ఈ సారి యాత్రలో పెద్దగా ఇబ్బందులేవీ ఎదుర్కోలేదు. సముద్రం మీద జీవనానికి నేను ఆ కాస్తలోనే అలవాటు పడిపోయానని చెప్పాలి. కాని మామయ్యకి మాత్రం ప్రయాణం మొదలయ్యిన దగ్గర్నుండి సుస్తీ చేసింది.
కనుక ఆయనకి కెప్టెన్ ని వాకబు చేసి స్నెఫెల్స్ గురించి, అక్కడికి చేరే మార్గం గురించి, రవాణా సౌకర్యాల గురించి, మొదలైన విషయాల గురించి కనుక్కునే అవకాశం కలగలేదు. గమ్యం చేరాక అన్నీ కనుక్కోవచ్చులే అని కేబిన్ లోంచి కదలకుండా ఉండిపోయాడు.
పదకొండో తారీఖున కేప్ పోర్ట్ లాండ్ (Cape Portland) చేరాం. వాతావరణం స్వచ్ఛంగా ఉండడం వల్ల అల్లంత దూరంలో కొండ మీద ఆకాశం నుండి వేలాడుతున్నట్టు మిర్టల్స్ జోకిల్ హిమానీనదం (Mýrdalsjökull glacier - (see figure) ) కనిపించింది. ఈ భూశిరం (cape) కేవలం నిట్రమైన అంచులు గల ఓ పొట్టి కొండ.
తీరం నుండి కొంచెం దూరంలోనే ఉంటూ వాల్కిరా నెమ్మదిగా పశ్చిమ దిశలో ముందుకి సాగిపోయింది. ఎటు చూసినా చుట్టుపక్కల తిమింగలాలు, సొరచేపలు నీట్లోంచి ఎగిరెగిరి పడుతున్నాయి. అంతలోనే అల్లంత దూరంలో సముద్రపు ప్రభావానికి బాగా గుంతలు పడ్డ ఓ రాకాసి బండ కనిపించింది.
పోటెక్కిన సముద్ర జలాలు దాన్ని కసితీరా ఢీకొంటున్నాయి. ఈ వెస్ట్ మన్ దీవులు నీట్లోంచి పొడుచుకొచ్చిన బండల్లా అనిపిస్తాయి. అక్కణ్ణుంచి మా పడవ కేప్ రెయిక్యానెస్ వద్ద ఓ సుదీర్ఘమైన మలుపు తిరిగింది. ఈ కేప్ రెయిక్యానెస్ ఐస్లాండ్ ద్వీపానికి పశ్చిమ కొస.
సముద్రం బాగా పోటెక్కి ఉండడంతో, కేబిన్ లోంచి బయటికొచ్చి, కెరటాల ముష్టి ఘాతాలకి బీటలు వారిన తీరాలని చూసి ఆనందించే అవకాశం లేకపోయింది పాపం మామయ్యకి.
నలభై ఎనిమిది గంటల తరువాత మా ఓడ కేప్ స్కాగెన్ ని చేరుకుంది. ఓ ఐస్లాండ్ అధికారి మా ఓడ లోకి ప్రవేశించాడు. మూడు గంటల్లో మా ఓడ ఫాక్సా ఖాతంలో రెయిక్ జావిక్ కి సమీపంలో వాల్కిరా లంగరు దించింది.
చివరికి ఫ్రొఫెసర్ తన కేబిన్ లోంచి బయటికి వచ్చాడు. ముఖంలో నీరసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అయినా ఉత్సాహం తగ్గలేదు. కళ్లలో మెరుపు మాయలేదు. ఓ మహాయాత్రలో మొదటి మెట్టు పూర్తయ్యిందన్న సంతృప్తి కళ్లలో కనిపిస్తోంది.
రేవు లోకి వచ్చిన కొత్త ఓడని చూడడానికి కాబోలు జనం రేవు మీద గుంపులు గుంపులుగా పోగయ్యారు.
నీటి మీద తేలే జైల్లాంటి ఆ పడవ లోంచి బయట పడడానికి మామయ్య ఆదుర్దాగా ఉన్నట్టున్నాడు. నన్ను కూడా తనతో బిరబిర లాక్కెళ్ళబోతూ అల్లంత దూరంలో కనిపిస్తున్న శిఖర ద్వయాన్ని చెయ్యి చాచి చూపుడు వేలితో చూపించాడు. నిత్య హిమావృతమై సూర్య కాంతిలో మౌనంగా భాసిస్తున్న రజతాద్రి ద్వయం.
"స్నేఫెల్! స్నేఫెల్"
సంతోషం పట్టలేక చిన్న పిల్లాడిలా కేకలేశాడు మామయ్య.
ఇద్దరం ఓడ దిగి మమ్మల్ని తీరానికి తీసుకుపోవడానికి ఎదురుచూస్తున్న చిన్న పడవ ఎక్కాం. కాసేపట్లో ఇద్దరం ఐస్లాండ్ నేల మీద నడుస్తూ ఊళ్లోకి ప్రవేశించాం.
మాకు తారసిల్లిన మొదటి వ్యక్తి ఎవరో జనరల్ యూనీఫామ్ లో హుందాగా ఉన్నాడు. కాని తరువాత తెలిసింది. అతడు జనరల్ కాడట. ఆ ప్రాంతానికి గవర్నర్ అతడు - మోన్ ష్యూ ద బరోన్ త్రాంప్ తానే స్వయంగా దిగి వచ్చాడు. ఫ్రొఫెసర్ కోపెన్హాగెన్ నుండి తెచ్చిన పరిచయ లేఖలన్నీ వినమ్రంగా సమర్పించుకున్నాడు. ఇద్దరూ కాసేపు డానిష్ భాషలో ఏదో మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో తెలీదు గాని అది అయ్యాక గవర్నర్ సదా మీ సేవలో అంటూ మామయ్యకి దాసోహం అన్నాడు.
(సశేషం...)
0 comments