూడబోతే ఐస్లాండ్ దేశస్థుడిలా లేడు. డేనిష్ మనిషిలా ఉన్నాడు. ఆయన అదరానికి మా మొహమాటం మటుమాయం అయిపోయింది.
సంభాషణ అంతా స్థానిక భాషలోనే సాగింది. అయితే నా సౌలభ్యం కోసం అందులో మా మామయ్య కొంచెం జర్మన్ కలిపితే, ఫ్రెడిరిక్సెన్ గారు కొంచెం లాటిన్ రంగరించారు. ఇద్దరు తాత్వికులు కలిస్తే సంభాషణ వైజ్ఞానిక విషయాల మీదకి పోవడం ఓ ఆనవాయితీ. ఒక పక్క ఉత్సాహంగా మాట్లాడుతున్నా, మరో పక్క నోరు జారకుండా మా మామయ్య పడుతున్న తిప్పలు కనిపిస్తూనే ఉన్నాయి. పైగా ప్రతీ వాక్యానికి చివర నాకేసి ’నోరు తెరిస్తే చంపేస్తా’ నన్నట్టు కొరకొరా చూడసాగాడు.
"గ్రంథాలయంలో గాలించిన విషయం దొరికిందా?" అడిగారు ఫ్రెడిరిక్సెన్.
"ఆ గ్రంథాలయమా? అందులో ఏవుందండీ ఖాళీ అలమరల్లో అక్కడక్కడ నాలుగు చింకి పుస్తకాలు తప్ప!" తీసిపారేస్తూ అన్నాడు మామయ్య.
"ఓహ్! మీకు తెలీదనుకుంటాను. మా వద్ద ఎనిమిది వేల పుస్తకాలు ఉన్నాయి. వాటిలో చాలా మటుకు అరుదైన, అమూల్యమైన పుస్తకాలు. ప్రాచీన స్కాండినావియన్ భాషలో రాసిన పుస్తకాలు. ఇవి గాక కోపెన్హాగెన్ నుండి ఏటేటా వచ్చే పుస్తకాలు కూడా ఉన్నాయి."
"అవునా? మరి నాకు కనిపించలేదే? ఇంతకీ మీ పుస్తకాలు ఎక్కడుంటాయి?"
"ఓహ్! అవా? దేశమంతటా ఉంటాయి. ఈ శీతల భూమి మీద మాకు పుస్తక పఠనం ఓ ముఖ్యమైన కాలక్షేపం. ఇక్కడ చదువు రాని రైతుగాని, జాలరి గాని ఉండడు. పుస్తకాలు ఇనుప అలమరల కారాగారంలో మగ్గే కన్నా, పాఠకుల బాహువులలో బందీలుగా ఉండడం మేలని మేం నమ్ముతాం. కనుక ఈ పుస్తకాలు చేతులు మారుతూ, ఊళ్లు మారుతూ, మళ్లీ మళ్లీ చదవబడుతూ ఉంటాయి. అలా ఎన్నో ఊళ్లు చుట్టి చుట్టి, చివరికి ఎన్నో ఏళ్లకి సొంతూరికి తిరిగొస్తాయి."
"మరి ఎవరైనా బయటి వాళ్లు వస్తే..." మామయ్య మెల్లగా తన సందేహాన్ని వెలిబుచ్చాడు.
"విదేశీయులకి ఎక్కువగా ఇళ్లలోనే గ్రంథాలయాలు ఉంటాయి. ముఖ్యంగా పని కోసం ఇక్కడికి వచ్చిన వాళ్లు ఇక్కడి పుస్తకాల ద్వార ఇక్కడి పద్ధతుల గురించి నేర్చుకోవడం చాలా అవసరం. పుస్తకాలంటే అభిమానం మా రక్తం లోనే ఉంది. 1816 లో ఇక్కడ ఓ సాహితీ సదస్సును ప్రారంభించాం. సాహితీ ప్రియులు అందులో సభ్యులు కావడమే ఓ పెద్ద గౌరవంలా భావించేవారు. మా దేశస్థులకి విద్యాబుద్ధులు నేర్పించగల అమూల్యమైన పుస్తకాలు ఆ సదస్సు నుండి ప్రచురితం అయ్యేవి. ఆ పుస్తకాలు మా దేశానికి ఎనలేని సేవ చేస్తాయి. ప్రొఫెసర్ లీడెన్బ్రాక్! మీరు కూడా అందులో సభ్యులైతే మాకెంతో సంతోషంగా ఉంటుంది."
అప్పటికే ఓ నూటికి పైగా ఇలాటి సాహితీ సదస్సులలో సభ్యుడిగా ఉన్న మా మామయ్య ఆ అవకాశానికి ఎగిరి గంతేశాడు. మామయ్య సంతోషం చూసి ఫ్రెడిరిక్సెన్ గారు కూడా అనందం పట్టలేకపోయాడు.
"సరే ఇంతకీ మీరు ఎలాంటి పుస్తకాలు వెతుకుతున్నదీ చెప్పనేలేదు. చెప్పారంటే వాటిని వెతికి పట్టుకోవడంలో నేను కూడా సహాయపడగలను."
మామయ్య నాకేసి ఓ సారి చూశాడు. మా ఇద్దరి కళ్లూ కలుసుకున్నాయి. కొంచెం తటపటాయిస్తూనే అడిగాడు -
"ఫ్రెడిరిక్సెన్ గారూ! మీ ప్రాచీన గ్రంథాలలో ఆర్నే సాక్నుస్సెం రచనలు ఏవైనా వున్నాయా?"
"ఆర్నే సాక్నుస్సేమా? ఆ పదహారవ శతాబ్దానికి చెందిన మహాపండితుడు, ప్రకృతి శాస్త్రవేత్త, రసాయన శాస్త్రవేత్త, పర్యాటకుడు రచనల కోసమా మేరు వెతుకుతున్నది?"
"అవును"
"ఐస్లాండ్ విజ్ఞాన, సాహిత్య చూడామణి కోసమా?"
"అవును. సరిగ్గా ఆయన గురించే నేను చెప్పేది."
"జగద్విఖ్యాతి గాంచిన రచయిత!"
"అవునవును."
"మహాధీమంతుడు, మగధీరుడు!"
"ఆయన గురించి మీకు బాగా తెలిసినట్టుందే!"
తన ఆరాధ్య దైవాన్ని ఫ్రెడిరిక్సెన్ గారు అలా తెగ పొగిడేస్తుంటే మామయ్య సంతోషం పట్టలేకపోయాడు.
"మరి ఇంతకీ ఆయన పుస్తకాలు ఎక్కడున్నాయి!" ఇక ఆగలేక అడిగేశాడు మామయ్య.
"ఆయన పుస్తకాలు మాత్రం మా వద్ద లేవు."
"ఏంటీ? ఐస్లాండ్ లో లేవా?"
"ఐస్లాండ్ లోనే కాదు. మరెక్కడా లేవు."
"అదెలా జరిగింది?"
"ఆర్నే సాక్నుస్సెం మీద మత విరోధి అన్న ముద్ర పడింది. 1573 లో ఆయన పుస్తకాలు ఓ ఉరితీసేవాడి చేతిలో తగులబడిపోయాయి."
"ఓ అదన్నమాట! అద్భుతం!" రంకెలు వేశాడు మామయ్య.
(సశేషం...)
0 comments