"ఇదంతా మీరు నేర్పించిందే నాన్నా" - అసిమోవ్
కాల్పనిక విజ్ఞాన (science fiction) ప్రియులకు ఐసాక్ అసిమోవ్ పేరు తెలియకుండా ఉండదు. కాల్పనిక విజ్ఞానం మీదే కాక ఇతడు విజ్ఞానం మీద కూడా అందరూ చదవదగ్గ, గొప్ప వైవిధ్యం గల అంశాల మీద, చక్కని పుస్తకాలెన్నో రాశాడు. ఇతడు మొత్తం ఇంచుమించు ఐదొందల పుస్తకాల దాకా రాశాడని చెప్పుకుంటారు.
మరి సహజంగా అసిమోవ్ వద్ద ఓ పెద్ద వ్యక్తిగత గ్రంథాలయం ఉండేదట. ఒకరోజు అతడి తండ్రి తన పుస్తకాలని చూడడానికి వచ్చాడు. ఆ పుస్తకాలన్నీ చూసి ఆశ్చర్యపోయిన తండ్రి,
"ఇన్ని విషయాలు ఎలా తెలుసు నీకు," అని అడిగాడు.
"ఇవన్నీ మీరు నేర్పించినవే నాన్నా," అన్నాడు అసిమోవ్.
"నేనా? అదేంటి. నాకసలు ఇవేవీ తెలీవు," అన్నాడాయన అమాయకంగా.
"తెలియనక్కర్లేదు, నాన్నా. మీకు చదువన్నా, చదవడం అన్నా చాలా అభిమానం. ఆ అబిమానమే నాకూ వంటపట్టించారు. అదొక్కటీ ఉంటే చాలు. ఇక తక్కినదంతా దానికదే వచ్చేస్తుంది."
Reference:
K. Krishnamurthy, Spice in Science, Pustak Mahal.
ప్రతి తండ్రీ తన పిల్లల్లో కలిగించాల్సింది అటువంటి జిజ్ఞాసే !