పారదర్శకమైన ఒక రసాయన పదార్థంలోంచి కాంతి ప్రసరిస్తున్నప్పుడు, ఆ పదార్థంలో కాంతి పరిక్షేపణం (scattering) చెందుతుంది. మామూలుగా అలా పరిక్షేపణం చెందిన కాంతి యొక్క తరంగదైర్ఘ్యం (wavelength) పదార్థంలోకి ప్రసరించిన కాంతి తరంగదైర్ఘ్యంతో సమానం అవుతుంది. కాని కొంత భాగం కాంతి మాత్రం మూలంలో లేని వేరే తరంగదైర్ఘ్యం కలిగి ఉంటుంది. తరంగదైర్ఘ్యంలో ఈ మార్పునే రామన్ ప్రభావం అంటారు. అయితే ఇది చాలా బలహీనమైన ప్రభావం. పతనం అయిన కాంతి (incident light) యొక్క తీక్షణత (intensity) లో ఇలా తరంగదైర్ఘ్యం మారిన కాంతి యొక్క తీక్షణత 1/100,000 వంతు మాత్రమే ఉంటుంది. తరంగదైర్ఘ్యంలో వచ్చే మార్పు ఆ కాంతి ప్రసరించిన రసాయన పదార్థం యొక్క లక్షణం మీద ఆధారపడుతుంది. కనుక ఈ ప్రభావం సహాయంతో రసాయన పదార్థాలని విశ్లేషించడానికి వీలవుతుంది. ఈ ప్రభావాన్ని కనుక్కున్నందుకు రామన్ కి 1930 లో భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. వైజ్ఞానిక రంగాల్లో తెల్లవారు కాని వారికి నోబెల్ రావడం అదే మొదటిసారి!
ఇప్పుడు అసలు కథకి వద్దాం.
సర్ సి వి రామన్ మద్యపానం విషయంలో చాలా నిష్ఠగా ఉండేవార్ట. మద్యం పుష్కలంగా సరఫరా అయ్యే విందులలో కూడా దాని జోలికి పోయేవాడు కారట. ఒకసారి ఒక విందులో ఆ విందుని ఇచ్చిన పెద్దమనిషి ఎలాగైనా కొంచెం రుచి చూడమని రామన్ ని బలవంత పెట్టాట్ట. అప్పుడు రామన్ ఇలా సమాధానం చెప్పార్ట:
"నాకు ఆల్కహాల్ లో రామన్ ప్రభావం గురించి తెలుసుకోవాలనుంది గాని, రామన్ మీద ఆల్కహాలు ప్రభావం తెలుసుకోవాలని లేదు."
ఆ పెద్ద మనిషి మళ్లీ రామన్ జోలికి రాలేదు!
*** ఇలాంటిదే మరో సన్నివేశం. ***
ఒకసారి ఓ వైజ్ఞానిక సమావేశంలో రామన్ సైక్లోట్రాన్ల గురించి ప్రసంగిస్తున్నార్ట. మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నట్టుండి ఎదురుగా కూర్చున్న ఓ పెద్దాయన వద్దకి విసవిసా నడుచుకుంటూ వెళ్లి ఆయన చేతి కర్ర లాక్కున్నార్ట. రామన్ కి అసలే ముక్కు మీద కోపం అందరికీ తెలిసిందే. ఎవడికి మూడనుందో అని ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగింది. రామన్ ఆ చేతి కర్రని పైకెత్తి గిర గిరా తిప్పటం మొదలెట్టారట. కర్ర వేగం పుంజుకుంటుంటే రామన్ ప్రేక్షకులని అడిగారట: "ఇప్పుడు నేనీ కర్రని ఉన్నట్లుండి విడిచిపెడితే ఏమవుతుంది?" అని. సభికుల ముఖాలు అప్పటికే పాలిపోయి ఉన్నాయి. అప్పుడు రామన్ తన మేఘగంభీర స్వరంతో "భయపడకండి! ఏవుంది? కర్ర గాల్లో ప్రయాణించి ఎవడి తలో బద్దలు కొడుతుంది. కాని నేనలా జరగనిస్తానా? ఊరికే మీకు సైక్లోట్రాన్ సిద్ధాంతాన్ని వివరిస్తున్నానంతే!" అన్నార్ట. సభకి ఊపిరి తీసుకోవాలన్న విషయం గుర్తొచ్చింది.
http://www.hinduonnet.com/fline/fl1910/19100660.htm
Good one :-)
good