అలాగే ఆ ఊరి మేయర్ మోన్ ష్యూ ఫిన్సెన్ కూడా మామయ్యని సాదరంగా ఆహ్వానించాడు. ఇతడి తీరు తెన్నులు కూడా కొంచెం సేనా విభాగానికి చెందిన అధికారిలాగానే ఉన్నాయి.
తరువాత బిషప్ సహచరుడైన పిక్టర్సెన్ ని కలుసుకున్నాం. ఇతగాడు ప్రస్తుతం ఏదో మతకార్యం మీద ఉత్తర ప్రాంతాన్ని సందర్శిసున్నాడు. ఆయనతో పరిచయం కలిగే భాగ్యం కోసం ఎదురుచూస్తూ ఉండిపోయాం. కాని రెయిక్జావిక్ లో ప్రకృతిశాస్త్రపు ప్రొఫెసర్ అయిన ఫ్రెడెరిక్ సెన్ చాలా హుషారైన మనిషి.
ఆయనతో స్నేహం త్వరలోనే బలపడింది. వినయశీలి అయిన ఈ మహాపండితుడు ఎప్పుడూ లాటిన్ లోను, డేనిష్ లోను మాత్రమే మాట్లాడతాడు. హోరేస్ మాట్లాడిన భాషలో మాట్లాడుతూ తన సహాయసహకారాలు అందిస్తానన్నాడు. ఇద్దరం ఒకరికొకరు త్వరలోనే అర్థమైపోయాం. అసలు మొత్తం ఐస్లాండ్ లోనే నేను మాట్లాడదగ్గ వ్యక్తి ఇతనొక్కడే అనిపించింది.
ఈ పెద్ద మనిషి మూడు గదులున్న తన ఇంట్లో రెండు గదులు మాకు ఇచ్చేశాడు. ఆ గదులలో మా సామానంతా చేర్చాము. సముద్రం లాంటి మా సామాను చూసి సముద్రం గురించి బాగా తెలిసిన రెయిక్ జావిక్ పురవాసులు కూడా ముక్కున వేలేసుకున్నారు.
"మన ప్రయాణంలో చాలా మటుకు పూర్తయ్యింది ఏక్సెల్!" మామయ్య ఉత్సాహంగా అన్నాడు.
"చాలా మటుకా?" అర్థంకాక ఆశ్చర్యంగా అడిగాను.
"మరింకేవుంది? ఇక్కడి దాకా వచ్చేశాం. ఇక మిగిలింది కిందకి దిగడమేగా?"
"అంతవరకు బాగానే ఉంది. కాని పైకి వచ్చే మాట గురించి ఆలోచించావా మామయ్యా?"
"ఓహ్! అదా. దాని గురించి నువ్వేం ఆలోచించకు. ఇక ఆలస్యం చెయ్యడానికి లేదు. నేనిప్పుడే లైబ్రరీ కి వెళ్తున్నాను. అక్కడ సాక్నుస్సెం కి చెందిన వ్రాతప్రతులు ఏవైనా దొరుకుతాయేమో పోయే చూసొస్తాను."
"సరే. నేనూ అలా ఊరు చూసి వస్తాను. నువ్వూ వస్తావా మామయ్యా?"
"ఉహు వద్దు. నా దృష్టి ఈ ఊరి మీద లేదు. ఈ ఊరి కింద ఉన్నదాని మీద ఉంది!"
మెల్లగా ఊర్లోకి బయలుదేరాను. కాళ్లు ఎటు తీసుకుపోతే అటు నడిచాను.
రెయిక్ జావిక్ నగరంలో దారి తప్పిపోవడం చాలా కష్టం. కనుక ఎవరినీ దారి అడగలేదు. అడిగితే ఇంకా లేనిపోని సమస్యలొస్తాయి. ఎందుకంటే భాష రాని నా మూగవేదన ఆ ఊరి ప్రజలకి అర్థం కాదు.
రెండు కొండల మధ్య ఉండే బురద నేల మీద ఊరు విస్తరించి ఉంది. ఒక పక్కగా ఓ పెద్ద లావా పీఠం సముద్రం దిక్కుగా విస్తరించి ఉంటుంది. మరో పక్క విశాలమైన ఫాక్సా ఖాతం. ఆ ఖాతానికి ఉత్తరాన విశాలమైన స్నెఫెల్ హిమానీనదం. ఆ ఖాతంలో ఉన్న రేవులోనే ఇప్పుడు వాల్కిరా ఒంటరిగా లంగరు వేసి ఉంది.
రెయిక్ జావిక్ లో రెండే పెద్ద రహదార్లు ఉన్నాయి. వాటిలో కొంచెం పొడవైన దారి తీరానికి సమాంతరంగా పరిగెడుతుంది. ఈ దారి వెంబడి బోలెడు అంగళ్లు ఉన్నాయి. ఆ వీధి లోనే బోలెడుమంది వర్తకుల ఇళ్లున్నాయి. రెండవ వీధి పశ్చిమంగా పరిగెడుతూ ఓ చెరువు వద్ద అంతం అవుతుంది.
