ఈ అంశం మీద అమెరికాకి చెందిన మాజీ ఉపరాష్ట్రపతి ఆల్ గోర్ "An Inconvenient Truth" అనే పేరుతొ ఒక చక్కని డాక్యుమెంటరీ రూపొందించాడు.
ప్రస్తుతం వాతావరణంలో కనిపిస్తున్న సంచలనాత్మక మార్పులన్నీ ఎప్పుడూ ఉండే ఆటుపోట్లే నని చాలా మంది ధరాతాపనాన్ని మొదట్లో కొట్టిపారేశారు. అసలు అలాంటిది ఉందని కూడా ఒప్పుకునేవారు కారు. కాని ధరాతాపనం అనేది మనకి నచ్చినా నచ్చకపోయినా ఒక స్థిర వాస్తవమని, అందులో మానవుడి పాత్ర ఎంతో ఉందని సామాన్యులకి అర్థమయ్యే తీరులో చక్కగా వర్ణిస్తాడు గోర్. ఆ చిత్రంలోని వ్యాఖ్యానానికి ఇది సచిత్ర అనువాదం.
---
నచ్చని నిజం
అంతరిక్షం లోంచి భూమిని తీసిన చిత్రాలలో ఇది మనం చూసిన మొట్టమొదటి చిత్రం.
1968 లో క్రిస్మస్ నాడు తీసిన చిత్రం.
అపోలో 8 మిషన్ లో తీసిని చిత్రం.
ప్రశాంత వాతావరణపు పొరల మధ్య భూమి ఒదిగిపోయింది.
కాని ఆ వాతావరణపు సన్నని పైపొరని కాలుష్యంతో నింపుతున్నాం.
(సోదర సోదరీమణులారా, ఇప్పుడు మిస్టర్ ఆల్ గోర్ ప్రసంగిస్తారు.)
నా పేరు ఆల్ గోర్.
అమెరికా దేశానికి ఒకప్పుడు నన్ను భావి రాష్ట్రపతిగా చెప్పుకునేవారు. (ప్రేక్షకులలో నవ్వు)
అది నాకేం అంత గమ్మత్తుగా అనిపించటంలేదు.
ఈ కథని నేను చాలా కాలంగా చెప్పాలని చూస్తున్నాను. కాని ఈ సందేశాన్ని అందించడంలో విఫలం అయ్యానని అనిపిస్తుంది.
రాజకీయాలలో ఎంతో కాలం సేవలు అందించాను. ఆ సేవలకి గర్వపడుతున్నాను.
మీరు నమ్మకపోవచ్చు గాని ఇది నిజంగా ఓ జాతీయ ఉపద్రవం. ఇది చాలా చాలా పెద్ద ఉపద్రవం.
మరిప్పుడు ఏం చెయ్యాలి? ప్రస్తుతం రాజకీయాల్లో మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇరు పక్షాలలోను ఉన్నారు. కాని ఈ సమస్యకి దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళీ సమస్యని ఒప్పుకుంటే, గుర్తిస్తే పెద్ద పెద్ద మార్పులు చెయ్యాల్సిన నైతిక బాధ్యత వాళ్ల నెత్తిన పడుతుంది.
ఈ దేశపు చరిత్రలోనే అతిపెద్ద ఉపద్రవం ఇది.
చందమామ మీద ఎక్కడ వాలాలో వెతుకుతుంటే
రేడియో సంబంధాలు తెగిపోయాయి
చంద్రుడి మీద చీకటి వైపుకి వెళ్ళారు.
కాసేపు ఏమయ్యిందో తెలీని ఉత్కంఠ.
రేడియో సంబంధాలు మళ్లీ ఏర్పడ్డాయి.
అప్పుడు పైకి చూశారు.
ఈ ఫోటో తీశారు. వసుధోదయం గా దీనికి పేరు వచ్చింది.
ఆ ఒక్క చిత్రం మానవ చైతన్యం మీద చెరగని ముద్ర వేసింది.
సంచలనాత్మక మార్పులు కలుగజేసింది.
అది తీసిన పద్దెనిమిది నెలల్లో ఆధునిక పర్యావరణ ఉద్యమం మొదలయ్యింది.
