అధ్యాయం 9
ఐస్లాండ్! ఆ తరువాత?
మేం బయల్దేరే రోజు వచ్చింది. మా స్నేహితుడైన ఎం. థాంసన్ మమ్మల్ని ఐస్లాండ్ లోని ప్రముఖులకి పరిచయం చేస్తూ ఇచ్చిన సిఫారసు ఉత్తరాలు తెచ్చి మామయ్య చేతిలో పెట్టాడు. మామయ్య ఆయన చేతులు పిసికి పిసికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.
(చిత్రం - హెల్సిన్యో నగరంలో ఉన్న కోర్న్ బోర్గ్ కోట; మూలం - వికీ)
రెండో తేదీ సాయంకాలం ఆరు గంటలకల్లా మా సామానంతా "వాల్కిరా" ఓడలోకి ఎక్కించబడింది. కాప్టెన్ మాకు మా ఇరుకైన కాబిన్ చూపించాడు.
"గాలి సానుకూలంగా వీస్తోందా?" అడిగాడు మామయ్య.
"గాలికేం? లక్షణంగా ఉంది. ఆగ్నేయ దిశలో వీస్తోంది. ఇక బయల్దేరడమే ఆలస్యం" హుషారుగా అన్నాడు కెప్టెన్.
ఓడ తెరచాపలన్నీ పూర్తిగా ఎగరేయబడ్డాయి. ఓడ కదిలింది. గంటలో డెన్మార్క్ రాజధాని అలల వెనుక మెల్లగా కనుమరుగయ్యింది. ఎల్సినోర్ (*) తీరం పక్క నుండి వల్కిరా హుందాగా ముందుకి సాగిపోయింది. అల్లంత దూరంలో కనిపించే బురుజు మీద హామ్లెట్ ఆత్మ ఎక్కడ కనిపిస్తుందో నని భయపడి చచ్చిపోయాననుకోండి!
(*దీని ఆధునిక నామం హెల్సిన్యో (Helsignor). ఈ ఊళ్లో ఉన్న క్రోన్ బోర్గ్ కోట షేక్స్పియర్ నాటకం ’హామ్లెట్’ కి కథాస్థలం. - అనువాదకుడు)
"ఓరి వెర్రి మానవుడా! మా దిక్కుమాలిన ప్రయాణం నీలాంటి వాళ్లకి తప్పకుండా నచ్చుతుందిలే. మాతో పాటు పాతాళపు లోతుల్లోకి రమ్మంటే తప్పకుండా వచ్చేట్టే వున్నావు. బతికున్నన్నాళ్ళు నిన్ను వేధించిన సందేహాలన్నీ అక్కడ తీరుతాయేమో" హామ్లెట్ ని తలచుకుంటూ మనసులోనే అనుకున్నాను.
కాని ఆ పాడుబడ్డ గోడల మీద ప్రేతాత్మల కదలికలేవీ నాకు కనిపించలేదు. నిజానికి ఈ కోట ఆ ప్రసిద్ధి గాంచిన డెన్మార్క్ రాజు కన్నా వయసులో చిన్నదే. మేం ప్రవేశిస్తున్న జలసంధి ఆరంభంలో ఇంత పెద్ద కోట ఎందుకుందో నాకు అప్పుడే అర్థమయ్యింది. ఏటా ఆ దారి వెంట వివిధ దేశాలకి చెందిన ఓడలు పదిహేను వందల దాకా ప్రయాణిస్తుంటాయి. వాటన్నిటికీ ఈ కోట ఓ సత్రం, ఓ విరామ స్థలం అన్నమాట.
ఈ వల్కిరా బహు చక్కని ఓడ. అయితే ఈ తెరచాప ఓడలని నమ్మడానికి లేదు. ఐస్లాండ్ రాజధాని రెయిక్ జావిక్ కి బొగ్గు, ఇంటి సామాను, మట్టి పాత్రలు, ఉన్ని దుస్తులు, గోధుమ మొదలైన వన్నీ మోసుకుపోతోంది. దాని సిబ్బంది మొత్తం ఐదుగురు నావికులు. అంతా డేన్ జాతి వారే.
"ఈ ప్రయాణం మొత్తం ఎంత సేపు పడుతుంది?" మామయ్య అడిగాడు.
"పది రోజులు," అన్నాడు కెప్టెన్. "అదీ మనకి దార్లో ఫారోస్ దీవుల వద్ద వాయవ్య పవనాలు అడ్డు తగలకపోతే!"
"అయితే ఆలస్యం అవుతుందంటారా?"
"అయ్యా! లీడెన్ బ్రాక్ గారూ! కంగారు పడకండి. సమయానికి మిమ్మల్ని చేర్చే పూచీ నాది."
సాయంత్రాని కల్లా మా ఓడ డెన్మార్క్ దేశపు ఉత్తర కొస వద్ద ఉన్న స్కా (ఆధునిక నామం - స్కాగెన్, Skagen) ద్వీపకల్పం చుట్టూ మలుపు తిరిగి, రాత్రికి స్కాగర్ రాక్ ని దాటి, కేప్ లిండ్నెస్ వద్ద నార్వే దేశం పక్క నుండి ముందుకి సాగి, ఉత్తర సముద్రం లోకి ప్రవేశించింది.
రెండు రోజుల ప్రయాణం తరువాత స్కాట్లాండ్ తీరం మీదున్న పీటర్ హెడ్ నగరం కనిపించింది. అక్కడ వల్కిరా కొద్దిగా దిశ తిరిగి ఆర్క్నీస్, షెట్లాండ్స్ దీవుల మధ్య నుండి ఫారోస్ దీవుల దిశగా పయనమయ్యింది.
త్వరలోనే మా ఓడ అట్లాంటిక్ మహాసముద్రం లోకి ప్రవేశించింది. ఉత్తరం నుండి వీచే బలమైన గాలులని ఎదుర్కోవలసి వచ్చింది. మొత్తం మీద ఫారోస్ ని చేరుకోవడానికి కొంచెం ఇబ్బందే అయ్యింది. ఎనిమిదో తారీఖున మా కెప్టెన్ ఫారోస్ దీవులలో దక్షిణ కొస వద్ద ఉన్న మైగానెస్ దీవిని గుర్తించగలిగాడు.
అక్కణ్ణుంచి నేరుగా ఓడ కేప్ పోర్ట్ లాండ్ దిశగా బయలుదేరింది. ఇది ఐస్లాండ్ దేశంలో దక్షిణ కొస వద్ద ఉన్న ఓ రేవు.
(సశేషం...)
0 comments