బిషప్ లాంటి వ్యాపారరంగంలో లేని వారి ఇళ్లు ఈ వీధిలో ఉన్నాయి.
ఈ ఒంటరి దారుల వెంట చాలా సేపు తిరిగాను. అక్కడక్కడ ఇళ్లలో పచ్చిక కనిపించింది. కొందరు పెరట్లో కూరలు పండించుకుంటున్నారు. గోడలెక్కిన లతల మీద విరిసిన పూలు ఎండలో, చల్లగాలిలో హాయిగా నవ్వుతున్నాయి.
వర్తకుల వీధి వెంబడి నడుస్తూ పోతుంటే ఒక చోట శ్మశాన వాటిక కనిపించింది. చుట్టూ ఎత్తయిన మట్టి గోడలు ఉన్నాయి. లోపల బోలెడంత ఖాళీ స్థలం ఉన్నట్టుంది.
మరో నాలుగు అడుగులేస్తే గవర్నరు గారి బంగళా వచ్చింది. హాంబర్గ్ టౌన్ హాలుతో పోల్చితే ఇది పూరి గుడిసె. ఐస్లాండ్ లో చిన్న చిన్న పెట్టెల్లాంటి సామాన్యుల ఇళ్లతో పోల్చితే ఇది రాజసౌధం. పక్కనే ఉన్న ఓ కొండ మీద ఓ జాతీయ పాఠశాల ఉంది. అక్కడ హీబ్రూ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, డేనిష్ భాషలన్నీ చెప్తారని తరువాత తెలిసింది.
అలా మూడు గంటలు తిరిగాక ఊరు మాత్రమే కాక ఊరి పరిసరాలు కూడా చూడగలిగాను. మొత్తం మీద ఆ ఊళ్లో నాకు పెద్ద విశేషమేమీ కనిపించలేదు.
చెట్లు చేమలు తక్కువ. ఎటు చూసినా కరకు బండలు అగ్నిపర్వతాల చర్యకి చిహ్నాలుగా మిగిలాయి. అక్కడి భూమిలో సహజంగా ఉండే తాపం కారణంగా పచ్చిక మొలుస్తుంది.
నా ఈ నగర సంచారంలో పెద్దగా మనుషులు ఎవరూ తారసపడలేదు. వర్తక వీధికి తిరిగి వచ్చాక అక్కడ చాలా మంది కాడ్ చేపలని ఎండపెడుతూ, ఉప్పు పట్టిస్తూ కనిపించారు. కాడ్ చేపలని అక్కడ పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తారు. ఇక్కడ జనం బాగా ధృఢ కాయులు. ఎర్ర జుట్టుగల జర్మన్ల లా ఉంటారు.
ఇతర దేశస్థులకి వాళ్లకి మధ్య తేడా వాళ్లకి బాగా తెలుసు. జీవితమంతా ఈ చల్లని, తెల్లని హిమభూమి మీద గడపడం వాళ్ల తలరాత అని వాళ్లకి తెలుసు. ఇంకొంచెం ఉంటే వీళ్ళకి ఎస్కిమోలకీ తేడాయే ఉండదు. ఆర్కిటిక్ వృత్తానికి వీళ్లు కాస్తంత బయట ఉన్నారంతే. ముఖంలో ఎక్కడా చిరునవ్వు కనిపించని అస్మితవదనులు! కొన్ని సార్లు పొరపాట్న, అప్రయత్నంగా, అనుకోకుండా ఆ ముఖంలో నవ్వు పెల్లుబుకుతుందేమో గాని చిరునవ్వు మాత్రం అక్కడ ఎప్పుడూ విరియదు!
అక్కడి స్త్రీలు కూడా మగవారి లాగానే విచారంగా కనిపించారు. ముఖంలో అందం లేదని కాదు గాని ఏ భావమూ కనిపించదు. ’వాడ్మెల్’ అనే ప్రత్యేకమైన నల్లని ఉన్ని బట్టతో చేసిన అంగీలు, గౌన్లు ధరిస్తారు. పెళ్లయిన స్త్రీలు తల చుట్టూ రంగు రంగుల రుమాలు లాంటిది చుట్టుకుని దాని మీద ఓ తెల్లని బట్టని తురాయిలా అమర్చుకుంటారు.
అలా చాలా సేపు ఊరంతా కాళ్లరిగేలా నడిచి తిరిగి ఫ్రిడెరిక్సెన్ గారి ఇంటికి వచ్చాను. మా మామయ్య ఆయన అప్పటికే లోతుగా కబుర్లలో కూరుకుపోయి ఉన్నారు.
(తొమ్మిదవ అధ్యాయం సమాప్తం)
0 comments