ఈ తదుపరి చిత్రం ఆఖరు అపోలో మిషన్ లో తీసింది. అపోలో పదిహేడు. దీన్ని 1972 లో డెసెంబర్ 11 నాడు తీశారు.
బహుశ చరిత్రలో ఇన్ని సార్లు ముద్రించబడ్డ ఫోటో మరేదీ లేదేమో.
అంతరిక్షం నుండి భూమిని తీసిన ఫోటోల్లో సూర్యుడు వ్యోమనౌకకి సరిగ్గా వెనక్కి ఉండగా తీసిన ఫోటో ఇదొక్కటేనేమో.
కోటి కాంతులతో భూమి ప్రకాశిస్తోంది ఇందులో.
నేను ఇప్పుడు చూపించబోయే ఫోటో మీరు ఎప్పుడూ చూసి ఉండరు.
గెలీలియో అనే వ్యోమనౌక నుండి తీసిన ఫోటో. సౌరమండలం మీద అన్వేషణలో బయలుదేరింది ఈ నౌక.
భూమి నుండి దూరం అవుతున్న సమయంలో అది దాని కెమేరాలని వెనక్కి తిప్పింది.
ఆగాగి తీస్తూ ఒక పూర్తి రోజు కాలం భూమిని ఫోటోలు తీసింది. 24 సెకనుల కాలంలో దాన్ని కుదిస్తున్నాం.
ఎంత అందంగా ఉంది కదూ?
ఒకరకంగా ఇదో అద్భుతమైన చిత్రం. నా మిత్రుడు టామ్ వాన్ సాంత్ దీన్ని తయారుచేశాడు. మూడు వేల సాటిలైట్ చిత్రాలని మూడేళ్ళ పాటూ సేకరించి వాటిని డిజిటల్ గా కలిపి కుట్టాడు. మబ్బులు క్రమ్మని దృశ్యాలని మాత్రమే తీసుకున్నాడు. భూమి మీద ప్రతీ అంగుళం కనిపించేలా
భూభాగాలన్నీ కచ్చితంగా కనిపించేలా అవన్నీ కలిపి ఒక్క సారి ప్రదర్శిస్తే అదో కళాఖండం అవుతుంది.
ఇది ఎందుకు చూపిస్తునానంటే... మీకొక కథ చెప్పాలి. నాకు చదువు చెప్పిన ఇద్దరు టిచర్ల గురించి చెప్పాలి.
వాళ్లలో ఒకరంటే నాకంత ఇష్టం లేదు. రెండో వ్యక్తి నాకు ఆరాధ్య దైవం.
నాకు బళ్లో జ్యాగ్రఫీ చెప్పిన టీచరు బోర్డుకి అడ్డుగా వేలాడే ఓ పెద్ద ప్రపంచ పటం చూపిస్తూ పాఠం చెప్పేది.
ఆరోక్లాసు లో ఓ సారి నా క్లాస్ మేట్ ఒకడు చెయ్యి పైకెత్తి దక్షిణ అమెరికా తూర్పు తీర రేఖని చూపిస్తూ ఆఫ్రికా పశ్చిమ తీరంతో దాన్ని పోల్చుతూ
"ఈ రెండూ ఎప్పుడైనా కలిసి ఉండేవా?" అని అడిగాడు.
అప్పుడా టీచర్ అంది. "ఎప్పుడూ లేవు. అయినా అంత బుద్ధితక్కువ మాట నేను ఎక్కడా విన్లేదు" అంది.
ఆ కుర్రాడు తరువాత మత్తుమందుకి బానిస అయ్యాడు. జీవితంలో ఓడిపోయాడు.
ఆ టీచరు సైన్స్ అడ్వయిసర్ గా ప్రస్తుత అధికారవర్గంలో నియమించబడింది. కాని ఆ టీచర్ కేవలం ఆ రోజుల్లోవైజ్ఞానిక అధికార వర్గం యొక్క పాఠాలనే వల్లె వేసింది. ఖండాలు అంతంత పెద్దవి కనుక కదలవు అనుకుంది.
కాని అవి నిజానికి అవి కదులుతాయని మనకి తెలుసు.
(సశేషం...)
0 comments